యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘మై భారత్’ ద్వారా లక్ష మంది యువ నాయకులను తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి దార్శనికత సాకారం: డాక్టర్ మన్సుఖ్ మాండవీయా

‘సంవాద్‌ లేకపోతే సమాధానం లభించదు’: చింతన్ శిబిరం ప్రాముఖ్యతను ప్రస్తావించిన రక్షణ శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే



‘వికసిత్‌ భారత్ కోసం వికసిత్‌ యువత’ ఇతివృత్తంతో లక్నోలో ప్రారంభమైన నాల్గో చింతన్ శిబిరం

प्रविष्टि तिथि: 18 JUL 2026 5:28PM by PIB Hyderabad

యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన యువజన వ్యవహారాల విభాగం, మై భారత్‌ సంయుక్త ఆధ్వర్యంలో లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్ఠాన్‌ వద్ధ చింతన్ శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ‘వికసిత్ యువతతో వికసిత్ భారత్‌’ ఇతివృత్తంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ నాల్గో చింతన్ శిబిరంలో యువజన వ్యవహారాల విభాగం, మై భారత్, మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్‌) సీనియర్ అధికారులు, జిల్లా యువజన అధికారులు, ప్రాంతీయ డైరెక్టర్లతో పాటు కేంద్రపాంత్రానికి చెందిన క్షేత్రస్థాయి సిబ్బింది పాల్గొన్నారు. దేశ అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేసేలా సమర్థవంతమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే యువజన వ్యవస్థను నిర్మించే వ్యూహాలపై వీరంతా ఇక్కడ సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. నిర్మాణాత్మక చర్చలు, ఉత్తమ పద్ధతుల మార్పిడి, ఉమ్మడి విధాన రూపకల్పన ద్వారా క్షేత్రస్థాయి అమలును బలోపేతం చేయడం, యువజన అభివృద్ధికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం.

ఈ ప్రారంభోత్సవ సమావేశానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గిరీష్ చంద్ర యాదవ్, యువజన వ్యవహారాల విభాగం కార్యదర్శి డాక్టర్ పల్లవి జైన్ గోవిల్, యువజన వ్యవహారాల విభాగం జాయింట్ సెక్రటరీ శ్రీ శివ్ రతన్, మై భారత్, ఎన్‌ఎస్‌ఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

డాక్టర్ మన్సుఖ్ మాండవీయా మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాలలో చింతన్ శిబిరం నిర్వహించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల మధ్య సంభాషణ, సహకారం, ఉమ్మడి అభ్యాస సంస్కృతిని పెంపొందించడమే దీని లక్ష్యమని చెప్పారు. ‘‘చింతన్ అంటే ఆలోచనల సమాహారం. అధికారుల మధ్య చర్చను సులభతరం చేయడానికి మేం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఎందుకంటే చర్చ లేకుండా స్పష్టత రాదు, స్పష్టత లేకపోతే సమర్థవంతమైన అమలు సాధ్యం కాదు’’ అని ఆయన పేర్కొన్నారు.

మై భారత్ వేదికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతగా అభివర్ణించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయా.. వికసిత భారత్ 2047 వైపు భారత్‌ను నడిపించే సమర్థులైన యువ నాయకుల తరాన్ని తయారు చేయడానికి ఈ వేదిక స్థాపించినట్లు చెప్పారు. సమాజంలోని ప్రతి విభాగం నుంచి లక్ష మంది యువ నాయకులను అభివృద్ధి చేయాలనే ప్రధానమంత్రి దార్శనికతను ప్రస్తావిస్తూ.. యువతను నాయకత్వం, వ్యక్తిత్వ నిర్మాణం, దేశ నిర్మాణంతో అనుసంధానించడానికి మై భారత్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. పంచ ప్రాణ్‌లకు అనుగుణంగా జిల్లా యువజన అధికారులు, ఎన్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను కర్తవ్య భావం, సేవతో పనిచేయాలని ఆయన కోరారు. తమను తాము యువజన సాధికారతకు సహకరించే వారూగా భావించాలని పిలుపునిచ్చారు. ‘మీ పనిని కేవలం ఉపాధిగా చూడకండి. ఈ దేశ యువతను చైతన్యపరచడం, వారికి సాధికారత కల్పించడం మీ బాధ్యత. మనం అధికారులుగా కాకుండా సేవలను అందించే వారిగా పనిచేసినప్పుడు ఫలితాలు ఎల్లప్పుడూ మెరుగ్గా ఉంటాయి’ అని అన్నారు.

