హోం మంత్రిత్వ శాఖ
‘మ్యూజియం ఆఫ్ వర్డ్‌స్’ ఒకటో దశను కోల్‌కతాలో ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
దేశంలో సాంస్కృతిక పునరుద్ధరణకు కృషి చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పాన్ని సాకారం చేస్తోంది ఈ మ్యూజియం
భాషలు, సంస్కృతితో పాటు సాంస్కృతిక పునరుద్ధరణను దేశ భావి తరాల వారికి అందించేందుకు ఓ శక్తిమంతమైన సాధనం ‘పదాల మ్యూజియం’
భాష, భావోద్వేగాలు, సంస్కృతి రూపుదిద్దుకొనేది పదాలతోనే.. దీనిని అర్థం చేసుకోకుండా భారత్‌లో సాంస్కృతిక పునుద్ధరణ సంపూర్ణత్వాన్ని సంతరించుకోదు
నూతన ఆవిష్కరణలను మనం ఎప్పుడూ కాదనలేదు.. గొప్పదైన ప్రతి దానినీ స్వీకరించాం.. అనేక సవాళ్లను, దాడులను ఎదుర్కొన్నా మన సాంస్కృతిక ప్రస్థానం హిమాలయాల్లా చెక్కుచెదరక నిలిచిందంటే అందుకు కారణం ఇదే
డిజిటల్ సాంకేతికతలను, కృత్రిమ మేధను మేళవించి ‘పదాల మ్యూజియం’ను విస్తరించడంతో పాటు భారతీయ భాషలను భావి సాంకేతికతలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి
భాష పూర్తి ప్రస్థానాన్ని వర్ణిస్తుంది ‘మ్యూజియం ఆఫ్ వర్డ్‌స్’.. ఓంకారం మొదలు వ్యాకరణం, శ్రుతి, స్మృతి, తాళపత్ర గ్రంథాలు, శిలాలేఖలు, ముద్రణాలయం నుంచి కృత్రిమ మేధ వరకూ భాష సమగ్ర యాత్రకు అద్దంపడుతుంది ఈ మ్యూజియం
భారత్‌లోని బహుభాషా చేతన, జ్ఞాన సంప్రదాయాలు, జన స్మృతిని దృశ్య, శ్రవణ, అనుభవాల సహితంగా సంరక్షించే ఒక సరికొత్త ప్రయత్నమే ఈ మ్యూజియం
అదృశ్య శబ్దాన్ని దృశ్య, శ్రవణ, స్పర్శాత్మక, అనుభవ పూర్వకమైందిగా మార్చే ముఖ్యమైన పనిని పూర్తి చేసింది ఈ మ్యూజియం
భారతీయ సాంస్కృతిక చేతనకు అంతర్జాతీయ స్థాయిలో ఓ దారిదీపంగా బెంగాల్ నిలిచింది.. ప్రపంచానికి మరోసారి మార్గాన్ని చూపే పాత్రను బెంగాల్ పోషించాల్సిన తరుణం వచ్చిందిక
మన మాటలు, మన సంస్కృతి, మన ఆత్మ విశ్వాసం నుంచి స్ఫూర్తిని పొంది 2047 కల్లా ‘వికసిత్ భారత్’ను ఆవిష్కరిద్దాం రండి.. భారత్‌ను ‘విశ్వ గురు’గా నిలబెడదాం...
