ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

గువహటి సమీపంలోని బైహత చరియాలి నుంచి తేజ్‌పూర్ (15.11 కి.మీ మంగళ్‌దోయ్ బైపాస్ మినహా) వరకు జాతీయ రహదారి- 15 వెంబడి 4 వరుసల రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం


ప్రాజెక్టు మొత్తం పొడవు 135.87 కి.మీ.... విలువ రూ. 8,970.20 కోట్లు

प्रविष्टि तिथि: 06 AUG 2026 4:12PM by PIB Hyderabad

అస్సాంలో జాతీయ రహదారి-15 వెంబడి 135.871 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల ప్రవేశ నియంత్రిత గువహటి - తేజ్‌పూర్ కారిడార్ అభివృద్ధికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘బిల్ట్- ఆపరేట్- ట్రాన్స్‌ఫర్ (బీవోటీ)’ టోల్ విధానంలో ఎన్‌హెచ్ (ఓ) కింద రూ. 8,970.20 కోట్ల మొత్తం మూలధన వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా తేజ్‌పూర్ బైపాస్‌లో 4.9 కిలోమీటర్ల పొడవైన అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాన్ని నిర్మించనున్నారు. భారత వైమానిక దళంతో సమన్వయంతో దీనిని రూపొందించారు. ఇది బ్రహ్మపుత్ర నదికి దక్షిణాన ఉన్న ప్రస్తుత జాతీయ రహదారి -27 (తూర్పు - పశ్చిమ కారిడార్)పై ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. అంతేకాకుండా 58.7 కిలోమీటర్ల మేర 5 ప్రధాన బైపాస్‌ల నిర్మాణాన్ని కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా చేపడతారు. దీనివల్ల బైహాటా చరియాలీ, సిపాఝార్, ఖరూపేటియా, దెకియాజులీ, తేజ్‌పూర్ వంటి జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల గుండా వెళ్లే రహదారులపై ట్రాఫిక్ చిక్కులు తొలగుతాయి.

వీటితోపాటు ఈ ప్రాజెక్టులో 15 పెద్ద వంతెనలు, 30 చిన్న వంతెనలు, 19 ఫ్లైఓవర్లు, తేజ్‌పూర్ బైపాస్‌లో ఒక ఏనుగుల అండర్‌పాస్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రవేశ నియంత్రిత (యాక్సెస్ కంట్రోల్డ్) మార్గంగా ఈ రహదారిని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో.. వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు 46 అండర్‌పాస్‌లు, 19 ఫ్లైఓవర్లతోపాటు 210 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్లను కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నారు.

ఈ ప్రాజెక్టు సగటు ప్రయాణ వేగాన్ని 100 శాతం పెంచుతుంది. ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గిస్తుంది. మొత్తంగా రహదారి భద్రతను మెరుగుపరుస్తుంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచడంతోపాటు వాహనాల నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది. తద్వారా ఆ ప్రాంతంలో రవాణాను మెరుగుపరచడంతోపాటు సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది.

అస్సాం, అరుణాచలప్రదేశ్‌లలోని కీలకమైన ఆర్థికసామాజిక, లాజిస్టిక్స్ కేంద్రాలకు ఎలాంటి అంతరాయం లేకుండా అనుసంధానాన్ని ఈ ప్రాజెక్టు కల్పిస్తుంది. అంతేకాకుండా ఈ కారిడార్ ఆధునికీకరణతో 8 పీఎం గతిశక్తి ఆర్థిక కేంద్రాలు (8 పారిశ్రామిక పార్కులు), 2 సామాజిక కేంద్రాలు (దర్రాంగ్, ఉదల్‌గురి అనే ఆకాంక్షాత్మక జిల్లాలు), 3 పర్యాటక కేంద్రాలు (కామాఖ్యా మాత ఆలయం, కాజీరంగా జాతీయ పార్కు, ఒరాంగ్ జాతీయ పార్కు), 7 లాజిస్టిక్ కేంద్రాలకు (3 ప్రధాన రైల్వే స్టేషన్లు, 2 విమానాశ్రయాలు, 2 జలమార్గ టెర్మినళ్లు)కు అనుసంధానం మరింత మెరుగవుతుంది. తద్వారా ఈ ప్రాంతంలో సరుకులు, ప్రయాణికుల వేగవంతమైన రవాణాకు వీలు కలుగుతుంది.  

 

***


(रिलीज़ आईडी: 2295573) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam