ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో ఆహార పరీక్షా వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యలు


ఆహార నమూనాల విశ్లేషణ కోసం ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్) గుర్తింపు పొందిన 259 ప్రయోగశాలలు, అప్పీల్ నమూనాల విశ్లేషణ కోసం 24 రిఫరల్ ఫుడ్ లేబొరేటరీలను నోటిఫై చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ

సాఫ్టెల్ పథకం కింద రసాయన, భార లోహాలు, జీవసంబంధమైన కలుషితాలను గుర్తించడం కోసం 47 రాష్ట్ర ఆహార పరీక్షా ప్రయోగశాలలను అత్యాధునిక విశ్లేషణ పరికరాలతో ఆధునికీకరించటంతో పాటు 34 ప్రత్యేక మైక్రోబయాలజీ ప్రయోగశాలల ఏర్పాటు

ముఖ్యంగా గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలలో ఆహార పరీక్షలు, శిక్షణ, అవగాహన కార్యక్రమాలను అందుబాటులోకి తెస్తున్న ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’.. ప్రస్తుతం 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉన్న 305 ఎఫ్ఎస్‌డబ్ల్యూలు

ఏడు వేర్వేరు ఆహార పదార్థాలలో సాధారణ కల్తీలను గుర్తించడానికి సులభమైన, వేగవంతమైన పరీక్ష పద్ధతులను కలిగి ఉండే చిన్న పరిమాణంలో, వాడేందుకు వీలుగా ఉండే కిట్ ‘మ్యాజిక్ బాక్స్’

వివిధ ఆహార ఉత్పత్తుల విషయంలో నీరు, టింక్చర్ ఆఫ్ అయోడిన్ వంటి సాధారణ ద్రావణాల సహాయంతో గృహ స్థాయిలో సులభంగా నిర్వహించగల 44 పరీక్షలను వివరిస్తున్న ‘డిటెక్ట్ అడల్ట్రేషన్ విత్ రాపిడ్ టెస్ట్’ పుస్తకం

అధునాతన, ఉపయోగించటానికి సులభమైన, పోర్టబుల్, చేతితో నిర్వహించగల ‘రాపిడ్ అనలిటికల్ ఫుడ్ టెస్టింగ్’ (ఆర్ఏఎఫ్‌టీ) కిట్‌లు.

క్షేత్ర స్థాయిలో ఎలాంటి అత్యాధునిక పరికరాలు లేదా సంప్రదాయ రియాజెంట్లు అవసరం లేకుండా పరీక్షలు నిర్వహించే ఆర్ఏఎఫ్‌టీ కిట్‌లు.. ఇప్పటివరకు 88 కిట్‌లకు లభించిన ఆమోదం

प्रविष्टि तिथि: 31 JUL 2026 2:32PM by PIB Hyderabad

మానవ వినియోగానికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉండేలా చూసేందుకు, ఆహార పదార్థాల విషయంలో శాస్త్రీయ ఆధారిత ప్రమాణాలను నిర్దేశించడానికి.. వాటి తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకం, దిగుమతులను నియంత్రించడానికి భారత ఆహార భద్రతా, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) బాధ్యత వహిస్తుంది. ఆహార భద్రతా, ప్రమాణాల (ఎఫ్ఎస్ఎస్) చట్టం- 2006 అమలు చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత.

పరీక్షల ద్వారా ఆహారం, ఆహార ఉత్పత్తుల భద్రతను నిర్ధారించడానికి, ఆహార నమూనాల విశ్లేషణ కోసం ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్) ద్వారా గుర్తింపు పొందిన 259 ప్రయోగశాలలను, అప్పీల్ నమూనాల విశ్లేషణ కోసం 24 రిఫరల్ ఫుడ్ లేబొరేటరీలను ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటిఫై చేసింది.

