ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్షయపై యుద్ధంలో డ్రోన్ల సాయం.. తెలంగాణలో ఐసీఎమ్ఆర్ అధ్యయనం


మారుమూల ప్రాంతాలకు చెందిన రోగులకు సత్వర వైద్యంపై దృష్టి..
మరింత వేగంగా రోగనిర్ధారణ.. రోగులకు తగ్గనున్న ఖర్చులు..
సత్వర రోగనిర్ధారణలో సత్ఫలితాలను అందించిన ఐ-డ్రోన్ కార్యక్రమం

प्रविष्टि तिथि: 16 JUL 2026 10:45AM by PIB Hyderabad

క్షయవ్యాధి (టీబీ)కి సంబంధించిన కఫం నమూనాల రవాణాకు డ్రోన్ సాయాన్ని తీసుకొని మారుమూల ప్రాంతాల్లో, వైద్య సేవలకు అంతగా నోచుకోని ప్రాంతాల్లో ప్రజలకు రోగనిర్ధారణ సేవలను మెరుగుపరచవచ్చని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్ఆర్) తన  ‘ఐ-డ్రోన్’ (i-DRONE)  కార్యక్రమంతో నిరూపించింది.
తెలంగాణ.. యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఏఐఐఎమ్ఎస్ బీబీనగర్‌, జిల్లా టీబీ కార్యాలయం సహకారంతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీ)లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షయవ్యాధి నిర్ధారణకు రోగుల రవాణాకు ఇంతవరకు సాంప్రదాయిక పద్ధతిని అనుసరించారు. ఇప్పుడు డ్రోన్ల సాయాన్ని తీసుకున్నారు. కళ్లె నమూనాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీల) నుంచీ, ఉపకేంద్రాల (ఎస్‌సీల) నుంచీ సేకరించి, నిర్దేశిత టీబీ రోగనిర్ధారణ ప్రయోగశాలల (టీయూల) వద్దకు డ్రోన్లతో చేర్చారు.
840 మందికి సంబంధించిన అధ్యయనంలో.. నమూనాల రవాణాకు  డ్రోన్లను ఉపయోగించి, టీబీ నిర్ధారణకు పట్టే సగటు సమయం 15 రోజుల నుంచి 5 దినాలకు తగ్గించగలిగారు. దీంతో రోగనిర్ధారణలో అయ్యే ఆలస్యం కూడా చాలా వరకు తగ్గిపోయింది. వ్యాధి సోకిన విషయాన్ని త్వరగా నిర్ధారించి, చికిత్సకు సంబంధించిన నిర్ణయాలను వెంట వెంటనే తీసుకోవడం సాధ్యమైంది.
రోగులకు అవుతున్న ఖర్చు చాలావరకు తగ్గిపోయింది. సాంప్రదాయిక రవాణా పద్ధతిలో టీబీ రోగనిర్ధారణకు ప్రయాణం, తదితరాలపై రోగి సగటున రూ. 9,451 వరకు ఖర్చు పెట్టాల్సివస్తుండగా డ్రోన్-ఆధారిత రవాణా పద్ధతిలో ఈ ఖర్చు రూ.91కి తగ్గింది. ప్రయాణ ఖర్చు, వేతన రూపేణా ఆదాయ నష్టం తగ్గడంతో పాటు ఉమ్మి నమూనాల ను రోగుల ఇళ్లకు దగ్గర్లోని ఆరోగ్య కేంద్రాల్లో సేకరించే వెసులుబాటు కూడా కల్పించడంతో  ఈ ప్రయోజనాలు కలిగాయి. నమూనాల రవాణాకు అవుతున్న సగటు ఖర్చు (అవుట్-ఆఫ్-పాకెట్ ఎక్స్‌పెండిచర్..ఓఓపీఈ) సున్నాకు తగ్గింది. ఎక్కువ మంది బాధితులు రోగనిర్ధారణకు ప్రయాణ సంబంధిత ఖర్చులేవీ పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు.  ఈ కార్యక్రమాన్ని  11 పీహెచ్‌సీలు, 60 ఉపకేంద్రాలు, 4 టీబీ యూనిట్ల పరిధిలో అమలు చేశారు. రోగులు కఫం నమూనాలను చాలా దూరం వెళ్లి రోగనిర్ధారణ కేంద్రాలకు అందించడానికి బదులు, తమ ఊళ్లకు దగ్గర్లో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లోనే అందించారు.
ఆరోగ్య పరిశోధన విభాగ కార్యదర్శి, ఐసీఎమ్ఆర్‌ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ మాట్లాడుతూ, ‘‘క్షయవ్యాధి నిర్మూలన దిశగా  భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో తక్కువ ఖర్చులో, సకాలంలో రోగనిర్ధారణ సదుపాయం ఎంతో కీలకపాత్రను పోషిస్తుంది. సాంకేతికత .. సమస్యలను దూరం చేసింది. రోగులకు, మరీముఖ్యంగా దూర ప్రాంతాల్లో నివసించే రోగులకు ఆర్థిక భారాన్ని తగ్గించడంలో  ఈ పద్ధతి ఎలా తోడ్పడుతుందో అధ్యయనం నిరూపించింది. ఐ-డ్రోన్ కార్యక్రమం ఫలితాలు రాబోయే కాలంలో ప్రజారోగ్య రంగంలో నూతన ఆవిష్కరణలకు తోడ్పడతాయి. ఈ ఫలితాలు ప్రస్తుతం ఆరోగ్యసంరక్షణ సేవలందించడానికి అనుసరిస్తున్న పద్ధతులకు పూరకంగా కూడాఉంటాయి’’అన్నారు.
డ్రోన్లను ఉపయోగించినందువల్ల ఆలస్యాన్ని తగ్గించినట్లు, నిర్వహణ సామర్థ్యం మెరుగుపడినట్లు, ప్రజలు ఈ పద్ధతికి అనుకూలంగా స్పందించినట్లు  అధ్యయనంలో పాలుపంచుకున్న ఆరోగ్యసంరక్షణ కార్యకర్తలు వివరించారు. వాతావరణం, పేలోడ్ పరిమితులు, నిరంతర శిక్షణను తీసుకోవాల్సిన అవసరం వంటి నిర్వహణ సంబంధిత అంశాలపైన కూడా అధ్యయనంలో దృష్టి సారించారు. ఈ పద్ధతిని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయాలంటే ఇంకా అనేక జాగ్రత్తచర్యలు తీసుకొని ముందుకు పోవాల్సి ఉంటుందని తేలింది.
జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరును పరిశోధకులు గమనించారు. మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి డ్రోన్- ఆధారిత ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్) కీలకమని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని వారు అన్నారు. విభిన్న ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తే విషయాలు తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవడానికి మరింత అవగాహన ఏర్పడుతుందని వారు అన్నారు.
ఐసీఎమ్ఆర్ ఐ-డ్రోన్ కార్యక్రమ సత్ఫలితాలు దేశంలో సుదూర ప్రాంతాల్లో  ఆరోగ్యసంరక్షణ సేవలను ఇప్పటి కన్నా మెరుగ్గా అందించడానికి అవసరమైన టీకామందులు, ఔషధాలు, రక్త ఉత్పాదనలు, రోగనిర్ధారణ సంబంధిత నమూనాలు, కణజాలం వగైరా రవాణా చేయడానికి డ్రోన్లను ఉపయోగించేందుకు అవకాశాలు  ఎంతవరకు ఉన్నాయో ఈ ఐ-డ్రోన్ కార్యక్రమం ద్వారా పరిశీలిస్తున్నారు.
అధ్యయనం పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు:  
https://journals.theunion.org/content/ijtldo/3/2/70.abstract
ఈ అధ్యయనంతో ముడిపడిన మరికొంత సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు:
https://journals.sagepub.com/doi/full/10.1177/20552076251406320

 

***


(रिलीज़ आईडी: 2285366) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati