పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఆగస్టు 4, 2026న ఎయిరిండియా విమానం ఏఐ2379లో (ఫుకెట్–ఢిల్లీ) చోటు చేసుకున్న ఘటన
प्रविष्टि तिथि:
04 AUG 2026 7:56PM by PIB Hyderabad
థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానం ఏఐ2379 (ఎయిర్‌బస్ ఏ320, నమోదు సంఖ్య వీటీ-ఏఎక్స్ఓ) మార్గమధ్యంలో… ఆల్టిట్యూడ్ పరంగా కొద్ది సమయంపాటు హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. అయితే, సమస్యను సత్వరమే పరిష్కరించడంతో...సాధారణ స్థితికి వచ్చింది. అనంతరం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానం సురక్షితంగా చేరుకుంది.
ఈ విమానంలో ముగ్గురు శిశువులతో సహా మొత్తం 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది (ఇద్దరు పైలట్లు, ఆరుగురు క్యాబిన్ సిబ్బంది) ఉన్నారు.
విమానం ఎయిర్ పోర్టుకు చేరుకున్న వెంటనే ముందస్తు జాగ్రత్తగా ప్రయాణికులూ, సిబ్బందికీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సమగ్ర వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఎనిమిది మంది ప్రయాణికులతో పాటు నలుగురు క్యాబిన్ సిబ్బందిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన ప్రయాణికులు, సిబ్బంది పరిస్థితి నిలకడగా ఉండగా.. వారికి వైద్యులు మెరుగైన వైద్య సంరక్షణ అందిస్తున్నారు. విమానంలోని ఇతర ప్రయాణికులకు అవసరమైన సాయం, మద్దతును అందించారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి స్వయంగా ఫోర్టిస్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయనతో పాటు పౌర విమానయాన శాఖ కార్యదర్శి, డీజీసీఏ డైరెక్టర్ జనరల్ కూడా ఆసుపత్రికి వెళ్లారు. గాయపడిన ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని తెలుగుసుని, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఫోర్టిస్, వేదాంత ఆసుపత్రులను సందర్శించి, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సంరక్షణ, సహాయం అందేలా ఆసుపత్రి యాజమాన్యాలతో, విమానయాన ప్రతినిధులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు.
సమస్య తలెత్తిన విమానాన్ని హ్యాంగర్‌కు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను లోతుగా విశ్లేషించడం కోసం విమానంలోని ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్‌డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను (సీవీఆర్) అధికారులు భద్రపరిచారు.
ఈ ఘటనపై డీజీసీఏ సమగ్ర విచారణను ప్రారంభించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ప్రయాణికుల భద్రతే తమ తొలి ప్రాధాన్యత అని, దీనికి సంబంధించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీజీసీఏ అధికారులు స్పష్టం చేశారు.



***
(रिलीज़ आईडी: 2294637)
आगंतुक पटल : 14