దేశంలో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీ (ఎంఎఫ్‌టీఎల్) సదుపాయంతో కూడిన ఆహార పరీక్షా వ్యవస్థను బలోపేతం చేసే పథకం (సాఫ్టెల్).. రాష్ట్ర ఆహార ప్రయోగశాలలను ఆధునికీకరించడానికి, మైక్రోబయాలజీ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి, మొబైల్ ఆహార పరీక్ష వ్యాన్‌లను మోహరించడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ అమలు చేస్తోన్న ఒక కార్యక్రమం. ఈ పథకం కింద రసాయన, భార లోహాలు, జీవసంబంధమైన కలుషితాలను గుర్తించడం కోసం 47 రాష్ట్ర ఆహార పరీక్షా ప్రయోగశాలలను అత్యాధునిక విశ్లేషణ పరికరాలతో వ్యవస్థీకృతంగా ఆధునికీకరించారు.. 34 ప్రత్యేక మైక్రోబయాలజీ ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. ఎంఎఫ్‌టీఎల్ లేదా ఎఫ్ఎస్‌డబ్ల్యూ (ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్) అనేది ముఖ్యంగా గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లో ఆహార పరీక్షలు, శిక్షణ, అవగాహన కార్యక్రమాలను అత్యంత అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 305 ఎఫ్ఎస్‌డబ్ల్యూలు అందుబాటులో ఉన్నాయి.

పాలు, సుగంధ ద్రవ్యాలు, నూనెలు, ధాన్యాల వంటి ఏడు వేర్వేరు ఆహార పదార్థాలలో సాధారణ కల్తీలను గుర్తించడానికి సులభమైన, వేగవంతమైన పరీక్ష పద్ధతులను కలిగి ఉండే చిన్న, సులభతరంగా ఉపయోగించేందుకు అనువుగా ఉండే కిట్ ‘మ్యాజిక్ బాక్స్’. 

పాలు, పాల ఉత్పత్తులు, నూనెలు-  కొవ్వులు, పంచదార- మిఠాయిలు, ఆహార ధాన్యాలు- వాటి ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు వంటి వివిధ ఆహార పదార్థాల కోసం నీరు, టింక్చర్ ఆఫ్ అయోడిన్ వంటి సాధారణ ద్రావణాల సహాయంతో గృహ స్థాయిలో సులభంగా నిర్వహించగల 44 పరీక్షలను ‘డీఏఆర్‌టీ (డిటెక్ట్ అడల్ట్రేషన్ విత్ రాపిడ్ టెస్ట్) పుస్తకం’ వివరిస్తుంది. ఈ పరీక్షల్లో ఆహార ఉత్పత్తుల ప్రామాణికతను నిర్ధారించడానికి ఇంద్రియ మూల్యాంకన (సెన్సరీ ఎవల్యూయేషన్) పరీక్షలు కూడా ఉంటాయి. చిత్రాల ద్వారా స్వచ్ఛమైన, కల్తీ చేసిన ఆహార ఉత్పత్తి మధ్య తేడాలను డీఏఆర్‌టీ పుస్తకం తెలియజేస్తుంది. 

ర్యాపిడ్ (రాపిడ్ అనలిటికల్ ఫుడ్ టెస్టింగ్) కిట్‌లు అధునాతనమైనవే కాకుండా వీటిని ఉపయోగించటం, తరలించటం సులభం. వీటిని చేతితోనే వాడొచ్చు. పరీక్షలు నిర్వహించడానికి వీటికి ఎలాంటి అత్యాధునిక పరికరాలు లేదా సంప్రదాయ రియాజెంట్లు అవసరం లేదు. ఇప్పటివరకు 88 ఆర్ఏఎఫ్‌టీ కిట్‌లకు ఆమోదం లభించింది. ఈ కిట్‌లు క్షేత్ర స్థాయిలో ఆహార ఉత్పత్తులను పరీక్షించే సమయాన్ని తగ్గించడానికి, తద్వారా నిఘా, పర్యవేక్షణ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి సహాయపడతాయి.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి శ్రీ ప్రతాప్‌రావు జాధవ్ లోక్‌సభలో ఒక రాతపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని ఇచ్చారు. 

 

***


(रिलीज़ आईडी: 2292869) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Tamil