భాష పరంగా మన సంకల్పం ఇలా ఉండాలి.. కుటుంబమే తొలి పాఠశాలగా మారాలి.. విశ్వవిద్యాలయాలు మౌలిక చింతన కేంద్రాలుగా రూపొందాలి.. అన్ని భాషలు డిజిటల్, ఏఐ మాధ్యమాల్లో సాధికారతను సంతరించుకోవాలి
प्रविष्टि तिथि:
19 JUL 2026 7:36PM by PIB Hyderabad
‘మ్యూజియమ్ ఆఫ్ వర్డ్‌స్’ ఒకటో దశను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ సువేందు అధికారి, ఆర్థిక మంత్రి శ్రీ స్వపన్ దాస్‌గుప్తా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేంద్ర సాంస్కృతిక కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టరుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సభను ఉద్దేశించి కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూ దేశవ్యాప్త భాషలకు, సంస్కృతికి ఒక ముఖ్యమైన రోజు ఈ రోజు అని వర్ణించారు. దేశంలో సాంస్కృతిక పునర్జాగృతికి కృషి చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పాన్ని ఈ ‘మ్యూజియమ్ ఆఫ్ వర్డ్‌స్’ ఇవాళ సాకారం చేస్తోందని శ్రీ అమిత్ షా అన్నారు. ఏదైనా దేశం లేదా రాష్ట్రం సంస్కృతిని వర్ణించడమనేది భాష లేనిదే సాధ్యపడదు అని మంత్రి అన్నారు. మనిషి భావాలను వ్యక్తం చేసే మాటలు లేనిదే భాషకు ఉనికే ఉండదు అని కూడా ఆయన చెప్పారు. మాటలతో భాష పుడుతుంది, మాటలు భావాల నుంచి పుడతాయి, సంస్కృతికి దర్పణంగా నిలిచేది భాషే, భాష లేకపోతే దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం అసాధ్యం అని శ్రీ షా అన్నారు. భారతదేశ భాషలు, సంస్కృతి, సాంస్కృతిక పునర్జాగరణను భావి తరాలకు చేర్చడంలో ‘మ్యూజియం ఆఫ్ వర్డ్‌స్’ ఒక శక్తిమంతమైన సాధనంగా నిలుస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
పాణిని వ్యాకరణ రచనకు సంబంధించిన పూర్తి చరిత్రను ఈ ‘మ్యూజియం ఆఫ్ వర్డ్‌స్’ చాలా చక్కని రీతిలో ఆవిష్కరించిందని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. అన్ని దిక్కుల నుంచి గొప్పవైన, శుభప్రదమైన ఆలోచనలు వస్తాయని, వాటిని అణగదొక్కడం కుదరదని, వాటిని ఎవ్వరూ వేధించారని, ఆలోచనల ఆధారంగానే సామాజిక జీవితాన్ని ముందుకు తీసుకుపోవాలని రుగ్వేదం చాటుతోందని ఆయన వివరించారు. మన నాగరికతలో సంకుచిత భావాలు జనించలేవని, సంకుచితత్వానికి మన ఆలోచనావిధానంలో చోటు లేకపోవడమే దీనికి కారణమని ఆయన అన్నారు. మనం భూమి పూజను చేసినప్పుడు గాని, లేదా శాంతి మంత్రాన్ని పఠించినప్పుడు గాని ఒక్క మానవ జాతి అనే కాకుండా పశువులు, మొక్కలు, యావత్తు విశ్వంలో శాంతి వర్ధిల్లాలని కోరుకుంటుంటామని ఆయన గుర్తు చేశారు. ఈ కారణంగా, సంకుచితత్వం భారతీయ సంస్కృతికి ఒక సంకేతంగా ఎప్పటికీ నిలవలేదు అని ఆయన స్పష్టం చేశారు.

‘మ్యూజియమ్ ఆఫ్ వర్డ్‌స్’ మన భాషలతో పాటు మన సంస్కృతిని చాలా కాలం దాకా మన భావి తరాల వారికి నేర్పుతుందని, వారికి మన విశిష్ట సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేస్తుందని, ఆ వారసత్వంలో వేళ్లూనుకున్న జీవన మార్గంలో నడిచేలా మార్గం చూపుతుందని శ్రీ అమిత్ షా అన్నారు. భావాల పైన గాని, లేదా ఆలోచనల పైన గాని ఆంక్షలను భారత్ ఎన్నడూ విధించ లేదని ఆయన అన్నారు. ఓంకారం మొదలు మాటల కూర్పు, వ్యాకరణ రచన, శ్రుతి, స్మృతి, చేతిరాత ప్రతులు, శిలాలేఖల నుంచి ముద్రణ యంత్రం వరకూ.. ఈ సమగ్రమైన మాటల ప్రయాణాన్ని మ్యూజియం కళ్లకు కడుతుందన్నారు. డిజిటల్, కృత్రిమ మేధ (ఏఐ) సహా ‘మ్యూజియమ్ ఆఫ్ వర్డ్‌స్’ను విస్తరించాలని, భవిష్యత్తు సాంకేతికతలకు అనుగుణంగా భారతీయ భాషలను అభివృద్ది చేయాలని ఆయన సూచించారు. నూతన ఆవిష్కరణలకు భారత్ అభ్యంతరం చెప్పిన దాఖలాలు లేవని, గొప్ప ఆలోచనలను, శుభప్రదమైన పరిణామాలను భారత్ సదా ఆమోదించిందని శ్రీ షా అన్నారు. ఈ కారణంగానే, లెక్కపెట్టలేనన్ని సవాళ్లు, దాడులు ఎదురైనప్పటికీ దేశ సాంస్కృతిక ప్రస్థానం హిమాలయాల్లా ఉన్నతంగా ఉందన్నారు. భారత్‌లోని బహు భాషల చేతనత్వం, జ్ఞాన పరంపర, జనస్మృతి.. వీటిని దృశ్య, శ్రవణ, అనుభవపూర్వక పంథాల్లో సంరక్షించే ఒక నూతన ప్రయత్నమే ఈ ‘పదాల మ్యూజియం’ అని మంత్రి చెప్పారు.

బెంగాల్‌లో అనేక మ్యూజియాలు ఉన్నాయని, ‘పదాల మ్యూజియం’ చాలా కొద్ది కాలంలో తనకంటూ ఒక ప్రధాన స్థానాన్ని ఏర్పరుచుకొంటుందన్న నమ్మకం తనకు ఉందని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఈ మ్యూజియానికి వచ్చే ప్రతి ఒక్కరూ అమూల్య జ్ఞానాన్ని, స్ఫూర్తిని తప్పక పొందుతారని ఆయన అన్నారు. ‘రాబోయే తరం వారికి భాషా విజ్ఞానాన్ని పరిచయం చేయడం ఎంతో కష్టమైన పని.. అయితే ఈ పనిని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ విజయవంతంగా చేసి చూపించింది’ అని శ్రీ షా అన్నారు. ‘‘పదాలను ఎవ్వరూ అడ్డుకోజాలరు.. కానీ పదాల విజ్ఞానాన్ని ఈ మ్యూజియమ్ తనలో ఇముడ్చుకొంది. పదాలను వినవచ్చు, పలకవచ్చు, జీవించవచ్చు, తరువాతి తరం వారికి అందజేయనూవచ్చు.. ఈ వారసత్వాన్ని భద్రపరిచి, భావి తరం వారికి అప్పగించే బాధ్యతను నిర్వర్తించడంలో మ్యూజియం కీలక పాత్రను పోషిస్తుంది’’ అని మంత్రి అన్నారు. భారతదేశ అదృశ్య వారసత్వాన్ని సాంస్కృతిక శాఖ దృశ్య, శ్రవణ, అనుభవ పూర్వకంగా తీర్చిదిద్దే పనిని సాంస్కృతిక శాఖ ఈ మ్యూజియం స్థాపన ద్వారా నెరవేర్చిందని శ్రీ అమిత్ షా అన్నారు.

‘‘ప్రపంచంలో మొట్టమొదటి సారి పలికిన మాట ఏదని ‘మ్యూజియం ఆఫ్ వర్డ్‌స్’లో ప్రశ్నించినప్పుడు ఓంకారం అనే సమాధానం వస్తుంది.. ఓంకారం పేరు వినగానే నిజంగానే ప్రపంచంలో పలికిన మొదటి మాట ఓంకారమేననే మనకూ అనిపిస్తుంది’’ అని కేంద్ర హోం మంత్రి అన్నారు. తల్లి నోట లాలిపాటలను మనం మన మాతృభాషలో విన్నప్పుడు.. వెంటనే మనకు మన అమ్మ గుర్తుకొస్తుంది అని ఆయన చెప్పారు. ‘‘మ్యూజియంలో అనేక విధాలైన కళాకృతులను, చేతిరాత ప్రతులను పదిలపరిచారనీ, వాటిని చూడవచ్చు, తాకవచ్చు’’ అని ఆయన వివరించారు. దేశంలోని అనేక మాండలికాలను, భాషలను, ప్రతి ప్రాంతానికీ చెందిన జానపద సంప్రదాయాలను మ్యూజియంలో కొలువుదీర్చారని, మాటల మాధ్యమం ద్వారా మన సాంస్కృతిక ప్రస్థానాన్ని వివరిస్తారని మంత్రి అన్నారు. అనేక శిలాలేఖలు, రాగి రేకులు, భోజపత్ర ప్రతులు, చేతిరాత ప్రతులే కాకుండా అచ్చువేసిన పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నారు. డిజిటల్ టెక్స్‌ట్, శ్రవణ మాధ్యమ పురావస్తువులకు తరువాయిగా ఇక ఏఐ యుగంలోనూ ఈ ప్రస్థానాన్ని కొనసాగించవలసి ఉందని శ్రీ షా అన్నారు.
