హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పుదుచ్చేరి పోలీసులకు రాష్ట్రపతి పతాకాన్ని బహూకరించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా

పుదుచ్చేరి పోలీసులకు ప్రతిష్ఠాత్మక 'ప్రెసిడెంట్స్ కలర్స్' ప్రదానం చేయడం ఆ దళాల శౌర్యానికి, కృషికి, అంకితభావానికి నిదర్శనం

రాష్ట్రపతి పతాకాన్ని అందుకోవడం క్రమశిక్షణ గల ఏ దళానికైనా లభించే అత్యున్నత గౌరవం

పుదుచ్చేరి పోలీసులు ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, పోలీసు దళానికి, ప్రజలకూ హృదయపూర్వక అభినందనలు

పుదుచ్చేరిలోని భౌగోళికంగా వేరుగా ఉన్న నాలుగు ప్రాంతాల శాంతిభద్రతలను కాపాడే బాధ్యత కలిగిన పుదుచ్చేరి పోలీసుల శౌర్యానికి ప్రతీకగా నిలిచే చిహ్నం ఈ రోజు సగర్వంగా రెపరెపలాడుతోంది

సంఖ్యాబలంలో సాపేక్షంగా తక్కువగా ఉన్నా... శౌర్యం, సేవ, అంకితభావంతో రాష్ట్రపు ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూ, రక్షణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తోన్న పుదుచ్చేరి పోలీసులు

భారత ఆధ్యాత్మిక, సాంస్కృతిక చైతన్యానికి పుదుచ్చేరి ప్రతీక

సుదీర్ఘ కాలం పాటు ఫ్రెంచ్ పాలనలో ఉన్నప్పటికీ... భారతీయ గుర్తింపును, ఆధ్యాత్మిక జీవశక్తిని నిలుపుకున్న పుదుచ్చేరి

కోవిడ్-19 సంక్షోభ సమయంలోనూ దృఢంగా నిలబడి ప్రజలకు సేవ చేసిన పుదుచ్చేరి పోలీసుల శౌర్యం.. చరిత్రలో నిలిచిపోతుంది

1950 నుంచి 2014 దాకా గత ప్రభుత్వాలు కేటాయించిన నిధులు రూ. 3,500 కోట్లు మాత్రమే

మోదీ ప్రభుత్వం గడిచిన 12 ఏళ్లలో కేటాయించిన నిధులు రూ.13,762 కోట్లు

గత ప్రభుత్వాల కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ

మోదీ ప్రభుత్వం పుదుచ్చేరి అభివృద్ధికి కట్టుబడి ఉంది... అక్కడి ప్రజలకు నిరంతర సేవ చేయడానికి సిద్ధంగా ఉంది: శ్రీ అమిత్ షా

నాడు పోస్టు చేయడమైనది: 09 AUG 2026 1:14PM by PIB Hyderabad

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు పుదుచ్చేరి పోలీసులకు రాష్ట్రపతి పతాకాన్ని (ప్రెసిడెంట్స్ కలర్స్) బహూకరించారు. లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె. కైలాసనాథన్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి శ్రీ ఎన్. రంగస్వామి సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

పుదుచ్చేరి దక్షిణ భారత ఆధ్యాత్మిక, సాంస్కృతిక చైతన్యానికి సజీవ చిహ్నం అని కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. పుదుచ్చేరి పోలీసులు దేశంలోని ప్రెసిడెంట్స్ కలర్స్‌ను పొందిన పోలీసు బలగాల ర్యాంక్‌లో చేరారు. పుదుచ్చేరి పోలీసులకు రాష్ట్రపతి పతాకం ప్రదానం చేయడం ఆ దళాల ధైర్యసాహసాలు, కృషి, అంకితభావానికి నిదర్శనం అని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రపతి పతాకాన్ని అందుకోవడం ఏ పోలీసు దళానికైనా అత్యంత ప్రతిష్ఠాత్మక క్షణాల్లో ఒకటి అని శ్రీ అమిత్ షా అన్నారు. పుదుచ్చేరిని రక్షించడం, అంతర్గత భద్రతను నిర్ధారించడం, రాష్ట్ర గౌరవాన్ని కాపాడటం వంటి బాధ్యతలను పుదుచ్చేరి పోలీసులు చక్కగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. వారి కఠోర శ్రమ, శౌర్యం, సేవ, అంకితభావానికి గుర్తింపుగా పుదుచ్చేరి పోలీసులు ఈ అత్యున్నత స్థాయి గౌరవాన్ని అందుకున్నారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.

సుదీర్ఘ కాలం పాటు ఫ్రెంచ్ పాలనలో ఉన్నప్పటికీ, పుదుచ్చేరి తన భారతీయ గుర్తింపును, ఆధ్యాత్మిక చైతన్యాన్ని కాపాడుకుందని కేంద్ర హోం మంత్రి అన్నారు. 1963 అక్టోబర్ 1న పుదుచ్చేరిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవిని ఏర్పాటు చేయగా, అప్పటి నుంచి పుదుచ్చేరి పోలీసులు ఈ సరిహద్దు ప్రాంత అంతర్గత భద్రతను మరింత పటిష్ఠం చేశారని ఆయన పేర్కొన్నారు.

బ్రిటిష్ వారు రూపొందించిన శిక్షాస్మృతుల స్థానంలో భారత ప్రభుత్వం మూడు కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకువచ్చిందని శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ కొత్త చట్టాలు కేవలం శిక్షలకు సంబంధించినవి మాత్రమే కాదనీ... సాంకేతికత సహాయంతో, కాలపరిమితితో కూడిన పద్ధతిలో పౌరులకు న్యాయం అందించడమే వీటి లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కొత్త క్రిమినల్ చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు మూలస్తంభాలపై నిర్మించినవని ఆయన పేర్కొన్నారు.

గత 12 ఏళ్లుగా కేంద్ర పాలిత ప్రాంతాల బలోపేతం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనేక చర్యలు తీసుకున్నారని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. పుదుచ్చేరిని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అక్కడి ప్రజల కోసం అనేక అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టిందని ఆయన తెలిపారు. జాతీయ రహదారి 332-Aను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ.2,200 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఇక్కడ సుమారు 3,400 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో విస్తరించిన రన్‌వేనూ నిర్మించిందన్నారు.

1950 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న గత ప్రభుత్వాలు పుదుచ్చేరి అభివృద్ధి పనులకు కేటాయించిన మొత్తం కేవలం రూ.3,500 కోట్లు మాత్రమేనని శ్రీ అమిత్ షా తెలిపారు. 2014 నుంచి 2026 వరకు మోదీ ప్రభుత్వం పుదుచ్చేరి అభివృద్ధికి కేవలం 12 సంవత్సరాల్లోనే రూ. 13,762 కోట్లు కేటాయించిందనీ, ఇది గతంలో కేటాయించిన మొత్తానికి దాదాపు నాలుగు రెట్లు అని ఆయన తెలిపారు. గత తొమ్మిదేళ్లలో భారత ప్రభుత్వం పుదుచ్చేరిలో రూ. 39,000 కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడులనూ ప్రోత్సహించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. లక్‌పతి దీదీ, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, మరుగుదొడ్ల నిర్మాణం, ఉచిత ఆహార ధాన్యాల పథకం, ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) వంటి కార్యక్రమాల ద్వారా పుదుచ్చేరి పౌరులు ఎంతో లబ్ధి పొందారని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం పుదుచ్చేరి అభివృద్ధికి కట్టుబడి ఉందని, అక్కడి ప్రజలకు నిరంతరం సేవ చేయడానికి సిద్ధంగా ఉందనీ కేంద్ర హోం మంత్రి తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2296893) సందర్శకుల సూచీ సంఖ్య : : 46