క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిస్తూ.. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంఘాలను చేరుకోవడం ద్వారా ఆగస్టు 15 వరకు కొనసాగుతున్న మై భారత్ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని కేంద్ర మంత్రి అధికారులను కోరారు. ‘‘మై భారత్‌ను ప్రతి యువ పౌరుడి వద్దకు తీసుకెళ్లండి. అర్హులైన ప్రతి యువకుడిని ఈ వేదికతో అనుసంధానించండి. మీ నిబద్ధత, క్షేత్రస్థాయి భాగస్వామ్యం ద్వారా ఈ నమోదు కార్యక్రమాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా మార్చండి’’ అని చెప్పారు.

వికసిత్‌ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (వీబీవైఎల్‌డీ) పరిధిని విస్తరించడంలో ఒక కీలక ముందడుగు వేస్తూ, ఈ కార్యక్రమం ఇప్పుడు జాతీయ చర్చతోపాటు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను కూడా కలిగి ఉంటాయని డాక్టర్ మన్సుఖ్ మాండవీయా తెలిపారు. ఈ విస్తరించిన కొత్త వ్యవస్థ వికసిత భారత్ 2047 వైపు సాగే ప్రయాణంలో యువ నాయకుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.

శివిర్‌ను ఉద్దేశించి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే మాట్లాడుతూ.. రెండు కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లతో మై భారత్ దేశంలోనే అతిపెద్ద యువజన వేదికగా అవతరించిందని, దేశ నిర్మాణం పట్ల యువతకు ఉన్న పెరుగుతున్న నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తోందని చెప్పారు. వివిధ రాష్ట్రాల అధికారులు క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకోవడానికి, అమలులో ఎదురయ్యే సవాళ్లను చర్చించడానికి, ఉమ్మడిగా ఆచరణాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఒక వేదికను అందించడం ద్వారా ఈ చింతన్ శిబిరం కార్యక్రమం చర్చల ఆధారిత పాలనకు ఒక వ్యవస్థీకృత రూపాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ‘‘చర్చ లేకపోతే సమాధానం లభించదు. క్షేత్రస్థాయిలో పనిచేసే మన అధికారుల అనుభవాల నుండే ఉత్తమ పరిష్కారాలు వస్తాయి’’ అని ఆమె స్పష్టం చేశారు.

కేంద్ర-రాష్ట్రాల సన్నిహిత సహకారం ద్వారా క్షేత్రస్థాయిలో యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని కేంద్ర సహాయ మంత్రి పేర్కొన్నారు. వికసిత్‌ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్‌ను ప్రస్తావిస్తూ.. ఇది యువ వాలంటీర్లలో జాతీయ సమగ్రత, సేవా భావాన్ని పెంపొందించిందని చెప్పారు. ‘‘మనమందరం ఒకే దార్శనికతతో కలిసి పనిచేస్తే వికసిత్‌ భారత్ సంకల్పాన్ని నెరవేరుస్తాం. యువజన కార్యక్రమాలను చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లడంలో ప్రతి అధికారికి మంత్రిత్వ శాఖ తన మద్దతును కొనసాగిస్తుంది’’ అని ఆమె తెలిపారు.

శ్రీ గిరీష్ చంద్ర యాదవ్ మాట్లాడుతూ.. చింతన్ శిబిరం అనేది కేవలం ఒక పరిపాలనాపరమైన ప్రక్రియ మాత్రమే కాదని, సాధికారత కలిగిన యువత ద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మన ఉమ్మడి నిబద్ధతకు ఇది ప్రతీక అని అన్నారు. మై భారత్‌ను ఆవిష్కరణలు, దేశభక్తి, యువ నాయకత్వ ఉద్యమంగా అభివర్ణించిన ఆయన, వికసిత్‌ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ‘‘యువత మేల్కొన్నప్పుడు కేవలం ప్రణాళికలు, సంస్థలు మాత్రమే మారవు.. దేశమే స్వయంగా మారుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, బ్లాక్, విద్యా సంస్థలను యువ నాయకత్వ, సామాజిక సేవా కేంద్రాలుగా మార్చాలని అధికారులకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ అక్షరాస్యత, విపత్తు నిర్వహణ, పరిశుభ్రత, మహిళల భద్రత వంటి రంగాలలో క్షేత్రస్థాయిలో విజయవంతమైన కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని ఆయన కోరారు.

అధికారులకు స్వాగతం పలుకుతూ.. శాఖాపరమైన చర్చలను మరింత ఫలితాధారితంగా మార్చడంలో ఈ నాల్గో చింతన్ శిబిరం కీలక పరిణామంగా డాక్టర్ పల్లవి జైన్ గోవిల్ అభివర్ణించారు. మై భారత్, ఎన్‌ఎస్‌ఎస్ మధ్య అనుసంధానాన్ని శాఖ బలోపేతం చేస్తోందని, సంస్థాగత వ్యవస్థలను మెరుగుపరుస్తోందని చెప్పారు. కేవలం రిజిస్ట్రేషన్లకే పరిమితం కాకుండా అర్థవంతమైన యువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ‘‘రిజిస్ట్రేషన్ మాత్రమే మన గమ్యం కాదు. దేశ నిర్మాణం, అనుభవపూర్వక అభ్యాసం, యువత క్రియాశీల భాగస్వామ్యం కోసం బలమైన వేదికలను నిర్మించడమే నిజమైన లక్ష్యం’’ అని ఆమె తెలిపారు.

ప్రారంభ సమావేశం అనంతరం ఈ శిబిరం ప్రధాన ఇతివృత్తమైన ‘సంవాద్ సే సమాధాన్’ (చర్చల ద్వారా పరిష్కారాలు)పై నేపథ్య చర్చలతో ముందుకు సాగింది. ఇందులో మై భారత్ వేదిక, డిజిటల్ యువ చేరిక ప్రక్రియ-భాగస్వామ్యం, మై భారత్-ఎన్‌ఎస్‌ఎస్ నిధుల ప్రవాహ యంత్రాంగం, వివిధ శాఖల మధ్య సమన్వయం, వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2026-27పై ప్రదర్వనలతో కూడిన సాంకేతిక సమావేశాలను నిర్వహించారు. క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకోవడానికి, ఆచరణాత్మక పరిష్కారాలను సమష్టిగా గుర్తించడానికి ఇది అధికారులకు మంచి వేదికను అందించింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అనుభవపూర్వక అభ్యాసం, వాలంటీర్ల సమీకరణ, యువజన క్లబ్‌లు, కార్యక్రమాల అమలులో తమ ఉత్తమ పద్ధతులను ప్రదర్శించాయి. ఇది ఇతర పాల్గొనేవారికి విజయవంతమైన నమూనాల నుంచి నేర్చుకోవడానికి, వాటిని తమ రాష్ట్రాల్లో అమలు చేసేలా పరిశీలించడానికి తోడ్పడింది.

మై భారత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ ప్రియాంక శుక్లా ప్రస్తుతం కొనసాగుతున్న “నషా ముక్త్ యువా ఫర్ వికసిత్‌ భారత్” ప్రచారాన్ని అధికారులకు వివరించారు. అవగాహన పెంచడం, తల్లిదండ్రులను చైతన్యపరచడం, వ్యసన రహిత భారత్‌ను నిర్మించడం కోసం మూడు రకాల స్థాయిల్లో సాంస్కృతిక పోటీలను నిర్వహించనున్నారు. ఇవి ఢిల్లీలో జరిగే జాతీయ యువజన సదస్సుతో ముగుస్తాయి.

రెండో రోజు సమర్పించాల్సిన సిఫార్సులను మరింత మెరుగుపరచడానికి, కీలకమైన చర్చల సమీక్ష, నేపథ్య కార్యవర్గాల ఏర్పాటుతో మొదటి రోజు చింతన్‌ శిబిరం ముగిసింది. ఈ చర్చలు సహకార, ఫలితాధారిత పాలనా సంస్కృతిని పెంపొందించడానికి, ‘‘వికసిత్‌ యువత కోసం వికసిత్‌ భారత్’’ దార్శనికతను సాకారం చేయడానికి మై భారత్ వ్యవస్థను బలోపేతం చేయడంలో శాఖకు ఉన్న నిబద్ధతను ప్రతిబింబించాయి.

 


(रिलीज़ आईडी: 2286223) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , Marathi , हिन्दी , Tamil