రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కంటైనర్ రైలు ఆపరేటర్లకు శుభవార్త... ఒకే అఖిల భారత లైసెన్సుతో అన్ని మార్గాల్లోనూ కార్యకలాపాలకు అవకాశం: మెరుగైన వాణిజ్య సౌలభ్యం

లైసెన్సు విధానాన్ని సరళీకరించిన భారతీయ రైల్వే

సంస్కరణలతో తగ్గనున్న రవాణా ఖర్చులు, కాలుష్య నియంత్రణ, రోడ్లపై తగ్గనున్న రద్దీ

పరిశ్రమలకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు లబ్ధి

రూ. 25 కోట్లతో ఒకే నమోదు రుసుము, రెన్యువల్ రుసుము లేకుండానే పొడిగింపునకు అవకాశం

प्रविष्टि तिथि: 05 AUG 2026 8:32PM by PIB Hyderabad

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో కంటైనర్ రైళ్లను నడిపేందుకు ఆపరేటర్లకు అనుమతినిచ్చే మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్ (ఎంసీఏ) సవరణలకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఆమోదం పొందిన ఈ మార్పుల ప్రకారం.. కంటైనర్ రైళ్ల నిర్వాహకులకు (సీటీవోలు) ఒకే అఖిల భారత లైసెన్సు ద్వారా దేశవ్యాప్తంగా అన్ని మార్గాల్లో కంటైనర్ రైళ్లను నడిపేందుకు అనుమతి లభిస్తుంది. ఇందుకోసం రూ. 25 కోట్ల ఏకరూప నమోదు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. వేర్వేరు మార్గాలకు సంబంధించిన కేటగిరీల కోసం విడివిడిగా అనుమతులు పొందాల్సిన, రుసుములు చెల్లించాల్సిన పాత విధానానికి దీంతో స్వస్తి పలకనున్నారు. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ మార్పుల వివరాలను విడుదల చేయనున్నారు.

అన్ని మార్గాలకూ ఒకే లైసెన్స్

ఆమోదించిన సవరణల్లో భాగంగా... లైసెన్సులకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న మార్గాలవారీ వర్గీకరణ విధానాన్ని రద్దు చేయనున్నారు. రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదానికి లోబడి.. కంటైనర్ రైలు ఆపరేటర్లకు ఒకే ఆలిండియా లైసెన్సును మంజూరు చేస్తారు. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లోని అన్ని మార్గాల్లో కంటైనర్ రైళ్లను నడిపేందుకు ఇది వారికి వీలు కల్పిస్తుంది.

ఏకీకృత రిజిస్ట్రేషన్ రుసుము

వివిధ మార్గాల కేటగిరీలకు వేర్వేరు రిజిస్ట్రేషన్ రుసుములను వసూలు చేసే పాత విధానానికి స్వస్తి పలికారు. ఇకపై ప్రతి దరఖాస్తుదారు రూ. 25 కోట్ల ఏకీకృత రిజిస్ట్రేషన్ రుసుమును (ఇది నాన్ రీఫండబుల్) డిపాజిట్ చేసి.. దేశంలోని అన్ని రైల్వే మార్గాల్లో రైళ్లను నడిపించవచ్చు.

పొడిగింపునకు రుసుము లేదు

ఆమోదించిన సవరణల ప్రకారం... కంటైనర్ రైలు ఆపరేటర్‌కు ఇచ్చిన అనుమతి గడువు ముగిసిన తర్వాత, దాన్ని మరో 20 ఏళ్ల కాలానికి పొడిగించే వెసులుబాటు ఉంటుంది. ఆపరేటర్ పనితీరు సంతృప్తికరంగా ఉంటే వారి దరఖాస్తు ఆధారంగా సంబంధిత ఆధికారిక సంస్థ ఈ పొడిగింపును మంజూరు చేస్తుంది. ఈ పొడిగింపునకు గానీ, లేదా భవిష్యత్తులో ఆ ఆపరేటర్‌కు ఇచ్చే తదుపరి పొడిగింపులకు గానీ ఎలాంటి రుసుమూ వసూలు చేయబోరు.

