సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం రెండో సమావేశానికి ఆతిథ్యమిస్తున్న భారత్


బ్రిక్స్‌కు అధ్యక్షత వహిస్తున్న భారత్ సారథ్యంలో హైదరాబాద్‌లో సమావేశం

प्रविष्टि तिथि: 03 AUG 2026 2:41PM by PIB Hyderabad

బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం (ఏసీడబ్ల్యూజీ) రెండో సమావేశానికీ, ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్‌వర్క్ రెండో సమావేశానికీ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ఆతిథ్యమివ్వనుంది. బ్రిక్స్‌–2026కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో 2026 ఆగస్టు 4, 5 తేదీల్లో తెలంగాణలోని హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది.

భారత్ అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్ ఇతివృత్తమైన ‘స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’ స్ఫూర్తిగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.  

ఈ కార్యక్రమాన్ని సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా ప్రారంభిస్తారు. బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులతో పాటుగా సీనియర్ విధాన రూపకర్తలు, నిపుణులు, ప్రాక్టీషనర్లు, అవినీతి నిరోధక, లా ఎన్ఫోర్స్‌మెంట్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.

2026 జూన్ 2,3 తేదీల్లో వర్చువల్‌గా జరిగిన బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం మొదటి సమావేశం ఫలితాల ఆధారంగా హైదరాబాద్ సమావేశం జరుగుతోంది. ఆస్తుల రికవరీ, సీమాంతర అవినీతిని ఎదుర్కోవడం, పాలనలో పారదర్శకతనూ, జవాబుదారీతనాన్నీ పెంపొందించడంలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంపై బ్రిక్స్ సభ్యదేశాలు చర్చిస్తాయి.

దిగువ పేర్కొన్న అంశాల ద్వారా ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించడంపై చర్చలు దృష్టి సారిస్తాయి:

  • అవినీతి కేసుల్లో పరారీలో ఉన్న నేరస్తుల ఆచూకీని గుర్తించడానికీ, అప్పగింత ప్రక్రియలకు మద్దతు ఇవ్వడానికీ అనధికారిక సహకారాన్ని బలోపేతం చేయడం.

  • ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్వర్క్ ద్వారా సమాచారాన్ని పంచుకోవడాన్నీ, కార్యాచరణ సహకారాన్నీ విస్తరించడం.

  • ఫిన్‌టెక్, డిజిటల్ ఆస్తులు, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక సాధనాల నుంచి ఉత్పన్నమయ్యే అవినీతి సంబంధిత ప్రమాదాలను నివారించడంలో, ఎదుర్కోవడంలో అనుభవాలనూ, ఉత్తమ పద్ధతులనూ పంచుకోవడం.

‘‘ఆవిష్కరణ, సాంకేతిక ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పరిపాలన’’ అనే అంశంపై 2026 ఆగస్టు 5న ఓ ప్రత్యేక అనుబంధ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. డిజిటల్ ప్రభుత్వ కొనుగోళ్ల వ్యవస్థ, పౌర భాగస్వామ్యం, పారదర్శకత, జవాబుదారీతనం, పరిపాలనలో నిజాయతీని బలోపేతం చేయడానికి ఆవిష్కరణాత్మక విధానాలతో సహా సాంకేతిక ఆధారిత పరిపాలనపై తమ అనుభవాలను పంచుకోవడానికి బ్రిక్స్ సభ్యులకు వేదికగా ఈ అనుబంధ కార్యక్రమం నిలుస్తుంది.

చర్చలు, అనుభవాలను పంచుకోవడం, సహకార కార్యక్రమాల ద్వారా బ్రిక్స్ దేశాల మధ్య ఆచరణాత్మక సహకారాన్ని ప్రోత్సహించాలనే భారత్ చిత్తశుద్ధిని హైదరాబాద్ సమావేశం తెలియజేస్తోంది. బ్రిక్స్‌కు అధ్యక్షత వహిస్తున్న భారత్ నేతృత్వంలో జరిగే చివరి సమావేశం కావడంతో ఈ అవినీతి నిరోధక కార్యాచరణ బృంద సమావేశం ఈ ఏడాదిలో సాధించిన పురోగతిని పటిష్టం చేస్తుందని భావిస్తున్నారు. అలాగే ఆస్తుల రికవరీ, సీమాంతర అవినీతిని నిరోధించడం, సాంకేతిక ఆధారిత పరిపాలన, సంస్థాగత సామర్థ్య నిర్మాణంలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య స్థిరమైన సహకారానికి పునాది వేస్తుందని అంచనా వేస్తున్నారు.

 

***

 


(रिलीज़ आईडी: 2293804) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Tamil