వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంకురసంస్థలకు మద్దతు బలోపేతం లక్ష్యంగా

కీలక పరిశ్రమల నాయకులు, వ్యవస్థలతో ప్రభుత్వం వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు

అంకురసంస్థలకు డిజిటల్ మౌలిక సదుపాయాల మద్దతు బలోపేతం కోసం క్యాష్ ఫ్రీ పేమెంట్స్‌తో కలిసి పనిచేయనున్న డీపీఐఐటీ

వ్యవస్థాపన అభివృద్ధి, అంకురసంస్థల వ్యవస్థ బలోపేతం కోసం డార్విన్ డైనమిక్స్ ఎల్ఎల్‌పీతో డీపీఐఐటీ భాగస్వామ్యం

అంకుర సంస్థలకు క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మద్దతు బలోపేతం కోసం వల్టర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో డీపీఐఐటీ ఒప్పందం

ఏఐ-ఆధారిత రవాణా ఆవిష్కరణలు, అంకుర సంస్థల వ్యవస్థ బలోపేతం కోసం కార్స్24 సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో డీపీఐఐటీ ఒప్పందం

భారతీయ అంకుర సంస్థల వృద్ధి, ప్రపంచ స్థాయి సామర్థ్యాల బలోపేతం కోసం కౌన్సిల్ ఫర్ స్టార్టప్ ఇండియాతో డీపీఐఐటీ ఒప్పందం

प्रविष्टि तिथि: 08 AUG 2026 2:45PM by PIB Hyderabad

వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ)... క్యాష్‌ఫ్రీ పేమెంట్స్, డార్విన్ డైనమిక్స్, వల్టర్ ఇండియా, కార్స్24, కౌన్సిల్ ఫర్ స్టార్టప్ ఇండియా (సీఎస్ఐ) వంటి కీలక పరిశ్రమల నాయకులు, వ్యవస్థను సులభతరం చేసే సంస్థలతో పలు వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలను ప్రకటించింది.

క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌ సహకారంతో డిజిటల్ చెల్లింపు మౌలిక సదుపాయాలు, ఫిన్‌టెక్ సామర్థ్యాలను మెరుగుపరచడం

డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలు, ఆర్థిక సాంకేతిక పరిష్కారాలు, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డీపీఐఐటీ గుర్తింపు గల అంకుర సంస్థలకు మద్దతును బలోపేతం చేయడం లక్ష్యంగా... డీపీఐఐటీ సంస్థ క్యాష్‌ఫ్రీ పేమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సహకారం ద్వారా అంకుర సంస్థలు సమర్థంగా వృద్ధి చెందడానికి, భారత ఆవిష్కరణ-ఆధారిత వృద్ధికి దోహదపడటానికి వీలుగా... ఇది డీపీఐఐటీ సంస్థాగత పరిధిని, డిజిటల్ చెల్లింపుల్లో క్యాష్‌ఫ్రీ పేమెంట్స్ నైపుణ్యంతో జోడించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ భాగస్వామ్యం కింద, అర్హతగల అంకుర సంస్థలు... సురక్షితమైన, విస్తరించదగిన చెల్లింపు, పంపిణీ పరిష్కారాలు... గుర్తింపు ధ్రువీకరణ... రిస్క్ మేనేజ్‌మెంట్ సేవలు... ప్రాధాన్య ఆన్‌బోర్డింగ్ మద్దతు... వాణిజ్య ప్రయోజనాలను పొందుతాయి. డిజిటల్ చెల్లింపులు, నిబంధనల పాటింపు, మోసాల నివారణ, కేవైసీ, వివిధ దేశాల మధ్య లావాదేవీలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు వంటి రంగాల్లో సామర్థ్యాలను పెంపొందించడానికి ఈ సహకారం వ్యవస్థాపకుల కార్యశాలలు, మార్గదర్శక సమావేశాలు, ఏఐ బిల్డథాన్‌లు, హ్యాకథాన్‌లు, విజ్ఞాన భాగస్వామ్య కార్యక్రమాలనూ సులభతరం చేస్తుంది.

డార్విన్ డైనమిక్స్‌ సహకారంతో సమ్మిళిత వ్యవస్థాపన, డీప్-టెక్ ఆవిష్కరణలను విస్తరించడం...

దేశంలో వ్యవస్థాపన అభివృద్ధిని బలోపేతం చేయడానికి, మరింత సమ్మిళిత, ఆవిష్కరణ-ఆధారిత అంకుర సంస్థల వ్యవస్థను పెంపొందించడానికి డార్విన్ డైనమిక్స్ ఎల్ఎల్‌పీతో డీపీఐఐటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం టయర్ II, టయర్ III, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థాపనను ప్రోత్సహించడం ద్వారా 'స్టార్టప్ ఇండియా' కార్యక్రమ పరిధిని విస్తరిస్తుంది. అంకురసంస్థలకు మార్గదర్శనం, సంస్థాగత నెట్‌వర్క్‌లు, మార్కెట్ అవకాశాలు, సామర్థ్య నిర్మాణ మద్దతును మరింత మెరుగ్గా అందుబాటులో ఉంచడం దీని లక్ష్యం.

డార్విన్ డైనమిక్స్ సంస్థ ఈ సహకారం కింద... అంకుర సంస్థల ఫార్మలైజేషన్‌ను సులభతరం చేయడానికి, వ్యవస్థాపనపై అవగాహనను బలోపేతం చేయడానికి, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలకూ మద్దతునిస్తుంది. పరిశుద్ధ ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, కృత్రిమ మేధ, వాతావరణ సాంకేతికతలు, అధునాతన తయారీ సహా వ్యూహాత్మక రంగాల్లో ఆవిష్కరణలను ఇది ప్రోత్సహిస్తుంది.

ఈ సంస్థ అంకుర సంస్థల విస్తరణ, ఫార్మలైజేషన్ డ్రైవ్‌లు, వ్యవస్థాన బూట్‌క్యాంప్‌లు, మెంటర్ నెట్‌వర్క్ అభివృద్ధి, అంతర్జాతీయ మార్కెట్ యాక్సెస్ కార్యక్రమాలు, ఇన్వెస్టర్ కనెక్ట్ కార్యక్రమాలు, పాలసీ పరిశోధన అధ్యయనాలు సహా నిర్మాణాత్మక కార్యక్రమాలనూ చేపడుతుంది. ముఖ్యంగా యువత, మహిళా పారిశ్రామికవేత్తలు, తొలితరం వ్యవస్థాపకులు, వెనకబడిన ప్రాంతాల ఆవిష్కర్తలు సహా అంకురసంస్థల కోసం ఈ సహకారం కొత్త అవకాశాలను సృష్టిస్తుందని... ప్రపంచంతో పోటీపడగల ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారాలన్న భారత దార్శనికతకు తోడ్పాటు నిస్తుందని భావిస్తున్నారు.

వల్టర్ ఇండియా సహకారంతో సాంకేతికతను, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మరింత మెరుగ్గా అందుబాటులో ఉంచడం...
వల్టర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఈ సహకారం... డీపీఐఐటీ గుర్తింపు పొందిన అంకుర సంస్థలకు అందుబాటులో ఉన్న సాంకేతిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుంది. అంకుర సంస్థలకు క్లౌడ్ కంప్యూటింగ్ వనరులు, సాంకేతిక సామర్థ్య నిర్మాణం, డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత మెరుగ్గా అందుబాటులో ఉంచడం, తద్వారా వాటి కోసం మరింత సమర్థమైన నిర్మాణం, విస్తరణ, ఆవిష్కరణకు వీలు కల్పించడం దీని లక్ష్యం.

ఈ భాగస్వామ్యం కింద, డీపీఐఐటీ గుర్తింపు పొందిన అర్హత గల అంకురసంస్థలు వల్టర్ గ్రూపు అంకుర సంస్థల కార్యక్రమాల ద్వారా క్లౌడ్ క్రెడిట్‌లు, ప్రాధాన్య ధరలు, సాంకేతిక మద్దతునూ పొందుతాయి. అంకుర సంస్థల సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సహకారంలో క్లౌడ్ కంప్యూటింగ్, స్టోరేజ్, డేటాబేస్‌లు, కుబెర్నెటెస్, నెట్‌వర్కింగ్, అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ వంటి రంగాలను కవర్ చేస్తూ... క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై నిర్మాణాత్మక శిక్షణా తరగతులు, సాంకేతిక సహాయం అందిస్తారు.

ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ, అంకుర సంస్థల వ్యవస్థతో మరింతగా మమేకమవ్వడానికి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని ప్రోత్సహించడానికి గానూ స్టార్టప్ ఇండియా-డీపీఐఐటీల ఆధ్వర్యంలో జరిగే ఈవెంట్లలో పాల్గొనే అవకాశాలనూ అన్వేషిస్తుంది. అధునాతన క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగించుకోవడంలో... సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలోని అడ్డంకులను తగ్గించడంలో... వినూత్నమైన, ప్రపంచంతో పోటీపడగల డిజిటల్ పరిష్కారాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో అంకురసంస్థలకు ఈ భాగస్వామ్యం మద్దతునిస్తుందని భావిస్తున్నారు.

కార్స్24 సహకారంతో రవాణా, ఆటో-టెక్, ఏఐ ఆధారిత ఆవిష్కరణలను ముందుకు నడిపించడం...

భారత రవాణా, ఆటోమోటివ్ టెక్నాలజీ వ్యవస్థలో ఆవిష్కరణలు, వ్యవస్థాపన, సామర్థ్యాలను పెంపొందించడం కోసం కార్స్24 సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో డీపీఐఐటీ ఒప్పందం చేసుకుంది. ఏఐ-ఆధారిత ఆవిష్కరణలు, వ్యవస్థాపనల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడి అవకాశాలు, రహదారి భద్రతా కార్యక్రమాలకు మద్దతునివ్వడం ద్వారా అంకుర సంస్థల వ్యవస్థను బలోపేతం చేయడం ఈ సహకారం లక్ష్యం.

అంకుర సంస్థల వ్యవస్థాపకులకు నిర్మాణాత్మక మార్గదర్శనం అందించడం... రవాణా, ఆటోటెక్ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ప్రోత్సహించడం... ఏఐ-కేంద్రిత సాంకేతిక పరిజ్ఞానాన్ని సులభతరం చేయడం... అంకుర సంస్థల నేతృత్వంలోని పరిష్కారాలను ప్రోత్సహించడం కోసం ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లు, హ్యాకథాన్‌లను నిర్వహించడం వంటి లక్ష్యాలను ఈ ఆటో-టెక్ కంపెనీ కలిగి ఉంది. ముఖ్యంగా రవాణా, కృత్రిమ మేధ వంటి రంగాల్లో పెట్టుబడి మూల్యాంకనం, వ్యవస్థ భాగస్వామ్యం ద్వారా ఈ సహకారం అత్యంత సమర్థమైన అంకుర సంస్థలకు మద్దతునిస్తుంది.

అంకుర సంస్థలు అత్యాధునిక రవాణా పరిష్కారాలను అభివృద్ధి చేయడం... అమలు సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం... సురక్షితమైన, సుస్థిరమైన, సాంకేతికత ఆధారితమైన రవాణా పురోగతికి దోహదపడటం ద్వారా ఈ భాగస్వామ్యం భారత ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

కౌన్సిల్ ఫర్ స్టార్టప్ ఇండియా (సీఎస్ఐ) సహకారంతో పెట్టుబడి, పాలన, ప్రపంచవ్యాప్త విస్తరణను వేగవంతం చేయడం...
పెట్టుబడి, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, మార్గదర్శనం, నాయకత్వ అభివృద్ధి, ప్రపంచ మార్కెట్లను అందుబాటులో ఉంచడాన్ని సులభతరం చేయడం ద్వారా డీపీఐఐటీ గుర్తింపు గల అంకురసంస్థలకు మద్దతును బలోపేతం చేయడం లక్ష్యంగా.... కౌన్సిల్ ఫర్ స్టార్టప్ ఇండియా (సీఎస్ఐ)తో డీపీఐఐటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంకురసంస్థలు స్థిరంగా వృద్ధి చెందడానికి, ప్రపంచంతో పోటీపడేలా వాటి సామర్థ్యాలను బలోపేతం చేయడానికి వీలు కల్పిస్తూ, ఆవిష్కరణల ఆధారిత సంస్థల వృద్ధిని వేగవంతం చేయడం ఈ సహకారం లక్ష్యం.

అవగాహన ఒప్పందంలో భాగంగా సీఎస్ఐ సంస్థ... పెట్టుబడి సంసిద్ధత, కార్పొరేట్ భాగస్వామ్యం, సీఎఫ్‌ఓ మ్యాచ్‌మేకింగ్, ప్రపంచ మార్కెట్‌ను అందుబాటులో ఉంచడం, అంతర్జాతీయ ఆవిష్కరణ సహకారాలపై ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అంకుర సంస్థలకు మద్దతునిస్తుంది. ఇది కార్పొరేట్ భాగస్వామ్యాలను సులభతరం చేస్తుంది. పాలన, ఆర్థిక సంసిద్ధత, నిబంధనల పాటింపు, అంతర్జాతీయ విస్తరణలో వ్యవస్థాపకులకు మద్దతునిస్తుంది. అంకుర సంస్థలు, పెట్టుబడిదారులు, పరిశ్రమ-విధాన భాగస్వాముల మధ్య సంబంధాలనూ బలోపేతం చేస్తుంది.

అంకుర సంస్థలకు ఆర్థిక సహాయం, మార్గదర్శనం అందించడం, వాణిజ్య అవకాశాలను మెరుగుపరచడంతో పాటు... దేశంలో పటిష్ఠమైన, ప్రపంచంతో పోటీపడగల, ఆవిష్కరణల ఆధారిత అంకురసంస్థల వ్యవస్థ వృద్ధికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని భావిస్తున్నారు.


(रिलीज़ आईडी: 2296634) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Malayalam