సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దేశంలో 386 ప్రైవేటు ఎఫ్‌ఎం రేడియో ఛానెళ్లు
ప్రాంతీయ సంస్కృతిని పెంపొందించేందుకు 20 శాతం స్థానిక భాషా ప్రసారాలు తప్పనిసరి చేసిన కేంద్రం
प्रविष्टि तिथि:
24 JUL 2026 3:58PM by PIB Hyderabad
గత ఏడాది జులై 9, 10 తేదీల్లో పారదర్శకమైన విధానం ద్వారా 234 కొత్త నగరాల్లో 730 ఎఫ్‌ఎం ఛానెళ్లకు ఈ-వేలం నిర్వహించింది. వేలానికి ముందు ఈ విషయంపై పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించారు. ఈ వేలంలో మొత్తం 18 బిడ్డర్లు విజయం సాధించగా, అందులో 9 సంస్థలు ప్రైవేటు ఎఫ్‌ఎం రంగానికి కొత్తగా పరిచయమైనవే కావడం విశేషం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 386 ప్రైవేటు ఎఫ్‌ఎం రేడియో ఛానెళ్లు పనిచేస్తున్నాయి
ప్రైవేటు ఎఫ్‌ఎం రేడియో విధానం ప్రకారం ప్రతి ప్రసార సంస్థ తమ రోజువారీ ప్రసారాల్లో కనీసం 20 శాతం కంటెంట్‌ను తప్పనిసరిగా స్థానిక భాషలోనే ఉండేలా చూసుకోవాలి. ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, జానపద సంగీతాన్ని పెంపొందించేందుకు, స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ నిబంధనను ప్రభుత్వం తీసుకువచ్చింది.
ప్రైవేటు ఎఫ్‌ఎం రేడియో ఫేజ్-3 విధానం ప్రకారం ప్రసారాలను దేశమంతటా వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ప్రైవేటు ప్రసార సంస్థలు అందుబాటులో ఉన్న ప్రసార భారతి టవర్లు, ప్రాంగణాలను వినియోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, ఆకాంక్షిత జిల్లాల్లో ఎఫ్‌ఎం సేవలు త్వరితగతిన ప్రారంభమయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందుకోసం కచ్చితమైన సమయ పరిమితులతో అంగీకార పత్రం (ఎల్ఓఐ) జారీ చేయడంతో పాటు అనుమతి మంజూరు ఒప్పందాన్ని (జీఓపీఏ) అమలు చేస్తోంది.
ప్రజా సంక్షేమ ప్రకటనలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు సరిగా చేరుతోందో లేదో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా ప్రసార మాధ్యమాల్లో వస్తున్న ప్రకటనలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. అత్యవసర పరిస్థితులు, కీలక ప్రచారాల సమయంలో ధ్రువీకరించిన సమాచారాన్ని సకాలంలో ప్రజలకు చేరవేసేందుకు, ప్రసార సంస్థలతో ప్రభుత్వం సన్నిహిత సమన్వయాన్ని కొనసాగిస్తోంది.
ఈ వివరాలను రాజ్యసభ సభ్యుడు శ్రీ ఐఎస్ ఇన్బదురై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
****
(रिलीज़ आईडी: 2289174)
आगंतुक पटल : 4