రక్షణ మంత్రిత్వ శాఖ
సవాళ్లను ఎదుర్కొనే బలమైన రక్షణ వ్యవస్థకు సైనిక-పౌర విభాగాల
భాగస్వామ్యం కీలకం: ఏఎఫ్‌హెచ్‌క్యూ సివిలియన్ సర్వీసెస్ డే వేడుకల్లో రక్షణ మంత్రి
‘‘దేశమే ప్రథమం’ అనేది సైనిక, పౌర సేవల ఉమ్మడి బాధ్యత... లక్ష్యం ఒకటే అయినప్పుడు ప్రతీ అంశం జాతీయ శక్తిగా మారుతుంది’’: రక్షణ మంత్రి
‘‘భారత్ రక్షణ నిర్వహణకు ఏఎఫ్‌హెచ్‌క్యూ పౌర సేవలు వ్యూహాత్మక మేధో కేంద్రంగా మారాలి.. జాతీయ భద్రత బలపేతానికి పరిశోధనలు, భౌగోళిక-వ్యూహాత్మక ఆలోచనలు, వినూత్న భావనలు అత్యంత కీలకం’’
प्रविष्टि तिथि:
03 AUG 2026 2:35PM by PIB Hyderabad
రక్షణ దళాలు కొత్త ఉత్సాహంతో ఉమ్మడి కార్యాచరణ దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖలోని సైనిక, పౌర విభాగాల మధ్య అనుసంధానాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మారుతున్న భద్రతా, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు రక్షణ వ్యవస్థలో మెరుగైన సమన్వయాన్ని పెంపొందించడంతోపాటు వ్యవస్థాగత అనుభవం, స్థిరత్వం, నిబంధనల సమర్థవంతమైన అమలును నిర్ధారించడం చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 03, 2026న న్యూఢిల్లీలో జరిగిన 85వ సాయుధ దళాల ప్రధాన కార్యాలయం (ఏఎఫ్‌హెచ్‌క్యూ) పౌర సేవల దినోత్సవ వేడుకల్లో రక్షణ మంత్రి ప్రసంగిస్తూ.. సైనిక, పౌర సేవలు రెండూ ‘దేశమే ప్రథమం’ అనే ఉమ్మడి నిబద్ధతను చాటుకుంటాయని అన్నారు. లక్ష్యం ఒకటే అయినప్పుడు వ్యవస్థలోని ప్రతి అంశం జాతీయ శక్తిగా మారుతుందని చెప్పారు.

సైనిక, పరిపాలనా సమైక్యత వేర్వేరు మార్గాల్లో సాగలేవని రక్షణ మంత్రి తెలిపారు. ఉమ్మడి వ్యవస్థలు రూపొందుతున్న కొద్దీ విధానాలు, పరిపాలన, మానవ వనరుల నిర్వహణ, ఆర్థిక ప్రక్రియలు, లాజిస్టిక్స్, వ్యవస్థాగత పరిజ్ఞానం వంటి అన్ని రంగాల్లో నిరంతరాయమైన నైపుణ్యం అవసరమని తెలిపారు. పౌర, సైనిక అధికారుల మధ్య పరస్పర అవగాహనను మరింత పెంచాల్సి అవసరం ఉందన్నారు. ఇరుపక్షాలు ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకోవడానికి ఉమ్మడి శిక్షణ కార్యక్రమాలు, అభివృద్ధి ఆధారిత నియామకాలు చేపట్టాలని ప్రతిపాదించారు.
‘సైబర్ వార్‌ఫేర్’ గురించి రక్షణ మంత్రి వివరిస్తూ.. ఏఎఫ్‌హెచ్‌క్యూ పౌర సేవల అధికారులు తమ నైపుణ్యాన్ని ఉపయోగించి రక్షణ రంగానికి ప్రత్యేకమైన సైబర్ పరికరాలను తయారుచేస్తే, అది రక్షణ దళాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. భారత సైనిక చరిత్రను పౌర దృక్పథంతో పరిశీలిస్తూ, అధ్యయనం చేయడానికి ఒక వేదికను ఏర్పాటు చేయవచ్చని సూచించారు. దీనివల్ల వినూత్న ఆలోచనలు, కొత్త దృక్పథాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఇలాంటి రంగాల్లోని నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఏఎఫ్‌హెచ్‌క్యూ పౌర సేవలు రక్షణ రంగానికి మరింత అర్థవంతమైన సేవలు అందించగలవని విశ్వాసం వ్యక్తం చేశారు.
‘‘సైనిక అధికారులు క్షేత్రస్థాయి అనుభవం, కమాండింగ్ దృక్పథం, యుద్ధ వ్యూహాలపై అవగాహనను పెంపొందిస్తారు. అలాగే సివిల్ అధికారులు పరిపాలనా కొనసాగింపు, విధానపరమైన అనుభవం, ప్రభుత్వ ప్రక్రియలపై పట్టు, వ్యవస్థాగత పరిజ్ఞానాన్ని అందిస్తారు. ఈ రెండు బలాలు కలిసి పనిచేసినప్పుడు నిర్ణయాధికారం మరింత సమగ్రంగా, సమతుల్యంగా, ప్రభావవంతంగా మారుతుంది’’ అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
భారత రక్షణ నిర్వహణ వ్యవస్థకు వ్యూహాత్మక ‘మేధోకేంద్రం’ లాగా ఏఎఫ్‌హెచ్‌క్యూ పౌర సేవలు ఎదగాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం రక్షణ రంగాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలనీ, ఉమ్మడి వాతావరణంలో సమర్థవంతంగా పనిచేయాలనీ, ఎదురవుతున్న నూతన సవాళ్లను తట్టుకునేలా నైపుణ్యాలను నిరంతరం పదును పెట్టుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సేవలు ముందుకు సాగుతున్న తీరును ఆయన అభినందించారు. సాంకేతిక మార్పులతో ఆధునిక యుద్ధాలు సాగుతున్న ఈ రోజుల్లో.. కేవలం సేవా నియమాలు, నిబంధనలు, ఆదేశాలను సరిగా అమలు చేయడానికే ఈ వ్యవస్థ పరిమితం కాకూడదని స్పష్టం చేశారు.

