యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సిడబ్ల్యూజి 2026 కాంస్య పతక విజేత, పవర్ లిఫ్టర్ ఝండూ కుమార్‌ ను సత్కరించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


కేంద్ర క్రీడా శాఖ మంత్రి నుంచి రూ.10 లక్షల నగదు పురస్కారం అందుకున్న పారా పవర్ లిఫ్టర్‌

గౌరవ ప్రధానమంత్రి సోషల్ మీడియా ద్వారా తన ప్రదర్శనకు అభినందనలు తెలియజేయడంపై సంతోషం వ్యక్తం చేసిన ఝండూ కుమార్‌

प्रविष्टि तिथि: 27 JUL 2026 4:02PM by PIB Hyderabad

స్కాట్లాండ్ లోని గ్లాస్గో లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకం అందించిన పారా పవర్‌లిఫ్టర్ ఝండూ కుమార్‌ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సోమవారం తన నివాసంలో సత్కరించారు. ఝండూ కుమార్‌ కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల హెవీవెయిట్ విభాగంలో 190 కిలోల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 

బీహార్‌లోని నలంద జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఝండూకు డాక్టర్ మాండవీయ రూ. 10 లక్షల నగదు పురస్కారాన్ని అందించారు. కేంద్ర క్రీడా మంత్రి చేతుల మీదుగా తనకు సత్కారం గురించి పవర్ లిఫ్టర్ మాట్లాడుతూ: "ఈరోజు కేంద్ర క్రీడా మంత్రిని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జీవితంలో ఎంతమందికి కేంద్ర మంత్రిని కలిసే అవకాశం లభిస్తుంది? క్రీడల్లో నా సాధనకు నన్ను ఇలా సత్కరిస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. డాక్టర్ మాండవీయ నన్ను స్కాట్లాండ్ అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో మాట్లాడటం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది" అని అన్నారు. 

 

జూన్ 2023లో గాంధీనగర్‌లోని  ఎస్ఏఐ ఎన్‌సిఓఈలో శిక్షణ కోసం చీఫ్ పారా కోచ్ రాజేందర్ రాహేల్  తనను ఎంపిక చేయడానికి ముందు, నలంద జిల్లాలోని హర్నౌత్ పట్టణంలో తన కుటుంబ పోషణ కోసం కూరగాయలు విక్రయించడమే కాకుండా ఈ-రిక్షా కూడా నడిపినట్లు ఝండూ కుమార్‌ తెలిపారు. 

తాను సాధించిన విజయాన్ని గురించి గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో అభినందిస్తూ పోస్టు చేయడం తనకు ఒళ్లు గగుర్పొడిచే అనుభూతిని కలిగించిందని ఆయన చెప్పారు. “పతకం గెలిచినప్పటి నుంచి ఉత్సాహం, సంతోషం కారణంగా నాకు సరిగా నిద్ర కూడా పట్టడం లేదు. నా ఫోన్‌కు నిరంతరం శుభాకాంక్షల కాల్స్ వస్తూనే ఉన్నాయి. మన గౌరవ ప్రధాన మంత్రి నా గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం చూసిన క్షణం నేను ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. అది నాకు జీవితాంతం గుర్తుండిపోయే క్షణం. భారత క్రీడలు ఈ స్థాయికి చేరుకోవడానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  క్రీడాకారులకు నిరంతరం అందిస్తున్న ప్రోత్సాహం, మద్దతే ప్రధాన కారణమని నేను భావిస్తున్నాను. కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించిన వారిలో దేశ ప్రధాన మంత్రి నుంచి వ్యక్తిగతంగా అభినందనలు, ప్రోత్సాహం పొందిన ఏకైక క్రీడాకారుడిని నేనేనని అనుకుంటున్నాను” అని 29 ఏళ్ల  ఝండూ కుమార్‌ అన్నారు.

 

గ్లాస్గో విజయానికి ముందు, ఈ పవర్ లిఫ్టర్ ఖేలో ఇండియా పారా గేమ్స్ 2024, 2025 క్రీడల్లో వరుసగా వెండి, బంగారు పతకాలను గెలుచుకున్నారు. ఖేలో ఇండియా అథ్లెట్ అయిన ఝండూ కుమార్ ఇప్పుడు జపాన్‌లోని ఐచి-నాగోయాలో 2026 అక్టోబర్ 18 నుంచి  24 వరకు జరగనున్న ఆసియా పారా గేమ్స్‌పై దృష్టి సారించారు. ‘‘దేశ నాయకత్వం నుంచి మనకు ఇటువంటి మద్దతు, ప్రోత్సాహం లభించినప్పుడు, మరింత మెరుగ్గా రాణించాలనే ప్రేరణ కలుగుతుంది. ఆసియా పారా గేమ్స్ కు సిద్ధం కావడానికి గాంధీనగర్‌కు తిరిగి వెళ్లేముందు, నా కుటుంబ సభ్యులను కలవడానికి కొద్దిరోజులు నా స్వగ్రామానికి వెడతాను. చైనా గట్టి పోటీదారు, కానీ నా దేశం కోసం పతకం సాధించడానికి నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మాట ఇస్తున్నాను" అని ఝండూ కుమార్ పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2290205) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Malayalam