మాటల మ్యూజియంలో ప్రతి ఒక్క గ్యాలరీ ని ఎంతో శాస్త్రీయ పద్ధతిలో రూపొందించారని శ్రీ అమిత్ షా అన్నారు. ఓరియంటేషన్ విభాగం భాష పుట్టుక నుంచి మొదలవుతుందని, పౌరాణికాలు, జోలపాటలు, అనుభూతిపూర్వక మాధ్యమాల ద్వారా భాషా వికాస క్రమాన్ని అర్థం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారని ఆయన వివరించారు. ప్రతి ఒక్క వ్యక్తికీ తన మాతృభాషతో విడదీయలేని ఒక గాఢ భావోద్వేగ భరిత బంధం ఉంటుందని, ఈ అనుబంధమే మనిషి స్వభావంలో ఓ అంతర్భాగంగా మారాలని శ్రీ షా స్పష్టం చేశారు.
భాషావిజ్ఞానం సహజంగా అభివృద్ధి చెందిన విజ్ఞానమని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. భాష తప్పక విజ్ఞానమే.. కానీ, అది అవసరాలను ఆధారంగా చేసుకొని వర్ధిల్లిందని ఆయన తెలిపారు. భాషలు చాలా సహజత్వంతో మార్పు చెందాయని, ఆ కారణంగానే జనబాహుళ్యంలో ఆదరణకు నోచుకున్నాయని ఆయన చెప్పారు. దేశంలో ప్రతి భాష మనుగడలో ఉండేటట్లు చూడటానికి ఎంతో మంది మహానుభావులు, కవులు, రచయితలు తమ వంతు తోడ్పాటును అందించారని శ్రీ అమిత్ షా తెలిపారు. వారి అమూల్య సేవలను గౌరవించుకోవడానికి మాటల మ్యూజియంలో ప్రత్యేకంగా ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. దేశ భవిత ఆ దేశంలోని కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఎంత ఎక్కువ మంది విద్యను అభ్యసిస్తున్నారనే అంశంపై ఆధారపడదని, ఎంతమంది యువకులు ఆ ఉన్నత విద్యాసంస్థల్లోని గ్రంథాలయాలకు వెళ్తుంటారనే అంశంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడుతుందని శ్రీ షా అన్నారు. యువతీయువకులు తమ వ్యక్తిత్వాన్నీ, మేధను పెంపొందించుకోవడానికి గ్రంథాలయాలను ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
భారత నాగరికతా చైతన్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ వచ్చిన దీపస్తంభంగా పశ్చిమ బెంగాల్ చాలా కాలం పాటు నిలిచిందని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. భారత సాంస్కృతిక చేతన నుంచి దూరంగా సుదీర్ఘ కాలం పాటు బెంగాల్‌ను నిలిపే ప్రయత్నాలు సాగాయంటూ ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. దేశానికీ, ప్రపంచానికీ సేవలను అందించడానికి బెంగాల్‌కున్న సామర్థ్యాన్ని క్షీణింపచేసింది ఈ సంకుచిత, విదేశీ ఆలోచనావిధానాలే అని శ్రీ షా అన్నారు. మహర్షి అరవిందులు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, చైతన్య మహాప్రభుల పురుటిగడ్డ బెంగాల్ అని శ్రీ షా చెప్పారు. దేశంలో అత్యంత ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, ప్రసిద్ధ సాహిత్యకారులతో పాటు అతి గొప్ప క్రాంతికారుల్లో ఒకరైన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వంటి వారిని అందించింది కూడా బెంగాల్‌యే అని ఆయన అన్నారు. బెంగాల్ సాంప్రదాయికంగా దశాబ్దాల పాటు దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా ముందు నిలిచి, తన మేధోపరమైన, సంస్కృతి పరమైన నాయకత్వంతో దేశానికి మార్గదర్శకత్వం వహించిందని శ్రీ షా అన్నారు. భారతదేశ సాంస్కృతిక చేతనకు సంబంధించిన మేధోపరమైన దారిదీపం మరో సారి ఉజ్జ్వలమై, తన పూర్తి ప్రకాశంతో ప్రపంచాన్ని