హోం మంత్రిత్వ శాఖ
మత్తు పదార్థాల దొంగ రవాణాకు అడ్డుకట్ట
प्रविष्टि तिथि:
21 JUL 2026 4:08PM by PIB Hyderabad
నిషేధిత మత్తు పదార్థాల దొంగ రవాణాను అడ్డుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతోంది. ప్రభుత్వం తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి: -
• నార్కొటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్‌స్టెన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం-1985లో భాగంగా నియంత్రణ కార్యకలాపాలలో మాదకద్రవ్యాల నియంత్రణ మండలి (ఎన్‌సీబీ), మత్తుమందుల నేర నియంత్రణ ఏజెన్సీ (డీఎల్ఈఏస్)లతో పాటు రాష్ట్రాల పోలీసు విభాగాలు కూడా చురుకుగా పాలుపంచుకుంటున్నాయి. ఈ ఉమ్మడి ప్రయత్నాల ఫలితంగా మాదక పదార్థాలను జప్తు చేయడం, కేసులను నమోదు చేయడం, అరెస్టులు, స్వాధీనపరుచుకున్న మత్తుమందుల్ని ధ్వంసం చేయడం, మత్తుమందుల సాగును అడ్డుకోవడం, సంబంధిత ఆర్థిక కార్యకలాపాలపై దర్యాప్తు జరపడంతో పాటు ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కొటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్‌స్టెన్సెస్ (పీఐటీఎన్‌డీపీఎస్) చట్టం-1988 ప్రకారం దొంగచాటు రవాణాను అడ్డుకోవడానికి ముందు జాగ్రత్త ప్రాతిపదికన నిర్బంధించడం వంటి కీలక విజయాలను సాధించారు.
• మాదకద్రవ్యాలను చట్టం కళ్లుగప్పి తరలించడం, మాదక పదార్థాల దురుపయోగం.. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ‘మాదకద్రవ్యాలపై నియంత్రణకు సంబంధించిన ఒక దార్శనిక పత్రం (విజన్ డాక్యుమెంటు) 2026-2029’ను తీసుకువచ్చారు. దీనిలో ‘సంపూర్ణ ప్రభుత్వ’, ‘సంపూర్ణ సమాజ’ దృక్పథంతో, మాదక పదార్థాల అదుపునకు ప్రాధాన్యాలను, నిర్దిష్ట కాలం లోపల సాధించాల్సిన లక్ష్యాలను, 3 సంవత్సరాల పాటు వర్తించే ఒక కార్యాచరణ ప్రణాళిక (రోడ్‌మ్యాప్)ను ప్రస్తావించారు.
• భారత్‌లో మత్తుమందుల దొంగరవాణాని, వినియోగాన్ని అదుపు చేసే రంగంలో కేంద్రీయ, రాష్ట్రాల మాదకద్రవ్యాల నేర నియంత్రణ ఏజెన్సీలతో పాటు ఇతర ఆసక్తిదారులకూ మధ్య మెరుగైన సమన్వయాన్ని నిర్ధారించడానికి మత్తుమందుల సంబంధిత సమన్వయ సంఘ (ఎన్‌సీఓఆర్‌డీ) యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ యంత్రాంగంలో 4 అంచెలు ఉన్నాయి.
• మత్తు మందులతో ముడిపడిన ఉగ్రవాద కేసులు సహా కీలక డ్రగ్ కేసుల దర్యాప్తును పర్యవేక్షించడానికి ఎన్‌సీబీ డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన ఒక సంయుక్త కార్యాచరణ సంఘాన్ని (జేసీసీ) ఏర్పాటు చేశారు.
• సింథెటిక్ డ్రగ్స్, మరీ ముఖ్యంగా మెఫెడ్రోన్, యాంఫిటమైన్ కోవకు చెందిన ఉత్తేజకాలు (ఏటీఎస్) వంటి వాటిని గుప్తంగా తయారు చేయడానికి సంబంధించిన రెడ్ ఫ్లాగ్ ఇండికేటర్స్ (ఆర్ఎఫ్ఐ)తో పాటు, సరికొత్త ముప్పుల విషయంలో బీట్ కానిస్టేబుళ్లను, క్షేత్ర అధికారులను, ఎస్‌హెచ్‌ఓలను అప్రమత్తం చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలకు సూచించారు.
