జౌళి మంత్రిత్వ శాఖ
ఆగస్టు 3న ఐఐటీ ఢిల్లీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించనున్న కేంద్రమంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్
పరిశోధన, ఆవిష్కరణలు, డిజిటల్ సాంకేతికతల ద్వారా భారతదేశ చేనేత రంగాన్ని బలోపేతం చేయటానికి... పోటీతత్వాన్ని, స్థిరత్వాన్ని, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పెంపొందించేందుకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
प्रविष्टि तिथि:
30 JUL 2026 3:36PM by PIB Hyderabad
సాంకేతికంగా మెరుగైన చేేనేత వ్యవస్థను ఏర్పరిచే దిశగా ఆగస్టు 3, 2026న ఐఐటీ ఢిల్లీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (సీఓఈ-హెచ్‌టీ)ని కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ప్రారంభిస్తారు. కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి శ్రీ పబిత్ర మార్గరిటా, జౌళి శాఖ కార్యదర్శి శ్రీమతి నీలం షామీ రావు, అభివృద్ధి కమిషనర్ (చేనేత) డాక్టర్ ఎం. బీనాతో పాటు జౌళి మంత్రిత్వ శాఖ, ఐఐటీ ఢిల్లీ ఉన్నతాధికారులు ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొంటారు.
భారత ప్రభుత్వం రూ.11.99 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్.. భారతదేశ సుసంపన్న చేనేత వారసత్వాన్ని అత్యాధునిక పరిశోధనలు, ఆవిష్కరణలు, డిజిటల్ సాంకేతికతతో అనుసంధానించటం ద్వారా పోటీతత్వాన్ని, స్థిరత్వాన్ని, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విద్యా సంస్థలు, పరిశ్రమలు, డిజైనర్లు, సాంకేతిక నిపుణులు, అంకుర సంస్థలు, చేనేత సంస్థలను ఒకచోట చేర్చి, ఈ రంగానికి మెరుగైన పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు జాతీయ విజ్ఞాన, ఆవిష్కరణ కేంద్రంగా పనిచేస్తుంది. మగ్గాల ఆధునీకరణ, ఎర్గోనామిక్స్, కృత్రిమ మేధ, సుస్థిరత, క్రియాత్మక ఆవిష్కరణలు, డిజిటల్ విజ్ఞాన వ్యవస్థలు, వ్యవస్థాపకతపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
రాబోయే ఐదేళ్లలో చేనేత పరిజ్ఞానానికి సంబంధించిన జాతీయ డిజిటల్ రిపోజిటరీని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఏఐ ఆధారిత పరికరాలను రూపొందించటం, మెరుగైన మగ్గాల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటం, పేటెంట్లు, పరిశోధనలకు మద్దతివ్వటం, అంకుర సంస్థలను ప్రోత్సహించటం, దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు, అధ్యాపకులు, చేనేత నిపుణులకు ఇది శిక్షణనిస్తుంది.
భారతదేశ సుసంపన్నమైన నేత సంప్రదాయాలను పరిరక్షిస్తూనే.. చేనేత రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభం కీలకంగా నిలుస్తుంది. పరిశోధన, ఆవిష్కరణ, వ్యవస్థాపకతను ప్రోత్సహించటం ద్వారా ఈ కేంద్రం నేత కార్మికులకు సాధికారత కల్పించి, ఉత్పాదకతను పెంచి, సుస్థిర పద్ధతులను ప్రోత్సహించి, దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న నూతన అవకాశాలకు భారతీయ చేనేతను సన్నద్ధం చేసే పటిష్టమైన వ్యవస్థను సృష్టిస్తుందని ఆశిస్తున్నారు.
భారతదేశ చేనేత రంగం 35 లక్షలకు పైగా నేత కార్మికులకు, అనుబంధ కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. వీరిలో దాదాపు 70 శాతం మంది మహిళా శ్రామికులున్నారు. శతాబ్దాల నాటి నేత సంప్రదాయాలను పరిరక్షిస్తూనే.. ఉత్పాదకత, సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణ, ట్రేసబిలిటీ, ప్రామాణికత, సుస్థిరత, మార్కెట్ పోటీతత్వానికి సంబంధించిన సవాళ్లను ఈ రంగం ఎదుర్కొంటోంది. పరిశోధన, ఆవిష్కరణ, సామర్థ్య నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా సవాళ్లను పరిష్కరించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
సంప్రదాయాన్ని సాంకేతికతతో జోడించాలన్న కేంద్రం దృక్పథాన్ని ప్రతిబింబించేలా ఐదు కీలక కార్యక్రమాల ఆవిష్కరణ ఈ ఆరంభ వేడుకలో జరగనుంది.
-
హ్యాండ్లూమ్ 4.0 - ప్రతి మగ్గానికి ఒక డిజిటల్ సహచరుడిగా నిలుస్తూ.. నేత కార్మికులకు ఉత్పాదకత, సుస్థిరతను అంచనా వేయటానికి సహాయపడుతుంది. అలాగే సహకార సంఘాలు, ప్రభుత్వ సంస్థలకు సకాలంలో చివరి దశ వరకూ సహాయాన్ని అందించటంలో సహాయపడుతుంది.
-
హ్యాండ్లూమ్ ఇ-విద్యా- చేనేత వ్యవస్థలోని నేత కార్మికులు, విద్యార్థులు, ఇతర కీలక భాగస్వాములకు ఆచరణాత్మక, ఎంపిక చేసిన పరిష్కారాలను అందించే.. సమస్యలతో అనుసంధానించిన డిజిటల్ లెర్నింగ్, విజ్ఞాన కేంద్రం.
-
హ్యాండ్లూమ్ ఎక్స్ - చేనేత విలువ వ్యవస్థ వ్యాప్తంగా అంకుర సంస్థలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు యాక్సిలరేటర్, ఇంక్యుబేషన్ వేదిక.
-
కళాగృహ హ్యాండ్లూమ్ స్టూడియో (జెన్‌జెడ్ డిజైన్ స్టూడియో)- డిజిటల్ విజువలైజేషన్, కస్టమైజేషన్, ఉత్పత్తి ప్రామాణీకరణ ద్వారా చేనేతను తదుపరి తరం వినియోగదారులతో అనుసంధానించటమే దీని లక్ష్యం.
-
థ్రెడ్స్ ఆఫ్ వాలర్ - రీసైకిల్ చేసిన రక్షణ రంగానికి చెందిన వస్త్రాలను ప్రీమియం చేనేత ఉత్పత్తులుగా మారుస్తూ, వనరుల పునర్వినియోగాన్ని ప్రోత్సహించే కార్యక్రమం.
***
(रिलीज़ आईडी: 2291970)
आगंतुक पटल : 7