‘‘ఒక సైన్యానికి కేవలం ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాత్రమే బలాన్ని ఇవ్వవు. వారికోసం నిరంతరం వెనుక ఉండి పనిచేసే వేలాది అదృశ్య హస్తాలు కూడా ఆ బలానికి కారణం. ఏఎఫ్‌హెచ్‌క్యూ పౌర సేవలు కూడా అలాంటి ఒక అదృశ్య, అత్యంత కీలక శక్తుల్లో ఒకటి. పరిశోధనలు, భౌగోళిక-వ్యూహాత్మక ఆలోచనలు, వినూత్న ప్రతిపాదనల ద్వారా జాతీయ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంపై ఈ అధికారులు దృష్టి పెట్టాలి. రక్షణ మంత్రిత్వ శాఖలో ఇదొక శాశ్వత వ్యవస్థ కావడం వల్ల దీనికి లోతైన శాఖాపరమైన పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి కీలక రక్షణ అంశాల్లో ఈ విభాగం చురుగ్గా పాల్గొనడం చాలా అవసరం’’ అని పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో భాగంగా సంయుక్త కార్యదర్శి, ముఖ్య పరిపాలనాధికారి (జేఎస్, సీఏఓ) కార్యాలయానికి చెందిన పలు డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే, సవరించిన దార్శనిక, లక్ష్య పత్రాలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు. వీటిలో ఇంటర్నెట్ ఆధారిత నివాస వసతి నిర్వహణ వ్యవస్థ (ఐబీఏఎంఎస్) rakshaawas.caomod.gov.in వేదిక, క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ కోసం తులిప్ 2.0 తో ఈహెచ్ఆర్ఎంఎస్ అనుసంధానం, జీతభత్యాల ప్రక్రియ కోసం తులిప్ 2.0 తో సీఏఓ కార్యాలయ అనుసంధానం, స్పారో (స్మార్ట్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ రికార్డింగ్ ఆన్‌లైన్ విండో) వేదికలో నమోదు చేయడం వంటివి ఉన్నాయి.

సర్వీస్ ప్రధాన కార్యాలయాలు, అంతర్-సేవా సంస్థల్లో పనిచేస్తున్న వివిధ హోదాల సిబ్బంది రాసిన ప్రయాణ కథనాలు, వ్యాసాలు, కవితలతో కూడిన ‘సంవాద్’ పత్రిక 34వ సంచికను రక్షణ మంత్రి విడుదల చేశారు. క్రీడలు వంటి వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ఏఎఫ్‌హెచ్‌క్యూ సిబ్బందికి, చదువులో రాణించిన ఉద్యోగుల పిల్లలకు ఆయన పురస్కారాలు అందించారు.
ఈ కార్యక్రమంలో రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్, త్రివిధ దళాల అధిపతి జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి, నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, భారత సైన్యాధిపతి జనరల్ ధీరజ్ సేథ్, రక్షణశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, కార్యదర్శి (రక్షణ ఉత్పత్తి) శ్రీ సంజీవ్ కుమార్, కార్యదర్శి (రక్షణ ఆర్థిక విభాగం) శ్రీ విశ్వజిత్ సహాయ్, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్, అదనపు కార్యదర్శి శ్రీ మనీష్ త్రిపాఠి, సంయుక్త కార్యదర్శ, ముఖ్య పరిపాలనా అధికారి శ్రీ అమితాబ్ ప్రసాద్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
సైనిక బలగాల సిబ్బందితో సమానంగా పనిచేసే ఉద్యోగుల సేవలను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి రోజున ఏఎఫ్‌హెచ్‌క్యూ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వీరు ప్రధానంగా మూడు ఇంటిగ్రేటెడ్ సర్వీస్ హెడ్‌క్వార్టర్స్, హెడ్‌క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 24 ఇంటర్-సర్వీస్ సంస్థల్లో సేవలు అందిస్తారు. ముఖ్య పరిపాలనా అధికారి పర్యవేక్షణలో వివిధ సేవల ప్రధాన కార్యాలయాలు, రక్షణ, ఆర్థిక శాఖ సచివాలయం పరిధిలో అప్పటి వికేంద్రీకృత పౌర పోస్టులు, కార్యకలాపాలను ఒక ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయడం ద్వారా 1942 ఆగస్టు 01న ఏఎఫ్‌హెచ్‌క్యూ వ్యవస్థకు నాంది పడింది.
***
(रिलीज़ आईडी: 2293993)
आगंतुक पटल : 7