వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్-యూకే ‘సెటా’ (సీఈటీఏ).. సామాజిక భద్రత ఒప్పందం (డీసీసీ) అమలు ప్రారంభం
సీఈటీఏ అమలుతో భారత్ నుంచి 99 శాతం ఎగుమతులకు సుంకం రహిత ప్రవేశం
ప్రాధాన్య సుంకాల విధానం కింద భారత్‌లోని 20కి పైగా ఓడరేవులు.. విమానాశ్రయాలు.. ‘ఐసీడీ’లు.. ‘ఎస్ఈజెడ్’లు.. ఫ్యాక్టరీల నుంచి 50కి పైగా ఎగుమతులు ప్రారంభం
తొలి రోజే 140 మిలియన్ డాలర్లకు పైగా విలువైన సరకుల ఎగుమతి
రెండు దేశాల సంబంధాల్లో కీలక ఘట్టానికి నేడు శ్రీకారం: కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ఈ ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక-వాణిజ్య ఒప్పందం ఒక చారిత్రక మలుపు: బ్రిటిష్ హైకమిషనర్
‘సీఈటీఏ’ కింద స్వీయ-నిర్ధారణ పద్ధతిలో ‘ఈసీఓఓ 2.0’ వేదిక ద్వారా ఉత్పత్తి మూలాల ధ్రువీకరణ పత్రాలు జారీ
प्रविष्टि तिथि:
15 JUL 2026 7:54PM by PIB Hyderabad
భారత్-యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యంలో నేడొక ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ మేరకు సమగ్ర ఆర్థిక-వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ-సెటా) సహా ద్వంద్వ చందా నివారణ ఒడంబడిక (డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్-డీసీసీ)గా వ్యవహరించే సామాజిక భద్రత ఒప్పందం నేటినుంచి అధికారికంగా అమలులోకి వచ్చాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో అధికారిక ప్రారంభోత్సవం నిర్వహించారు. భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ శ్రీమతి లిండీ కామెరాన్, భారత వాణిజ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్, విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ సహా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతోపాటు పలువురు ప్రముఖ ఎగుమతిదారులు ఇందులో పాల్గొన్నారు.
కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ కార్యక్రమ వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో ప్రజలతో పంచుకున్నారు. ఈ రోజున భారత్-యూకేల మధ్య ‘సెటా’తో పాటు ‘డీసీసీ’ కూడా అమలులోకి రావడం ద్వైపాక్షిక సంబంధాలలో ఓ కీలక ఘట్టమని ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన భారత్ నుంచి దాదాపు 99 శాతానిపైగా ఎగుమతులకు సంబంధించిన వాణిజ్య విలువలో దాదాపు 100 శాతానికి సుంకం రహిత విపణి సౌలభ్యం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ ఒప్పందంతో సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలతో పాటు రైతులు, తయారీదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి చెప్పారు. ముఖ్యంగా, వస్త్ర, చర్మ, రత్నాలు-ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువులు, సముద్ర ఉత్పత్తులు, రసాయనాలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వంటి రంగాలకు వృద్ధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. అలాగే, భారత ఐటీ, వృత్తిగత, ఆర్థిక, విద్యా-వ్యాపార సేవల రంగాలకూ ఈ ఒప్పందం కొత్త బాటలు పరుస్తుందని, భారతీయ ప్రతిభ చలనశీలత విస్తరణకు ఇతోధికంగా దోహదం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక భద్రత ఒడంబడిక (డీసీసీ) వల్ల ‘యూకే’లో తాత్కాలిక కార్యకలాపాల నిమిత్తం నివసిస్తున్న భారతీయ నిపుణులకు గరిష్ఠంగా ఐదేళ్ల పాటు సామాజిక భద్రత చందా ద్వంద్వ చెల్లింపు నుంచి మినహాయింపు లభిస్తుందని శ్రీ గోయల్ వివరించారు. తద్వారా రెండు దేశాల భాగస్వామ్యం మరింత బలోపేతం కావడమేగాక అంతర్జాతీయ కార్మిక విపణిలో భారత శ్రామికశక్తి పోటీతత్వం ఇనుమడిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాత్మక ఒడంబడిక ఖరారు కావడంలో నిబద్ధత కనబరచిన యూకే వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రితోపాటు ద్వైపాక్షిక సంప్రదింపుల బృందాలను ఆయన ప్రశంసించారు. ఈ నేపథ్యంలో వృద్ధి, పెట్టుబడి, సంయుక్త సౌభాగ్యాన్ని ప్రోత్సహించే పటిష్ట, ఆవిష్కరణాధారిత భాగస్వామ్యం ఖరారులో ఉభయ పక్షాల ఉమ్మడి నిబద్ధతను ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
భారత్-యూకే సంబంధాల బలోపేతంలో ‘సీఈటీఏ’ అమలును ఓ కీలక మలుపుగా వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ అభివర్ణించారు. అలాగే, భారత వాణిజ్య శాఖ తన ప్రస్థానంలో సాధించిన అత్యంత ప్రధాన విజయాలలో ఇదొకటని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృక్కోణానికి అనుగుణంగా ఈ ఒప్పందం రూపొందిందని చెప్పారు. ఇది ఖరారయ్యే దిశగా చర్చలను విజయవంతంగా ముగించడంలో కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నాయకత్వ పటిమ ప్రశంసనీయమని కొనియాడారు.
ఈ ఒప్పందం ఖరారుకు ముందు సాగిన సుదీర్ఘ చర్చల ప్రక్రియను, అందులోని సంక్లిష్టతలను వాణిజ్య శాఖ కార్యదర్శి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ దిశగా నిర్దేశించిన 14 దఫాల అధికారిక చర్చలలో భాగంగా సాంకేతిక అంశాలపై 800కు పైగా సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ‘సెటా’ ఫలవంతం కావడంలో ఏళ్ల తరబడి నిర్విరామంగా కృషి చేసిన రెండు పక్షాల సంప్రదింపు బృందాల అంకితభావాన్ని ఆయన వేనోళ్ల ప్రశంసించారు.
భారత్ లోగడ వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడాన్ని శ్రీ అగర్వాల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. వాటితో పోలిస్తే ప్రపంచంలోని రెండు ప్రధాన, పరస్పర సంధానిత ఆర్థిక వ్యవస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందం పరిధి, విస్తృతి రీత్యా ఎంతో మెరుగైనదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంతో వస్తు వాణిజ్యంలో గణనీయ విపణి సౌలభ్యం లభించడమేగాక సేవల వాణిజ్యంలోనూ కీలక ప్రయోజనాలు ఒనగూడుతాయని పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) సేవల రంగం వాటా భారత్ పరంగా 50 శాతానికి పైగా, యూకే పరంగా 70 శాతం కన్నా అధికంగా ఉండటాన్ని ఉటంకించారు. ఈ నేపథ్యంలో ఉభయపక్షాలు ఇచ్చిన హామీలు, స్పష్టత ఫలితంగా భవిష్యత్తులో ద్వైపాక్షిక సేవల వాణిజ్యానికి నవ్యోత్తేజం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒప్పందం ఖరారుతో అంతా సవ్యంగా సాగిపోయినట్లు కాదని, క్షేత్రస్థాయిలో అది పటిష్టంగా అమలు కావడం అత్యంత ప్రధానమని శ్రీ అగర్వాల్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉద్యోగాలు, జీవనోపాధులు, ఆర్థిక అవకాశాల కల్పన ద్వారా రెండు దేశాల జనజీవనంపై అది చూపే సానుకూల ప్రభావమే ఒప్పందం విజయానికి వాస్తవిక ప్రమాణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం సృష్టించే అవకాశాలను విస్పష్ట ఫలితాలుగా మలచుకోవాలని పారిశ్రామిక భాగస్వాములకు పిలుపునిచ్చారు. ఈ ఒప్పందంతో ఒనగూడే ప్రయోజనాలపై దేశంలోని వివిధ రంగాల, ఉత్పత్తుల, సముదాయాల స్థాయిలో ప్రాచుర్యం కల్పించడానికి వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపడుతుందని చెప్పారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా గల ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, పారిశ్రామిక సముదాయాలతో సంయుక్తంగా కృషి చేస్తుందని ప్రకటించారు.
ఫ్రాన్స్‌లో ఓ నెల కిందట నిర్వహించిన జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత్-యూకే అధినాయకులు సమావేశం కావడాన్ని వాణిజ్య కార్యదర్శి గుర్తుచేశారు. ఆ సమయంలోనే ఈ ఏడాది జూలై 15న ‘సెటా’ను అమలులోకి తేవాలని వారు నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. తదనుగుణంగా ఉభయ పక్షాలు నిర్దేశిత వ్యవధిలో అన్ని చిక్కుముడులనూ పరిష్కరించి, అవసరమైన ప్రకటనలన్నిటినీ జారీ చేశాయని తెలిపారు. వాణిజ్య భాగస్వాములకు తొలి రోజు నుంచే ఈ ఒప్పందం ప్రయోజనాలను లభించేలా అన్ని చర్యలూ తీసుకున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ‘ఉత్పత్తి మూలాల ధ్రువీకరణ నిబంధనలు (రూల్స్ ఆఫ్ ఆరిజిన్ సర్టిఫికేషన్), కస్టమ్స్ విభాగ సన్నద్ధత సహా ఇతరత్రా వాణిజ్య సౌలభ్య కల్పన చర్యలను అమలులోకి తెచ్చామని వివరించారు. దీంతో ‘సెటా’ అమలులోకి వచ్చిన తొలినాడే 140 మిలియన్ డాలర్లకు పైగా విలువైన వస్తు ఎగుమతులు మొదలు కావడాన్ని ఆయన ఉదాహరించారు. ఈ ఒప్పందాన్ని స్థిరంగా అనుసరించడం ద్వారా భారత్-యూకే మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలపడుతుందని తెలిపారు. దీంతోపాటు ప్రస్తుతం పరిశీలన దశలో గల ఇతర వాణిజ్య కార్యక్రమాలను కొనసాగించే వెసులుబాటు కలుగుతుందని ఆశాభావం వెలిబుచ్చారు.
ఈ ఒప్పందం అధికారికంగా అమలులోకి రాగానే ‘సెటా’ ప్రాధాన్య సుంకాల విధానం కింద దేశవ్యాప్తంగా తొలి సరకుల ఎగుమతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ చారిత్రక సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటూ 20కి పైగా ఓడరేవులు, విమానాశ్రయాలు, అంతర్గత కంటైనర్ డిపోలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, కర్మాగారాల నుంచి 140 మిలియన్ డాలర్లకు పైగా విలువైన 50కి పైగా కన్‌సైన్‌మెంట్లను పంపారు. వీటిలో ఎలక్ట్రానిక్స్, ఔషధ రంగాల ఉత్పాదనలు సహా రత్నాలు, ఆభరణాలు వంటి అనేక ఉత్పత్తులున్నాయి. ఈ సరకులన్నీ ముంద్రా, నవసేవా, చెన్నై ఓడరేవులు సహా ముంబయి (సహార్), కోల్‌కతా, హైదరాబాద్ నగరాల్లోని విమాన వస్తు రవాణా ప్రాంగణాల నుంచి బ్రిటన్‌కు రవాణా అయ్యాయి.
ఈ ఒప్పందం అమలు ఒక చారిత్రక ఘట్టం కాగా, యూకే-భారత్ స్నేహబంధం విస్తృతిని ఇది ప్రస్ఫుటం చేసిందని బ్రిటిష్ హైకమిషనర్ గౌరవనీయ శ్రీమతి లిండీ కామెరాన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. పటిష్ట ద్వైపాక్షిక సంబంధాలను ప్రస్తావిస్తూ- తమ దేశానికి భారత్ 11వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కావడంతో 2025 నాటికే ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 48 బిలియన్ పౌండ్లకు చేరువైందని ఆమె గుర్తుచేశారు. రెండు దేశాల మధ్య పెట్టుబడుల రీత్యా సంబంధాల వల్ల 7 లక్షలకు పైగా ఉద్యోగాల సృష్టికి వీలు కలిగిందని తెలిపారు. రెండు దేశాల వ్యాపార-వాణిజ్య కార్యకలాపాలకు, పెట్టుబడులలో వృద్ధికి, ఆవిష్కరణల వేగం పెంచడానికి, సమష్టిగా వృద్ధి చెందడానికి తగిన చట్రాన్ని ఈ ఒప్పందం సిద్ధం చేసిందని శ్రీమతి కామెరాన్ విశదీకరించారు. మరింత విస్తృత, ప్రతిష్టాత్మక, భవిష్యద్దార్శనిక భాగస్వామ్యం దిశగా ఇదొక నిర్ణయాత్మక ముందడుగని అభివర్ణించారు.
