ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అధికరణలు 370, 35(ఎ) రద్దుకు ఏడేళ్లు... చరిత్రాత్మక నిర్ణయాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 05 AUG 2026 2:25PM by PIB Hyderabad

అధికరణలు 370, 35(ఎ)లను రద్దు చేస్తూ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయానికి నేటితో ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా... ఆ కీలక ఘట్టాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. సమ్మిళిత అభివృద్ధి దిశగా భారత్ ప్రయాణంలో కీలకమైన మైలురాయిగా 2019 ఆగస్టు 5ను ఆయన అభివర్ణించారు.

గడిచిన ఏడేళ్లలో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రజలు అన్ని రంగాల్లోనూ విస్తృతమైన విప్లవాత్మక మార్పులను చూశారని శ్రీ మోదీ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించడమే కాకుండా... విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం, క్రీడల విభాగాల్లో సరికొత్త అవకాశాలు లభించాయని వివరించారు. ‘‘అనేక రాజ్యాంగబద్ధ హక్కులకు దశాబ్దాలుగా దూరమైన మహిళలు, వెనుకబడిన వర్గాల ప్రజలు... నేడు భారత రాజ్యాంగం ఇక్కడ పూర్తిస్థాయిలో అమలులోకి రావడంతో సాధికారతను సాధించారు’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంత్యుత్సవాలు జరుగుతున్న తరుణంలో... ఈ వార్షికోత్సవం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశ ఐక్యత కోసం డాక్టర్ ముఖర్జీ ఆజన్మాంత కృషి, అంకితభావం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. 2019 ఆగస్టు 5న ఆయన స్వప్నం సాకారమైందని, అది చరిత్రాత్మక ఘట్టమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ... గొప్పగా కలలు కనేఆశయాలను సాకారం చేసుకునే, వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములయ్యే అవకాశం ప్రతి పౌరుడికీ ఉండాలని ప్రధానమంత్రి అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

ఏడేళ్ల కిందట ఇదే రోజున అధికరణలు 370, 35(ఎ) కాలగర్భంలో కలిసిపోయాయి. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రస్థానంలో నిశ్చయాత్మకమైన సరికొత్త అధ్యాయానికి ఈ నిర్ణయం నాంది.

నాటి నుంచి జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రజల జీవితాల్లో విస్తృతమైన విప్లవాత్మక మార్పులొచ్చాయి. మౌలిక సదుపాయాలు విస్తరించాయి. విద్య, ఆరోగ్యం, నవ పారిశ్రామిక, క్రీడా రంగాల్లో అవకాశాలు పెరిగాయి. దశాబ్దాల తరబడి ప్రాథమిక రాజ్యాంగ హక్కులకు దూరమైన మహిళలు, అట్టడుగు వర్గాలకు... నేడు భారత రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలులోకి రావడం వల్ల సాధికారత లభించింది.

ఈ ఏడాదే దేశం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని జరుపుకొంటున్న నేపథ్యంలో... ఈ ఏడాది ఆగస్టు 5 మరింత విశిష్టతను సంతరించుకుంది. దేశ ఐక్యతను బలోపేతం చేసేందుకు ఆయన ఆజన్మాంతం కట్టుబడి ఉన్నారు. ఎన్నో తరాలకు ఆయన స్ఫూర్తి. దశాబ్దాల నాటి ఆయన చరిత్రాత్మక స్వప్నం 2019 ఆగస్టు 5న సాకారమైంది.

జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ పురోగతికి, అలాగే ప్రతి పౌరుడికీ గొప్పగా కలలు కనేసాధించే, వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వామి అయ్యే అవకాశముండేలా చూసేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం’’.

#Article370Abrogation


(रिलीज़ आईडी: 2294818) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Bengali-TR , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Gujarati , Kannada , Malayalam