మేల్కొలుపుతుందని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీ సువేందు అధికారి సారథ్యంలో బెంగాల్‌లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న మార్పులతో ఈ రాష్ట్రం త్వరలోనే భారతీయ చేతనకు వెలుగులు విరజిమ్మే దారిదీపంగా మారగలదన్న విశ్వాసం తనకు ఉందని శ్రీ షా అన్నారు. మహర్షి అరవిందులను అధ్యయనం చేయనిదే భారత్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేరని కూడా కేంద్ర హోం మంత్రి అన్నారు. మహర్షి అరవిందులు భారత భూత, వర్తమానాలను గురించి రాశారనీ, భారత్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కూడా ఆయన భావి తరాల వారికి సూచించారనీ కేంద్ర మంత్రి చెప్పారు. ఒకనాటికి ఖచ్చితంగా విశ్వ గురు స్థానాన్ని భారత మాత మళ్లీ చేజిక్కించుకుంటుందనీ, తన సర్వ శ్రేష్ఠత్వాన్ని పూర్తి ప్రపంచానికి అందించే ప్రయత్నాన్ని చేస్తుందనీ చెప్పింది మహర్షి అరవిందులేనని శ్రీ షా అన్నారు.
పదాలకు, భాషకు ఉన్న శక్తిని గ్రహించాల్సిందిగా యువ తరానికి శ్రీ అమిత్ షా విజ్ఞప్తి చేశారు. పదాలను పలికే తీరును మెరుగుపరుచుకోవాలని, వ్యాకరణ సూత్రాలపై పట్టును సాధించి భావ వ్యక్తీకరణను మరింత ప్రభావవంతంగా మార్చుకోవాలని ఆయన సూచించారు. ఇది సమాజంలో యువతకు స్వీకృతిని, విశ్వసనీయతను అనేక రెట్లు పెంచుతుందని ఆయన చెప్పారు.
దేశమంతా ప్రస్తుతం వందే మాతరం గేయానికి 150వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకొంటోందని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గుర్తు చేశారు. ఈ చరిత్రాత్మక సమయంలో పదాల మ్యూజియాన్ని ప్రారంభించుకుంటూ ఉండడం మహత్తర విషయమని ఆయన అన్నారు. ఎవరైనా వేదికపై నిల్చొని వందే మాతరం గేయం పూర్తి ఆలాపనను వింటే, భరత మాత పట్ల దేశంలో ప్రతి ఒక్కరికీ ఎంత భక్తిభావం, గౌరవ భావం ఉన్నాయో ఆ వ్యక్తికి తెలుస్తుందని మంత్రి అన్నారు. ఈ గేయం ఇస్తున్న గొప్ప సందేశం స్వతంత్య్రానంతరం 76-77 సంవత్సరాల పాటు దేశ ప్రజలకు అందకుండా ఉండిపోయిందని ఆయన అన్నారు. ప్రస్తుతం, వందేమాతరం జాతీయ గేయాన్ని దేశవ్యాప్తంగా పాఠశాలల్లో పూర్తిగా పాడుతూ ఉండటం సంతోషదాయకమని ఆయన చెప్పారు. ఇది ఎంతో ఆనందాన్నిస్తున్న అంశమని కూడా ఆయన అన్నారు.
బెంగాలీ భాషకు 2024లో శాస్త్రీయ భాష హోదాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చారని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. దేశ ప్రజలు ఇటీవలే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పాటించారని కూడా శ్రీ షా తెలిపారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవ ప్రసంగాన్ని బెంగాలీలో ఇవ్వండంటూ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌ను ఆహ్వానించింది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీయే అని శ్రీ షా అన్నారు. బ్రిటిషు హయాంలో, దేశంలో ఏదైనా విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవ ప్రసంగాన్ని ఒక భారతీయ భాషలో ఇవ్వడం ఇదే మొదలు అని కూడా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం బెంగాల్ మరో సారి ‘సోనార్ బాంగ్లా’గా మారే దిశగా ముందుకు సాగుతోందని శ్రీ అమిత్ షా అన్నారు.
భాషను సృష్టించింది తామేనని మానవులు తరుచుగా భావిస్తుంటారని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. అయితే తాను మాత్రం భాషయే మానవజాతిని తీర్చిదిద్దిందని నమ్ముతున్నానని ఆయన చెప్పారు. ‘భావాలు జాగృతం అయినప్పుడు మనిషి నిజంగా మానవతను అలవరుచుకుంటాడు, భాషయే భావాన్ని మేల్కొలుపుతుంది. భాష మూలాధారం పదాలే. అవి కూడా ఒకరి సొంత భాషలోని పదాలే. ఈ వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు ప్రోత్సహించడంలో ‘పదాల మ్యూజియం’ ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది’ అని మంత్రి వివరించారు. భాషలను పరిరక్షించి, అభివృద్ధి చేయడంలో అయిదు సూత్రాలు కీలకమని ఆయన అన్నారు. అవి.. ఒకటోది, కుటుంబం మాట్లాడే భాషే మొదటి పాఠశాల కావాలి. రెండోది, పిల్లలు మాతృభాషలోనే చదువుకోవాలి. మూడోది మౌలిక ఆలోచనలకు కేంద్రాలుగా విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు నిలవాలి. అప్పుడు మాత్రమే మనం సృజనలో మన వంతు తోడ్పాటును అందించగలుగుతాం. మౌలిక ఆలోచనలు చేయడానికి అంకురార్పణ విశ్వవిద్యాలయాల్లో జరగాలి. ప్రతి భారతీయ భాషను డిజిటలీరించడంతో పాటు కృత్రిమ మేధ కూడా ఆ భాషను వినియోగించుకొనేట్టు చూడాలి. ఇలా చేస్తే భారతదేశానికి చెందిన ప్రతి భాషనూ మరో 1000 సంవత్సరాల పాటు మనుగడలో ఉండే దిశగా ప్రయత్నాలను చేపట్టాలి. గ్రంథాలయాలు, మ్యూజియాలు వాటి భవన సదుపాయాలకే పరిమితం కాకూడదు, అవి ప్రతీకలుగా నిలుస్తున్న విలువలు, జ్ఞానం యువకులకు చేరవేయడానికి ప్రజాసంబంధ ప్రచార ఉద్యమాలను నిర్వహించాట్టాలి అని కేంద్ర మంత్రి అన్నారు. ‘యువతలో ప్రతి ఒక్కరూ తమ మాతృభాషకు తోడు మరో భారతీయ భాషను నేర్చుకుని తీరాలి. దీనివల్ల మనం ఒక్క మన అమ్మభాషనే కాకుండా భారత్‌లోని అన్ని భాషలకు కూడా దీర్ఘాయుష్షును ఇచ్చే మార్గంలో ముందుకు పోగలుగుతాం’ అని శ్రీ షా అన్నారు. ఈ అయిదు సూత్రాలను ప్రభుత్వాలు, విద్యావ్యవస్థ.. అన్నింటినీ మించి దేశ ప్రజలు ఆచరించినప్పుడు భారతీయ భాషల పరిరక్షణకు, ప్రోత్సాహానికి, సేవకు గొప్ప తోడ్పాటును అందించినట్లు అవుతుందని మంత్రి వివరించారు.

భారతీయ సంస్కృతికి దీప స్తంభంగా భావించే బెంగాల్ గడ్డ మీద నుంచి పదాల సంస్కృతిని బలోపేతం చేస్తామని మనం సంకల్పం చెప్పుకోవాల్సివుందని శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారు. శక్తిమంతమైన సంస్కృతి ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేస్తుందనీ, ఆత్మవిశ్వాసంతో 2047 కల్లా ‘వికసిత్ భారత్’ దృష్టికోణాన్ని ఆచరణ లోకి తీసుకు వచ్చి భరత మాతను విశ్వానికి గురువుగా పున:ప్రతిష్ఠించాలన్న ఆకాంక్షను నెరవేరుద్దామనీ ఆయన అన్నారు. ఈ దార్శనికతను సాకారం చేయడానికి ‘మ్యూజియం ఆఫ్ వర్డ్‌స్’ పునాదిగా మారుతుందని శ్రీ షా వ్యాఖ్యానించారు.
****
(रिलीज़ आईडी: 2286648)
आगंतुक पटल : 11