సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించే చర్యలను బలోపేతం చేస్తూ, డీ–అడిక్షన్ సేవలను విస్తరిస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లభించే సాయాన్ని వ్యవస్థీకృతం చేస్తున్న ప్రభుత్వం: లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి శ్రీ బి. ఎల్. వర్మ


నషా ముక్త భారత్ అభియాన్ పరిధిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమాల ద్వారా 29.68 కోట్ల మందికి చేరువైన కార్యక్రమం

ఎన్ఏపీడీడీఆర్ పరిధిలో దేశవ్యాప్తంగా 765 డీ–అడిక్షన్, రీహాబిలిటేషన్ కేంద్రాలకు సాయం అందిస్తున్న ప్రభుత్వం

प्रविष्टि तिथि: 23 JUL 2026 2:18PM by PIB Hyderabad

సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలును మరింత పటిష్టం చేస్తోంది. డ్రగ్స్‌ వినియోగాన్ని తగ్గించడం, పునరావాసం, సామాజిక న్యాయం తదితర విభాగాల్లో సకాలంలో ఆర్థిక సహాయం అందేలా, పారదర్శకత పెరిగేలా, మెరుగైన సేవలు అందించేలా ఈ చర్యలు తీసుకుంటోంది. దేశ వ్యాప్తంగా నిధుల విడుదల ప్రక్రియలను సరళతరం చేయడం, డీ–అడిక్షన్ మౌలిక వసతులను విస్తరించడం, పునరావాస సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి ఈ చర్యలను మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.

పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ప్రతిమా మండల్ అడిగిన వివిధ ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానంగా సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి శ్రీ బీఎల్ వర్మ ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందించారు.

వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల పరిధిలో 

వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల పరిధిలో వచ్చిన ప్రతిపాదనలను సకాలంలో పరిశీలించి, నిధులను విడుదల చేయడానికి కఠినమైన పర్యవేక్షణ విధానాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి సభకు తెలియజేశారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించే జాతీయ ప్రణాళిక (ఎన్ఏ‌పీడీడీఆర్), అటల్ వయో అభ్యుదయ యోజన (ఏవీవైఏవై)లాంటి పథకాలను అమలు చేసే భాగస్వామ్య ఎన్జీవోలకు నిధుల విడుదలను సరళీకృతం చేయడానికి సవరించిన మార్గదర్శక నిర్వహణ విధానం (ఎస్‌వోపీ)ను ప్రారంభించింది. దీని ద్వారా డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం తగ్గి, పాలనాపరమైన సామర్థ్యం మెరుగవుతుంది.

మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలను శ్రీ వర్మ వివరించారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించేందుకు జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఏపీడీడీఆర్) పరిధిలో సమగ్రమైన, సాక్ష్యం ఆధారితమైన వ్యూహాన్ని మంత్రిత్వశాఖ అమలు చేస్తోందని పేర్కొన్నారు. భారతదేశంలో మాదక ద్రవ్యాల వినియోగ విస్తరణ, తీరుపై న్యూఢిల్లీ ఎయిమ్స్‌లోని నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్ (ఎన్‌డీడీటీసీ)లో చేపట్టిన జాతీయ సర్వేలో వెల్లడైన ఫలితాల ఆధారంగా ఈ వ్యూహాన్ని రూపొందించారు.

ఈ సర్వే ప్రకారం వయోజనుల్లో (18 నుంచి 75ఏళ్ల వయసున్న వారు) మత్తు పదార్థాలను వినియోగిస్తున్న వారి సంఖ్య 15.10 కోట్లుగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో గంజాయి వినియోగదారులు 2.90 కోట్ల మంది, ఒపియాయిడ్ వాడేవారు 1.90 కోట్ల మంది ఉన్నారు. సెడేటివ్‌లను వినియోగించేవారు 1.10 కోట్ల మంది కాగా... ఇన్‌హెలెంట్ మత్తు పదార్థాలు వాడేవారు 60 లక్షల మంది ఉన్నారు. చిన్నారులు, కిశోర దశలో ఉన్నవారి (10 నుంచి 17 ఏళ్ల వరకు) విషయానికి వస్తే... 40 లక్షల మంది  ఒపియాయిడ్లను, 30 లక్షల మంది ఆల్కహాల్‌ను, 30 లక్షల మంది ఇన్‌హేలెంట్స్‌ను, 20 లక్షల మంది గంజాయిని వాడుతున్నట్టు అంచనా. ఇది నిరంతర అవగాహన, నివారణ, చికిత్స అవసరమని తెలియజేస్తోంది.

నివారణ విద్య, అవగాహన కల్పన, కౌన్సెలింగ్, చికిత్స, పునరావాసానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఎన్జీవోలు, ప్రభుత్వ ఆసుపత్రులకు ఎన్ఏపీడీడీఆర్ ద్వారా కేంద్రం అందిస్తుందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 344 ఇంటిగ్రేటెడ్ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఫర్ అడిక్ట్స్ (ఐఆర్‌సీఏలు), 45 కమ్యూనిటీ బేస్డ్ పీర్ లెడ్ ఇంటర్వెన్షన్స్ (సీపీఎల్ఐలు), 76 అవుట్ రీచ్ అండ్ డ్రాప్–ఇన్ సెంటర్లు (ఓడీఐసీలు), 145 జిల్లా డీ–అడిక్షన్ కేంద్రాలు (డీడీఏసీలు), 155 అడిక్షన్ చికిత్సా కేంద్రాలు (ఏటీఎఫ్‌లు)కు మంత్రిత్వ శాఖ సహకారం అందిస్తోంది.

2020 ఆగస్టు 15న నషా ముక్త భారత్ అభియాన్ (ఎన్ఎంబీఏ) ప్రారంభమయిందని, 2023 ఆగస్టులో అన్ని జిల్లాలకు విస్తరించి, ప్రపంచవ్యాప్తంగా మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న అతిపెద్ద అవగాహనా కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచిందని   లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన అవగాహన కార్యకలాపాల ద్వారా ఈ కార్యక్రమం 29.68 కోట్ల మంది ప్రజలకు చేరువయింది. వారిలో 11.43 కోట్ల మందికి పైగా యువత, 8.05 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 1.17 లక్షలకు పైగా నషా ముక్తి మిత్రలు ఈ ప్రచారంలో చేరారు. దీనికి అదనంగా 28.29 లక్షల మందికి చికిత్స, పునరావాస సేవలు అందాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా 21.73 లక్షల విద్యా సంస్థల్లో ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 

చికిత్స సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఎన్ఎంబీఏ 2.0 మొబైల్ అప్లికేషన్‌ను మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇది సమీపంలో ఉన్న డీ–అడిక్షన్ కేంద్రాన్ని చేరుకోవడాన్ని సులభతరం చేస్తుంది. 2024–25 మధ్య కాలంలో జీఏపీ జిల్లాల్లో 55 నూతన జిల్లా స్థాయి డీ–అడిక్షన్ కేంద్రాలు (డీడీఏసీలు)కు ఆమోదం లభించింది. 2025–26లో 21 అదనపు డీడీఏసీలు ఏర్పాటయ్యాయి. ఇది దేశంలో వ్యసనం నుంచి విముక్తి కల్పించే మౌలిక సదుపాయాలను మరింత విస్తరించింది.

డిసెంబర్ 2024లో డెవలప్మెంట్ అండ్ రీసెర్చి సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, 2025లో నీతి ఆయోగ్ చేపట్టిన స్వతంత్రంగా తృతీయ పక్ష విశ్లేషణలు నిర్వహించినట్లు మంత్రి సమాచారమిచ్చారు. ఈ విశ్లేషణలో దేశవ్యాప్తంగా సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో, మత్తు పదార్థాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించేందుకు అమలు చేస్తున్న జాతీయ కార్యాచరణ ప్రణాళిక గణనీయమైన పురోగతి సాధించిందని తేలింది.

పునరావాస మౌలిక సదుపాయాలను విస్తరించడం, నివారణ చర్యలను మెరుగుపరచడం, అమలు ప్రక్రియలను సరళీకరించడం, కేంద్ర ప్రాయోజిత పథకాలను సమర్థవంతంగా అమలయ్యేలా చూడటం ద్వారా డ్రగ్ రహిత, సామాజిక సమ్మిళిత్వం సాధించిన భారత్ దిశగా తన నిబద్ధతను స్థిరంగా కొనసాగిస్తుంది. నిరంతర సామాజిక భాగస్వామ్యం, మెరుగైన పాలన, సాంకేతికత ఆధారితంగా సేవలు అందించడం ద్వారా బలహీన వర్గాలను రక్షించడానికి, అందరికీ సామాజిక న్యాయాన్ని అందించేందుకు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.

 

***


(रिलीज़ आईडी: 2288820) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Kannada