నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ

భారత వాణిజ్య నౌకాయాన పాలనలో డిజిటల్ విప్లవం.. ఈ-సముద్ర వేదికను ప్రారంభించిన కేంద్రం


నావికుల భద్రత, సంక్షేమానికి భారత్‌ కట్టుబడి ఉంది: కేంద్రమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్


నావికుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు సింగిల్-విండో డిజిటల్ సేవలు, 24/7 ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, పటిష్ట సంక్షేమ చర్యలు

प्रविष्टि तिथि: 08 AUG 2026 5:49PM by PIB Hyderabad

న్యూఢిల్లీ, ఆగస్టు 8, 2026: దేశీయ వాణిజ్య నౌకాయాన రంగంలో డిజిటల్ పరిపాలనను వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నావికులు, షిప్పింగ్ కంపెనీలు, ఓడరేవులు, సముద్ర వాణిజ్య భాగస్వాములందరికీ అవసరమైన సేవలను ఒకే వ్యవస్థ కిందకు తెసుకొచ్చే సరికొత్త సమగ్ర డిజిటల్ వేదిక ‘ఈ-సముద్ర’ను శనివారం ప్రారంభించింది. ఈ వేదిక ఆవిష్కరణతో పాటు నావికుల సంక్షేమం, భద్రత, సేవల పంపిణీని మరింత బలోపేతం చేసేందుకు పలు సంస్కరణలను కూడా ప్రకటించింది.

 

కేంద్ర నౌకాయాన, ఓడరేవులు, జలమార్గాల శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (డీజీఎంఏ) ఆధ్వర్యంలో ముంబైలో నిర్వహించిన ‘‘నావికుల భద్రత, రక్షణ  సంక్షేమం అలాగే ఈ-సముద్ర ప్రారంభోత్సవం’’ అంశంపై జరిగిన జాతీయ సదస్సులో కేంద్రమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ వేదికను ప్రారంభించారు.

 

ఈ-సముద్ర వేదికతోపాటు, నౌకాయాన పరిపాలనను ఆధునీకరించడానికి, నావికుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి డీజీఎంఏ పలు నూతన కార్యక్రమాలను ఈ సదస్సులో ప్రదర్శించింది. వీటిలో ఈ-నావిక్ 24/7 ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, త్వరలో రాబోయే సీఫేరర్ ట్రాకింగ్ డాష్‌బోర్డు, డిజిటల్ సీఫేరర్స్ ఎంప్లాయ్‌మెంట్ అగ్రిమెంట్ (డీ-సీఈఏ), సీఫేరర్స్ వెల్ఫేర్ ఫండ్ సొసైటీ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఎస్‌) ద్వారా నావికులు, వారి కుటుంబాలకు మెరుగైన సంక్షేమ చర్యలు చేపట్టారు.

 

సదస్సును ఉద్దేశించి కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ వాణిజ్య నౌకాయాన రంగం గొప్ప మార్పులకు లోనవుతోందని అన్నారు. దేశ దీర్ఘకాలిక వృద్ధి వ్యూహంలో నావికులే కేంద్ర బిందువు అని, వారి భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

 

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారత్‌ ‘మారిటైమ్ ఇండియా విజన్ 2030’, ‘మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047’ ద్వారా వాణిజ్య నౌకాయాన రంగంలో ప్రతిష్ఠాత్మకమైన మార్పులను సాధిస్తోంది. ఈ ప్రయాణంలో నావికులే దేశానికి అత్యంత కీలకం. ప్రతి భారతీయ నావికుడు సురక్షితంగా ఉండాలి, గౌరవం, పూర్తి మద్దతు లభించాలనేదే మా స్పష్టమైన సంకల్పం. ప్రపంచ నౌకాయాన శక్తిగా భారత్‌ ఎదుగుతున్న తరుణంలో దేశ వృద్ధికి కారణమవుతున్న మన నావికులు ఎలాంటి భయం లేకుండా, సురక్షితంగా, ఆత్మగౌరవంతో పనిచేసేలా చూస్తాం’’ అని సోనోవాల్ హామీ ఇచ్చారు.

 

భారత్‌కు పెరుగుతున్న నౌకాయాన సామర్థ్యాలను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు నావికులను అందిస్తున్న దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ రెండో అతిపెద్ద దేశంగా అవతరించిందని, త్వరలోనే మొదటి స్థానానికి చేరుకుంటుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనితో పాటు, పాత ఓడలను పునరుద్ధరించే పాత ఓడల పునరుద్ధరణ రంగంలో భారత్‌ ఇప్పటికే ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని, రాబోయే రోజుల్లో ప్రపంచంలోని టాప్-5 ఓడల తయారీ దేశాల జాబితాలో భారత్‌ను నిలిపేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.

 

నూతనంగా ప్రారంభించిన డిజిటల్ వేదిక గురించి మంత్రి మాట్లాడుతూ.. ‘‘ఈ-సముద్ర కేవలం ఒక సాంకేతిక వేదిక మాత్రమే కాదు.సముద్ర వాణిజ్య పరిపాలనను మరింత సరళంగా, పారదర్శకంగా, భాగస్వాములకు మరింత జవాబుదారీగా మార్చేందుకు వేసిన ఒక పెద్ద ముందడుగు. సాంకేతికత అనేది ప్రజల జీవితాలను మెరుగుపరిచినప్పుడే దానికి నిజమైన అర్థం ఉంటుంది. ఈ-సముద్ర ద్వారా మన నావికుల జీవన సౌలభ్యాన్ని, అలాగే నౌకాయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మేం సుసాధ్యం చేస్తున్నాం’’ అని సర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు.

 

దేశ నౌకాయాన విధానం ప్రస్తుతం మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ముందుకు సాగుతోందని కేంద్ర నౌకాయాన, ఓడరేవులు, జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ముంబై సదస్సులో ఆయన మాట్లాడుతూ.. నావికులను అత్యంత కీలక కార్మికులుగా గుర్తించే నూతన మర్చంట్ షిప్పింగ్ యాక్ట్, 2025, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047,  ప్రభుత్వ సూత్రమైన కనీస ప్రభుత్వం-గరిష్ట పాలన అనే మూడు అంశాలే ఈ విధానానికి కీలకమని వివరించారు.

 

ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న సముద్రయాన పరిశ్రమ ప్రతినిధులు, నావికుల సంఘాలు, నియామక,ప్లేస్‌మెంట్ ఏజెన్సీలు, నౌకాయాన శిక్షణ సంస్థలు, ఓడల యజమానులు, ప్రభుత్వ సంస్థల అధికారుల, సముద్ర వాణిజ్య నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

‘‘నూతన వేదిక గురించి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఈ-సముద్ర పూర్తిస్థాయి కార్యప్రవాహాలు, ఆన్‌లైన్ చెల్లింపులు, తక్షణ ట్రాకింగ్, డిజిటల్ ధ్రువీకరణ పత్రాల జారీ వంటి సేవలను ఒకే డిజిటల్ వేదిక పరిధిలోకి తీసుకువస్తుంది. మా లక్ష్యం కేవలం ప్రభుత్వ ప్రక్రియలను ఆన్‌లైన్ చేయడం మాత్రమే కాదు, వాటిని మరింత పారదర్శకంగా, ముందే ఊహించదగినవిగా, కాలపరిమితితో కూడినవిగా మార్చడమే మా ధ్యేయం’’ అని  పేర్కొన్నారు.

 

భారతదేశంలో చురుకైన నావికుల సంఖ్య 2013 లో దాదాపు 1.03 లక్షలుగా ఉండగా.. అది 2025 నాటికి ఏకంగా 3.23 లక్షల మార్కును దాటి మూడింతలు పెరగడం విశేషం. దేశంలో వేగంగా విస్తరిస్తున్న నౌకాయాన శ్రామిక శక్తికి అనుగుణంగా డిజిటల్ సేవల పంపిణీ, సంక్షేమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు ఈ సందర్భంగా గణాంకాలతో వివరించారు.

 

వాణిజ్య నౌకాయాన పరిపాలన డైరెక్టర్ జనరల్ శ్రీ శ్యామ్ జగన్నాథన్ మాట్లాడుతూ.. ఈ-సముద్ర అనేది ఒక పరివర్తనాత్మక వేదికగా అభివర్ణించారు. ఇది నౌకాయాన పరిపాలనను భౌతిక కార్యాలయాల నమూనా నుంచి ‘డిజిటల్ ఫస్ట్’, ‘ఫేస్‌లెస్ గవర్నెన్స్’ వైపు మారుస్తుందని చెప్పారు.

