|
హోం మంత్రిత్వ శాఖ
సైబర్ మోసాల నివారణ కేంద్రం
प्रविष्टि तिथि:
28 JUL 2026 3:16PM by PIB Hyderabad
భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం 'పోలీస్', 'శాంతిభద్రతలు' రాష్ట్ర పరిధిలో ఉండే అంశాలు. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తమ చట్టబద్ధమైన సంస్థల (ఎల్ఈఏ) ద్వారా సైబర్ మోసాలతో సహా నేరాల నివారణ, గుర్తింపు, దర్యాప్తు, విచారణకు ప్రాథమికంగా బాధ్యత వహిస్తాయి. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల చట్ట అమలు సంస్థల సామర్థ్యాన్ని పెంచడానికి వివిధ పథకాల పరిధిలో సలహాలు, ఆర్థిక సాయం అందించడం ద్వారా వారి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది.
సైబర్ ఆర్థిక నేరాలతో సహా సైబర్ నేరాలను సమగ్రంగా, సమన్వయ విధానంలో ఎదుర్కొనే యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి దిగువ పేర్కొన్న చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.
-
దేశంలో అన్ని రకాల సైబర్ నేరాలను పరిష్కరించే అనుబంధ కార్యాలయంగా ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’ (ఐ4సీ)ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఇది సమన్వయ, సమగ్ర విధానంలో పని చేస్తుంది.
-
ఐ4సీలో భాగంగా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) (https://cybercrime.gov.in) ప్రారంభమైంది. ఇది మహిళలు, చిన్నారులపై జరిగిన సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. అన్ని రకాల సైబర్ నేరాలకు సంబంధించిన ఘటనలపై ఫిర్యాదు నమోదు చేసే వీలును ప్రజలకు అందిస్తోంది.
-
ఆర్థిక మోసాలపై తక్షణమే ఫిర్యాదు చేయడానికి, నిధులను మోసగాళ్లు కొల్లగొట్టకుండా నిరోధించడానికి ఐ4సీ ఆధ్వర్యంలో ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (సీఎఫ్‌సీఎఫ్ఆర్ఎంఎస్)ను 2021లో ప్రారంభించారు. ఐ4సీ ఆధ్వర్యంలో నడిచే సీఎఫ్‌సీఎఫ్ఆర్ఎంఎస్ ప్రకారం 30.06.2026 నాటికి 32.80 లక్షల ఫిర్యాదుల్లో రూ.11,158 కోట్ల విలువైన సొమ్మును మోసగాళ్ల బారిన పడకుండా చూశారు. ఆన్లైన్లో సైబర్ ఫిర్యాదులను నమోదు చేయడంలో సాయం అందించడానికి ‘1930’ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
-
సైబర్ నేరాలు ఎదుర్కోవడంలో తక్షణ చర్యలు చేపట్టడానికి, నిరంతర సహకారం కోసం ఐ4సీలో అత్యాధునిక సైబర్ మోసాల నివారణ కేంద్రం (సీఎఫ్ఎంసీ)ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధాన బ్యాంకులు, ఆర్థిక మధ్యవర్తులు, పేమెంట్ అగ్రిగేటర్లు, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు, ఐటీ మధ్యవర్తులు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల లా ఎన్ఫోర్స్‌మెంట్ సంస్థల ప్రతినిధులు కలసి పనిచేస్తున్నారు.
-
పోలీసు అధికారులు అందించిన నివేదిక ప్రకారం 30.06.2026 వరకు 15.75 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5.77 లక్షల ఐఎంఈఐలను భారత ప్రభుత్వం నిషేధించింది.
-
బ్యాంకులు/ఆర్థిక సంస్థల సహకారంతో సైబర్ నేరగాళ్ల గుర్తింపు సమాచారానికి సంబంధించిన అనుమానితుల రిజిస్ట్రీని 10.09.2024న ఐ4సీ ప్రారంభించింది. 30.06.2026 వరకు, బ్యాంకుల నుంచి స్వీకరించిన 30.48 లక్షలకు పైగా అనుమానితుల గుర్తింపు డేటాను, 32.08 లక్షల లేయర్-1 మ్యూల్ ఖాతా అనుమానితుల రిజిస్ట్రీలో భాగస్వామ్య సంస్థలతో పంచుకున్నారు. రూ.25,698 కోట్ల విలువైన లావాదేవీలను తిరస్కరించారు.
-
సైబర్‌క్రైమ్ సమాచారాన్ని పంచుకోవడానికి, విశ్లేషణల కోసం లా ఎన్ఫోర్స్‌మెంట్ సంస్థ (ఎల్ఈఏ)లకు మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) వేదికగా, డేటా రిపోజిటరీగా, సమన్వయ వేదికగా పనిచేయడానికి ‘సమన్వయ వేదిక’ను కార్యాచరణలోకి తీసుకువచ్చారు. ఇది వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని సైబర్ నేరాల ఫిర్యాదులతో సంబంధం ఉన్న నేరాలు, నేరస్తుల మధ్య విశ్లేషణ ఆధారిత అంతరాష్ట్ర సంబంధాల సమాచారాన్ని తెలియజేస్తుంది. నేరస్తుల స్థావరాలను, నేర కేంద్రాలను మ్యాపులో గుర్తించి సంబంధిత అధికారులకు ‘ప్రతిబింబ’ మాడ్యూల్ స్పష్టమైన సమాచారాన్ని ఇస్తుంది. ఐ4సీ, ఇతర ఎస్ఎంఈల నుంచి సాంకేతిక–చట్టపరమైన సాయాన్ని అభ్యర్థించే, స్వీకరించే వీలును లా ఎన్ఫోర్స్‌మెంట్ సంస్థలకు అందిస్తుంది. ఫలితంగా 29,837కు పైగా నిందితులను అరెస్టు చేయడంతో పాటు 2,33,593కి పైగా సైబర్ దర్యాప్తు సహాయ అభ్యర్థనలు నమోదయ్యాయి.
-
ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 79, ఉప సెక్షన్ (3), క్లాజ్ (బి) ప్రకారం.. సంబంధిత ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థ ద్వారా ఐటీ మధ్యవర్తులకు నోటీసులు పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి ‘సహయోగ్’ పోర్టలును ప్రారంభించారు. తద్వారా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడేందుకు ఉపయోగిస్తున్న ఏదైనా సమాచారం, డేటా లేదా కమ్యూనికేషన్ లింకును అందుబాటులో లేకుండా చేయడం లేదా నిలిపివేయడానికి వీలవుతుంది.
-
సైబర్ క్రైమ్ దర్యాప్తు, ఫోరెన్సిక్, ప్రాసిక్యూషన్ వంటి కీలక అంశాలపై ఆన్‌లైన్ కోర్సుల ద్వారా పోలీసు అధికారులు, న్యాయాధికారుల సామర్థ్యాలను పెంపొందించడం కోసం ఐ4సీ కింద ‘సైట్రెయిన్’ అనే విస్తృతమైన సార్వత్రిక ఆన్‌లైన్ కోర్సుల (ఎంవోవోసీ) పోర్టలును అభివృద్ధి చేశారు. 2026 జూన్ 30 నాటికి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1,63,344 మందికి పైగా పోలీసు అధికారులు/న్యాయ అధికారులు ఇందులో నమోదు చేసుకున్నారు. ఈ పోర్టల్ 1,61,957కు పైగా ధ్రువపత్రాలను జారీ చేసింది.
-
2024 సెప్టెంబరు 10న ‘సైబర్ కమాండో’ కార్యక్రమాన్ని గౌరవ హోం శాఖ మంత్రి ప్రారంభించారు. దేశంలో సైబర్ భద్రతకు చెందిన ముప్పును ఎదుర్కోవడం కోసం.. ప్రత్యేక శిక్షణ పొందిన సైబర్ కమాండోల ప్రత్యేక విభాగాన్ని దీని ద్వారా ఏర్పాటు చేశారు. గౌరవనీయ హోంమంత్రి 10.09.2024 న ‘సైబర్ కమాండో’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కీలక సమాచార మౌలిక సదుపాయాలను భద్రపరచగల, జాతీయ సైబర్ భద్రత చర్యలకు తోడ్పాటునందించగల అంకితభావమూ, నైపుణ్యమూ కలిగిన కార్యబృందాన్ని నెలకొల్పడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ క్రమంలో 281 మంది సైబర్ కమాండోలు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు.
-
అత్యుత్తమ పద్ధతులను పంచుకోవడం, సామర్థ్యాన్ని మెరుగుపరచుకునే దిశగా.. ‘స్టేట్ కనెక్ట్’, ‘ఠానా కనెక్ట్’, ‘బ్యాంక్ కనెక్ట్’, మౌఖిక అభ్యాస సదస్సులను.. ఐ4సీ, హోం మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.
-
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు దర్యాప్తు అధికారులకు ప్రాథమిక దశలోనే సైబర్ ఫోరెన్సిక్ సహాయాన్ని అందించడం కోసం.. ఐ4సీలో భాగంగా అత్యాధునిక జాతీయ డిజిటల్ విచారణ సహాయక కేంద్రాన్ని (గతంలో దీనిని జాతీయ సైబర్ ఫోరెన్సిక్ ప్రయోగశాల (విచారణ) {ఎన్‌సీఎఫ్ఎల్ (I)} అని పిలిచేవారు) 2019 ఫిబ్రవరి 18న ఢిల్లీలోనూ, 2025 ఆగస్టు 29న అస్సాంలోనూ ఏర్పాటు చేశారు. 2026 జూన్ 30 నాటికి సైబర్ నేరాలకు సంబంధించిన 14,064కు పైగా కేసుల్లో రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల అమలు సంస్థలకు ఢిల్లీలోని జాతీయ డిజిటల్ విచారణ సహాయక కేంద్రం సేవలను అందించింది.
-
కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడం, సైబర్ నేరాల సంబంధిత ఫిర్యాదుల విచారణలో ఏకరూపతను తీసుకురావడం లక్ష్యంగా.. ఎన్సీఆర్పీ - సీఎఫ్‌సీఎఫ్ఆర్ఎంఎస్ కోసం సమగ్ర ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్‌వోపీ) మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఎన్సీఆర్పీ ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా.. ఫిర్యాదుల పరిశీలన, బ్యాంకు సమన్వయం, ఫిర్యాదుల పరిష్కారం, బ్యాంకు ఖాతాలో నిధుల నిలిపివేత (లీన్ మార్కింగ్)లను తొలగించడం, మోసపూరితంగా కొల్లగొట్టిన నిధులను అర్హులకు తిరిగి అందించడం కోసం ఈ ఎస్‌వోపీ ఒక ప్రామాణిక విధానాన్ని నిర్దేశిస్తుంది. మోసపోయిన బాధితులకు డబ్బును త్వరితగతిన తిరిగి ఇప్పించడం కోసం ‘మనీ రెస్టోరేషన్ మాడ్యూల్’, బ్యాంకు ఖాతాల నిలుపుదల, ఆ మొత్తాలపై లీన్ మార్కింగ్ వంటి అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడానికి ఫిర్యాదుల పరిష్కార మాడ్యూల్ 2026 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వచ్చాయి.
సైబర్ నేరాలపై అవగాహనను మరింత విస్తృతం చేసేలా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కాలర్ ట్యూన్ ప్రచారం, ఎస్ఎంఎస్ ద్వారా సందేశాలను అందించడంతోపాటు.. ఐ4సీ సోషల్ మీడియా ఖాతాలైన ఎక్స్ (గతంలో ట్విట్టర్) (@CyberDost), ఫేస్‌బుక్ (CyberDostI4C), ఇన్‌స్టా గ్రామ్ (CyberDostI4C), టెలిగ్రామ్ (cyberdosti4c) ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వీటితోపాటు.. ఎస్ఎంఎస్ ద్వారా ప్రచారం, టీవీ, రేడియో ప్రసారాలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, సినిమా హాళ్లలో ప్రకటనలు, ప్రముఖులతో ప్రచారాలు, ఐపీఎల్ కాంపెయిన్, మైగవ్ ద్వారా వివిధ మాధ్యమాల్లో ప్రచారం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో సైబర్ భద్రత, భద్రతా అవగాహన వారోత్సవాల నిర్వహణ, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో డిజిటల్ ప్రదర్శనల వంటి వివిధ చర్యలను ప్రభుత్వం చేపట్టింది.
లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2290510)
|