రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రొమేనియాలో భారత రాష్ట్రపతి: రొమేనియా అధ్యక్షునితో ద్వైపాక్షిక చర్యలు, ప్రతినిధి స్థాయి చర్చలకు ప్రాతినిధ్యం


యూరోపియన్ యూనియన్‌లో రొమేనియా భారతదేశానికి ఒక ముఖ్యమైన భాగస్వామి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మన పరిశ్రమలకు, నిపుణులకు అపూర్వమైన అవకాశాలను అందిస్తుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

प्रविष्टि तिथि: 23 JUL 2026 11:25PM by PIB Hyderabad

మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల్లో చేపడుతున్న అధికారిక పర్యటన చివరి దశలో భాగంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఈ రోజు (జులై 23, 2026) రొమేనియాలోని బుకారెస్ట్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో రాష్ట్రపతికి రొమేనియా విదేశీ వ్యవహారాల మంత్రి ఒనా–సిల్వియా టోయు స్వాగతం పలికారు.

దాదాపు మూడు దశాబ్దాల అనంతరం భారత రాష్ట్రపతి రొమేనియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో రాష్ట్రపతి వెంట వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీమతి నిముబెన్ జయంతిబాయి బంభానియా, పార్లమెంటు సభ్యులు డాక్టర్ దినేశ్ శర్మ, శ్రీ విజయ్ బఘేల్ ఉన్నారు.

రొమేనియా అధ్యక్షుని అధికారిక నివాసం, కార్యాలయమైన కొట్రోసెని ప్యాలెస్‌ను రాష్ట్రపతి సందర్శించారు. ఆమెకు రొమేనియా రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ నికుషోర్ డాన్ సాదర స్వాగతం పలికారు. రాష్ట్రపతి గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించారు. వ్యక్తిగత, ప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన చర్చల్లో నాయకులిద్దరూ పాల్గొన్నారు. భారత్–రొమేనియా ద్వైపాక్షిక భాగస్వామ్యంలో అన్ని ప్రధాన అంశాలపై ఫలవంతమైన, భవిష్యత్తులో ప్రయోజనం కలిగించేలా చర్చలు నిర్వహించారు. ఇరుదేశాలూ ప్రాధాన్యమిస్తున్న రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు వారు అంగీకరించారు.

ఏడు దశాబ్దాలకు పైగా భారత్, రొమేనియా మధ్య ఆత్మీయ సంబంధాలున్నాయని రాష్ట్రపతి చెప్పారు. ఇవి పరస్పర విశ్వాసం, గౌరవం, బలమైన ప్రజాసంబంధాల ఆధారంగా ఏర్పడ్డాయన్నారు. కాలం గడిచే కొద్దీ రెండు దేశాల మధ్య భాగస్వామ్యం క్రమంగా బలపడిందని, ఇప్పుడు మరింత గొప్ప ఆశయం, బలమైన సహకారం, భవిష్యత్తు కోసం ఉమ్మడి దార్శనికతతో కూడిన నూతన దశలోకి ప్రవేశించిందని తెలిపారు.

భారత్–రొమేనియా భాగస్వామ్యంలో ఆర్థిక సహకారం ముఖ్యమైన అంశంగా ఉందని రాష్ట్రపతి చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు, రెండు దేశాలకు చెందిన వ్యాపార సమాజాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు నాయకులిద్దరూ అంగీకరించారు. వచ్చే మూడేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసేందుకు కూడా వారు అంగీకరించారు.

యూరోపియన్ యూనియన్‌లో రొమేనియా ముఖ్యమైన భాగస్వామిగా ఉందని రాష్ట్రపతి అన్నారు. భారత్–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం... రెండు దేశాల్లోని పరిశ్రమలకు , నిపుణులకు అపూర్వమైన అవకాశాలను అందిస్తుందని తెలియజేశారు.

ఇండియా–రొమేనియా సంబంధాలకు విద్య, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలే పునాదిగా నిలుస్తాయని రాష్ట్రపతి అన్నారు. ఈ రంగాలకు సంబంధించి మూడు ముఖ్యమైన ఒప్పందాలు కుదరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ సహకార కార్యక్రమం పరిధిలో ఉమ్మడి పరిశోధన, అభివృద్ధిని భారత్, రొమేనియా విస్తరిస్తాయని రాష్ట్రపతి తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) సహకారంతో బుకారెస్ట్ విశ్వవిద్యాలయంలో ఇండియన్ స్టడీస్ ఛైర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భారత సాంకేతిక, ఆర్థిక సహకారం (ఐటీఈసీ) కార్యక్రమం పరిధిలో రొమేనియాకు శిక్షణ అవకాశాలను రెట్టింపు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

2028 నాటికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పాటై 80 ఏళ్లు పూర్తయ్యే నేపథ్యంలో ‘‘ఇండియా–రొమేనియా ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’’ నిర్వహించేందుకు ఇరుపక్షాలు అంగీకరించినట్లు రాష్ట్రపతి వెల్లడించారు.

భారత రాష్ట్రపతి, రొమేనియా అధ్యక్షుడు పత్రికా ప్రకటనలను జారీ చేశారు. ( రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పత్రికా ప్రకటన)

భారత్–రొమేనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి రాష్ట్రపతి రేపు (2026, జులై 24) ప్రసంగిస్తారు. రొమేనియా పార్లమెంటును, బుకారెస్ట్ యూనివర్శిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్‌‌ను సందర్శిస్తారు.

 

***


(रिलीज़ आईडी: 2288773) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Malayalam