భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
ఎల్ నినో.. రుతుపవనాలపై దాని ప్రభావం గురించి లోక్‌సభలో భూ విజ్ఞానశాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరణ
“ఈ ప్రభావం 2027 ఫిబ్రవరి దాకా కొనసాగవచ్చునని ఏఐ-ఆధారిత అంచనా వ్యవస్థ సూచిస్తోంది... రుతుపవన ప్రభావం వివిధ వాతావరణ కారకాలపై ఆధారపడి ఉంటుంది”
“సంభావ్య-అనిశ్చితి అంచనాలు ప్రాతిపదికగా స్వదేశీ ఏఐ-ఎంఎల్ ఆధారిత ‘ఈఎన్‌ఎస్‌ఓ’ అంచనా వ్యవస్థను ‘ఇన్‌కాయిస్’ రూపొందించింది”
“రుతుపవనాలపై ఇండియన్ ఓషన్ డైపోల్.. మాడెన్-జూలియన్ ఆసిలేషన్.. ప్రాంతీయ సముద్ర వాతావరణ పరస్పర చర్యల ప్రభావం కూడా ఉంటుంది”
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో సముద్ర స్థితి అంచనాలు.. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు.. తీరప్రాంత సంసిద్ధతలను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది”
प्रविष्टि तिथि:
05 AUG 2026 4:31PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఈ ఏడాది మే నెలలో ఏర్పడిన ఎల్ నినో పరిస్థితి 2027 ఫిబ్రవరి వరకూ కొనసాగే అవకాశం ఉందని కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూవిజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. లోక్‌సభలో ఇవాళ ఈ ప్రకృతి వైపరీత్యంపై వివరణ ఇస్తూ- ఇందుకు 70 నుంచి 90 శాతం దాకా సంభావ్యత ఉన్నదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) తాజా అంచనాలు సూచించినట్లు ఆయన వెల్లడించారు. ‘ఇన్‌కాయిస్’ స్వదేశీ కృత్రిమ మేధ పరిజ్ఞానం, మెషిన్ లెర్నింగ్ (ఏఐI/ఎంఎల్) ఆధారిత ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ (ఈఎన్‌ఎస్‌ఓ) ప్రిడిక్షన్ సిస్టమ్ సహా గ్లోబల్ ఓషన్ డేటా అసిమిలేషన్ సిస్టమ్ ప్రాతిపదికగా ఈ అంచనాలను రూపొందించినట్లు పేర్కొన్నారు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేసవి రుతుపవన వర్షపాత క్షీణతకు ఎల్ నినో కారణమన్నది చారిత్రకంగా వినిపించే అంశమైనప్పటికీ రుతుపవనాల నిర్ధారణలో ఇది ఏకైక ప్రాతిపదిక కాదన్నారు. భారత రుతుపవనాలపై ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ), మాడెన్-జూలియన్ ఆసిలేషన్ (ఎంజేఓ) సహా ప్రాంతీయ సముద్ర-వాతావరణ పరస్పర చర్యలు, ఇతర వాతావరణ కారకాలు కూడా ప్రభావం చూపుతాయని వివరించారు. ఎల్ నినో కొనసాగుతుందని ప్రస్తుత అంచనాలు సూచిస్తున్నప్పటికీ, రుతుపవన కాలంలో హిందూ మహాసముద్ర ద్విధ్రువం (ఇండియన్ ఓషన్ డైపోల్), విస్తృత వాయుప్రవాహ సరళి సహా సంబంధిత సముద్ర వాతావరణ పరిస్థితుల పరిణామంకూడా భారత్‌లో రుతుపవనాలపై అంతిమ ప్రభావం చూపుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అందువల్ల, అధునాతన వాతావరణ అంచనా వ్యవస్థల ద్వారా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు.
