సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో ప్రారంభమైన బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూపు సమావేశం


పరారీలో ఉన్న నేరస్తులను పట్టుకోవడానికి, అక్రమ ఆస్తులను రికవరీ చేయడంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలి: కార్యదర్శి రచనా షా

प्रविष्टि तिथि: 04 AUG 2026 2:02PM by PIB Hyderabad

రెండు రోజుల పాటు నిర్వహించే బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ (ఏసీడబ్ల్యూజీ) సమావేశం ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. 2026 ఆగస్టు 4, 5 తేదీల్లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్‌వర్క్ రెండో సమావేశం కూడా జరుగుతుంది.

 

హైదరాబాద్‌లో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి భారత ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి కార్యదర్శి రచనా షా మాట్లాడారు. సుస్థిరమైన, సమ్మిళిత్వంతో కూడిన అభివృద్ధికి... అవినీతి ప్రధాన ఆటంకంగా ఉందని ఆమె అన్నారు. ఇది ఆసుపత్రులు, పాఠశాలలు, కీలకమైన మౌలిక వసతుల నుంచి పరిమిత ప్రజా వనరులను మళ్లిస్తుందని, ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీస్తుందని ఆమె తెలిపారు.

 

అవినీతి అనే సవాలుకు ఏ దేశమూ మినహాయింపు కాదని, ఏ దేశమూ దీనిని ఒంటరిగా ఎదుర్కోలేదని ఆమె స్పష్టం చేశారు. అక్రమ ఆర్థిక మళ్లింపులను నివారించి, ప్రజా వనరులను పరిరక్షించడానికి, అంతర్జాతీయ అవినీతి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సమష్టిగా, సమన్వయంతో కూడిన, నిరంతర అంతర్జాతీయ సహకారానికి ఆమె పిలుపునిచ్చారు.

 

సమగ్రత, జవాబుదారీతనం, అంతర్జాతీయ సహకారం, ఆవిష్కరణలను బలోపేతం చేయడం అత్యంత ముఖ్యమైనదిగా మారిన ఈ సమయంలో బ్రిక్స్ ఏసీడబ్ల్యూజీ రెండో సమావేశం జరుగుతోందని కార్యదర్శి రచనా షా తెలిపారు. సీమాంతర అవినీతిని ఎదుర్కోవడంపై తన ఉమ్మడి బాధ్యతను బ్రిక్స్ ఆచరణాత్మక సహకారంగా, స్పష్టమైన ఫలితాలుగా మార్చాలని ఆమె అన్నారు.

పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుల వల్ల ఎదురవుతున్న సవాళ్ల గురించి కార్యదర్శి ప్రస్తావించారు. నేరాల నుంచి లబ్ధి పొందే వారికి ఏ దేశమూ ఆశ్రయంగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించడం వారి అప్పగింతకు సహకరించడడం, దొంగిలించిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడం, నేరస్తులు, అక్రమ నిధులు సరిహద్దులు దాటి తరలిపోవడానికి అవకాశం కల్పిస్తున్న లోపాలను తొలగించడంలో బలమైన సహకారానికి ఆమె పిలుపునిచ్చారు.

 

అవినీతి ఆరోపణలతో పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించడం, వారి అప్పగింతకు సహకరించడం కోసం ఏర్పాటు చేసిన అనధికారిక సహకార బ్రిక్స్ భాండాగారం విషయంలో సాధించిన పురోగతిని ఆమె స్వాగతించారు. అవినీతి కేసుల్లో పరారీలో ఉన్న నిందితుల విషయంలో, వారి అప్పగింతకు మద్దతు ఇవ్వడం కోసం బ్రిక్స్ దేశాల మధ్య అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన బ్రిక్స్ లా ఎన్ఫోర్స్‌మెంట్ ప్రాక్టీషనర్ల నెట్వర్క్‌పై జరుగుతున్న చర్చలను కూడా ఆమె స్వాగతించారు. నిర్ధిష్టమైన ఫలితాల దిశగా కృషి చేయాలని సభ్యులను కోరారు.

బ్రిక్స్ అసెట్ రికవరీ నిపుణుల నెట్‌వర్క్ కార్యకలాపాలు ప్రారంభించటాన్ని కార్యదర్శి రచనా షా స్వాగతించారు. సమాచార మార్పిడి కోసం రూపొందించిన ప్రామాణిక టెంప్లేట్, స్థానిక నోడల్ పాయింట్లు, నిపుణుల డైరెక్టరీతో కలిసి చట్టాన్ని అమలు చేసే సంస్థల మధ్య వేగవంతమైన, మరింత ప్రత్యక్షమైన, అత్యంత ప్రభావవంతమైన సహకారాన్ని సులభతరం చేస్తాయని ఆమె పేర్కొన్నారు.

నివారణాత్మక అప్రమత్తత, సాంకేతికత ఆధారిత పరిపాలనకు పెద్దపీట వేస్తూ మారుతున్న అవినీతి ముప్పులను ఎదుర్కొనే పరిష్కారంలో సాంకేతికతే కీలకమని కార్యదర్శి అన్నారు. డిజిటల్ గుర్తింపు, ఎలక్ట్రానిక్ సేవలందించే విధానం, డిజిటల్ చెల్లింపులు, పారదర్శక కొనుగోలు వ్యవస్థలు వృథాను తగ్గించగలవని, అధికారుల విచక్షణాధికారాలకు కళ్లెం వేయగలవని, ప్రజా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయగలవని ఆమె పేర్కొన్నారు.

దేశ జాతీయ ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ అయిన గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం), ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమాలను సాంకేతికత ఆధారిత సంస్కరణలకు ఉదాహరణలుగా ఆమె చెప్పారు. పన్నుల విధింపు, ఇతర ప్రభుత్వ ప్రక్రియల్లో ముఖ రహిత, కాగిత రహిత విధానాలు.. సాంకేతికతతో కూడిన నిఘా, డేటా ఆధారిత పర్యవేక్షణ, బలమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను కూడా ఆమె ప్రస్తావించారు.

నవకల్పనలు, సాంకేతికత ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పరిపాలన’ అంశంపై జరిగే సమాంతర కార్యక్రమం... విస్తరించదగిన విజిలెన్స్ పద్ధతులు, సాంకేతికత ఆధారిత పరిష్కారాలు, నివారణాత్మక పర్యవేక్షణా విధానాలపై సభ్యులు తమ అనుభవాలను పరస్పరం పంచుకోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని అందిస్తుందని కార్యదర్శి తెలిపారు.

ఈ రెండు రోజుల కార్యక్రమంలో అవినీతికి పాల్పడి పరారైన నేరస్థుల అన్వేషణ, నేరస్థుల అప్పగింతకు మద్దతు ఇచ్చే అనధికారిక సహకారంపై బ్రిక్స్ రిపాజిటరీ, బ్రిక్స్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాక్టీషనర్ల నెట్‌వర్క్, బ్రిక్స్ అసెట్ రికవరీ నిపుణుల నెట్‌వర్క్ రెండో సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ‘నవకల్పనలు, సాంకేతికత ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పాలన’  అంశంపై ఒక సమాంతర కార్యక్రమం, ‘ఆర్థిక సాంకేతికత(ఫిన్‌టెక్), వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏలు) నుంచి ఎదురవుతున్న అభివృద్ధి చెందుతున్న ముప్పులు: అవినీతి ద్వారా వచ్చిన సొమ్మును దాచడంలో, లాండరింగ్ చేయడంలో వాటి దుర్వినియోగాన్ని అరికట్టడం’ అంశంపై ప్రత్యేక సెషన్ ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.

ప్రారంభోత్సవంలో బ్రిక్స్ ఏసీడబ్ల్యూజీ చైర్మన్ శ్రీ జే. అశోక్ కుమార్ ప్రతినిధి బృందాలకు స్వాగతం పలికారు. వారి నిరంతర భాగస్వామ్యానికి, నిర్మాణాత్మక సహకారానికి, పరస్పర సహకార స్ఫూర్తికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత కొన్ని నెలల్లో సాధించిన పురోగతి, నిరంతర చర్చల విలువ.. అవినీతి నిరోధక సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.

ఈ సంవత్సరంలో చేసిన కృషి ఇప్పటికే ఉన్న ఇతర వ్యవస్థలతో ఎలాంటి డూప్లికేషన్ జరగకుండా చూసుకుంటూనే బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ఆచరణాత్మక సాధనాలు, విధానాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిందని శ్రీ జే. అశోక్ కుమార్ అన్నారు.

***

 


(रिलीज़ आईडी: 2294232) आगंतुक पटल : 74
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Tamil , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati