సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ‘‘ప్రాచీన బౌద్ధ క్షేత్రం సారనాథ్’’
प्रविष्टि तिथि:
25 JUL 2026 6:04PM by PIB Hyderabad
దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరుగుతున్న ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. 2025-26 కాలానికి అధికారికంగా భారత్ ప్రతిపాదించిన ‘‘ప్రాచీన బౌద్ధ క్షేత్రం సారనాథ్’’కు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కింది. భారతదేశంలో ఈ గుర్తింపు సాధించిన 45వ ప్రదేశంగా నిలిచింది. భారత దేశ సుదీర్ఘ సాంస్కృతిక వారసత్వాన్ని ఈ అంతర్జాతీయ గుర్తింపు చాటిచెబుతోంది. అలాగే వాస్తు కళా వైభవం, ప్రాంతీయ గుర్తింపు, చరిత్ర కొనసాగింపునకు సంబంధించిన వైవిధ్యమైన సంప్రదాయాలను ప్రదర్శిస్తోంది.
యునెస్కో/హెచ్‌సీఎం/ ప్రధాని ట్వీట్
ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, కేంద్ర సాంస్కృతిక మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

బుసాన్‌లో జరిగిన 48వ సీవోఎంలో ధన్యవాద ప్రసంగం చేస్తోన్న భారత ప్రతినిధి బృందం
సారనాథ్-ప్రాచీన బౌద్ధ క్షేత్రం
ఈ చారిత్రక ప్రదేశంలో చౌఖండీ స్థూపం, సారనాథ్ పురావస్తు అవశేషాలు (దమేఖ్ స్థూపం, ధర్మరాజిక స్థూపం, మూలగంధకుటి విహారం, అశోక స్తంభం, తదితరమైనవి) అనే రెండు ప్రధాన భాగాలున్నాయి. ఈ ప్రదేశం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉంది. ఈ రెండు భాగాలు కలసి ప్రాచీన సారనాథ్ ప్రదేశంలోని నిర్మాణ, పురావస్తు అవశేషాలను పరిరక్షిస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని బౌద్ధ సంప్రదాయంలో రిషిపతన, ఇషిపతన, మృగదావ అనే విభిన్న పేర్లతో పిలుస్తారు. ఈ పేర్లు అన్నీ పవిత్ర భౌగోళిక ప్రదేశాన్ని సూచిస్తాయి. క్రీ.పూ. ఆరో శతాబ్దంలో బుద్ధుడు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడే తన తొలి బోధన అయిన ‘ధర్మచక్ర పరివర్తన’ ప్రవచించారు. ఈ సంఘటనే బౌద్ధ సంఘం ప్రారంభానికి, పవిత్ర అష్టాంగ మార్గ సూత్రాల ఏర్పాటుకు దారి తీసింది.
సారనాథ్‌ను ముఖ్యమైన నాలుగు బౌద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా బుద్ధుడే సూచించారు. ఈ ప్రాంతాన్ని రాజ వంశాలు, భిక్షువులు, భక్తులు అభివృద్ధి చేశారు. గౌతమ బుద్ధుడు తొలి బోధన చేసినదిగా, తన తొలి శిష్యులను కలుసుకున్నదిగా భావించే ఈ ప్రాంతం చుట్టూ అనేక స్థూపాలు, ఆలయాలు, విహారాలు నిర్మితమయ్యాయి. క్రీ.శ. 12వ శతాబ్దంలో క్షీణించి, అనంతరం విధ్వంసానికి గురై ఈ ప్రాంతం తన ప్రాభవాన్ని కోల్పోయింది. తిరిగి 18వ శతాబ్దం వరకు వెలుగులోకి రాలేదు.
ఈ ప్రదేశంలో మౌర్యులకు పూర్వ కాలం (క్రీ.పూ.5-4 శతాబ్దాల నుంచి క్రీ.పూ. 3వ శతాబ్దం వరకు) నుంచి 12వ శతాబ్దంలో ధ్వంసం అయ్యేంత వరకు (తర్వాత చేసిన మార్పులతో సహా) కట్టిన నిర్మాణాలున్నాయి.
భారత పురావస్తు సర్వే విభాగం విస్తృతంగా తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో సారనాథ్ ఒకటి. దీని ఫలితంగా 16 శతాబ్దాల పాటు (క్రీ.పూ. 5-4 శతాబ్దాల నుంచి క్రీ.శ. 12వ శతాబ్దం వరకు) వర్థిల్లిన ప్రాచీన సంస్కృతి వెలుగులోకి వచ్చింది.
సారనాథ్‌లో పురావస్తు అవశేషాల తవ్వకాలు, 1907-1908
(మూలం- భారత పురావస్తు సర్వే)
ప్రముఖ బౌద్ధ క్షేత్రాలైన లుంబిని (నేపాల్), బోదగయలోని మహాబోధి ఆలయం (బీహార్) తర్వాత సారనాథ్ ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకుంది. అంటే నాలుగు ముఖ్యమైన బౌద్ధ క్షేత్రాల్లో మూడింటిని ఈ జాబితాలో చేర్చారు. వీటితో పాటు సాంచి, నలంద, అజంతా (ఈ మూడు భారత్‌లోనే ఉన్నాయి), అనురాధాపూర్ (శ్రీలంక). పహార్‌పూర్ (బంగ్లాదేశ్), తక్షశిల, తక్త్-ఈ-బహి (ఈ రెండూ పాకిస్థాన్‌లో ఉన్నాయి) లాంటి ఇతర ముఖ్యమైన బౌద్ధ ప్రదేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా సారనాథ్
ప్రాచీన ప్రదేశమైన సారనాథ్‌ను 1998లో తాత్కాలిక జాబితాలో చేర్చారు. ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలనే ప్రతిపాదనను 2025 జనవరిలో ప్రపంచ వారసత్వ కమిటీకి పంపించారు. సలహా సంఘాలతో అనేక మార్లు నిర్వహించిన సాంకేతిక సమావేశాలు, ప్రదేశాన్ని సమీక్షించేందుకు ఐసీవోఎంవోఎస్ మిషన్ పర్యటనతో సహా 18 నెలల పాటు సాగిన కఠిన ప్రక్రియ అనంతరం, దక్షిణ కొరియాలోని బుసాన్‌లో ఈ రోజు సాయంత్రం ప్రపంచ వారసత్వ కమిటీ ఈ చారిత్రక నిర్ణయం తీసుకుంది.

2025 సెప్టెంబర్ 24 నుంచి 29 వరకు సారనాథ్ తవ్వకాల్లో బయల్పడిన మెట్ల మార్గాన్ని పరిశీలిస్తున్న ఐసీవోఎంవోఎస్ బృందం

సారనాథ్ అవశేషాల విహంగ వీక్షణం
(మూలం-ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా)
కమిటీ సమావేశంలో ప్రపంచ వారసత్వ కమిటీకి చెందిన 21 మంది సభ్యులు, సభ్యదేశాలు, యునెస్కో సెక్రటేరియట్, ప్రపంచ వారసత్వ కేంద్రం, యునెస్కో (ఐసీవోఎంవోఎస్, ఐయూసీఎన్, ఐసీసీఆర్‌వోఎం) సలహా సంఘాలు ఈ చరిత్రాత్మక సందర్భం నేపథ్యంలో భారత్‌కు శుభాకాంక్షలు తెలియజేశాయి.
ప్రాచీన బౌద్ధ క్షేత్రమైన సారనాథ్‌ను (iii), (vi) ప్రమాణాల ప్రకారం ప్రతిపాదించారు. బౌద్ధమతానికి సంబంధించిన నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సారనాథ్ ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని మూడో ప్రమాణం గుర్తిస్తుంది. అనేక శతాబ్దాలు ఇక్కడ పెద్ద సంఖ్యలో నిర్మించిన, పునర్నిర్మించిన ఆధ్యాత్మిక కట్టడాలు, ఇతర స్మారక కట్టడాలు దీనిని ప్రదర్శిస్తున్నాయి. బౌద్ధ సమాజం అత్యంత ప్రాధాన్యమిచ్చే బుద్ధుని జీవితంలో సంఘటనలైన – తన తొలి సందేశం, తొలి శిష్యులను కలుసుకోవడంతో ఈ ప్రదేశానికి ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని ఆరో ప్రమాణం గుర్తిస్తుంది. ఈ సంఘటనల ప్రాధాన్యాన్ని, వాటి అర్థాన్ని సారనాథ్‌లో నిర్మించిన అనేక కట్టడాలు శతాబ్దాలుగా తెలియజేస్తున్నాయి. ఇవన్నీ బుద్ధుని సందేశం, ఆయన బోధనలు, త్రిరత్న భావనకు ప్రతీకలు.

1904-06 తవ్వకాల్లో బయటపడిన అశోక స్థూపం, సింహ చిహ్నంతో మూలగంధకుటి విహార (మూలం – భారత పురావస్తు సర్వే విభాగం)

1904-06 పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన అశోక సింహ చిహ్నం, తర్వాత దీనిని జాతీయ చిహ్నంగా ప్రకటించారు (మూలం – భారత పురావస్తు సర్వే విభాగం)
196 దేశాల్లో కనుగొన్న సాంస్కృతికమైన, సహజమైన, రెండింటి మేళవింపుతో కూడిన ప్రాంతాల్లో కనిపించే ఓయూవీలు (విశిష్ట సార్వత్రిక విలువలు) ఆధారంగా ఉమ్మడి వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి ఈ వారసత్వ ప్రదేశాలను యునెస్కో జాబితాలో చేరుస్తారు. 2021-25 నుంచి ప్రపంచ వారసత్వ కమిటీలో భారత్ సభ్యదేశంగా మారింది. అలాగే 2024 జులైలో న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశానికి మొదటిసారి ఆతిథ్యమిచ్చింది.

సారనాథ్‌లో ఇటుకలతో నిర్మించిన మొక్కుబడులకు సంబంధించిన స్థూపాలను శాస్త్రీయంగా పరిరక్షించేందుకు కొనసాగుతున్న పనులు
ప్రపంచ వేదికపై భారతదేశ వారసత్వాన్ని చాటి చెప్పాలన్న నూతన భారత దేశ అవిశ్రాంత కృషికి ఈ అంతర్జాతీయ గుర్తింపు నిదర్శనం. ఈ చారిత్రక సంపదలను పరిరక్షించడంలో భారతీయ పురావస్తు సర్వే (ఏఎస్ఐ) చేపడుతున్న సంరక్షణ, నిర్వహణ ప్రయత్నాలను ఈ గుర్తింపు సూచిస్తోంది.
150 ఏళ్లకు పైగా భారత పురావస్తు సర్వే విభాగం సారనాథ్‌లోని ప్రాచీన బౌద్ధ క్షేత్రాన్ని వెలికి తీసి, పరిరక్షిస్తోంది. దీని ఫలితంగా శాక్యముని బుద్ధుడు మొదటిసారి తన సందేశమిచ్చిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని గుర్తించారు.
భారతదేశ జాతీయ చిహ్నంగా మారిన ప్రసిద్ధ మౌర్య సింహ స్థంభాన్ని, గుప్తుల ప్రాచీన కళకు చెందిన ధార్కచక్రప్రవర్తన బుద్ధున్ని పురావస్తు తవ్వకాల్లో కనుగొన్నారు. వీటిని 1904లో ఏర్పాటు చేసిన భారత దేశ తొలి సైట్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.
ఈ ప్రపంచ వారసత్వ హోదా బౌద్ధ మత జన్మస్థలంగా భారత దేశ గుర్తింపును బలోపేతం చేస్తుంది. అలాగే జపాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, మయన్మార్, కాంబోడియా, వియత్నాం, దక్షిణ కొరియా, మంగోలియా తదితర దేశాలతో సాంస్కృతిక దౌత్యాన్ని విస్తరిస్తుంది.
అంతర్జాతీయ సంబంధాలకు వారధిగా బౌద్ధ వారసత్వాన్ని ప్రోత్సహించాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ గుర్తింపు మరింత బలాన్ని చేకూరుస్తుంది. అలాగే వారసత్వ సంపద పరిరక్షణలో భారత్ నైపుణ్యాన్ని, నామినేషన్ ప్రక్రియలో సన్నద్ధతను కూడా ప్రదర్శిస్తుంది.
గతేడాది ప్యారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సమావేశంలో ‘భారత్‌లోని మరాఠా సైనిక భూభాగాలు’ ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ఈ జాబితాలో 45వ ప్రదేశాలతో ప్రపంచంలోనే అత్యధిక వారసత్వ ప్రదేశాలు కలిగిన దేశంగా భారత్ ఆరో స్థానంలో ఉంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో రెండో స్థానంలో ఉంది. 1972లో జరిగిన ప్రపంచ వారసత్వ సదస్సును 196 దేశాలు ఆమోదించాయి.
ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో భారత్‌కు చెందిన 69 ప్రదేశాలున్నాయి. భవిష్యత్తులో ఏ ప్రదేశాన్నైనా వారసత్వ సంపదగా పరిగణించేందుకు ఈ జాబితాలో ఉండటం తప్పనిసరి. ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చేందుకు ఏటా ప్రతి దేశం ప్రపంచ వారసత్వ కమిటీ పరిశీలనకు ఒక ప్రదేశం పేరును మాత్రమే ప్రతిపాదించాల్సి ఉంటుంది.
దేశంలో ప్రపంచ వారసత్వ సంపదకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ భారత ప్రభుత్వం తరఫున నోడల్ ఏజెన్సీగా భారత పురావస్తు సర్వే విభాగం పనిచేస్తుంది.
ఈ అంతర్జాతీయ గుర్తింపుతో సారనాథ్ ప్రామాణికతను, సమగ్రతను కాపాడటానికి సుస్థిర పర్యాటకాన్ని నిర్వహించడం, బఫర్ జోన్‌లో ప్రణాళిక లేని నిర్మాణాలను నిరోధించడం ద్వారా దాని అత్యుత్తమ సార్వత్రిక విలువను సంరక్షించడంలో తన నిబద్ధతను భారత్ పునరుద్ఘాటించింది.
***
(रिलीज़ आईडी: 2289565)
आगंतुक पटल : 57