ఆర్థిక మంత్రిత్వ శాఖ
మహారాష్ట్రలో మరో అక్రమ మాదక ద్రవ్యాల తయారీ కేంద్రాన్ని గుర్తించిన డీఆర్ఐ
నిఘా వర్గాల సమాచారం ఆధారంగా వారం రోజుల పాటు సాగిన ఆపరేషన్
2 లక్షల ట్రామాడోల్ హైడ్రోక్లోరైడ్, టాపెంటాడోల్ మాత్రలు సహా తయారీ యంత్రాలు, ముడి సరుకుల స్వాధీనం
నైజీరియాకు అక్రమంగా తరలించేందుకు మాత్రలు తయారీ చేస్తున్న ముఠా
ముగ్గురు ప్రధాన నిందితుల అరెస్టు
నాడు పోస్టు చేయడమైనది:
10 AUG 2026 5:03PM by PIB Hyderabad
మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ తయారీ, అంతర్జాతీయ రవాణాను నిరోధించే నిరంతర ప్రయత్నాల్లో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) మరో విజయం సాధించింది. షెడ్యూల్డ్ సైకోట్రోపిక్ పదార్థమైన ట్రామాడోల్ హైడ్రోక్లోరైడ్ మాత్రలను ఆఫ్రికా దేశాలకు రవాణా చేయడం కోసం రహస్యంగా తయారు చేయడం, దాచిపెట్టడం, అక్రమంగా ఎగుమతి చేయడంలో పాలుపంచుకుంటున్న ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను డీఆర్ఐ సమర్థంగా అడ్డుకుంది. వారం రోజుల నిఘా ఆధారంగా జరిగిన ఈ ఆపరేషన్‌లో, లక్ష ట్రామాడోల్ హైడ్రోక్లోరైడ్ మాత్రలు, లక్ష టాపెంటాడోల్ మాత్రలు, సైకోట్రోపిక్ పదార్థాల రహస్య తయారీలో ఉపయోగించే యంత్రాలు, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ సిండికేట్‌కు చెందిన ముగ్గురు కీలక సభ్యులనూ అరెస్టు చేశారు.
ఈ నెల 2న అందిన నిఘా సమాచారం ఆధారంగా చేపట్టిన ఒక ఆపరేషన్‌లో, ముంబయి ఎయిర్ కార్గో కాంప్లెక్స్ వద్ద నైజీరియాకు ఎగుమతి చేసేందుకు ఉంచిన సరుకును డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఈ సరుకులో 'ప్రెగాబాలిన్-300 ఎంజీ క్యాప్సూల్స్' ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. పూర్తిస్థాయి పరిశీలన ద్వారా, ఆ సరుకులో దాచి ఉంచిన 1 లక్ష 'ట్రామాడోల్ హైడ్రోక్లోరైడ్' టాబ్లెట్లు (250 ఎంజీ, సుమారు 25 కిలోల బరువు)తో పాటు 1 లక్ష 'టాపెంటాడోల్' మాత్రలూ (200 ఎంజీ, సుమారు 20 కిలోల బరువు) ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
డీఆర్ఐ జరిపిన వేగవంతమైన దర్యాప్తులో, పలు దశల్లో పనిచేస్తున్న ఒక వ్యవస్థిత అక్రమ సరుకు రవాణా వ్యవస్థను అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లో ఉన్న ఒక ఫ్యాక్టరీలో ట్రామాడోల్ మాత్రలను రహస్యంగా తయారు చేసి, వాటి గుర్తించే వీలులేకుండా సాదా కార్టన్‌లలో ప్యాక్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ సరుకును ముంబయి ఎయిర్ కార్గో కాంప్లెక్స్ సమీపంలోని ఒక గిడ్డంగికి తరలించి, అక్కడ వాటిని తెల్లటి గోనె సంచుల్లో తిరిగి ప్యాక్ చేసి, నైజీరియాకు అక్రమంగా ఎగుమతి చేయడానికి సిద్ధం చేశారు.
వారం రోజుల పాటు పూర్తి సమన్వయంతో నిర్వహించిన దాడుల ద్వారా... ఎగుమతిదారు, తయారీదారు, సరఫరాదారు, రవాణాదారు, నిల్వ గిడ్డంగికి సంబంధించిన పలు ప్రదేశాల్లో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. తయారీ కేంద్రంలో జరిపిన సోదాల్లో సైకోట్రోపిక్ పదార్థాల రహస్య తయారీలో ఉపయోగించే టాబ్లెట్ కంప్రెషన్ యంత్రాలు సహా, గణనీయ పరిమాణంలో ముడి పదార్థాలనూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా ఐఈసీ హోల్డర్/ఎగుమతిదారు, సరఫరాదారు-కమ్-కోఆర్డినేటర్, ట్రామాడోల్ టాబ్లెట్ల రహస్య తయారీదారు సహా ముగ్గురు కీలక నిందితులను అరెస్టు చేశారు.
ట్రామాడోల్, టాపెంటాడోల్ అనేవి సింథటిక్ ఓపియాయిడ్ అనాల్జెసిక్ ఔషధాలు. వీటిని మధ్యస్థం నుంచి తీవ్రమైన నొప్పిని తగ్గించడానికి వైద్యుల పర్యవేక్షణలో విస్తృతంగా ఉపయోగిస్తారు. దుర్వినియోగం చేసేందుకు అవకాశం, వ్యసనానికి దారితీసే ప్రమాదం కారణంగా... ఈ రెండు ఔషధాలు కఠినమైన నియంత్రణలకు లోబడి ఉంటాయి. ట్రామాడోల్‌ను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌పీడీఎస్) చట్టం-1985 కింద సైకోట్రోపిక్ పదార్థంగా నోటిఫై చేశారు. టాపెంటాడోల్‌ను ప్రస్తుతానికి ఎన్‌పీడీఎస్ చట్టం షెడ్యూల్‌లో చేర్చనప్పటికీ... డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ఇదీ కఠిన నియంత్రణలకు లోబడి ఉంది. ఈ ఔషధాల అక్రమ తయారీ, మళ్లింపు, అక్రమ రవాణా ప్రజారోగ్యానికి తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. తరచుగా వ్యవస్థీకృత అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌లతో ఇవి సంబంధం కలిగి ఉంటాయి.
ఈ ఆపరేషన్ ద్వారా సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ తయారీ, నిల్వ, దాచిపెట్టడం, ఎగుమతి చేసే ప్రయత్నాల్లో పాలుపంచుకున్న ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను డీఆర్ఐ సమర్థంగా ఛేదించింది.
***
(రిలీజ్ ఐడి: 2297396)
సందర్శకుల సూచీ సంఖ్య : : 38