ప్రస్తుత ఆపరేటర్లకు ఉపశమనం

ఇప్పటికే కేటగిరీ-I లైసెన్సులు ఉన్న ఆపరేటర్లు తమ రాయితీ కాలం ముగిసే వరకు వారి ప్రస్తుత కేటగిరీలోనే కొనసాగవచ్చు. కొత్త లైసెన్సు కింద పునరుద్ధరణ లేదా పొడిగింపులపై వారికి ఎటువంటి రుసుమూ ఉండదు.

కేటగిరీ II, IIIIVలలోని నిర్వాహకులు తమ రాయితీ కాలం ముగిసే వరకు ప్రస్తుత కేటగిరీల్లోనే కొనసాగవచ్చు. కొత్త లైసెన్స్ కింద పునరుద్ధరణ లేదా పొడిగింపు కోసం వారు రూ. 15 కోట్లు చెల్లించాలి. రూ. 25 కోట్ల కొత్త రుసుముకూ, ఇప్పటికే వారు చెల్లించిన రూ. 10 కోట్లకూ మధ్య ఉన్న వ్యత్యాసానికి ఈ మొత్తం సమానం. ఈ మొత్తాన్ని వాపసు పొందే అవకాశం లేదు.

ఈ ఆపరేటర్లు తమ 20 ఏళ్ల రాయితీ కాలం పూర్తి కాకముందే, ముందుగానే కొత్త లైసెన్సుకు మారే అవకాశం కూడా ఉంది. ముందుగానే మారాలనుకున్నా కూడా అదే రూ. 15 కోట్ల మొత్తాన్ని వారు చెల్లించాల్సి ఉంటుంది.

పరిశ్రమకు ప్రయోజనాలు

ఒకే రిజిస్ట్రేషన్ రుసుము, పొడిగింపు రుసుముల రద్దు వంటి నిర్ణయాల వల్ల అనుమతుల ప్రక్రియ సరళతరం కావడంతోపాటు ఆపరేటర్లకు నిబంధనలు, నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు.

సరళీకృత లైసెన్సింగ్ విధానం ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి, కంటైనర్ రైళ్ల కార్యకలాపాల విస్తరణకు దోహదపడుతుంది. తద్వారా దేశవ్యాప్తంగా రైల్వేల ద్వారా సరుకు రవాణా మెరుగుపడుతుంది. కంటైనర్ రవాణాకు రైల్వేను ఎక్కువగా వినియోగించడం వల్ల.. సమర్థంగా, తక్కువ ఖర్చుతో సరుకు రవాణాకు అవకాశం లభిస్తుంది. దీంతో పరిశ్రమలకూ, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకూ సరుకు రవాణా వ్యయం తగ్గుతుంది.

కంటైనర్ రవాణాను రోడ్డు మార్గం నుంచి రైల్వేల వైపు మళ్లించడం వల్ల హైవేలపై రద్దీ తగ్గడమే కాకుండా, ఇంధన వినియోగం తగ్గి కర్బనోద్గారాలు నియంత్రణలోకి వస్తాయి. మరింత సుస్థిర పద్ధతుల్లో సరుకు రవాణా వ్యవస్థకు ఇది తోడ్పడుతుంది.

ఒకేరకమైన, సరళీకృత లైసెన్సింగ్ విధానం దిశగా..

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లోని కంటైనర్ రైళ్ల ఆపరేటర్ల కోసం సరళమైన, ఏకరూప లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడమే ఆమోదిత సవరణల ప్రధాన లక్ష్యం. మోడల్ కన్సెషన్ అగ్రిమెంట్ కింద కంటైనర్ రైళ్ల నిర్వహణకు ఒకే రకమైన నియంత్రణ విధానాన్ని అందించడంతోపాటు.. క్రమబద్ధమైన ఆమోద ప్రక్రియకు ఈ సంస్కరణలు దోహదపడతాయని భావిస్తున్నారు.  

 

***


(रिलीज़ आईडी: 2295374) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Punjabi , Gujarati , Odia , Kannada