వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోడెక్స్ కమిషన్‌లో భారత్‌కు కీలక విజయం: సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మూడు అంతర్జాతీయ ప్రమాణాలకు ఆమోదం


భారత్ ఆతిథ్యంలో కోడెక్స్ కమిటీ తుది రూపమిచ్చిన పెద్ద ఏలకులు, ధనియాలు, వనిల్లా ప్రమాణాలకు కోడెక్స్ కమిషన్ ఆమోదం

సుగంధ ద్రవ్యాలకు కొత్త కోడెక్స్ ప్రమాణాలతో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశానికి, భారత ఎగుమతుల పోటీతత్వానికి మరింత బలం

प्रविष्टि तिथि: 16 JUL 2026 7:00PM by PIB Hyderabad

అంతర్జాతీయ ఆహార ప్రమాణాల రూపకల్పనలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జూలై 6 నుంచి 10 వరకు జరిగిన 49వ కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ (సీఏసీ49) సమావేశంలో పెద్ద యాలకులు, ధనియాలు, వెనిల్లాకు సంబంధించిన మూడు కోడెక్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు ఆమోదం లభించింది. అదే సమావేశంలో కొత్త ఆహార ఉత్పత్తుల హాని సంబంధిత విశ్లేషణ అంశంపై ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ వర్కింగ్ గ్రూప్ (ఈడబ్ల్యూజీ)కి.సహ-అధ్యక్ష దేశంగా వ్యవహరించాలన్న భారత్ ప్రతిపాదనను కూడా కమిషన్ ఆమోదించింది. దీంతో అంతర్జాతీయ ఆహార ప్రమాణాల రూపకల్పనలో భారత నాయకత్వం మరింత బలపడిందని స్పష్టమైంది.

కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ ను  ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ,  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థగా సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణతో పాటు ఆహార వాణిజ్యంలో న్యాయమైన విధానాలను నిర్ధారించే లక్ష్యంతో శాస్త్రీయ ఆధారాలపై ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలను రూపొందించడం ఈ కమిషన్ ప్రధాన బాధ్యత.

కోడెక్స్ కార్యకలాపాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. కోడెక్స్‌కు చెందిన ఐదు వస్తు కమిటీలలో ఒకటైన సుగంధ ద్రవ్యాలు, వంట మసాలా దినుసుల  కోడెక్స్ కమిటీ (సీసీఎస్సీహెచ్) కి భారత్ ఆతిథ్యమిస్తోంది. ఈ కమిటీకి స్పైసెస్ బోర్డు కార్యదర్శిత్వ బాధ్యతలు నిర్వహిస్తోంది. పెద్ద యాలకులు, ధనియాలు, వెనిల్లాకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలను 2025 అక్టోబర్‌లో గువాహటిలో జరిగిన సీసీఎస్సీహెచ్ ఎనిమిదో సమావేశంలో ఖరారు చేశారు. వాటికే ఇప్పుడు కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ అధికారిక ఆమోదం లభించింది. ఈ ప్రమాణాలను కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ ఆమోదించే ముందు, తమ తమ పరిధిలో విశ్లేషణ పద్ధతులు, నమూనా సేకరణపై కోడెక్స్ కమిటీ,  ఆహార సంకలనాలపై కోడెక్స్ కమిటీ,  ఆహార లేబ్లింగ్ పై కోడెక్స్ కమిటీ పరిశీలించి ఆమోదించాయి. అనంతరం కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ వీటికి తుది ఆమోదం తెలిపింది.

కొత్తగా ఆమోదం పొందిన ఈ ప్రమాణాలు పెద్ద యాలకులు, ధనియాలు, వెనిల్లాకు ఏకీకృత అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒకే విధమైన నాణ్యతా ప్రమాణాలతో అంతర్జాతీయ వాణిజ్యం మరింత సులభతరం కానుంది. ప్రపంచంలో పెద్ద యాలకులు, ధనియాల ఉత్పత్తి, ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న భారత్‌కు ఈ ప్రమాణాలు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత సులభంగా ప్రవేశించే అవకాశాలను కల్పించడంతో పాటు, న్యాయమైన వాణిజ్య విధానాలను ప్రోత్సహించి, భారత ఎగుమతుల పోటీతత్వాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.

పెద్ద ఏలకుల పంట భారతదేశంలోని ఈశాన్య హిమాలయ ప్రాంతానికి చెందిన స్థానిక పంట కావడంతో, దీనికి సంబంధించిన కోడెక్స్ ప్రమాణాల ఆమోదం విశేష ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రపంచంలోనే ఈ సుగంధ ద్రవ్యాన్ని అత్యధికంగా ఉత్పత్తి, ఎగుమతి చేసే ప్రధాన దేశాలలో ఒకటిగా ఉన్న భారత్ కు ధనియాలకు సంబంధించిన కోడెక్స్ ప్రమాణం కూడా అంతే ప్రాముఖ్యత కలిగింది. ప్రస్తుతం భారత్ తన అవసరాలకు కావలసిన వెనిల్లాలో గణనీయమైన భాగాన్ని దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, వెనిల్లాకు రూపొందించిన కోడెక్స్ అంతర్జాతీయ ప్రమాణం ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన నాణ్యతా ప్రమాణాలను అందిస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో నాణ్యతలో ఏకరూపత పెరగడంతో పాటు, వినియోగదారుల విశ్వాసం మరింత బలోపేతం కానుంది.

సమావేశంలో కొత్త ఆహార ఉత్పత్తులకు సంబంధించిన హాని సంబంధిత విశ్లేషణపై విధాన మార్గదర్శకాలను రూపొందించేందుకు ఎలక్ట్రానిక్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఈ వర్కింగ్ గ్రూప్‌ నకు యూరోపియన్ యూనియన్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనుండగా, సహ అధ్యక్ష దేశంగా నియమించాలన్న భారత్ ప్రతిపాదనను కమిషన్ ఆమోదించింది. అంతర్జాతీయ ఆహార ప్రమాణాల రూపకల్పనలో భారత్ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు క్రియాశీల పాత్ర పోషిస్తున్నదనడానికి ఇది మరో నిదర్శనంగా నిలిచింది.

ఈ పరిణామాలు శాస్త్రీయ ఆధారిత అంతర్జాతీయ ఆహార ప్రమాణాల అభివృద్ధికి భారత్ చూపుతున్న నిబద్ధతను మరోసారి స్పష్టం చేస్తున్నాయి. న్యాయమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, భారత వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించడం వంటి లక్ష్యాలకు కూడా ఇవి దోహదపడనున్నాయి.

 

***


(रिलीज़ आईडी: 2285650) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam