సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఆదర్శ గ్రామ విభాగం ద్వారా లబ్ధి పొందిన 47.59 లక్షలకు పైగా పౌరులు:16,759 ఆదర్శ గ్రామాల ప్రకటన
పూర్తయిన 46,782కు పైగా అభివృద్ధి పనులు, దేశవ్యాప్తంగా సిద్ధమైన 24,133 గ్రామాభివృద్ధి ప్రణాళికలు
750 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు గాను రెండు బాలికల హాస్టళ్లతో సహా మూడు వసతి గృహాల నిర్మాణానికి రూ.22.50 కోట్ల కేటాయింపు
ఎస్సీ వర్గానికి చెందిన వారికి సాధికారత కల్పించే, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించే దిశగా లక్షిత కార్యక్రమాలు,
సహకార ప్రయత్నాల ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలను పరిష్కరించడంలో పీఎం-ఏజేఏవై కీలక పాత్ర పోషిస్తుంది: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్
प्रविष्टि तिथि:
17 JUL 2026 6:26PM by PIB Hyderabad
ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన (పీఎం-ఏజేఏవై) ద్వారా షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక సాధికారతను సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ బలోపేతం చేస్తోంది. సాంకేతిక ఆధారితమైన, ఫలితాల ఆధారితమైన విధానం ద్వారా షెడ్యూల్డ్ కులాల జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లో పేదరికాన్ని తగ్గించడం, సుస్థిరమైన జీవనోపాధి అవకాశాలను అందించడం, మౌలిక వసతులను మెరుగుపరచడం, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడమే ఈ ప్రతిష్ఠాత్మక పథకం లక్ష్యం.
పీఏం-ఏజేఏవై పథకంలోని ఆదర్శ గ్రామ విభాగం పరిధిలోకి దేశంలోని 47,316 గ్రామాలను తీసుకురావడం ద్వారా 47,59,399 మందికి లబ్ధి చేకూరిందని మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి తెలియజేశారు. మొత్తం 46,782 అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, 24,133 గ్రామాభివృద్ధి ప్రణాళికలు (వీడీపీలు) సిద్ధమయ్యాయని ఆయన తెలియజేశారు.
షెడ్యూల్డ్ కులాలు అధికంగా ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సేవలు, జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సాధించిన గణనీయమైన పురోగతిని ప్రతిబింబిస్తూ… 16,759 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించినట్లు అధికారి తెలిపారు.
షెడ్యూల్డ్ కులాల యువతకు విద్యావకాశాలను మెరుగు పరచాలనే ప్రభుత్వ నిబద్ధతను బలోపేతం చేస్తూ 2026-27 ఆర్థిక సంవత్సరంలో వసతి గృహాల నిర్మాణానికి మంత్రిత్వ శాఖ రూ. 22.50 కోట్ల కేంద్ర సహాయాన్ని కేటాయించింది. ఈ నిధులతో 750 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు రెండు బాలికల వసతి గృహాలతో సహా మూడు హాస్టల్ ప్రాజెక్టుల నిర్మాణం చేపడతారు.

ఎస్సీ వర్గాలకు చెందిన వారికి సాధికారత కల్పించే, సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా చేపడుతున్న లక్షిత కార్యక్రమాలు, సహకార ప్రయత్నాల ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలను పరిష్కరించడంలో పీఎం-ఏజేఏవై కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అన్నారు. సమన్వయం, సామాజిక భాగస్వామ్యం ద్వారా సామాజిక వర్గాలకు సాధికారత కల్పించడం, క్షేత్ర స్థాయి సంస్థలను బలోపేతం చేయడం ద్వారా ఈ పథకం సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.
షెడ్యూల్డ్ కులాల సంపూర్ణాభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న పీఎం-ఏజేఏవై పథకంలో మూడు ప్రధాన విభాగాలు ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సమాజ ఆధారిత ప్రణాళిక ద్వారా గ్రామాల సమగ్రాభివృద్ధిపై ఆదర్శ గ్రామ విభాగం దృష్టి సారిస్తుంది. జీవనోపాధి కల్పనకు, నైపుణ్యాభివృద్ధికి, ఆదాయాన్ని పెంచే కార్యకలాపాలకు గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ విభాగం తోడ్పాటు అందిస్తుంది. షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు విద్యావకాశాలను మెరుగుపరిచేందుకు వసతి గృహాల నిర్మాణం, మరమ్మతుల కోసం ఆర్థిక సాయాన్ని హాస్టల్ విభాగం అందిస్తుంది.
ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ఆన్‌లైన్లో అమలు చేయడానికి పీఎం-ఏజేఏవై పోర్టల్, ఏజేఏవై మొబైల్ అప్లికేషన్ ద్వారా విస్తృతమైన డిజిటల్ పాలనా విధానాన్ని మంత్రిత్వ శాఖ స్వీకరించింది. గ్రామాభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయడం, ప్రాజెక్టు మదింపు, నిధుల ట్రాకింగ్, లబ్ధిదారుల పర్యవేక్షణ, జియో-ట్యాగింగ్ రిపోర్టింగును సులభతరం చేస్తుంది. తద్వారా ప్రతి దశలోనూ పారదర్శకత, సమర్థవంతమైన పర్యవేక్షణ సాధ్యమవుతుంది.
పీఏం-ఏజేఏవై పరిధిలో చేపట్టే ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, అమలు సంస్థలతో కలసి మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. మౌలిక వసతులు, జీవనోపాధి, విద్య, డిజిటల్ పరిపాలనలో పెట్టుబడులను కొనసాగించడం ద్వారా సమ్మిళితమైన, సమానత్వం నిండిన సమాజాన్ని నిర్మించే దిశగా ఈ పథకం తోడ్పడుతుంది. అలాగే భారతదేశ వృద్ధి గాథలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వర్గాలు పూర్తి స్థాయిలో భాగమయ్యేలా చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2286119)
आगंतुक पटल : 8