ఔషధాల విభాగం
‘ఇండియా మెడికల్ డివైస్-2026’ నిర్వహణకు సన్నాహాలు
న్యూఢిల్లీలో 9వ దఫాగా నిర్వహించే రెండు రోజుల ప్రతిష్టాత్మక సదస్సుకు ఆగస్టు 7న శ్రీకారం... 8 నాటి కార్యక్రమంలో మంత్రి జె.పి.నడ్డా ప్రసంగం
వికసిత భారత్ దృక్కోణానికి తగినట్లు ప్రపంచ పోటీతత్వ వైద్య పరికరాల తయారీ వ్యవస్థపై విధాన రూపకర్తలు... నియంత్రణాధికారులు.. ‘సీఈఓ’లు... మెడ్‌టెక్ అగ్రగాముల మధ్య చర్చ
प्रविष्टि तिथि:
29 JUL 2026 5:18PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ‘ఇండియా మెడికల్ డివైస్-2026’ 9వ దఫా సదస్సు ఆగస్టు 7న ప్రారంభమవుతుంది. “విశిష్ట భారత్ దిశగా: నాణ్యమైన వైద్య పరికరాల అంతర్జాతీయ కూడలిగా భారత్ రూపకల్పన” ఇతివృత్తంగా ఈ రెండు రోజుల సదస్సును కేంద్ర ఎరువులు-రసాయనాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఔషధ విభాగం నిర్వహిస్తుంది. భారత వాణిజ్య-పారిశ్రామిక సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐసీసీఐ-ఫిక్కీ) సహకారంతో ఔషధ విభాగం ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న వైద్య పరికరాలు-మెడ్‌టెక్ రంగం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ఇందులో ప్రధానంగా చర్చిస్తారు. ఈ మేరకు విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు, పరిశ్రమ అగ్రగాములు, ప్రపంచ భాగస్వాములు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, విద్యావేత్తలు, ఆవిష్కర్తలు తదితరలందర్నీ ఈ వేదిక ఏకం చేస్తుంది.
ఈ సదస్సు రెండో రోజు (ఆగస్టు 8)న “స్వయంసమృద్ధ మెడ్‌టెక్: విశిష్ట భారత్ వైపు వేగంగా దేశ ప్రస్థానం” అంశంపై కేంద్ర రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ప్రసంగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల, ఆవిష్కరణాత్మక వైద్య పరికరాల తయారీ వ్యవస్థకు రూపకల్పనపై ప్రభుత్వ దృక్కోణాన్ని ఆయన వివరిస్తారు. అలాగే, ఆ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ కూడా ప్రసంగిస్తారు. ఔషధ విభాగం కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్యసలిల శ్రీవాస్తవ, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ ఎం.శ్రీనివాస్ సహా సీనియర్ అధికారులు, విధాన రూపకర్తలు, ప్రముఖ వైద్య పరికరాల కంపెనీల ‘సీఈఓ’లు, పరిశ్రమ నిపుణులు, అంకుర-ఆరోగ్య సంరక్షణ-విద్యా సంస్థల ప్రతినిధులు కూడా ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొంటారు.
వైద్య పరికరాల రంగం భవితను తీర్చదిద్దే అంశాలపై ‘ఇండియా మెడికల్ డివైస్-2026’ సదస్సు ఉన్నత స్థాయిలో చర్చిస్తుంది. ఇందులో భాగంగా పరికరాలు-విడిభాగాల తయారీ స్థానికీకరణ, పరీక్ష మౌలిక సదుపాయాలు, నాణ్యతా హామీ బలోపేతంపై దృష్టి సారిస్తారు. అంతేకాకుండా అధిక ప్రభావశీల, అధిక పరిమాణ ఉత్పాదిత పరికరాల రీత్యా సాంకేతిక అగ్రస్థానం సముపార్జన, కృత్రిమ మేధ, వైద్య ఉపకరణంగా సాఫ్ట్‌వేర్ సద్వినియోగం క్లినికల్ ఆధారాల సమీకరణ, నియంత్రణ మార్గాల మెరుగుదల, భారత వైద్య పరికరాల ఎగుమతి విస్తరణపైనా చర్చిస్తారు. అలాగే, సేవలు-నిర్వహణ వ్యవస్థల బలోపేతం, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణకు మద్దతుగా వినూత్న చికిత్సలపై వ్యయం వాపసు చట్రాల రూపకల్పనపైనా చర్చలు కేంద్రీకృతమవుతాయి.
భారత వైద్య పరికరాల పరిశ్రమ విలువ ప్రస్తుతం 15 బిలియన్ డాలర్లకు పైగా నమోదవుతోంది. అందువల్ల ఆరోగ్య సంరక్షణ రంగంలో శరవేగంగా పురోగమించే విభాగాలలో ఒకటిగా ఇది ఆవిర్భవించింది. జాతీయ వైద్య పరికరాల విధానం-2023, ఉత్పత్తి సంధానిత ప్రోత్సాహక పథకం, వైద్య పరికరాల పార్కుల అభివృద్ధి, నియంత్రణ చట్రాల బలోపేతం, పరిశోధన-ఆవిష్కరణలు, నాణ్యమైన తయారీపై నిరంతర దృష్టి తదితర పరివర్తనాత్మక, విధానపరమైన కార్యక్రమాలు ఈ పరిశ్రమ వృద్ధికి తోడ్పడుతున్నాయి.
వైద్య పరికరాల విలువ వ్యవస్థ అంతటా అర్థవంతమైన చర్చలు, భాగస్వామ్యాలకు ప్రోత్సాహం ద్వారా ప్రపంచ మెడ్‌టెక్ కూడలిగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడమే ‘ఇండియా మెడికల్ డివైస్-2026’ లక్ష్యం. దేశీయ వైద్య పరికరాల తయారీ వ్యవస్థ వృద్ధిని వేగిరపరచే ఆధునిక సాంకేతికతలు, అంకుర ఆవిష్కరణలను ప్రదర్శించడం సహా పెట్టుబడులు, సాంకేతిక సహకారం, ఆవిష్కరణలు, ప్రపంచ ఉత్తమ పద్ధతుల అనుసరణను ప్రోత్సహించడం కూడా ఈ సదస్సు ధ్యేయం.
వికసిత భారత్-2047 దార్శనికతకు అనుగుణంగా ఆవిష్కరణాధారిత, స్వయంసమృద్ధ, అంతర్జాతీయ పోటీతత్వంతో కూడిన వైద్య పరికరాల రంగానికి రూపమివ్వడంపై భారత్ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, ఈ సదస్సులో ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ భాగస్వాములు పాల్గొంటున్నారు.
***
(रिलीज़ आईडी: 2291501)
आगंतुक पटल : 11