శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భవిష్యత్ బయోటెక్నాలజీ కోసం శ్రామిక శక్తి నిర్మాణం లక్ష్యంగా

భారత తొలి ఇంజనీరింగ్ బయాలజీ గ్రాడ్యుయేషన్ కోర్సును ప్రకటించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

2035 నాటికి ఏఐ-ఆధారిత జీవశాస్త్రం, బయో-మాన్యుఫ్యాక్చరింగ్ ద్వారా ప్రపంచ బయోఎకానమీలో భారత్ నాయకత్వం లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక

తదుపరి తరం బయోటెక్నాలజీ, బయో-మాన్యుఫ్యాక్చరింగ్ కోసం భారత వ్యూహాన్ని స్పష్టం చేసిన ప్రణాళిక ఆవిష్కరణ

ప్రతిభ, ఆవిష్కరణలు, పారిశ్రామిక భాగస్వామ్యాల ద్వారా స్వయం-సమృద్ధ బయోటెక్నాలజీ వ్యవస్థ నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం: డాక్టర్ జితేంద్ర సింగ్

प्रविष्टि तिथि: 16 JUL 2026 6:14PM by PIB Hyderabad

భారత తొలి ఇంజనీరింగ్ బయాలజీ గ్రాడ్యుయేషన్ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, అణుశక్తి, అంతరిక్ష, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ప్రకటించారు. దేశపు దీర్ఘకాలిక శాస్త్రీయ, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక ఆకాంక్షలకు మద్దతునివ్వగల స్వతంత్ర, స్వయం-సమృద్ధ బయోటెక్నాలజీ వ్యవస్థను నిర్మించడంలో కీలక ముందడుగుగా దీనిని ఆయన అభివర్ణించారు.

"2035 నాటికి దేశాన్ని ప్రపంచంలోనే ప్రముఖ బయోఎకానమీ కేంద్రంగా నిర్మించడం" లక్ష్యంగా రూపొందించిన రోడ్‌మ్యాప్‌ను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, కంప్యూటర్ సైన్స్ డిజిటల్ విప్లవాన్ని నడిపించినట్లే, ఇంజనీరింగ్ బయాలజీ భారత బయోఎకానమీ తదుపరి దశ కోసం విజ్ఞానశాస్త్రపు పునాదిగా ఆవిర్భవిస్తుందని అన్నారు. ఇంజనీరింగ్, బయాలజీ, ఆరోగ్య సంరక్షణ రంగాల మధ్య పెరుగుతున్న సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తూ... ఐఐటీలు ఇప్పటికే వైద్య సంస్థలతో అంతర్విభాగ కార్యక్రమాల కోసం ప్రతిపాదనలు సమర్పించడం ప్రారంభించాయని ఆయన తెలిపారు. ఆవిష్కరణ కార్యక్రమ ప్రారంభానికి ముందు రోడ్‌మ్యాప్ ప్రజెంటేషన్, పరిశ్రమ దృక్పథాలు, సీనియర్ విధానకర్తల ప్రసంగాలు జరిగాయి.

"మన సొంతమైన స్వతంత్ర, స్వయం-సమృద్ధ వ్యవస్థ మనకు ఉండాలి" అని కొత్త కోర్సు ప్రారంభాన్ని ప్రకటిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఇది దేశంలోనే ఈ తరహా తొలి కోర్సుగా నిలుస్తుందన్నారు. ఇంజనీరింగ్, జీవశాస్త్రం, వైద్యం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల సమ్మేళనంలో పనిచేయడానికి సన్నద్ధులైన కొత్త తరం నిపుణులను ఇది తయారు చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

గత దశాబ్దంలో బయోటెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన వేగవంతమైన పురోగతిని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రముఖంగా ప్రస్తావించారు. దేశ బయోఎకానమీ 2014లో దాదాపు 10 బిలియన్ డాలర్లుగా ఉండేదని... అది ప్రస్తుతం సుమారు 95 బిలియన్ డాలర్లకు విస్తరించిందని ఆయన తెలిపారు. 2030 నాటికి దేశ బయోఎకానమీ దాదాపు 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనాలు సూచిస్తున్నాయన్నారు. దేశ ఆవిష్కరణల వ్యవస్థలో వస్తున్న పరివర్తనను ప్రతిబింబిస్తూ, భారత్ ఇప్పుడు 11,000కు పైగా బయోటెక్నాలజీ అంకురసంస్థలకు నిలయంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, పర్యావరణం కోసం బయోటెక్నాలజీ కేంద్రితమైన ప్రత్యేక బయోటెక్నాలజీ విధానాన్ని కలిగి ఉన్న అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటిగా ఆవిర్భవించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇది శాస్త్రీయ పరిశోధనను వేగంగా ఆర్థిక, సామాజిక ఫలితాలుగా మార్చడానికి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు. ప్రపంచ పరిణామాలను అనుసరించడం నుంచి బయోటెక్నాలజీలోని సరికొత్త రంగాల్లో చురుకైన భాగస్వామిగా మారే దిశగా దేశం పురోగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు.

ఆరోగ్య సంరక్షణ బయోటెక్నాలజీలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, కోవిడ్-19కి వ్యతిరేకంగా ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ వ్యాక్సిన్‌ను భారత్ అభివృద్ధి చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తుచేశారు. దాదాపు 30 దేశాలకు వ్యాక్సిన్‌లను సరఫరా చేయడం... పెరుగుతున్న భారత శాస్త్రీయ సామర్థ్యాలను, ప్రపంచ నాయకత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆయన స్పష్టం చేశారు. సీఏఆర్-టీ సెల్ థెరపీ, అభివృద్ధి చెందుతున్న జన్యు-ఆధారిత చికిత్సల్లో దేశీయ పురోగతి కారణంగా అధునాతన చికిత్సలు అత్యంత సరసమైనవిగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో కూడిన ప్రపంచ ఆరోగ్య సంరక్షణ గమ్యస్థానంగా భారత్ స్థానాన్ని ఇవి బలోపేతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.

