బొగ్గు మంత్రిత్వ శాఖ
వాణిజ్య బొగ్గు తవ్వకంలో సంస్కరణలు, ప్రైవేటు భాగస్వామ్య పెంపుపై బొగ్గు మంత్రిత్వ శాఖ సలహా సంఘం చర్చలు
प्रविष्टि तिथि:
06 AUG 2026 11:16AM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పార్లమెంటరీ సభ్యుల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ‘వాణిజ్య బొగ్గు తవ్వకం సంస్కరణలు, ప్రైవేటు రంగ భాగస్వాన్ని పెంచడం’ అంశంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కమిటీ సభ్యులతో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, బొగ్గు రంగ ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో చేపట్టిన అనేక సంస్కరణలకు వాణిజ్య బొగ్గు తవ్వకం ఒక అద్భుతమైన నిదర్శనమని తెలిపారు. ఇప్పటివరకు 14 విడతల వాణిజ్య బొగ్గు గనుల వేలం విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం 15వ విడత వేలం ప్రక్రియ కొనసాగుతోందని సభ్యులకు వివరించారు. వాణిజ్య బొగ్గు తవ్వకం విధానం వల్ల దేశీయ బొగ్గు రంగం మరింత సమర్థవంతంగా, పోటీతత్వంతో తయారైందని పేర్కొన్నారు. పారదర్శకంగా జరుగుతున్న వేలం ప్రక్రియ వ్యాపార పోటీని, పెట్టుబడులను ప్రోత్సహిస్తూ భారతీయ బొగ్గు రంగా రూప రేఖలను మార్చివేసిందని కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. ప్రైవేటు కంపెనీలు, పారిశ్రామిక వర్గాల్లో అవగాహన పెంచి వారి భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ నిరంతరం రోడ్‌షోలు, భాగస్వామ్య పక్షాల సమావేశాలను చురుగ్గా నిర్వహిస్తోందని తెలిపారు.
కమిటీ సభ్యులకు స్వాగతం పలుకుతూ బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్ మాట్లాడారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో దేశం 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంలో క్యాప్టివ్, వాణిజ్య గనులు అత్యంత కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో జరిగిన మొత్తం బొగ్గు ఉత్పత్తిలో ఈ గనుల వాటా దాదాపు 20 శాతంగా ఉందని గుర్తుచేశారు. బొగ్గు రంగంలో నిరంతరం తీసుకువస్తున్న సంస్కరణల కారణంగా గనులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే సమయం గణనీయంగా తగ్గిందని కార్యదర్శి వివరించారు. పూర్తిస్థాయి అన్వేషణ పూర్తయిన బొగ్గు బ్లాకుల ప్రారంభ సమయం 51 నెలల నుంచి 40 నెలలకు తగ్గిందని, పాక్షికంగా అన్వేషణ జరిగిన బ్లాకుల సమయం 66 నెలల నుంచి 52 నెలలకు తగ్గిందని పేర్కొన్నారు.
బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రుపిందర్ బ్రార్ ‘‘వాణిజ్య బొగ్గు తవ్వకం సంస్కరణలు-ప్రైవేటు రంగ భాగస్వామ్యం’’ అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. బొగ్గు రంగాన్ని ఆధునీకరించేందుకు మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న చర్యలను పార్లమెంటరీ సలహా మండలి సభ్యులు ప్రశంసించారు. ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించడంతో పాటు, వ్యాపార పురోగతికి, పర్యావరణ పరిరక్షణ, స్థానిక సమాజ సంక్షేమానికి మధ్య సరైన సమతుల్యత పాటించేలా పలు విలువైన సూచనలు చేశారు.
***
(रिलीज़ आईडी: 2295439)
आगंतुक पटल : 3