మంత్రిమండలి
azadi ka amrit mahotsav

రూ.23,731 కోట్ల వ్యయంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి కోసం జాతీయ సమగ్ర పథకం గోబర్ధన్‌కు కేబినెట్ ఆమోదం


భారత సేంద్రీయ సంపదను పరిశుద్ధ ఇంధనంగా, గ్రామీణ శ్రేయస్సుగా, ఆర్థిక వృద్ధిగా మార్చే చరిత్రాత్మక జాతీయ పథకం

హామీతో కూడిన కొనుగోలు, స్థిరమైన ధరలు, మూలధన సహాయం, పైప్‌లైన్ అనుసంధానం, ఆర్థిక వనరుల లభ్యత ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి వేగవంతం కోసం సమీకృత విధానం

దేశీయ సీబీజీ ఉత్పత్తిలో దాదాపు పది రెట్లు వృద్ధితో దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయనున్న పథకం

రైతులు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, ప్రైవేటు పెట్టుబడులు, వ్యర్థాల నుంచి సంపద సృష్టి, స్వయం-సమృద్ధ భారత్‌లకూ భారీ ప్రోత్సాహం

प्रविष्टि तिथि: 06 AUG 2026 4:08PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో... మొత్తం రూ.23,731 కోట్ల వ్యయంతో చేపట్టే జాతీయ సర్క్యులర్ బయోఎనర్జీ పథకమైన గోబర్ధన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

భారత పరిశుద్ధ ఇంధన ప్రయాణంలో గోబర్ధన్ ఒక కీలక ఘట్టం. ఇది దేశంలో సమృద్ధిగా ఉన్న వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ, ప్రెస్ మడ్, పురపాలికల్లోని సేంద్రియ వ్యర్థాలు, ఇతర జీవద్రవ్య వనరులను... పరిశుద్ధ ఇంధనంగా, సేంద్రియ ఎరువుగా, గ్రామీణ ఆదాయ వనరుగా, జాతీయ ఆర్థిక విలువగా రూపాంతరం చెందిస్తుంది.

ఈ పథకాన్ని ఆర్థిక సంవత్సరం 2026-27 నుంచి 2035-36 వరకు అమలు చేస్తారు. దీని ద్వారా దేశ భవిష్యత్ ఇంధన మిశ్రమానికి ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్‌ మూలస్తంభంగా నిలుస్తుంది.

హామీతో కూడిన డిమాండ్... లాభదాయకమైన, స్థిరమైన ధరలు... మూలధన సహాయం... పైప్‌లైన్ మౌలిక సదుపాయాలు... ఆర్థిక సహాయం... సాంకేతిక అభివృద్ధి ద్వారా భారత సీబీజీ రంగాన్ని జాతీయ స్థాయిలో విస్తరించడానికి అవసరమైన పటిష్ఠమైన, అంచనా వేయదగిన విధాన ప్రణాళికను గోబర్ధన్ అందిస్తుంది.

దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తిని దాదాపు పది రెట్లు పెంచడం, భారీ స్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులను సమీకరించడం, దేశవ్యాప్తంగా శక్తిమంతమైన సర్క్యులర్ బయోఎకానమీని సృష్టించడం ఈ పథకం లక్ష్యం.

ప్రభుత్వ స్పష్టమైన దృక్పథాన్ని ఇది ప్రతిబింబిస్తుంది:

భారతదేశ వ్యర్థాలు దేశ వృద్ధికి ఇంధనంగా మారతాయి.

భారత గ్రామాలు పరిశుద్ధ ఇంధన ఉత్పత్తి కేంద్రాలుగా మారతాయి.

భారత రైతులు దేశ ఇంధన భద్రతలో భాగస్వాములవుతారు.

బలమైన పునాది నుంచి జాతీయ స్థాయికి:

గత కొన్నేళ్లుగా భారత ప్రభుత్వం... సరసమైన రవాణా కోసం సుస్థిర ప్రత్యామ్నాయ (ఎస్ఏటీఏటీ) పథకం, సేంద్రియ ఎరువుల కోసం మార్కెట్ అభివృద్ధి సహాయ (ఎండీఏ) పథకం, బయోమాస్ అగ్రిగేషన్ మెషినరీ (బీఏఎమ్) పథకం, పైప్‌లైన్ మౌలిక సదుపాయాల అభివృద్ధి (డీపీఐ) పథకం, జాతీయ బయోఎనర్జీ కార్యక్రమం కింద సీబీజీ ప్లాంట్ల కోసం కేంద్ర ఆర్థిక సహాయం (సీఎఫ్ఏ) వంటి పథకాల ద్వారా సీబీజీ రంగానికి క్రమపద్ధతిలో బలమైన పునాదులు వేసింది.

ఈ కార్యక్రమాలన్నీ కలిసి 200కు పైగా సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు వీలు కల్పిస్తూనే... ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థల స్థాపనను, సేంద్రీయ ఎరువుల వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేశాయి. వివిధ ఫీడ్‌స్టాక్‌లు, భౌగోళిక ప్రాంతాల్లో సీబీజీ సామర్థ్యాన్ని ప్రదర్శించాయి.

గోబర్ధన్ ఇప్పుడు ఈ పురోగతిని తదుపరి స్థాయికి తీసుకువెళుతోంది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ నిర్వహణలో గల ఈ పథకం... మొత్తం సీబీజీ వాణిజ్య కార్యకలాపాల వ్యాప్తంగా ఒక సమీకృత వేదికను సృష్టిస్తోంది. ఇది వేగవంతమైన అమలు... పటిష్ఠమైన ప్రాజెక్టు ఆర్థిక వ్యవస్థ... పెట్టుబడిదారులు, రుణదాతలు, డెవలపర్‌లకు అధిక విశ్వసనీయతకు వీలు కల్పిస్తుంది.

భారత్ కోసం ఒక వ్యూహాత్మక అవకాశం:

దేశంలో రవాణా, గృహ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో సహజ వాయువుకు డిమాండ్ విస్తరిస్తోంది. దేశీయ పునరుత్పాదక ఉత్పత్తి ద్వారా ఈ డిమాండ్‌లో పెరుగుదల అవసరాలను సీబీజీ తీర్చగలదు. తద్వారా ఇంధన సుస్థిరతను బలోపేతం చేసి, దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్నీ తగ్గిస్తుంది.

సీబీజీ రసాయనికంగా సహజ వాయువుకు సమానమైనది. ఇప్పటికే ఉన్న గ్యాస్ వ్యవస్థతో దీనిని సజావుగా అనుసంధానించవచ్చు. ఇది పునరుత్పాదక ఇంధన ప్రయోజనాలను... విస్తరిస్తున్న భారత గ్యాస్ మౌలిక సదుపాయాల విస్తృతి, వినియోగంతో మిళితం చేస్తుంది.

ప్రతి సీబీజీ ప్లాంట్ వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ, ఇతర సేంద్రీయ వనరులతో స్థానిక సర్క్యులర్ ఎకానమీనీ సృష్టిస్తుంది. ఇది ఫీడ్‌స్టాక్ సరఫరా, రవాణా, ప్లాంట్ కార్యకలాపాలు, సేంద్రీయ ఎరువుల ఉత్పత్తిలో అవకాశాలను కల్పిస్తూనే... పరిశుభ్రమైన వ్యర్థాల నిర్వహణకు, తక్కువ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకూ మద్దతునిస్తుంది.

గోబర్ధన్ ఆధ్వర్యంలోని ఆరు వృద్ధి చోదకాలు

విభాగం 1: హామీతో కూడిన సీబీజీ కొనుగోలు

ఉత్పత్తిదారులకు విశ్వసనీయమైన, అంచనా వేసిన మార్కెట్‌ను అందించడానికి గోబర్ధన్ ఒక ప్రత్యేకమైన సీబీజీ కొనుగోలు హామీ విధానాన్ని ఏర్పాటు చేస్తుంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల ద్వారా జరిగే సేకరణ, సీఎన్‌జీ (రవాణా), పీఎన్‌జీ (దేశీయ) విభాగాల్లో ఆర్థిక సంవత్సరం 2026-27లో 3 శాతం, 2027-28లో 4 శాతం, 2028-29 నుంచి 5 శాతంగా నోటిఫై చేసిన పునరుత్పాదక సీబీజీ మిశ్రణ లక్ష్యాన్ని సాధించడానికి మద్దతునిస్తుంది.

ఈ విధాన ప్రణాళిక మిశ్రణ బాధ్యతను పరిశ్రమకు ఒక స్పష్టమైన, దీర్ఘకాలిక డిమాండ్ సంకేతంగా మారుస్తుంది. సీజీడీ నెట్‌వర్క్‌ల వ్యాప్తంగా స్థిరమైన అమలును... ప్రాజెక్టు బ్యాంకెబిలిటీని మెరుగుపరుస్తుంది. సామర్థ్య వినియోగానికి మద్దతునిస్తుంది. దీర్ఘకాలిక ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.

విభాగం 2: సుస్థిర సీబీజీ ధరల విధానం

ప్రభుత్వ మద్దతు గల ధరల విధానం ద్వారా, ప్రతి మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంఎంబీటీయూ)కు రూ.2,110 చొప్పున స్థిరమైన, నియంత్రిత సీబీజీ ధరను గోబర్ధన్ పథకం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ మద్దతు, మార్కెట్ ఆధారిత వ్యయ-భాగస్వామ్య యంత్రాంగం కలయిక ద్వారా వినియోగదారుల కొనుగోలు సామర్థ్యాన్ని కాపాడుతూనే, దీర్ఘకాలిక రాబడిపై స్పష్టతనూ ఈ విధానం అందిస్తుంది.

కనీసం పదేళ్ల కాలపరిమితితో, ఈ ధరల విధానం ఉత్పత్తిదారులకు స్థిరమైన ఆదాయ భరోసాను, వాణిజ్యపరంగా ఆకర్షణీయమైన రాబడులను, పెట్టుబడులు-సామర్థ్యాల విస్తరణ కోసం మరింత బలమైన వ్యాపార అవకాశాన్నీ అందిస్తుంది.

విభాగం 3: మూలధన సహాయం

అర్హత కలిగిన గ్రీన్‌ఫీల్డ్ సీబీజీ ప్రాజెక్టులు... స్థాపిత సీబీజీ సామర్థ్యానికి గానూ రోజుకు ప్రతి టన్ను (టీపీడీ) కోసం రూ. 2 కోట్ల వరకు మూలధన సహాయం పొందుతున్నాయి.

ప్రధాన ప్లాంట్ యంత్రాలకే పరిమితం కాకుండా... ఫీడ్‌స్టాక్ సమీకరణ, సేంద్రీయ ఎరువుల శుద్ధి, విలువ జోడింపు కోసం కీలకమైన వాణిజ్య కార్యకలాపాల సంబంధిత ఆస్తుల వరకూ ఈ మద్దతు విస్తరిస్తోంది. తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తున్న బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టులూ దీనికి అర్హత కలిగి ఉంటాయి.

ఈ విభాగం ప్రారంభ మూలధన భారాన్ని తగ్గించడం సహా, ఆర్థికపరమైన ఒప్పందాలను వేగంగా పూర్తి చేయడం ద్వారా ప్రైవేట్ డెవలపర్లు, ఎంఎస్ఎంఈలు, సహకార సంఘాలు, గ్రామీణ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యాన్నీ విస్తరిస్తుంది.

విభాగం 4: పైప్‌లైన్ మౌలిక సదుపాయాల అభివృద్ధి

ఈ పథకం... సీబీజీ ప్లాంట్లను ట్రంక్ పైప్‌లైన్‌లు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లతో అనుసంధానించే క్లస్టర్-ఆధారితమైన, స్వతంత్ర పైప్‌లైన్ మౌలిక సదుపాయాలు రెండింటికీ మద్దతునిస్తుంది. మెరుగైన పైప్‌లైన్ అనుసంధానం తరలింపు ఖర్చులనూ తగ్గిస్తుంది. విశ్వసనీయతను మెరుగుపరుస్తుంది. మార్కెట్ పరిధిని విస్తరిస్తుంది. దేశీయంగా ఉత్పత్తి చేసిన సీబీజీ అధిక వినియోగాన్ని సాధ్యం చేస్తుంది.

విభాగం 5క్రెడిట్ గ్యారంటీ మద్దతు

ఒక ప్రత్యేక రుణ హామీ యంత్రాంగం రుణదాతల విశ్వాసాన్ని బలోపేతం చేసి, అర్హత కలిగిన ఎంఎస్ఎంఈ-ఆధారిత సీబీజీ ప్రాజెక్టులకు సంస్థాగత రుణాలను మరింత విస్తరిస్తుంది.

రుణదాత నష్టంలో కొంత భాగాన్ని పంచుకోవడం ద్వారా, ఈ యంత్రాంగం సరసమైన ఆర్థిక లభ్యతను మెరుగుపరుస్తుంది. పూచీకత్తు అవసరాలను తగ్గిస్తుంది. వేగవంతమైన ప్రాజెక్టు అభివృద్ధికి తోడ్పడుతుంది.

ఇది ఎంఎస్ఎంఈలు, మహిళా పారిశ్రామికవేత్తలు, ఫస్ట్-టైమ్ డెవలపర్స్ భాగస్వామ్యాన్ని విస్తృతం చేస్తుంది. తద్వారా విస్తృతమైన, పోటీతత్వంతో కూడిన, పారిశ్రామిక స్ఫూర్తి గల సీబీజీ పరిశ్రమను నిర్మించడంలో సహాయపడుతుంది.

విభాగం 6: సీబీజీ వ్యవస్థ ఛాలెంజ్ ఫండ్

సీబీజీ వ్యవస్థ వ్యాప్తంగా జిల్లా స్థాయి అమలును వేగవంతం చేయడానికి, స్థానిక వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేయడానికి గోబర్ధన్ ఒక ప్రత్యేక సీబీజీ వ్యవస్థ ఛాలెంజ్ ఫండ్‌నూ ఏర్పాటు చేసింది.         

