ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
నీట్ యూజీ కౌన్సెలింగ్-2026 కోసం సన్నద్ధతను సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా
అవాంతరాలు లేని, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ సంసిద్ధతపై సమీక్ష
విద్యార్థులకు అనుకూలంగా ప్రవేశపెట్టిన కౌన్సెలింగ్ సంస్కరణలు
ఒకేసారి భౌతిక హాజరు, ఆన్‌లైన్ ద్వారా ధ్రువపత్రాల పరిశీలన, దివ్యాంగుల కోసం మెరుగైన సౌకర్యాలు
అభ్యర్థుల ఆందోళనలను పరిష్కరించడానికి అవసరమైన ముందస్తు చర్యలన్నీ చేపట్టాలని కేంద్ర మంత్రి ఆదేశం
प्रविष्टि तिथि:
29 JUL 2026 6:52PM by PIB Hyderabad
నీట్ యూజీ కౌన్సెలింగ్-2026 సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఈ రోజు సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల ప్రవేశ ప్రక్రియను పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా, సాంకేతికతతో అనుసంధానించి... ప్రక్రియ అంతా విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) పరిధిలో గల ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ), ఇతర సీట్ల కౌన్సెలింగ్ కోసం సన్నద్ధతను ఈ సమీక్ష అంచనా వేసింది.
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ, ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ సహా కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనే ఇతర భాగస్వాముల సంసిద్ధతను సమీక్ష సందర్భంగా కేంద్ర మంత్రి అంచనా వేశారు. కౌన్సెలింగ్ షెడ్యూల్, ఐటీ మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీ సంసిద్ధత, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలు, అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించే చర్యలు, పాల్గొంటున్న సంస్థలతో సమన్వయాన్ని కేంద్ర మంత్రి సమీక్షించారు.
విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కౌన్సెలింగ్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రతిభ ఆధారంగా నిర్వహించాలని శ్రీ నడ్డా స్పష్టం చేశారు. ప్రవేశ ప్రక్రియ అంతటా పటిష్ఠమైన సాంకేతిక మద్దతును కొనసాగించాలని, ఫిర్యాదుల సత్వర పరిష్కారాన్ని నిర్ధారించాలని, కౌన్సెలింగ్ పోర్టల్ సజావుగా పనిచేసేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. అభ్యర్థుల ఆందోళనలను పరిష్కరించడానికి అవసరమైన ముందస్తు చర్యలన్నీ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
పారదర్శకతను పెంచడం, మరింత మెరుగ్గా అందుబాటులో ఉంచడం, ప్రవేశ ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా నీట్ యూజీ కౌన్సెలింగ్-2026లో అనేక ప్రధాన సాంకేతిక ఆధారిత, విద్యార్థి-కేంద్రిత సంస్కరణలు ప్రవేశపెడుతున్నట్లు అధికారులు కేంద్ర మంత్రికి తెలిపారు.
ఈ కీలక సంస్కరణల్లో ఒకటి... ఒకేసారి భౌతికంగా రిపోర్ట్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టడం. దీనివల్ల అభ్యర్థులు పదేపదే సంస్థలను సందర్శించాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుంది. సీట్ల కేటాయింపు తర్వాత, అభ్యర్థులు ఫ్రీజ్ లేదా ఫ్లోట్ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఆన్‌లైన్‌లో తమ సుముఖతను వ్యక్తపరచవచ్చు.
ఫ్రీజ్ ఆప్షన్‌ను ఎంచుకున్న అభ్యర్థులు... అసలు ధ్రువపత్రాల పరిశీలన, ప్రవేశ రుసుము చెల్లింపు సహా ప్రవేశ సంబంధిత లాంఛనాలను పూర్తి చేయడం కోసం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం తమకు కేటాయించిన సంస్థకు స్వయంగా హాజరు కావాలి.
అప్‌గ్రేడేషన్ కోసం తదుపరి రౌండ్‌లలో పాల్గొనడానికి ఫ్లోట్ ఆప్షన్‌ను ఎంచుకున్న అభ్యర్థులు... నిర్దేశించిన కాలపరిమితిలోగా ధ్రువపత్రాల పరిశీలన సహా ప్రవేశ సంబంధిత లాంఛనాలను ఆన్‌లైన్ విధానం ద్వారా పూర్తి చేసుకోవచ్చు. ఈ కాలంలో, వారు కేటాయించిన సంస్థకు భౌతికంగా హాజరు కావడం, అసలు ధ్రువపత్రాలను సమర్పించడం లేదా ప్రవేశ రుసుము చెల్లించడం వంటివి చేయాల్సిన అవసరం లేదు. తదుపరి కౌన్సెలింగ్ రౌండ్‌లలో పాల్గొనేటప్పుడు వారి తాత్కాలిక ప్రవేశం చెల్లుబాటులో ఉంటుంది.
మూడో రౌండ్ కౌన్సెలింగ్ వరకు అప్‌గ్రేడేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మూడో రౌండ్ పూర్తయిన తర్వాత, సీట్లు పొందిన అభ్యర్థులు అసలు ధ్రువపత్రాల పరిశీలన, ప్రవేశ రుసుము చెల్లింపు, సంస్థాగత లాంఛనాలను పూర్తి చేయడం కోసం వారు సీటు పొందిన సంస్థలకు స్వయంగా హాజరు కావాలి.
ఒకేసారి భౌతికంగా హాజరుకావడం, అసలు ధ్రువపత్రాలను ఒకేసారి పరిశీలించడం, ప్రవేశ రుసుమును ఒకేసారి చెల్లించడం వంటి వాటిని ఈ సవరించిన విధానం నిర్ధారిస్తుంది. తద్వారా అనవసర ప్రయాణాలను తగ్గించి, ప్రవేశ ప్రక్రియలను సులభతరం చేసి, విద్యార్థులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.
ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన మరో ముఖ్యమైన సంస్కరణ ఆన్‌లైన్ రాజీనామా సౌకర్యం. వర్తించే కౌన్సెలింగ్ నియమాలు, కాలపరిమితుల ప్రకారం అనుమతించిన చోట... ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో వేరే విధంగా పేర్కొనకపోతే లేదా ఎంసీసీ ద్వారా ప్రత్యేకంగా నోటిఫై చేయకపోతే... తమకు కేటాయించిన సీటుకు రాజీనామా చేయాలనుకునే అభ్యర్థులు తమకు కేటాయించిన సంస్థను భౌతికంగా సందర్శించే అవసరం లేకుండానే ఇప్పుడు ఎంసీసీ కౌన్సెలింగ్ పోర్టల్ ద్వారా తమ రాజీనామాను సమర్పించవచ్చు.
పారదర్శకతను, కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం కోసం... ముందుగా పూరించి ఉన్న అభ్యర్థి డేటాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నుంచి స్వీకరించడం, ఆన్‌లైన్ ద్వారా ధ్రువపత్రాల పరిశీలన, నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా సీట్ మ్యాట్రిక్స్ ధ్రువీకరణ, పాల్గొనే సంస్థల ద్వారా ధ్రువీకరణ వంటి అనేక చర్యలనూ ఈ సమీక్షలో ప్రధానంగా ప్రస్తావించారు.
ప్రామాణిక వైకల్యం కలిగిన దివ్యాంగుల కోసం అనుకూలమైన సౌకర్యాలను కల్పించడంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించారు. మరింత మెరుగ్గా అందుబాటులో ఉండడం, మూల్యాంకనంలో పారదర్శకత, ఏకరూపతను సులభతరం చేయడం కోసం దేశవ్యాప్తంగా నిర్దేశిత మూల్యాంకన కేంద్రాల సంఖ్యను 16 నుంచి 61కి విస్తరించారు.
27 జూలై 2026 నాటి జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా, నియమిత వైద్య బోర్డులు జారీ చేసే ధృవపత్రాన్ని ఇకపై "అర్హత ధ్రువపత్రం" అని పిలుస్తారు. క్రియాత్మక మూల్యాంకనం ఆధారంగా ఎంబీబీస్ కోర్సులో ప్రవేశానికి అభ్యర్థి అర్హతను నిర్ధారించడమే దీని ఉద్దేశం. ఈ సవరించిన మార్గదర్శకాలు సమాన అవకాశాలు, విద్యా ప్రమాణాలు, వృత్తిపరమైన సామర్థ్యం, రోగి భద్రతను నిర్ధారిస్తూనే... మానసిక వైకల్యం ఉన్న అభ్యర్థుల మూల్యాంకనం కోసం పారదర్శకమైన, ఏకరీతి, సాక్ష్యాధారిత, సామర్థ్య-ఆధారిత విధానాన్ని రూపొందిస్తాయి.