ఎల్ నినో పరిణామాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంపై వాతావరణ ప్రసరణను ప్రభావితం చేయవచ్చునని మంత్రి అన్నారు. ఈ ప్రాంతాల్లో జలాలు నిరంతర వేడెక్కడం వల్ల సముద్ర ఉష్ణ తరంగాల సంభావ్యత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ మార్పులతో సముద్ర మిశ్రమం, పోషకాల లభ్యత, జీవ ఉత్పాదకత ప్రభావితం కావచ్చునని దీని ప్రభావం చేపల విస్తరణ, తీరప్రాంత సముద్ర జీవావరణ వ్యవస్థలపై పడుతుందని తెలిపారు. నౌకాయానం, సముద్ర-తీరప్రాంత కార్యకలాపాలను కూడా అలల పోటు, ఉప్పెన వంటి పరిస్థితులలోని వైవిధ్యం ప్రభావితం చేసే వీలుందని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంసిద్ధతను ఆయన ప్రముకంగా ప్రస్తావించారు. తుఫాను, ఉప్పెన, అలల ఉధృతి, అధిక ప్రవాహాలకు సంబంధించి అధిక-రిజల్యూషన్ వాతావరణ అంచనా నమూనాల ద్వారా ఇన్‌కాయిస్ సముద్ర స్థితి అంచనాలతోపాటు సముద్ర సంబంధ బహుళ ప్రమాద ముందస్తు హెచ్చరిక సేవలను నిరంతరం బలోపేతం చేస్తున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. సముద్ర గ్లైడర్లు, లంగరు వేసిన బూయ్‌లు, ఆర్గో ఫ్లోట్‌లు, టైడ్ గేజ్‌లు, ఆధునిక డేటా సమీకరణ వ్యవస్థలతో అనుసంధానించిన ఉపగ్రహ పరిశీలన సహిత విస్తృత సముద్ర పరిశీలన నెట్‌వర్క్ ద్వారా వాతావరణ సూచన సామర్థ్యం మెరుగుపడిందన్నారు. తీరప్రాంతాలలో సామాజిక సంసిద్ధత, పునరుత్థాన సామర్థ్యం మెరుగు దిశగా ప్రభుత్వం-భాగస్వాముల శిక్షణ కార్యక్రమాలు, ప్రయోగాత్మక కసరత్తులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. అలాగే, కార్యాచరణపై నిరంతర పర్యవేక్షణ, బహుళ వేదికల ద్వారా సలహాల ప్రసారం, ప్రభావాధారిత అంచనాలనూ బలోపేతం చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
డీప్ ఓషన్ మిషన్ కింద, సముద్ర వనరుల గుర్తింపు నిమిత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ₹145.06 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. భారత ప్రత్యేక ఆర్థిక మండలం (ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్)లోని సముద్ర పర్వత జీవవైవిధ్య సర్వేలను విస్తృతం చేస్తున్నారు. అదే సమయంలో హైడ్రోథర్మల్ వెంట్లు, ఖనిజ సంపన్న ప్రాంతాలు, సముద్ర వనరుల అన్వేషణ కోసం అధునాతన అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్, సుదూర నిర్వహణ వాహనాలను మోహరిస్తున్నారు.
తమిళనాడు సహా తీరప్రాంత రాష్ట్రాల కోసం ‘ఇన్‌కాయిస్’ పది రోజుల ముందు వరకు అలలు, గాలులు, ఉప్పెనలు, ప్రవాహాలు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత అంచనాలతో కూడిన ఓషన్ స్టేట్ ఫోర్‌కాస్ట్ సేవలు అందిస్తున్నదని మంత్రి తెలిపారు. విపత్తు సంసిద్ధత, సముద్ర భద్రతకు మద్దతుగా రాష్ట్రాల అధికారులకు అలల పోటు, ఉప్పెన ఉధృతి, అధిక ప్రవాహ సలహాలు క్రమం తప్పకుండా జారీ అవుతాయి. తీరప్రాంత పునరుత్థాన సామర్థ్యాన్ని, సమాజ సంసిద్ధతను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో టైడ్ గేజ్ స్టేషన్లు, కోస్టల్ వేవ్ రైడర్ బ్యూయ్‌లు, సునామీ సంసిద్ధత కార్యక్రమాలను కూడా రూపొందించింది.
వాతావరణ మార్పు వైవిధ్యం మేరకు భారత పునరుత్థాన సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వాలు, తీరప్రాంత సమాజాలు, మత్స్యకారులు, ఇతర భాగస్వాములకు సకాలంలో సలహాలిచ్చేందుకు, వాతావరణ-సముద్ర అంచనాల కచ్చితత్వం మెరుగుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మేరకు స్వదేశీ అంచనా సాంకేతికతలు, ఆధునిక సముద్ర పరిశీలన, శాస్త్రీయ నిర్ణయ మద్దతు వ్యవస్థలలో పెట్టుబడులు పెడుతున్నదని వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2295201)
आगंतुक पटल : 6