వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

ఎన్ఎస్‌పీ–డీబీటీ ద్వారా 6,000 మందికి పైగా విద్యార్థులకు రూ. 21.35 కోట్ల ఉపకార వేతనాలను విడుదల చేసిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

ప్రయోగాత్మక శిక్షణ, సకాలంలో తోడ్పాటు, వ్యవసాయ ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కేంద్ర మంత్రి

‘‘పరీక్షలు, ప్రవేశాలు, చెల్లింపులు అన్నీ సకాలంలో జరగాలి, అదే ఏ వ్యవస్థకైనా అసలైన సవాలు’’ : శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

‘‘వ్యవసాయంలో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి తరగతులతో పాటు ఆచరణాత్మక శిక్షణ అవసరం’’: శ్రీ శివరాజ్ సింగ్
‘‘దేశ ఆహార భద్రతను, స్వావలంబనను వ్యవసాయ క్షేత్రాలు, రైతులు, సైన్స్ సమష్టిగా బలోపేతం చేస్తున్నాయి’’: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వానికి వ్యవసాయం, ఆహార భద్రత, పోషకాహారం, రైతుల ఆదాయ భద్రత ప్రాధాన్యాంశాలుగా కొనసాగుతాయి’: శ్రీ శివరాజ్ సింగ్

‘హరియాలి అమావాస్య’ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్ సంస్థల్లో మొక్కలను నాటాలని వ్యవసాయ విద్యార్థులను కోరిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

నాడు పోస్టు చేయడమైనది: 11 AUG 2026 12:01PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యార్థులకు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్ఎస్‌‌పీ) ద్వారా ఉపకార వేతనాలను, ఫెలోషిప్ నిధులను సోమవారం పూసాలోని ఐసీఏఆర్–ఐఏఆర్ఐలో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 6,000 మందికి పైగా విద్యార్థులకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో రూ. 21.35 కోట్ల మొత్తాన్ని విడుదల చేశారు. ఈ నూతన కార్యక్రమం ప్రారంభంతో, ఎలాంటి ఇబ్బందులూ, జాప్యాలూ లేకుండా డీబీటీ ద్వారా ఉపకార వేతనాన్ని ప్రతి నెలా వ్యవసాయ విద్యార్థులు అందుకుంటారు. ఉపకార వేతన పంపిణీ ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడం, సకాలంలో, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక సాయం పొందేలా చూడటమే ఈ కార్యక్రమ లక్ష్యం.

 

కేవలం ఆర్థిక సాయంగా మాత్రమే కాకుండా, వ్యవసాయ విద్యను బలోపేతం చేయడానికి, మరింత ఆచరణాత్మకంగా మార్చడానికి, అవకాశాలతో అనుసంధానించడానికి ఉపకరించే సాధనంగా ఉపకార వేతనాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ వర్ణించారు. డీబీటీ విధానం అమల్లోకి రావడంతో విద్యార్థులకు సకాలంలో సాయం అందుతోందని చెప్పారు. ఫలితంగా ఉపకార వేతనాల పంపిణీలో ఎదురయ్యే జాప్యాలు తొలగిపోతాయని అన్నారు. వ్యవసాయ విద్యలో ప్రయోగాత్మక శిక్షణ అత్యంత కీలకమనీ, ఎందుకంటే తరగతిలో చదువుకోవడం ద్వారా మాత్రమే రైతులు, శాస్త్రవేత్తలు లేదా వ్యవసాయ పారిశ్రామికవేత్తలను తయారు చేయలేమనీ విద్యార్థులనుద్దేశించి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ప్రయోగాత్మక అనుభవాన్ని సాధించడానికీ, తరగతి వెలుపల వ్యవసాయానికి సంబంధించిన వాస్తవాలను అర్థం చేసుకోవడానికీ విద్యార్థులకు అవకాశాలు అవసరమని ఆయన తెలియజేశారు. విద్య, శిక్షణ వ్యవస్థను నిరంతరం బలోపేతం చేసేందుకు, మెరుగుపరిచేందుకు సూచనలనూ, ఆలోచనలనూ పంచుకోవాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. జ్ఞానాన్ని అందించడం మాత్రమే కాకుండా.. వ్యవసాయ రంగానికి సమర్థవంతంగా తోడ్పడేందుకు అవసరమైన ప్రయోగాత్మక నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, అవగాహనతో యువతను సన్నద్ధం చేయడం కూడా వ్యవసాయ విద్య లక్ష్యం కావాలని అన్నారు. 

వ్యవసాయ రంగంలో ఆహార భద్రత, పోషణ, రైతుల ఆదాయ భద్రతకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, మార్గదర్శకత్వంలోని ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని శ్రీ చౌహాన్ అన్నారు. ఐసీఏఆర్ (భారత వ్యవసాయ పరిశోధనా మండలి) శాస్త్రవేత్తల కృషిని ఆయన ప్రశంసించారు. రైతుల కృషికి శాస్త్రవేత్తల పరిశోధనలు తోడై దేశ వ్యవసాయ నిల్వలను బలోపేతం చేశాయని, భారత వ్యవసాయ అభివృద్ధికి గణనీయంగా తోడ్పడ్డాయని చెప్పారు. కెరీర్ నిర్మాణంతో పాటుగా దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని, అర్థవంతమైన రీతిలో దేశం కోసం ఏదైనా చేయాలని యువతను ప్రోత్సహించారు. ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా.. ఆవిష్కరణ, అంకుర సంస్థలు, పరిశోధనల్లో కూడా వ్యవసాయ విద్యార్థులు రాణించాలని శ్రీ చౌహాన్ చెప్పారు. విస్తృత అవకాశాలను అందించే రంగంగా వ్యవసాయాన్ని చూడాలని యువతరానికి పిలుపునిచ్చారు. అలాగే కొత్తగా పుట్టుకొస్తున్న సవాళ్లకు నూతన పరిష్కారాలను కనుగొనేందుకు సహకరించాలని సూచించారు. ఈ రంగంలో శాస్త్రీయ పురోగతి, ఔత్సాహిక పారిశ్రామిక రంగం, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో యువ వ్యవసాయ నిపుణులు, విద్యార్థుల ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు.

 

ఉపకార వేతనాల పంపిణీనీ మరింత పారద్శకంగా, వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్ఎస్‌పీ–డీబీటీ వ్యవస్థ మారుస్తుందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా విద్యార్థులకు సకాలంలో ఆర్థిక సాయం అందుతుందని, దీనివల్ల ఉపకార వేతన నిధుల విడుదలలో అనిశ్చితి వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా చదువుపై దృష్టి సారిస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులకు కేవలం విద్యాపరమైన జ్ఞానాన్ని మాత్రమే కాకుండా.. ఆచరణాత్మక సామర్థ్యాలపై, వ్యవసాయంలో మారుతున్న అవసరాలపై కూడా అవగాహనను పెంపొందించే విద్యావ్యవస్థను సృష్టించాల్సిన అవసరాన్ని కేంద్రమంత్రి వివరించారు.

 

‘హరియాలి అమావాస్య’ సందర్భంగా మొక్కలను నాటాలని దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్ సంస్థల్లోని వ్యవసాయ విద్యార్థులకు శ్రీ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం, పర్యావరణం పట్ల ఉమ్మడి బాధ్యతలో ఈ హరిత కార్యక్రమాలు కూడా భాగమన్నారు. మొక్కలను నాటే కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలనీ, పర్యావరణం పట్ల అవగాహనను, బాధ్యతను బలోపేతం చేయడంలో దోహదపడాలని ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ భాగీరథ్ చౌధరి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంఎల్ జాట్, ఐసీఏఆర్ కార్యదర్శి శ్రీ జ్ఞానేంద్ర త్రిపాఠి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ యశ్‌పాల్ సింగ్ మాలిక్, ఐఏఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ సీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఐసీఏఆర్, ఐఏఆర్ఐకు చెందిన ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా వేలాది మంది విద్యార్థులు దీనిలో పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2297612) సందర్శకుల సూచీ సంఖ్య : : 43
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Manipuri , Gujarati , Tamil , Kannada , Malayalam