బయోటెక్నాలజీ భవిష్యత్తు ప్రధానంగా సింథటిక్ బయాలజీ, ఏఐ-ఆధారిత జీవ పరిశోధన, బయో-మాన్యుఫ్యాక్చరింగ్ ద్వారా ముందుకు సాగుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కొత్త ప్రొటీన్‌లను రూపొందించడం, జీవకణ-ఆధారిత ఔషధాలు, పరిశుద్ధ ఇంధనాలు, సుస్థిర ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయగల సాంకేతికతలు రాబోయే దశాబ్దాల్లో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పరిశ్రమల వంటి రంగాలను గణనీయంగా మెరుగు పరుస్తాయని ఆయన అన్నారు.

పరిశ్రమలతో బలమైన భాగస్వామ్యాల కోసం పిలుపునిస్తూ, భారత బయోటెక్నాలజీ రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. స్వదేశీ డీఎన్ఏ వ్యాక్సిన్ వంటి విజయవంతమైన కార్యక్రమాలు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి తొలి దశల నుంచే పరిశ్రమల సహకారం ప్రాముఖ్యతను ప్రదర్శించాయని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కరణలను వేగవంతం చేయడం లక్ష్యంగా భాగస్వాములు సాంప్రదాయిక ఆలోచనా విధానాలను అధిగమించి... శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, తయారీదారుల మధ్య బలమైన భాగస్వామ్యాలను నిర్మించాలని ఆయన కోరారు.

స్వదేశీ జీవ-ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించడం... ప్రతిభ అభివృద్ధిని బలోపేతం చేయడం... విజ్ఞానం, ఆరోగ్యం, పరిశ్రమల రంగాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతనూ కేంద్ర మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ఇంజనీరింగ్ బయాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న విభాగాలు... ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, పర్యావరణ సుస్థిరత, అధునాతన తయారీ రంగాల్లో భారత ఆకాంక్షలకు మద్దతునివ్వగలిగే, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని సృష్టిస్తాయని ఆయన తెలిపారు.

బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ ఎస్. గోఖలే మాట్లాడుతూ, భారత్ నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బయోఎకానమీల్లో ఒకటిగా ఉందన్నారు. ఇది 15–18 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తోందని తెలిపారు. ‘బయోఈ3’ పాలసీ సహా ప్రగతిశీల విధానపరమైన కార్యక్రమాల మద్దతుతో దేశం దాదాపు 100 బయో-ఇంక్యుబేటర్లను, 10,000కు పైగా బయోటెక్నాలజీ కంపెనీలను అభివృద్ధి చేసిందని ఆయన పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని, ప్రపంచంతో పోటీపడగల బయోటెక్నాలజీ వ్యవస్థను నిర్మిస్తూనే... ఆవిష్కరణల ఆధారిత బయోమాన్యుఫ్యాక్చరింగ్, కచ్చితమైన ఆరోగ్య సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, ఏఐ-సామర్థ్యం గల జీవశాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ రోడ్‌మ్యాప్ ఒక వ్యూహాత్మక ప్రణాళికను అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

నీతి ఆయోగ్ సభ్యులు ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ మాట్లాడుతూ, గత పారిశ్రామిక విప్లవాలతో పోల్చదగిన ఒక కీలకమైన బయోటెక్నాలజీ ఘట్టాన్ని భారత్ ప్రస్తుతం చూస్తోందని అన్నారు. గత దశాబ్ద కాలంలో దేశ బయోఎకానమీ దాదాపు 16 రెట్లు వృద్ధి చెంది, జాతీయ జీడీపీకి 4.8 శాతం వాటాను అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించిన రోడ్‌మ్యాప్‌ను ప్రస్తావిస్తూ... ప్రతిపాదిత రూ. 50,000 కోట్ల బయోఎకానమీ గ్రోత్ ఫండ్, బలమైన ప్రతిభావంతుల లభ్యత, ప్రపంచ స్థాయి బయో-మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యాల మద్దతుతో 2035 నాటికి భారత బయోఎకానమీని దాదాపు 700 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇది లక్ష్యంగా నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి తెలిపారు. దేశాన్ని ప్రపంచంలోని అగ్రశ్రేణి బయోటెక్నాలజీ శక్తుల్లో ఒకటిగా మార్చడానికి పరిశ్రమ, పరిశోధకులు, పెట్టుబడిదారులు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రాబోయే దశాబ్దం ప్రపంచ బయో ఎకానమీలో భారత్ స్థానాన్ని నిర్ణయిస్తుందని పేర్కొంటూ డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రసంగాన్ని ముగించారు. పరిశోధన, ప్రతిభ అభివృద్ధి, పారిశ్రామిక భాగస్వామ్యాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో నిరంతర పెట్టుబడులు... భారత ఆరోగ్య, ఆహార భద్రత రంగాలను బలోపేతం చేస్తాయన్నారు. తద్వారా లక్షలాది ఉన్నత నైపుణ్యం గల ఉద్యోగాలను సృష్టించడం సహా, ప్రపంచంతో పోటీపడగల బయోటెక్నాలజీ శక్తిగానూ భారత్ ఆవిర్భవిస్తుందని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

 

***


(रिलीज़ आईडी: 2285653) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil