సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్ఎంఈ సుస్థిరతా (జెడ్ - జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్) ధ్రువీకరణ: నాణ్యత, సుస్థిరత, మహిళా సారథ్యంలోని సంస్థల బలోపేతం
మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత: మహిళల సారథ్యంలోని ఎంఎస్ఎంఈలకు జెడ్ ధ్రువీకరణపై 100% రాయితీని అందిస్తున్న ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ
అంతర్జాతీయంగా పోటీతత్వానికి ఊతమిచ్చేలా.. జెడ్ ధ్రువీకరణను సాధించిన 6.7 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు
జెడ్ ధ్రువీకరణ విప్లవాత్మక సానుకూల ప్రభావాన్ని చాటుతున్న విజయగాథలు
प्रविष्टि तिथि:
04 AUG 2026 11:22AM by PIB Hyderabad
ఫినెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ – జెడ్ఈడీతో నాణ్యత, సుస్థిరత దిశగా పురోగతి
మహారాష్ట్ర నాసిక్‌లోని దిండోరీ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఫినెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోహ, కలప ఫర్నిచర్‌ను తయారుచేస్తోంది. ఈ సంస్థ 2025 జూలై 14న జెడ్ సిల్వర్ ధ్రువీకరణను సాధించింది. అనంతరం నాణ్యతా లోపాల వ్యయాన్ని 11 శాతం, తిరిగి పని చేయడాన్ని 10 శాతం, లోపాలను 1 శాతం మేర తగ్గించుకోవడమే కాకుండా.. పని ప్రదేశంలో భద్రతనూ, వనరుల వినియోగాన్నీ మెరుగుపరచుకుంది. మెరుగైన విద్యుత్ సామర్థ్యం, స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడం, వస్తువుల వాడకాన్ని తగ్గించడం ద్వారా గణనీయమైన పొదుపును కూడా సాధించింది. జెడ్ ధ్రువీకరణ వల్ల ఉత్పాదకత, ఉత్పత్తుల నాణ్యత, కార్యాచరణ సామర్థ్యం పెరిగాయని సంస్థ తెలిపింది. ఎంఎస్ఎంఈలు సుస్థిర పద్ధతుల్లో అభివృద్ధి చెందేందుకు, పోటీతత్వ సమర్థతను పెంపొందించుకునేందుకు ‘లోప రాహిత్యం, పర్యావరణ హితం (జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్)’ విధానాలు దోహదపడుతున్న తీరును ఇది ప్రతిబింబిస్తోంది.
కాన్సెప్ట్ క్లాథింగ్ ప్రైవేట్ లిమిటెడ్ - జెడ్ ద్వారా నాణ్యత, సామర్థ్యాల బలోపేతం
పంజాబ్‌లోని జలంధర్ కేంద్రంగా పనిచేసే కాన్సెప్ట్ క్లోథింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2025 జూన్ 14న జెడ్ సిల్వర్ ధ్రువీకరణను సాధించి.. నాణ్యత, సుస్థిరత, కార్యాచరణ నైపుణ్యాల పట్ల నిబద్ధతను చాటుకుంది. జెడ్ విధానాలను అమలు చేసిన తర్వాత ప్రమాదాల సంఖ్యను 80 శాతం, సగటు మరమ్మతు సమయాన్ని 50 శాతం, తిరిగి చేసే పని చేయాల్సిన పరిస్థితులను 7.4 శాతం, ఉత్పత్తుల తిరస్కరణను 4 శాతం మేర తగ్గించుకున్నట్లు సంస్థ తెలిపింది. అంతేకాకుండా నాణ్యత, పర్యావరణం, పని ప్రదేశాల్లో అభివృద్ధి చర్యల ద్వారా గణనీయమైన పొదుపును సాధించింది. జెడ్ ధ్రువీకరణ వల్ల సంస్థలో క్రమశిక్షణ, వివిధ ప్రక్రియల్లో సమర్థత పెరగడంతోపాటు పోటీతత్వం మెరుగైందని తెలిపింది. ఎంఎస్ఎంఈల్లో ‘లోప రాహిత్యం, పర్యావరణ హితం (జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్)’ విధానాల విలువను ఇది స్పష్టం చేస్తోంది.
లోపరాహిత్యం, పర్యావరణ హితం (జెడ్) ధ్రువీకరణతో ఎంఎస్ఎంఈల బలోపేతం
ఎంఎస్ఎంఈ సుస్థిరతా - జెడ్ ధ్రువీకరణ పథకం ద్వారా.. నాణ్యతతో కూడిన, పర్యావరణ హిత తయారీ రంగాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రోత్సహిస్తోంది. ఉత్పత్తి ప్రక్రియలను మెరుగుపరచుకోవడానికి, మెరుగైన నాణ్యత ప్రమాణాలను పాటించడానికి, పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఈ కార్యక్రమం ఎంఎస్ఎంఈలకు దోహదపడుతుంది. తద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వాటి పోటీతత్వాన్ని బలోపేతం చేస్తుంది.
నాణ్యమైన, సుస్థిర తయారీ రంగంలో మహిళా పారిశ్రామికవేత్తల అధిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. మహిళల సారథ్యంలోని సంస్థలకు ఎదురయ్యే వ్యయపరమైన అడ్డంకులను తగ్గించడం కోసం.. మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు జెడ్ ధ్రువీకరణ ఖర్చుపై 100 శాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది. 2023 నవంబరు 11 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. మహిళల యాజమాన్యంలోని అర్హత కలిగిన ఎంఎస్ఎంఈలకు ధ్రువీకరణ కోసం ఎలాంటి ఖర్చూ ఉండదు.


నాణ్యత, ఉత్పాదకత, భద్రత, పర్యావరణ సుస్థిరతలకు సంబంధించి గురింపు పొందిన ప్రమాణాలకు అనుగుణంగా మహిళా పారిశ్రామికవేత్తలు తమ తయారీ వ్యవస్థలను సమీక్షించుకోవడంతోపాటు.. మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ సహాయం ద్వారా వీలు కలుగుతుంది. నిర్దిష్టమైన మదింపు, ధ్రువీకరణలకు అవకాశాన్ని కల్పించడం ద్వారా.. మహిళల సారథ్యంలోని పరిశ్రమలు మెరుగైన పనివిధానాలను తీర్చిదిద్దుకోవడానికి, మార్కెట్టులో విశ్వసనీయతను పెంచుకోవడానికి, విస్తృతమైన వ్యాపార అవకాశాలను అందుకునేలా సంసిద్ధమవడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.
నేపథ్యం
ఎంఎస్ఎంఈలు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపకుండా అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసేలా లోప రాహిత్యం, పర్యావరణ హితం (జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్ - జెడ్) కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. నాణ్యత, ఉత్పాదకత, సుస్థిరతలను పెంచుకోవడానికి వీలుగా తమ సాంకేతికత, వ్యవస్థలు, తయారీ విధానాలను నిరంతరం మెరుగుపరుచుకోవడంలో పరిశ్రమలకు ఇది తోడ్పడుతుంది. ‘జెడ్’ కేవలం ఒక ధ్రువీకరణ కార్యక్రమం మాత్రమే కాదు.. మదింపు, నాణ్యతలో మెరుగుదల, ప్రోత్సాహకాలు, సాంకేతికత ఆధునికీకరణ దిశగా ఎంఎస్ఎంఈలకు ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఈ ధ్రువీకరణ విధానంలో కాంస్య, రజత, స్వర్ణ అనే స్థాయులుంటాయి. దీనివల్ల పరిశ్రమలు క్రమక్రమంగా ఉన్నతమైన నాణ్యత, సుస్థిరతా ప్రమాణాలను అందుకోవడానికి వీలవుతుంది. అర్హత కలిగిన ఎంఎస్ఎంఈలు పరీక్ష/ వ్యవస్థాపరమైన/ ఉత్పత్తి ధ్రువీకరణ వ్యయంలో 75 శాతం వరకు (గరిష్టంగా రూ. 50,000) ఆర్థిక సాయాన్ని పొందవచ్చు. అలాగే ప్రత్యక్ష మార్గదర్శకత్వం, సలహా సేవల కోసం రూ. 2 లక్షల వరకూ, పర్యావరణ హిత మార్గాలు, కాలుష్య నియంత్రణ చర్యలు, శుద్ధ సాంకేతికతల కోసం రూ. 3 లక్షల వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు.
విస్తరిస్తున్న పరిధి, విస్తృత ప్రభావం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో నాణ్యత, సుస్థిరత, పోటీతత్వాలను పెంచడంలో ఎంఎస్ఎంఈ సుస్థిరతా (జెడ్) ధ్రువీకరణ పథకం కీలక ఉత్ప్రేరకంగా ఎదుగుతోంది. 2026 జూలై 7 నాటికి ఈ పథకం కింద దాదాపు 9.49 లక్షల ఎంఎస్ఎంఈలు నమోదు చేసుకున్నాయి. వీటిలో 6.67 లక్షలకు పైగా సంస్థలు కాంస్య, 6,700కు పైగా సంస్థలు రజత, 4,800కు పైగా సంస్థలు స్వర్ణ ధ్రువీకరణ పత్రాలను పొందాయి. పరిశ్రమలు నాణ్యమైన, సుస్థిరమైన తయారీ విధానాలను అందిపుచ్చుకొనేలా.. ఈ కార్యక్రమం ఇప్పటివరకు రూ. 913 కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని అందించింది.
జెడ్ ధ్రువీకరణ సానుకూల ప్రభావం ధ్రువీకరణకు మాత్రమే పరిమితం కాలేదు. 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ పారిశ్రామిక విధానాలతో జెడ్‌ను అనుసంధానించి.. ధ్రువీకరించిన ఎంఎస్ఎంఈలకు అదనపు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. అంతేకాకుండా 19 ఆర్థిక సంస్థలు ప్రాసెసింగ్ ఫీజులు, వడ్డీ రేట్లలో రాయితీల వంటి ప్రయోజనాలను అందిస్తూ.. జెడ్ ధ్రువీకరణ పొందిన సంస్థలకు ఆర్థికసాయాన్ని సులభంగా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు జెడ్ ధ్రువీకరణపై 100 శాతం సబ్సిడీని అందించడం ఈ పథకంలో ఒక ముఖ్యమైన అంశం. ఇది వ్యయపరమైన అవరోధాన్ని తొలగించి, మహిళా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. నాణ్యమైన తయారీ, వనరుల సామర్థ్యం, పర్యావరణ సుస్థిరతలను ప్రోత్సహించడం ద్వారా.. ఎంఎస్ఎంఈలు పోటీతత్వాన్నీ, మార్కెట్ విశ్వసనీయతను పెంచుకోవడానికీ, దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ అన్ని దశల్లోనూ మరింత సమర్థంగా ఏకీకృతం కావడానికీ జెడ్ దోహదపడుతుంది.
వివరాల కోసం వెబ్‌సైటును సందర్శించండి https://zed.msme.gov.in/
***
(रिलीज़ आईडी: 2294440)
आगंतुक पटल : 3