కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ప్రారంభమైన నాటి నుంచి 10.05 కోట్లకు పైగా ఖాళీలను సమీకరించిన నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి నమోదు చేసుకున్న ఉద్యోగార్థుల సంఖ్య 6.64 కోట్లకు పైమాటే
2026 జులై 15 నాటికి నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య 17.68 లక్షలు
ఎన్‌సీఎస్, ప్రైవేటు భాగస్వాముల మధ్య ఇప్పటి వరకు కుదిరిన ఒప్పందాలు 40కి పైమాటే
प्रविष्टि तिथि:
05 AUG 2026 8:58AM by PIB Hyderabad
ఉద్యోగార్థులకు, సంస్థలకు ఉపాధి సంబంధిత సేవలను సులభతరం చేసేందుకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జాతీయ ఉపాధి సేవను అమలు చేస్తోంది. ఇందులో ఉద్యోగార్థుల నమోదు, సంస్థల నుంచి ఖాళీల వివరాల సేకరణ, వృత్తిపరమైన, కౌన్సిలింగ్‌పరమైన మార్గదర్శకం మొదలైన సేవలు అందుబాటులో ఉంటాయి. జాతీయ ఉపాధి సేవ పేరును నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సీఎస్)గా మార్చారు. కెరీర్ సంబంధిత సేవలు అన్నింటినీ ఒక్కచోటే అందించే డిజిటల్ వేదికగా ఎన్‌సీఎస్ పోర్టల్ (www.ncs.gov.in) పనిచేస్తుంది. దీనిలో ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు, ఆన్‌లైన్–ఆఫ్‌లైన్ జాబ్ ఫెయిర్‌ల సమాచారం, ఉద్యోగాన్వేషణ, అర్హతలకు తగిన ఉద్యోగాన్ని సూచించడం, కెరీర్ కౌన్సెలింగ్, వృత్తిపరమైన సూచనలు, నైపుణ్యాభివృద్ధి కోర్సులకు సంబంధించిన సమాచారం, నైపుణ్య/శిక్షణ కార్యక్రమాలు తదితరమైన సేవలు అందుబాటులో ఉంటాయి.
ఎన్‌సీఎస్ పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 6.64 కోట్లకు పైగా ఉద్యోగార్థులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. వారిలో 15.07.2026 నాటికి 2.89 కోట్ల మంది క్రియాశీలకంగా ఉన్నారు. పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 10.05 కోట్లకు పైగా ఖాళీల వివరాలు పోర్టల్లో అందుబాటులోకి వచ్చాయి. వాటిలో15.07.2026 నాటికి 17.68 లక్షల ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎన్‌సీఎస్ పోర్టల్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకున్న ఉద్యోగార్థులు, సంస్థల వివరాలు, ఖాళీ సంఖ్య రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా దిగువన ఉన్న లింకులో చూడవచ్చు.
https://www.ncs.gov.in/_layouts/15/ncsp/ViewStaticReport.aspx
పోర్టల్‌ను మెరుగుపరచడం నిరంతరం కొనసాగే ప్రక్రియ. అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తగిన మార్పులూచేర్పులూ చేస్తారు. క్లౌడ్–ఆధారిత, ఓపెన్–ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌కు ఎన్‌సీఎస్‌ను మెరుగుపరిచారు. దీనిని నిరంతరం అభివృద్ధి చేస్తూనే ఉంటారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా, అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి మెరుగుపరుస్తారు. నవీకరిస్తారు. దీనిలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ, నైపుణ్య వెబ్‌సైట్లను అనుసంధానించడం, ఏఐ–ఆధారిత ఫీచర్లను మెరుగుపరచడం (ఇంటిలిజెంట్ జాబ్ మ్యాచింగ్, ఏఐ స్కిల్ గ్యాప్ విశ్లేషణ, వ్యక్తిగతీకరించిన ఉద్యోగ సూచనలు, ఏఐ ఇంటర్వ్యూ కోచ్, భాషిణి ద్వారా బహుళ భాషల్లో తోడ్పాటును అందించడంతో సహా), ఉద్యోగార్థులు, సంస్థల కోసం క్లౌడ్ ఆధారిత అప్లికేషన్లు, పటిష్టమైన ధ్రువీకరణ వ్యవస్థలు, సౌలభ్యాన్ని, వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరిచేందుకు మొబైల్ అప్లికేషన్ల ప్రారంభం తదితరమైనవి ఉన్నాయి.
ప్రతి ఆర్థిక సంఘం పదవీకాలం ప్రారంభానికి ముందు అన్ని పథకాలు, కార్యక్రమాలు ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా, సమర్థవంతంగా, మారుతున్న ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చూసేందుకు క్రమబద్ధమైన సమీక్షను, మూల్యాంకనాన్ని ప్రభుత్వం చేపడుతుంది.
అలాగే, ఉద్యోగార్థులకు విస్తృత ఉద్యోగావకాశాలను అందించడం కోసం ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు ప్రైవేటు, ప్రభుత్వ రంగాలకు చెందిన సంస్థలు/పోర్టళ్లు/వేదికలతో మంత్రిత్వ శాఖ అనేక అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇప్పటి వరకు 40కి పైగా అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వాటిలో ఏపీఎన్ఏ, స్విగ్గీ, ర్యాపిడో, జొమాటో, అమెజాన్, టీసీఎస్ అయాన్, క్వికర్, ఫౌండ్ఇట్ (మాన్‌స్టర్) తదితర ప్రైవేటు సంస్థలతో కుదిరిన ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఈ భాగస్వామ్యాల ద్వారా జాబ్ ఫెయిర్ వివరాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, కెరీర్ కౌన్సిలింగ్ వంటి సేవలను ఎన్‌సీఎస్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటాయి.
ఉద్యమ్, ఈ–శ్రామ్, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్, ఈపీఎఫ్‌వో, ఈఎస్ఐసీ, ఎంహెచ్‌ఆర్‌డీ, డిజీలాకర్, తదితర ప్రభుత్వ పోర్టళ్లు సైతం ఎన్‌సీఎస్ వెబ్‌సైటుకి అనుసంధానం చేశారు. అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తదితర ప్రభుత్వ నియామక సంస్థలతో కూడా అనుసంధానమై ఉంది.
దేశంలోని ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీలను మోడల్ కెరీర్ సెంటర్లు (ఎంసీసీలు)గా మార్చి దేశవ్యాప్తంగా కెరీర్ సంబంధిత సేవలను అందించడం కూడా ఎన్‌సీఎస్ ప్రాజెక్టులో భాగంగా ఉంది. వీటి ద్వారా ఉద్యోగార్థులకు, సంస్థలకు రాష్ట్రాలు, ఇతర సంస్థల సహకారంతో ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ జాబ్ ఫెయిర్స్ నిర్వహించడం, సంస్థలను సమీకరించడం, ప్రాంతీయ స్థాయిలో ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ కెరీర్ కౌన్సెలింగ్ నిర్వహించడం లాంటి సేవలు అందిస్తారు. ఇప్పటి వరకు 407 మోడల్ కెరీర్ సెంటర్లు (ఎంసీసీలు)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో ఎంసీసీలుగా మార్చిన 370 ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీలు కూడా ఉన్నాయి.
ఇప్పటి వరకు 31 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్‌సీఎస్ పోర్టల్‌తో అనుసంధానమయ్యాయి. వీటిలో 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నేరుగా ఎన్‌సీఎస్ పోర్టల్‌ను ఉపయోగిస్తున్నాయి.
2026 ఆగస్టు 3న లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్షుఖ్ మాండవీయ లిఖితపూర్వకంగా అందించారు.
***
(रिलीज़ आईडी: 2294723)
आगंतुक पटल : 13