ప్రధాన మంత్రి కార్యాలయం
ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా తన ప్రసంగానికి సంబంధించిన విశేషాలను ప్రధానమంత్రి పంచుకున్నారు
प्रविष्टि तिथि:
15 AUG 2026 4:21PM by PIB Hyderabad
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి తన ప్రసంగానికి సంబంధించిన ముఖ్యమైన దృశ్యాలను, సందేశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలతో పంచుకున్నారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే దిశగా సాగుతున్న ప్రయాణంలోని ముఖ్య విశేషాలను పంచుకున్నారు. ప్రపంచ సంక్షోభాల సమయంలో దేశం ప్రదర్శించిన అసమానమైన ప్రగతిని, స్థితిస్థాపకతను, ఆత్మనిర్భర్ భారత్ కల్పాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశ వికాసానికి కీలకమైన ప్రాథమిక స్తంభాలు, యువత సాధికారత, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, వికసిత్ భారత్ నిర్మాణానికి అవసరమైన సమష్టి పట్టుదలను ప్రధాని స్పష్టం చేశారు. దేశం బహుముఖ రంగాలలో సాధిస్తున్న అభివృద్ధిని ప్రస్తావిస్తూ, సప్తధార అనే శక్తిమంతమైన కార్యాచరణ ద్వారా దేశం కొత్త వేగాన్ని పుంజుకుని మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించబోతోందని చెప్పారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ఎర్రకోటలో చిరస్మరణీయమైన స్వాతంత్య్ర దినోత్సవం. మనకు స్వాతంత్య్రం అందించిన వారి ధైర్యాన్ని, త్యాగాలను ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది. అదే సమయంలో, వికసిత భారత్‌ను నిర్మించాలనే మన నిబద్ధతను పునరుద్ధరించుకోవడానికి కూడా ఇది ఒక రోజు. ప్రతి సవాలును అధిగమించడానికి, ఐక్యతా బంధాలను బలోపేతం చేయడానికి మరియు దేశానికి మనల్ని మనం అంకితం చేసుకోవడానికి త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ మనకు స్ఫూర్తినివ్వాలి."
‘‘ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎంతో మరపురానివి. మనకు స్వాతంత్య్రాన్ని అందించడానికి ప్రాణాలర్పించిన అమరవీరుల ధైర్యాన్ని, త్యాగాన్ని ఈ రోజు మనకు గుర్తుచేస్తుంది. అదే సమయంలో వికసిత భారత్ నిర్మాణానికి మన నిబద్ధతను పునరుద్ధరించుకోవడానికి ఇది సరైన సమయం. ప్రతి సవాలును అధిగమించడానికి, ఐక్యతా బంధాలను బలోపేతం చేసుకోవడానికి, దేశానికి మనల్ని మనం అంకితం చేసుకోవడానికి మన త్రివర్ణ పతాకం మనకు నిరంతరం స్పూర్తిగా నిలవాలి’’
‘‘స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి మరికొన్ని దృశ్యాలు...’’
