యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
కామన్వెల్త్ క్రీడలు 2026: బాక్సింగ్, జూడో, పారా-అథ్లెటిక్స్‌లో పతక విజేతలను సత్కరించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయా
రాబోయే తరానికి మార్గదర్శకులుగా నిలవాలని క్రీడాకారులకు పిలుపు
రూ. 36,000 కోట్లతో ఖేలో ఇండియా పథకాన్ని విస్తరించినట్లు డాక్టర్ మాండవీయా వెల్లడి...
ఈ పెట్టుబడి భారతీయ క్రీడల నిరంతర వృద్ధికి దోహదపడుతుందన్న కేంద్రమంత్రి
प्रविष्टि तिथि:
04 AUG 2026 5:32PM by PIB Hyderabad
కామన్వెల్త్ క్రీడలు 2026లో బాక్సింగ్, జూడో, పారా-అథ్లెటిక్స్ విభాగాల్లో చారిత్రాత్మక ప్రతిభ కనబరిచిన భారతీయ క్రీడాకారులను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయా నేడు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా విజేతలకు అభినందనలు తెలియజేసిన కేంద్రమంత్రి.. క్రీడాకారులు కేవలం పోటీలకే పరిమితం కాకుండా రాబోయే తరానికి మార్గదర్శకులుగా నిలిచి, వారిలో స్ఫూర్తి నింపుతూ భారతీయ క్రీడారంగానికి తమ వంతు సహకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు.

ఈ సత్కార కార్యక్రమంలో బాక్సింగ్ పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన భారత బాక్సింగ్ బృందం సభ్యులు పాల్గొన్నారు. భారత్ బాక్సింగ్‌లో ఏడు స్వర్ణాలు, మూడు రజతాలతో కలిపి మొత్తం 10 పతకాలను సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచింది.

కామన్వెల్త్ క్రీడలు జూడో చరిత్రలోనే రెండు చారిత్రాత్మక స్వర్ణాలతో సహా మొత్తం నాలుగు పతకాలు సాధించి అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన జూడో బృందాన్ని, అద్భుత ప్రతిభతో భారత పారా క్రీడల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన పారా-అథ్లెటిక్స్ బృందాన్ని కూడా కేంద్ర క్రీడల మంత్రి ప్రత్యేకంగా సత్కరించారు.
కామన్వెల్త్ క్రీడల విజేతలకు కేంద్ర ప్రభుత్వం నగదు బహుమతులను ప్రకటించింది. స్వర్ణ పతక విజేతలకు రూ. 30 లక్షలు, రజత పతక విజేతలకు రూ. 20 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ. 10 లక్షల చొప్పున నగదు పురస్కారాలను కేంద్రమంత్రి అందజేశారు.

క్రీడాకారులతో డాక్టర్ మన్సుఖ్ మాండవీయా మాట్లాడుతూ.. కేవలం ఆటకు మాత్రమే పరిమితం కాకుండా భారతీయ క్రీడారంగంలో తదుపరి తరానికి మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు. రూ. 36,000 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకున్న ఖేలో ఇండియా పథకం మద్దతుతో క్రీడాకారులు పదవీ విరమణ తర్వాత క్రీడా అకాడమీలను స్థాపించి, నూతన ప్రతిభను ప్రోత్సహించాలని కోరారు.
‘‘కేవలం ప్రభుత్వ ఉద్యోగం కోసమే అన్నట్లుగా గెలుపు ఉండరాదు. క్రీడా జీవితం నుంచి పదవీ విరమణ తర్వాత మీరందరూ క్రీడా అకాడమీలను నిర్వహించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని డాక్టర్ మాండవీయా తెలిపారు. ప్రతి ఒక్క క్రీడాకారుడి లక్ష్యం ‘దేశమే ప్రథమం’గా ఉండాలని తెలిపారు.

‘‘మీరు గ్లాస్గోలో స్వర్ణ పతకం కోసం పోరాడుతున్న సమయంలోనే మేం రూ. 36,000 కోట్ల పెట్టుబడితో విస్తరించిన ఖేలో ఇండియా పథకాన్ని ప్రారంభించాం. రాబోయే సంవత్సరాల్లో భారతీయ క్రీడా రంగం అభివృద్ధి చెందడానికి ఈ భారీ పెట్టుబడి ఎంతగానో తోడ్పడుతుంది’’ అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

రాబోయే ఆసియా క్రీడలు 2026ను దృష్టిలో ఉంచుకుని కామన్వెల్త్ క్రీడల విజయాల ద్వారా వచ్చిన ఉత్సాహాన్ని కొనసాగించాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయా క్రీడాకారులకు సూచించారు. ‘‘ ఇదే ఆత్మవిశ్వాసంతో 2026 ఆసియా క్రీడల్లో మరిన్ని స్వర్ణ పతకాలు సాధించాలి. రజత, కాంస్య పతకాలు గెలుచుకున్న వారు స్వర్ణం కోసం శ్రమించాలి. స్వర్ణం నెగ్గిన వారు తమ అద్భుతమైన ప్రతిభను ఇలాగే కొనసాగించాలి’’ అని పిలుపునిచ్చారు.

క్రీడాకారులు తమ విజయంలో భాగస్వాములైన శిక్షకుల సహకారాన్ని ఎప్పటికీ మరచిపోకూడదని కేంద్ర మంత్రి తెలిపారు.‘‘మీలో ఎవ్వరూ మీ శిక్షకుల కృషిని మరవకూడదు. అది నిజమైన అంకితభావానికి ప్రతీక. జీవితంలో గురువు ఇచ్చే మార్గదర్శకత్వం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది’’ అని పేర్కొన్నారు.

భారత బాక్సింగ్ బృందం గ్లాస్గో నుంచి ఏడు స్వర్ణాలు, మూడు రజత పతకాలను సాధించింది. ఇందులో ప్రీతి పవార్ (54 కేజీలు), జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), సాక్షి చౌదరి (51 కేజీలు), ప్రియా ఘంగాస్ (60 కేజీలు), అరుంధతి చౌదరి (70 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), అంకుష్ పంగాల్ (80 కేజీలు) స్వర్ణ పతకాలు సాధించారు. అలాగే ఒలింపిక్ పతక విజేతల లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), జాదుమణి సింగ్ (55 కేజీలు), నరేందర్ బెర్వాల్ (90+ కేజీలు) రజత పతకాలను గెలుచుకున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా బాక్సర్లు ఏడు స్వర్ణ పతకాలు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన భారత జూడో బృందానికి కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించాయి.

గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడలు 2026లో భారత్... 12 జూడో ఈవెంట్లలో పాల్గొని రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు పతకాలను గెలుచుకుంది. 2022లో స్వర్ణం లేకుండా కేవలం మూడు పతకాలు మాత్రమే సాధించిన భారత్‌కు ఇది అద్భుతమైన పురోగతి. ఖేలో ఇండియా క్రీడాకారులు అస్మిత డే, హర్ష్ సింగ్ ఈ అద్భుత విజయానికి నాయకత్వం వహించారు. కామన్వెల్త్ క్రీడలు జూడో చరిత్రలోనే భారత్‌కు తొలి స్వర్ణ పతకాలను అందించి నూతన చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ క్రీడలు జూడో విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళా జూడోకాగా అస్మిత డే నిలవగా.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ పురుష జూడో క్రీడాకారుడిగా హర్ష్ సింగ్ నిలిచారు.
అన్ని క్రీడా విభాగాల్లో పతకాలు సాధించిన ఈ విజేతలందరూ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలను అందుకున్నారు. ఖేలో ఇండియా, టాప్స్ (టీఓపీఎస్), శిక్షణ, పోటీల వార్షిక క్యాలెండర్ (ఏసీటీసీ) కార్యక్రమాల ద్వారా వారికి తగిన మద్దతు లభించింది. ఎస్ఏఐ-ఎన్‌సీఓసీల్లో నిర్వహించిన జాతీయ శిక్షణ శిబిరాలు, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే అవకాశాలు, నాణ్యమైన పరికరాలు, అత్యుత్తమ శిక్షణ సౌకర్యాలు వీరి విజయాలకు ఎంతగానో తోడ్పడ్డాయి.
***
(रिलीज़ आईडी: 2294620)
आगंतुक पटल : 15