ఈ నిధి... ఫీడ్‌స్టాక్ వనరుల అంచనా, మ్యాపింగ్, ఫీడ్‌స్టాక్ సమీకరణ మౌలిక సదుపాయాలు, జిల్లా స్థాయి సీబీజీ అభివృద్ధి ప్రణాళిక, సాంకేతిక పరిజ్ఞాన అమలు, ప్రక్రియ మెరుగుదల, సేంద్రియ ఎరువుల విలువ జోడింపు, సామర్థ్యాలను పెంపొందించడం, వాటాదారుల అవగాహన కల్పించడంలో మద్దతునిస్తుంది.

ప్రభావం:

గత కొన్నేళ్లుగా ఈ రంగంలో ఏర్పాటు చేసిన బలమైన పునాదిని... దేశవ్యాప్త సీబీజీ విస్తరణగా మార్చడానికి గోబర్ధన్ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ద్వారా కింది ఫలితాలను ఆశిస్తున్నారు:

దేశీయ సీబీజీ ఉత్పత్తిలో దాదాపు పది రెట్ల వృద్ధి, భారత క్లీన్ గ్యాస్ ఎకానమీకి సరికొత్త మూలస్తంభాన్ని సృష్టిస్తుంది.

పునరుత్పాదక వాయు ఇంధన దేశీయ ఉత్పత్తిని పెంచడం, దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా అధిక ఇంధన భద్రత.

బలమైన ప్రాజెక్ట్ మనుగడ, స్థిరమైన ధరలు, సంస్థాగత ఆర్థిక వనరులు మరింత మెరుగ్గా అందుబాటులో ఉండడం వంటి వాటి మద్దతుతో కొత్తగా అధిక మొత్తంలో ప్రైవేటు పెట్టుబడుల రాక.

రైతులు, ముడిసరుకు సేకరణదారులు, సహకార సంఘాలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు కొత్త ఆదాయ అవకాశాల ద్వారా బలమైన గ్రామీణ జీవనోపాధి.

వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, పురపాలికల్లోని సేంద్రీయ వ్యర్థాలు, ఇతర జీవపదార్థ వనరులను ఉత్పాదకంగా ఉపయోగించడం ద్వారా శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ.

శిలాజ ఇంధనాల స్థానంలో ప్రత్యామ్నాయాలను వాడటం, సేంద్రీయ వ్యర్థాలను ఉత్పాదకంగా వినియోగించడం ద్వారా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం.

ఎఫ్ఓఎమ్, ఎల్ఎఫ్ఓఎమ్‌ల అధిక ఉత్పత్తి, విలువ జోడింపు, వినియోగం ద్వారా విస్తృతమైన సేంద్రీయ ఎరువుల ఆర్థిక వ్యవస్థ.

జాతీయస్థాయిలో ఒకే విధానం, డిజిటల్ పాలన, సరళీకృత సంస్థాగత ఏర్పాట్ల ద్వారా వేగవంతమైన, సులభమైన ప్రాజెక్టు అమలు.

దేశంలో సమృద్ధిగా ఉన్న సేంద్రీయ వనరులను పరిశుద్ధ ఇంధనంగా, గ్రామీణ శ్రేయస్సుగా, ఆర్థిక విలువగా మార్చడంలో గోబర్ధన్ ఒక నిర్ణయాత్మక ముందడుగు. హామీతో కూడిన డిమాండ్, స్థిరమైన ధరలు, మూలధన సహాయం, పైప్‌లైన్ అనుసంధానం, రుణ మద్దతు, వ్యవస్థ అభివృద్ధిని జాతీయస్థాయిలో ఒకే విధాన ప్రణాళిక కిందకు తీసుకురావడం ద్వారా, ఈ పథకం సీబీజీ భారీ స్థాయిలో వృద్ధి చెందే పరిస్థితులను కల్పిస్తుంది.

ఇప్పటికే సాధించిన పురోగతిని ఆధారంగా చేసుకుని, 'గోబర్ధన్' పథకం దేశపు సీబీజీ ప్రస్థానాన్ని ఒక బలమైన పునాది స్థాయి నుంచి జాతీయ స్థాయి పరిశుద్ధ ఇంధన పరిశ్రమగా మారుస్తుంది. ఇంధన భద్రత, రైతులు-గ్రామీణ సంస్థలు, వ్యర్థాల నుంచి సంపద సృష్టి, 'స్వయం-సమృద్ధ భారత్', 'వికసిత్ భారత్' లక్ష్యాల పట్ల ప్రభుత్వ నిబద్ధతనూ ఇది ప్రతిబింబిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2295630) आगंतुक पटल : 31
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Malayalam , Odia , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Tamil