నౌకారవాణా మంత్రిత్వ శాఖ
సముద్రయాన సిబ్బందిని అందించడంలో... ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా అవతరించిన భారత్
2015లో ఐదో స్థానంలో ఉన్న భారత్... 2026 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నావికుల వనరుగా ఎదగడం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వ ఫలితమే: శ్రీ సర్బానంద సోనోవాల్
ప్రపంచ నౌకా వాణిజ్య సిబ్బందిలో ప్రస్తుత భారత్ వాటా 12.16 శాతం
ప్రపంచవ్యాప్తంగా నౌకా వాణిజ్య అధికారుల్లో భారతీయ అధికారుల వాటా 13.41 శాతం
ఇది ప్రపంచ నౌకా వాణిజ్య రంగంలో నైపుణ్య కేంద్రంగా భారత్ స్థానాన్ని మరింత బలపరుస్తోంది
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఐదుగురు నావికుల్లో ఒక భారతీయుడు ఉండేలా చూడటమే 'మిషన్ 20 శాతం' లక్ష్యం
प्रविष्टि तिथि:
28 JUL 2026 6:42PM by PIB Hyderabad
బీఐఎమ్‌సీవో-ఐసీఎస్ నావికా సిబ్బంది నివేదిక-2026 ప్రకారం, ప్రపంచ నౌకాయాన రంగానికి 3,11,936 మంది సముద్రయాన నిపుణులను అందించడం ద్వారా నౌకా వాణిజ్య సిబ్బందిని సరఫరా చేసే దేశాల్లో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా అవతరించింది. ప్రపంచవ్యాప్త సముద్రయాన సిబ్బందిలో భారత్ వాటా ప్రస్తుతం 12.16 శాతంగా ఉందని ఈ నివేదిక అంచనా వేస్తోంది. ఈ విషయంలో ఫిలిప్పీన్స్ మాత్రమే భారత్ కంటే ముందుండగా... చైనా, రష్యా, ఇండోనేషియా దేశాలు భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఈ విజయం భారత సముద్రయాన రంగ చరిత్రలో అత్యంత విశేషమైన పరిణామాల్లో ఒకటిగా నిలిచింది. 2015లో, ప్రపంచవ్యాప్త నావికుల్లో భారత్ వాటా కేవలం 5.2 శాతంగా ఉండేది. చైనా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, రష్యా దేశాల తర్వాత భారత్ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉండేది. ఆరు సంవత్సరాల తర్వాత అంటే 2021 నాటికి, ఈ వాటా స్వల్పంగా పెరిగి 6 శాతానికి చేరింది. అయినప్పటికీ, భారత్ ఐదో స్థానంలోనే కొనసాగింది. 2026కు సంబంధించిన తాజా బీఐఎమ్‌సీవో-ఐసీఎస్ నివేదిక ఒక కీలక పురోగతిని వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్త నావికుల సంఖ్యలో భారత్ వాటా రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి 12.16 శాతానికి చేరింది. దీనివల్ల భారత్ ప్రపంచంలోనే రెండో స్థానానికి ఎగబాకడమే కాకుండా, నైపుణ్యం కలిగిన నౌకా వాణిజ్య రంగ నిపుణులను అందించే అగ్రగామి దేశాల్లో ఒకటిగా తన స్థానాన్ని భారత్ సుస్థిరం చేసుకుంది.
భారత్ బలం ముఖ్యంగా అధికారుల విభాగంలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధికారుల సంఖ్యలో 13.41 శాతం వాటాతో భారత్ 1,40,718 మంది అధికారులను సమకూరుస్తోంది. వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్న 'రేటింగ్స్' (సిబ్బంది) విభాగంలో 1,71,218 మంది భారతీయ సిబ్బందితో ప్రపంచవ్యాప్త రేటింగ్స్ సిబ్బందిలో 11.29 శాతం వాటాను భారత్ కలిగి ఉంది. మొత్తంగా చూస్తే, ప్రపంచ వాణిజ్యానికి తోడ్పడుతున్న అత్యంత పెద్ద, అత్యంత నైపుణ్యం కలిగిన సముద్రయాన సిబ్బందిలో భారతీయ నావికులూ ఉన్నారు.
ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన సిబ్బంది సరఫరా 2.57 మిలియన్లుగా ఉండగా, డిమాండ్ 2.55 మిలియన్లకు చేరుకుంది. ఇది ప్రపంచ కార్మిక మార్కెట్‌లో పెరుగుతున్న తీవ్ర కొరతను స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అర్హత కలిగిన అధికారుల కొరత కొనసాగుతోందనీ ఇది సూచిస్తోంది. నౌకాయాన రంగంలో భవిష్యత్ మానవ వనరుల అవసరాలను తీర్చడంలో భారత్ ఒక కీలక భాగస్వామిగా నిలుస్తోంది.
ప్రపంచ నౌకా వాణిజ్య రంగ మానవ వనరుల కేంద్రంగా భారత్ ఆవిర్భవించడం... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దశాబ్దానికి పైగా కొనసాగిన నిరంతర సంస్కరణల ఫలితమే. గత పన్నెండేళ్లుగా, ప్రభుత్వం నౌకా వాణిజ్య రంగ విద్య, నైపుణ్యాభివృద్ధిని విస్తరించింది. శిక్షణా మౌలిక సదుపాయాలను ఆధునికీకరించింది. నౌకా వాణిజ్య సంబంధిత శిక్షణా సంస్థల సామర్థ్యాన్నీ పెంచింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ద్వారా నావికుల ధ్రువీకరణ, నియంత్రణ సేవలను డిజిటలైజ్ చేసింది. అంతర్జాతీయ శిక్షణ, ధ్రువీకరణ, వాచ్-కీపింగ్ ప్రమాణాల (ఎస్‌టీసీడబ్ల్యూ) అనుగుణ్యతను బలోపేతం చేసింది. భారతీయ నావికుల ఉపాధి అవకాశాలను, ప్రపంచ స్థాయి సామర్థ్యాన్ని మెరుగుపరిచింది.
2021లో నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్... దశాబ్దాల భారత్ నౌకా వాణిజ్య సంబంధిత చట్టపరమైన విధాన ప్రణాళికలో అత్యంత సమగ్రమైన సంస్కరణల ద్వారా సంస్కరణల అజెండాను వేగవంతం చేశారు. 2021 అంతర్గత నౌకల చట్టంతో ప్రారంభించి, ప్రభుత్వం తదనంతరం ప్రవేశపెట్టిన వాణిజ్య నౌకాయాన చట్టం-2025, భారత నౌకాశ్రయాల చట్టం-2025, తీరప్రాంత నౌకాయాన చట్టం-2025, బిల్స్ ఆఫ్ లేడింగ్ చట్టం-2025, సముద్ర మార్గం ద్వారా సరుకుల రవాణా చట్టం-2025లను అమలులోకి తెచ్చింది. సమష్టిగా, ఈ చరిత్రాత్మక చట్టాలు నౌకా వాణిజ్య కార్యకలాపాల నిర్వహణను ఆధునికీకరించాయి. నావికుల సంక్షేమాన్నీ బలోపేతం చేశాయి. భారత నౌకాయాన చట్టాలను అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా మార్చాయి. నియంత్రణ ప్రక్రియలను సరళీకృతం చేశాయి. నౌకా వాణిజ్య రంగం అంతటా వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరిచాయి.
ఈ నివేదికను స్వాగతిస్తూ కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఇలా అన్నారు... “2015లో ప్రపంచ కార్మిక శక్తిలో కేవలం 5.2 శాతం వాటాతో ఐదో అతిపెద్ద నౌకా వాణిజ్య రంగ కార్మికుల సరఫరాదారుగా ఉన్న భారత్... 2026 నాటికి 12.16 శాతం వాటాతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సముద్రయాన మానవ వనరుల దేశంగా ఎదగడం మన ప్రభుత్వ దార్శనికత, సంకల్పం, పరివర్తనాత్మక నాయకత్వానికి నిదర్శనం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చైతన్యవంతమైన నాయకత్వంలోనే ఈ అద్భుత పురోగతి సాధ్యమైంది. ఆయనకున్న అచంచలమైన నిబద్ధత కారణంగా గత పన్నెండేళ్లుగా భారత నౌకా వాణిజ్య రంగ వ్యవస్థను మౌలికంగా పునర్నిర్మించింది. ప్రపంచ స్థాయి నౌకా వాణిజ్య విద్య, ఆధునిక శిక్షణా మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టడం నుంచి నౌకా వాణిజ్య రంగ సేవలను డిజిటలైజ్ చేయడం, నౌకా వాణిజ్య చట్టాలను సంస్కరించడం, ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా ఉండే ప్రమాణాలను సృష్టించడం దాకా.... ప్రభుత్వం వేలాది మంది యువ భారతీయులకు ప్రపంచ వేదికపై పోటీపడి రాణించేలా సాధికారత కల్పించింది. నేటి విజయం కేవలం ఒక గణాంకపరమైన మైలురాయి మాత్రమే కాదు... ఇది నూతన భారత్ పట్ల పెరుగుతున్న ప్రపంచ విశ్వసనీయతకు, భారతీయ ప్రతిభపై అంతర్జాతీయ నాకాయాన కంపెనీలు ఉంచిన నమ్మకానికి, మన సమష్టి కృషికి, భారత్‌ను నౌకా వాణిజ్య సిబ్బందిని అందించే అగ్రగామి దేశంగా నిలపాలనే సంకల్పానికి ప్రతిబింబం.”
ప్రపంచ సముద్రయాన సిబ్బందిలో భారత్ వాటాను 12.16 శాతం నుండి 20 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం ఇప్పుడు 'మిషన్ 20 శాతం' అనే ప్రతిష్ఠాత్మక జాతీయ లక్ష్యాన్ని అనుసరిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. "మిషన్ 20 శాతం మా తదుపరి జాతీయ స్థాయి మైలురాయి. మేం సముద్రయాన సిబ్బంది కోసం శిక్షణ సామర్థ్యాన్నీ విస్తరిస్తున్నాం. నౌకాదళ శిక్షణ అవకాశాలను బలోపేతం చేస్తున్నాం. పరిశ్రమ-విద్యాసంస్థల భాగస్వామ్యాలను మరింతగా పెంపొందిస్తున్నాం. డిజిటల్ సాంకేతికతలను సద్వినియోగం చేసుకుంటున్నాం. యువ భారతీయులకు... ముఖ్యంగా మహిళలకు, సముద్ర సంబంధిత సంతృప్తికరమైన వృత్తిని చేపట్టడానికి మరిన్ని అవకాశాలను కల్పిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్న ప్రతి ఐదుగురు సముద్రయాన కార్మికుల్లో ఒకరు వృత్తి నైపుణ్యం, సామర్థ్యం, శ్రేష్ఠతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయుడు ఉండేలా చూడాలనే స్పష్టమైన లక్ష్యంతో మేం ముందుకు సాగుతున్నాం," అని శ్రీ సోనోవాల్ జోడించారు.
ప్రపంచ నౌకాయాన రంగం అర్హతగల అధికారుల కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో... విస్తరిస్తున్న భారత నౌకా వాణిజ్య విద్యా వ్యవస్థ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన శిక్షణా ప్రమాణాలు, ప్రగతిశీల విధానాల ప్రణాళిక, మారిటైమ్ ఇండియా విజన్-2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్-2047 లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తున్నాయి. భవిష్యత్ ప్రపంచ డిమాండ్‌ను తీర్చడానికి దేశాన్ని పటిష్ఠ స్థితిలో నిలుపుతున్నాయి.
***
(रिलीज़ आईडी: 2290861)
आगंतुक पटल : 5