ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కామన్వెల్త్‌లో చరిత్రాత్మక విజయం సాధించిన వెయిట్‌లిఫ్టింగ్
ఛాంపియన్ మీరాబాయి చానుతో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భేటీ
పీఎం మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈశాన్య భారత్ నుంచి తర్వాతి తరం క్రీడా ఛాంపియన్లను తయారు చేయాలనే లక్ష్యాన్ని పునరుద్ఘాటించిన సింధియా
అంతర్జాతీయ స్థాయి శిక్షణ, సహకారంతో మరెంతో మంది మీరాబాయి చానులను ఈశాన్య ప్రాంతం తయారు చేయాలి: సింధియా
प्रविष्टि तिथि:
03 AUG 2026 3:18PM by PIB Hyderabad
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు స్థాయిలో వరుసగా మూడో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుతో ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా సమావేశమయ్యారు.

అసాధారణ విజయం సాధించిన మీరాబాయి చానును శ్రీ సింధియా అభినందించారు. ఆమె దృఢ సంకల్పం, క్రమశిక్షణ, పట్టుదలను ప్రశంసించారు. దేశంలో ఉన్న వేలాది మంది యువ క్రీడాకారులకు ముఖ్యంగా ఈశాన్య ప్రాంతానికి చెందిన వారికి ఆమె విజయం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.
భారతదేశంలో ప్రసిద్ధి పొందిన క్రీడాకారుల్లో ఒకరిగా ఎదిగే క్రమంలో సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి, ఎదుర్కొన్న సవాళ్ల గురించి మీరాబాయి చాను ఈ సందర్భంగా వివరించారు. అత్యుత్తమంగా రాణించడంలో శిక్షణ పద్ధతులు, పోషకాహారం, రికవరీ దశలు, తగినంత నిద్రతో సహా క్రీడలకు సంబంధించిన వివిధ అంశాలపై ఆమెతో కూలంకషంగా మంత్రి చర్చించారు.

మీరాబాయి చాను కోచ్, ట్రైనర్, ఫిజియోథెరపిస్టు అందించిన అమూల్యమైన సేవలను కూడా మంత్రి ప్రశంసించారు. శాస్త్రీయ శిక్షణ, నిపుణుల మార్గదర్శకత్వంతో కూడిన బలమైన తోడ్పాటు వ్యవస్థపై ప్రపంచ స్థాయి క్రీడా విజయం ఆధారపడి ఉంటుందని ఆయన అంగీకరించారు.
క్రీడా ప్రతిభను ప్రోత్సహించాలనే ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ దార్శనికతను మంత్రి సింధియా తెలియజేశారు. అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ (హెచ్ఎల్టీఎఫ్) ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో సమగ్ర క్రీడా వ్యవస్థ అభివృద్ధి గురించి సింధియా చర్చించారు. ఈ టాస్క్‌ఫోర్స్ ద్వారా ‘ఒక రాష్ట్రం, ఒక క్రీడ’ కార్యక్రమంపై ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోంది. దీని పరిధిలో వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, ఫుట్‌బాల్ వంటి క్రీడాంశాలతో సహా సహజ పోటీ ప్రయోజనం ఉన్న క్రీడల్లో ప్రతిభ కనబరిచేలా ప్రతి ఈశాన్య రాష్ట్రానికి మద్దతు లభిస్తోంది.

ఈ కార్యక్రమం కేవలం మౌలిక వసతులను సిద్ధం చేయడం గురించి మాత్రమే కాదనీ, నాణ్యమైన కోచింగ్, శాస్త్రీయపరమైన శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్, పోషకాహారం, రికవరీ, అథ్లెట్‌కు తోడ్పాటునందించడంపై దృష్టి సారించిన ప్రపంచ స్థాయి క్రీడా వ్యవస్థను సృష్టించడం గురించి అనీ కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోనే నాణ్యమైన శిక్షణ, వసతులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా క్రీడల్లో రాణించేందుకు మరింత మంది యువ క్రీడాకారులు స్ఫూర్తి పొందుతారనీ, ఈశాన్య ప్రాంతం నుంచి మీరాబాయి చాను లాంటి మరింత మంది ఛాంపియన్లను తయారుచేయడానికి వీలవుతుందనీ ఆయన చెప్పారు. ఈశాన్య ప్రాంతంలోని క్రీడాకారుల సామర్థ్యం గురించి చానుకి శిక్షణ ఇచ్చిన విజయ్ శర్మ వివరించారు. ఈ కార్యక్రమాలు క్షేత్రస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించడంలో సాయపడతాయని అంగీకరించారు.
ఈశాన్య ప్రాంతం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా.. ప్రతిభ, ఉత్తమ కోచింగ్, అథ్లెట్ల అభివృద్ధికి నిధులు కేటాయించడం ద్వారా క్రీడా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధిని ఈ సమావేశం పునురుద్ఘాటిస్తోంది. అలాగే ఈశాన్య ప్రాంతంలోని క్రీడా సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సమావేశం పునరుద్ఘాటించింది.

****
(रिलीज़ आईडी: 2293995)
आगंतुक पटल : 6