2047 నాటికి వికసిత్ భారత్‌గా మారాలనేదే మన లక్ష్యం. గత 12 ఏళ్లలో భారతదేశ ప్రగతి వేగం, విస్తృతి అపూర్వమైనవి. ఈనాడు భారత్ సరికొత్త ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. ప్రపంచం కూడా భారతదేశపు ఈ అనూహ్యమైన వేగాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తోంది’’
‘‘వికసిత్ భారత్ అనేది ఖచ్చితంగా ఆత్మనిర్భర భారత్ అయి తీరాలి. మన సొంత సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారానే శాశ్వతమైన బలం చేకూరుతుంది. మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ ఉద్యమాల వెనుక ఉన్న ప్రధాన విశ్వాసం ఇదే. ఆ మార్పు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ స్వయంగా ఒక సమగ్ర సెమీకండక్టర్ తయారీ రంగాన్ని అభివృద్ధి చేస్తోంది. సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి, చిప్‌ల ఎగుమతులు కూడా మొదలయ్యాయి. రాబోయే ఏళ్లలో మరిన్ని ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. అలాగే కీలక ఖనిజాల రంగంలోనూ మనం మన శక్తిసామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటున్నాం’’
“‘వద్దు’ నుంచి ‘ముందుకు సాగండి’ దిశగా…”
‘‘ఆయుధాలు పట్టిన నక్సలైట్లు వెళ్లిపోయారు. కానీ సమాజాన్ని తప్పుడు మార్గంలోకి లాగేందుకు ఆలోచనా విధానంతో నక్సలిజాన్ని ప్రోత్సహించే వారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని గుర్తించి, సమాజం నుంచి వేరుచేయడంతో పాటు, దేశ యువతను అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే ప్రధాన స్రవంతిలో భాగస్వాములను చేయాలి’’
“పేద, మధ్యతరగతి కుటుంబాలపై కోచింగ్ క్లాసుల ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు యువత కోసం వివిధ పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించాలని నిర్ణయించాం. ఈ దిశగా ఒక బలమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నాం.”
“2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని గ్రామాల నుంచి నగరాల వరకు పెద్ద ఎత్తున ప్రతిభా అన్వేషణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 5 నుంచి 15 ఏళ్ల వయసు గల పిల్లల్లోని క్రీడా ప్రతిభను ప్రత్యేక శిక్షణ ద్వారా మరింత మెరుగుపరచనున్నారు.”
“సంక్షోభ సమయాల్లోనే భారతదేశ అసలైన బలానికి పరీక్ష ఎదురైంది. కోవిడ్-19 మహమ్మారి నుంచి ఉక్రెయిన్, పశ్చిమాసియాలోని పరిస్థితుల వరకు భారత్‌పై అనేక ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే గత దశాబ్దంలో భారత్ నిర్మించుకున్న సామర్థ్యాలు ఈ ఆందోళనలన్నింటినీ తప్పని నిరూపించేందుకు మనకు తోడ్పడ్డాయి. ఎలాంటి ఒత్తిడి వచ్చినా దాని పూర్తి ప్రభావం పేద కుటుంబాలు, రైతులపై పడకుండా రక్షించేందుకు మేము ఎల్లప్పుడూ కృషి చేశాం.
“నేడు దేశంలో స్థిరమైన రాజకీయ ప్రజాభిప్రాయం, స్థిరమైన ప్రభుత్వం, చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం, బలమైన న్యాయ వ్యవస్థ, మనందరికీ దిశానిర్దేశం చేసే రాజ్యాంగం ఉన్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా నేడు దేశ గౌరవం వేగంగా పెరుగుతోంది.”
“దేశానికి ఈ ఏడు శక్తి ధారలు కొత్త వేగాన్ని, కొత్త శిఖరాలను అందించనున్నాయి
1. తయారీ రంగ శక్తి
2. వ్యవసాయం, ఆహార శుద్ధి రంగం
3. సాంకేతికత, ఆవిష్కరణలు
4. గతిశక్తి
5. రక్షణ శక్తి
6. హరిత ఆర్థిక వ్యవస్థ, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ
7. సాఫ్ట్ పవర్
“దేశ మాతృశక్తికి నమస్కరిస్తూ, మహిళా రిజర్వేషన్‌ను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలూ ముందుకు రావాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.”
“దేశంలో తొలిసారిగా నిర్వహించనున్న డిజిటల్ జనగణన విషయంలో దేశ ప్రజలందరికీ, ముఖ్యంగా యువ మిత్రులకు నా విజ్ఞప్తి…”
“సమయం మనది, అవకాశం మనది, సంకల్పం మనది… రండి, మనమందరం కలిసి అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మిద్దాం.”
***
(रिलीज़ आईडी: 2300027)
आगंतुक पटल : 8