అప్పీలేట్ డిసేబిలిటీ అసెస్‌మెంట్ బోర్డు ఏర్పాటుకూ ఈ కొత్త మార్గదర్శకాలు వీలు కల్పిస్తాయి. దీని ద్వారా అర్హులైన అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లోని నిబంధనలకు అనుగుణంగా ప్రాథమిక డిసేబిలిటీ అసెస్‌మెంట్ బోర్డు మూల్యాంకనంపై అప్పీల్ చేసుకోవచ్చు.
ఎన్నారై కేటగిరీ కింద ప్రవేశ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయడం మరో ముఖ్యమైన సంస్కరణ. ఎన్నారై అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ఇప్పుడు నిర్దేశించిన అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తిగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ పోర్టల్ ద్వారానే జరుగుతుంది. ఇంతకుముందు ఈమెయిల్ ద్వారా పత్రాలను సమర్పించే పద్ధతికి బదులుగా, అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. అప్‌లోడ్ చేసిన పత్రాలను దీని కోసం నియమించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలిస్తారు. తద్వారా పారదర్శకమైన, సమర్థమైన, కాలపరిమితితో కూడిన ధ్రువీకరణ ప్రక్రియను నిర్ధారిస్తారు. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్-1890 నిబంధనల ప్రకారం స్పాన్సర్ ఆ అభ్యర్థికి నిజమైన చట్టబద్ధత గల సంరక్షకుడని నిరూపిస్తూ... ఎన్నారై కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియ సమయంలో సాక్ష్యాధారాలు, సంబంధిత చట్టపరమైన పత్రాలను సమర్పించవలసి ఉంటుందని 2026 మే 27న జారీ చేసిన తన పబ్లిక్ నోటీసు ద్వారా ఎంసీసీ ఇప్పటికే తెలియజేసింది.
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సమన్వయంతో సైబర్ సెక్యూరిటీ సన్నద్ధతను సమగ్రంగా సమీక్షించినట్లు అధికారులు శ్రీ నడ్డాకు తెలియజేశారు. దేశవ్యాప్తంగా కౌన్సెలింగ్ ప్రక్రియ ఏకరీతిగా అమలు జరిగేలా చూసేందుకు, డిసేబిలిటీ అసెస్మెంట్ బోర్డులు, కళాశాల నోడల్ అధికారులు, ధ్రువపత్రాల పరిశీలన అధికారుల కోసం శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు.
అభ్యర్థులకు మద్దతును బలోపేతం చేయడానికి, 24×7 టోల్-ఫ్రీ కాల్ సెంటర్ (1800-102-7637) ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియ అంతటా అభ్యర్థులకు సహాయపడటానికి వీలుగా ద్విభాషా సమాచార సామగ్రి, తరచుగా అడిగే ప్రశ్నలు, మార్గదర్శక వీడియోలనూ వివిధ వేదికల ద్వారా అందుబాటులో ఉంచుతున్నారు. అభ్యర్థుల సందేహాలను త్వరితగతిన పరిష్కరించడానికి, ఈమెయిల్ ఆధారిత ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్నీ (mcc2026[at]gov[dot]in) ఏర్పాటు చేశారు.
జాతీయ పరీక్షల ఏజెన్సీ 16 జూలై 2026న నీట్ (యూజీ)-2026 పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్‌లోని ఆల్ ఇండియా కోటా సీట్ల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.
సీటును అంగీకరించడం, అప్‌గ్రేడేషన్, రాజీనామా లేదా వైకల్యాన్ని పరీక్షించడానికి సంబంధించిన ఎంపికలను వినియోగించుకునే ముందు... అభ్యర్థులు సమాచార బుల్లెటిన్, కౌన్సెలింగ్ స్కీమ్, వర్తించే నియమాలనూ జాగ్రత్తగా చదవాలని సూచించడమైనది. వారు ప్రవేశ ప్రక్రియ అంతటా అధికారిక ఎంసీసీ కౌన్సెలింగ్ పోర్టల్‌ను క్రమం తప్పకుండా సందర్శించాలనీ, తెలియజేసిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాలనీ సూచించడమైనది.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలీల శ్రీవాస్తవ, వైద్య విద్య అదనపు కార్యదర్శి శ్రీమతి వినోద్ కోత్వాల్, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ లవనీష్ జి కృష్ణ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రియాంక్ భారతి, ఇతర సీనియర్ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2291510)
आगंतुक पटल : 6