హోం మంత్రిత్వ శాఖ
తప్పుదోవ పట్టించే మొబైల్ ఫోన్ అనువర్తనాల నిషేధం
प्रविष्टि तिथि:
11 AUG 2026 4:10PM by PIB Hyderabad
దేశంలో అన్ని రకాల సైబర్ నేరాలపై సమన్వయంతో, సమగ్రంగా దర్యాప్తు, పరిష్కారం దిశగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’ (ఐ4సి) పేరిట ఒక అనుబంధ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
మహిళలు, బాలలపై నేరాలకు పాల్పడటం మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ అన్ని రకాల సైబర్ నేర సంఘటనలను ప్రజలు నివేదించేందుకు ‘ఐ4సి’ కింద ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ (ఎన్‌సీఆర్‌పీ) (https://cybercrime.gov.in) కూడా ఇప్పుడు పనిచేస్తోంది.
చట్టవిరుద్ధ చర్యల కోసం వ్యక్తిగత సమాచార వినియోగ నిరోధం, డేటా లేదా కమ్యూనికేషన్ లింకుల తొలగింపు లేదా వాటి లభ్యత నిరోధం కోసం ‘సహయోగ్’ (Sahyog) పేరిట మరొక పోర్టల్ కూడా ప్రారంభమైంది. సమాచార సాంకేతిక చట్టం-2000లోని సెక్షన్ 79 ఉప-సెక్షన్ (3) క్లాజ్ (బి) ప్రకారం- సంబంధిత ప్రభుత్వం లేదా దాని సంస్థ ద్వారా సమాచార సాంకేతికత ప్రదాన సంస్థలకు నోటీసుల జారీని వేగిరపరచడం దీని లక్ష్యం. ఇందులో భాగంగా 30.06.2026 నాటికి ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 69(ఎ), సెక్షన్ 79(3)(బి) కింద మోసపూరిత రుణ అనువర్తనాలు (యాప్) సహా మొత్తం 3,718 మొబైల్ అనువర్తనాలను ‘ఐ4సి’ నిషేధించింది.
ఆర్థిక మోసాలపై తక్షణ నివేదన, మోసగాళ్ల ద్వారా నగడు అక్రమ తరలింపు నిరోధం దిశగా ‘ఐ4సి’ పరిధిలో ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్) 2021లో ప్రారంభమైంది. దీని తోడ్పాటుతో ఆర్థిక మోసాలపై 30.06.2026 నాటికి 32.80 లక్షలకు పైగా ఫిర్యాదులకు సంబంధించి రూ.11,158 కోట్లకు పైగా నగదు బదిలీని అడ్డుకున్నారు.
దేశంలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల సహకారంతో 10.09.2024న సైబర్ నేరగాళ్ల గుర్తింపు సమాచారంతో ‘సస్పెక్ట్ రిజిస్ట్రీ’ (అనుమానితుల జాబితా)ని కూడా ‘ఐ4సి’ ప్రారంభించింది. ఈ మేరకు 30.06.2026 నాటికి బ్యాంకుల నుంచి అందిన 30.48 లక్షల మందికి పైగా అనుమానితుల గుర్తింపు సమాచారం సహా రూ.25,698 కోట్ల విలువైన 32.08 లక్షల ‘లేయర్ 1 మ్యూల్ అకౌంట్స్’ వివరాలను ఈ రిజిస్ట్రీలో భాగస్వామ్యంగల సంస్థలు పరస్పరం పంచుకున్నాయి. ఇక పోలీసు అధికారులు నివేదించిన మేరకు 30.06.2026 నాటికి 15.75 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5.77 లక్షల ‘ఐఎంఈఐ’ నంబర్లను ప్రభుత్వం నిషేధించింది.
సైబర్ నేరాలపై ఫిర్యాదుల పరిష్కార సామర్థ్యం పెంపు, ఏకరూపత లక్ష్యంగా ‘ఎన్‌సీఆర్‌పీ-సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్’ కోసం సమీకృత ‘ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ’ (ఎస్‌ఓపీ)ను నిర్దేశించింది. ఎన్‌సీఆర్‌పీ ద్వారా అందే ఫిర్యాదుల పరిశీలన, బ్యాంకులతో సమన్వయం, సమస్యల పరిష్కారం, ‘లీన్ మార్కింగ్’ తొలగింపు, మోసపోయిన సొమ్ము నిజమైన బాధితులకు వాపసు వంటి అంశాలను ఇది నిర్దేశిస్తుంది. మోసగాళ్లు కాజేసిన సొమ్మును బాధితులకు వేగంగా వాపసు ఇప్పించేందుకు ‘మనీ రెస్టోరేషన్ మాడ్యూల్’ (ఎంఆర్‌ఎం), బ్యాంకు ఖాతాల స్తంభన లేదా నగదుపై ‘లీన్ మార్కింగ్’ వంటి అంశాలపై ఫిర్యాదుల సత్వర పరిష్కారం నిమిత్తం 2026 ఏప్రిల్ నుంచి ‘గ్రీవెన్స్ రిడ్రసల్ మాడ్యూల్’ (జీఆర్‌ఎం) ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
సైబర్ నేరాలపై దేశ ప్రజానీకంలో అవగాహన పెంపు ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు “కాలర్ ట్యూన్ ప్రచారం, సందేశాలు (ఎస్‌ఎంఎస్) సహా ‘ఐ4సి’ సామాజిక మాధ్యమ ఖాతాలు- ఎక్స్ లేదా ట్విట్టర్ (@సైబర్‌దోస్త్), ఫేస్‌బుక్ (సైబర్‌దోస్త్‌ఐ4సి), ఇన్‌స్టాగ్రామ్ (సైబర్‌దోస్త్‌ఐ4సి), టెలిగ్రాం (సైబర్‌దోస్త్‌ఐ4సి)”ల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. టీవీ-రేడియో, పాఠశాలల్లో ప్రచారం, సినిమా హాళ్లలో ప్రకటనలు, ప్రముఖుల ద్వారా ప్రచారం, ఐపీఎల్‌లో ప్రచారం, వివిధ మాధ్యమాల్లో ప్రచారం దిశగా ‘MyGov’ వినియోగం వంటి చర్యలు చేపట్టింది. మరోవైపు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంయుక్తంగా ‘సైబర్ భద్రత-రక్షణ అవగాహన వారోత్సవాల’ను నిర్వహిస్తోంది. కౌమారదశలోని బాలలు, విద్యార్థుల కోసం ప్రత్యేక కరదీపికల ప్రచురణ, రైల్వే స్టేషన్లతోపాటు విమానాశ్రయాలలో డిజిటల్ డిస్‌ప్లే ఏర్పాటు వంటి మాధ్యమాల ద్వారా అవగాహన కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2297763)
आगंतुक पटल : 17