 

‘‘ఈ-సముద్ర వేదిక మన నౌకాయాన పరిపాలనను భౌతిక కార్యాలయాల నమూనా నుంచి ఒక సమగ్ర డిజిటల్ వ్యవస్థగా మారుస్తుంది. ఇది డిజిటల్ ఫస్ట్, ఫేస్‌లెస్ గవర్నెన్స్ వైపు సాగుతున్న పరివర్తనకు నిదర్శనం. దీని ద్వారా సముద్రంలో ఓడపై ప్రయాణిస్తున్న నావికుడు సైతం.. తీరంలో హాయిగా కూర్చున్న వ్యక్తి ఎంత సులభంగా ప్రభుత్వ సేవలను పొందుతాడో, అంతే సులభంగా డిజిటల్ సేవలను పొందగలడు’’ అని డీజీఎంఏ శ్యామ్ జగన్నాథన్ స్పష్టం చేశారు.

 

ఇటీవలి కాలంలో అంతర్జాతీయ నౌకాయాన రంగాన్ని కుదిపేస్తున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సముద్ర భద్రతా సవాళ్లపై డీజీఎంఏ స్పందించిన తీరును ఈ సదస్సులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతర్జాతీయంగా వివిధ సంక్షోభాలు ఎదురైనప్పుడు డీజీఎంఏ 16,000 కంటే ఎక్కువ అత్యవసర కాల్‌లను పర్యవేక్షించిందని, 40,000 కి పైగా కమ్యూనికేషన్లను నిర్వహించిందని కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, భారత నౌకాదళం, ఓడల యజమానుల ఉమ్మడి భాగస్వామ్యంతో.. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 4,000 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

 

నావికుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన సాగర్ మే యోగ్, మహిళా నావికులకు నౌకాయాన రంగంలో మరిన్ని మెరుగైన అవకాశాలు, తోడ్పాటును అందించేందుకు ఉద్దేశించిన సాగర్ మే సమ్మాన్ వంటి నూతన కార్యక్రమాలను అధికారులు వివరించారు. ఇటీవలి కాలంలో భారత నౌకాయాన రంగంలో మహిళా నావికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది వాణిజ్య నౌకాయాన శ్రామిక శక్తిలో సమష్టి వృద్ధికి నిదర్శనమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

 

కార్యక్రమంలో  నియామకాలు, ప్లేస్‌మెంట్ సేవల ప్రతినిధులు, సముద్ర రవాణా రంగానికి చెందిన భాగస్వాములు, క్యాడెట్లు, యువ నౌకాయాన వృత్తి నిపుణులతో  కేంద్రమంత్రి శ్రీ సోనోవాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా నియామకాలు, ఉపాధి, సంక్షేమం, నిబంధనల అమలు, వృత్తి అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఆయన చర్చించారు. యువతకు ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. భద్రత, వృత్తి నైపుణ్యం, గౌరవం, నిరంతర అభ్యాసం వంటి విలువలను నిలబెట్టుకోవాలని ఆయన భారతీయ నావికుల తదుపరి తరానికి పిలుపునిచ్చారు.

 

సాంకేతికత ఆధారిత, పారదర్శక, పౌర-కేంద్రిత నౌకాయాన పాలన వైపు సాగుతున్న భారత్‌ ప్రయాణంలో ఈ-సముద్ర వేదిక ప్రారంభం కీలక మైలురాయిగా నిలుస్తుంది. బహుళ సేవలను ఒకే డిజిటల్ వేదిక పరిధిలోకి తీసుకురావడం ద్వారా సేవల పంపిణీ మెరుగుపడుతుందని, నిబంధనల భారం తగ్గుతుందని, పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ప్రపంచంలోనే అగ్రగామి వాణిజ్య నౌకాయాన దేశంగా భారత్‌ స్థానం మరింత బలోపేతం కానుంది.

 

 

 

 

****


(रिलीज़ आईडी: 2296635) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , Marathi , English , हिन्दी , Gujarati , Tamil , Malayalam