• సింథెటిక్ డ్రగ్ ట్రాఫికింగుతో ముడిపడిన వ్యవస్థీకృత నెట్‌వర్కులను బలహీనపరచడానికి, నేలమట్టం చేయడానికి ఆర్థిక కార్యకలాపాలపై దర్యాప్తును చేపట్టాల్సిందిగాను, పీఐటీఎన్‌డీపీఎస్‌ను ప్రభావవంతంగా అమలు చేయాల్సిందిగాను నేషనల్ నార్కొటిక్స్ కోఆర్డినేషన్ పోర్టల్ (ఎన్‌సీఓఆర్‌డీ), జేసీసీ, ప్రాంతీయ సమావేశం వంటి వేదికల్లో నిరంతరం స్పష్టం చేస్తున్నారు.
• నేరాలను వ్యవస్థీకృతంగా గుర్తించడానికి, నేరాలతో లంకె ఉన్న ఆదాయ రాశిని పసిగట్టి, జప్తు ప్రక్రియకు మార్గాన్ని సుగమం చేయడానికి విస్తృత మార్గదర్శకాలను జారీ చేశారు.
• మాదకద్రవ్యాల నేర నియంత్రణ అధికారుల, ఏజెన్సీల సామర్థ్యాన్ని పెంచడానికి ఎన్‌సీబీ వర్క్‌షాపులను, సెమినార్లను, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. యూఎస్-డీఈఏ సహకారంతో గుప్త ప్రయోగశాలల దర్యాప్తు, రసాయనిక పదార్థాల దారిమళ్లింపుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఎన్‌సీబీ క్రమం తప్పక ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలలో సెంట్రల్ ఏజెన్సీలు, రాష్ట్రాల డీఎల్ఈఏస్ అధికారులు పాల్గొంటున్నారు.
• మత్తుమందులకు సంబంధించిన వ్యవహారాల్లో మయన్మార్, నేపాల్, థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాలతో భారత్ తరచుగా డైరెక్టర్ జనరల్ (డీజీ) స్థాయి చర్చలను, ద్వైపాక్షిక చర్చలను నిర్వహిస్తోంది.
ఎన్‌సీబీ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను, 19 దేశాలతో అవగాహన ఒప్పందాలను (ఎమ్ఓయూస్) కుదుర్చుకుని, మాదకద్రవ్యాలపై నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని పటిష్ఠపరిచింది.
ఎన్‌సీబీని బలోపేతం చేయడానికి ఈ కింది చర్యలను కూడా తీసుకున్నారు:
• అమృత్‌సర్, గువాహాటీ, చెన్నయి, అహ్మదాబాద్‌లలో 4 ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో ప్రాంతీయ కార్యాలయాలు 3 నుంచి 7కు పెరిగాయి.
• దేశవ్యాప్తంగా జోనల్ కార్యాలయాలను 13 నుంచి 30కి పెంచారు. దీనికోసం ఉత్తర్‌ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ లోను, పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి లోను, త్రిపుర లోని అగర్తల లోను, అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లోను, ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ లోను 5 కొత్త జోనల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న 12 సబ్-జోన్ల స్థాయిని జోన్ల స్థాయికి పెంచారు.
• అండమాన్, నికోబార్ దీవుల లోని పోర్ట్ బ్లేర్‌లో, నాగాలాండ్ లోని దీమాపూర్‌లో, మిజోరం లోని ఐజ్వాల్‌లో, హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో, మేఘాలయ లోని షిల్లాంగ్‌లో, సిక్కిం లోని గాంగ్‌టక్‌లో 6 కొత్త జోనల్ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఇటీవలే ఆమోదం తెలిపారు.
• దీనికి అదనంగా, 10 క్షేత్ర కార్యాలయాలకు కూడా ఆమోదముద్ర వేశారు. అవి తమ కార్యకలాపాలను మొదలుపెట్టాయి కూడా.
ఎన్‌సీబీలో కొత్తగా 568 ఉద్యోగావకాశాలను కల్పించారు.
• ఎన్‌సీబీలో ఒక ప్రత్యేక ప్రాసిక్యూషన్ డైరెక్టరేటును ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయ ఆమోదాన్ని కూడా తెలిపారు. దీనికి తోడు, ప్రభావవంతమైన ప్రాసిక్యూషన్ ప్రయత్నాలను మరింత ఎక్కువ శక్తిమంతంగా రూపొందించడానికి ప్రాంతీయ, జోనల్ కార్యాలయాల్లో 36 ప్రాసిక్యూటర్లను నియమించారు.
హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2287982)
आगंतुक पटल : 13