ఈ ఒప్పందంతో దీర్ఘకాలిక ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 25 బిలియన్ పౌండ్లకు మించి పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. యూకే, భారత ‘జీడీపీ’లో ఏటా దాదాపు £5 బిలియన్ల మేర వృద్ధికి ఈ దీర్ఘకాలిక ఆర్థిక ప్రభావం దోహదం చేస్తుందని తెలిపారు. రెండు దేశాల్లోని వ్యాపార-వాణిజ్య కార్యకలాపాలు వేగిరం, సరళం కావడమేగాక చౌకగా మారుతాయని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా యూకేకు భారత ఎగుమతులపై వర్తించే 99 శాతం సుంకాల శ్రేణి రాయితీలతో వ్యాపార సంస్థల ఉత్పత్తులకు సుంకం రహిత విపణి ప్రవేశం లభిస్తుందన్నారు. అదేవిధంగా యూకే నుంచి భారత్‌కు ప్రస్తుత ఎగుమతులలో 92 శాతానికి వర్తించే 90 శాతం సుంకం శ్రేణి రాయితీలతో బ్రిటన్ వ్యాపార సంస్థలకూ సుంకాల తగ్గింపు లేదా రద్దు ప్రయోజనం లభిస్తుందని ఆమె వివరించారు.
ఈ ఒప్పందం వస్తు వాణిజ్యానికి అతీతంగా విస్తృతం కాగలదని హై కమిషనర్ స్పష్టం చేశారు. కస్టమ్స్, డిజిటల్ వాణిజ్యం, ఆర్థిక సేవలు, టెలికమ్యూనికేషన్లు, మేధా సంపత్తి, వృత్తిగత సేవలు, పారదర్శకత, నియంత్రణ రంగాల్లో సహకార విస్తృతికి దోహదం చేస్తుందని చెప్పారు. ఆధునిక తయారీ, ఆహార-పానీయాలు, జీవన శాస్త్రాలు, ఇంధనం, వినియోగ వస్తువులు, వస్త్రాలు, దుస్తులు, ఇంజినీరింగ్ వస్తువులు, సముద్ర ఉత్పత్తులు, రసాయనాలు అనేక రంగాల్లో గణనీయ అవకాశాల సృష్టికి తోడ్పడుతుందని తెలిపారు.
ఈ ఒప్పందంతో చిన్న-మధ్య తరహా పరిశ్రమల పరిధి మరింత పెరిగి, వాటితోపాటు వినియోగదారులకూ ప్రయోజనాలు ఒనగూడుతాయని ఆమె అన్నారు. ఆ మేరకు పరిశ్రమల మధ్య బలమైన పోటీవల్ల మరింత నాణ్యతతో రూపొందే వస్తూత్పత్తుల వల్ల వినియోగదారులకు ఎంపిక అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. చర్చలు, సంతకాల దశలను దాటి, ఇవాళ ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన తక్షణమే రెండు దేశాల మధ్య వస్తురవాణా ప్రారంభం కావడంపై శ్రీమతి కామెరాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వ్యాపారాలు, కార్మికులకే కాకుండా వినియోగదారులకూ ఈ ఒప్పందంతో పూర్తి లబ్ధి చేకూరే విధంగా పటిష్ట అమలు కీలకమని ఆమె స్పష్టం చేశారు.
‘సెటా’ అమలులో భాగంగా ఎగుమతి దారులకు తొలిసారి స్వీయ నిర్ధారణ పద్ధతిలో ‘ఈసీఓఓ 2.0’ వేదిక ద్వారా ‘ఉత్పత్తి మూలాల ధ్రువీకరణ పత్రాలు’ జారీ అయ్యాయి. ఇలా తొలిరోజునే స్వీయ నిర్ధారణ, డిజిటల్ విధానంలో ధ్రువీకరణ పత్రాల జారీ వల్ల... ముఖ్యంగా ‘ఎంఎస్‌ఎంఈ’లకు నిబంధనానుసరణ భారంతోపాటు లావాదేవీల వ్యయం కూడా తగ్గడం విశేషం. ఈ ఒప్పందం అమలుతో వ్యయభారం తగ్గడంపై పారిశ్రామిక సంఘాలు, ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, ఎగుమతిదారుల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సుంకం రహిత విపణి ప్రవేశం, సరళ ధ్రువీకరణ, వ్యాపార హిత మూలస్థాన నిబంధనలతో యూకే విపణిలో భారతీయ ఉత్పత్తుల పోటీతత్వం గణనీయంగా ఇనుమడిస్తుందని వారు పేర్కొన్నారు.
ప్రపంచంలోని అత్యంత ప్రగతిశీల విపణులలో ఒకటైన యూకేలోకి భారత వస్తువులకు మెరుగైన ప్రవేశ సౌలభ్యం ద్వారా ‘వికసిత భారత్’ సంకల్ప సాకారానికి ఈ ఒప్పందం అర్థవంతంగా దోహదం చేస్తుందని పరిశ్రమల ప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేశారు. భారత ఎగుమతిదారులను ఇది ఇతర దేశాల పోటీదారులతో సమఉజ్జీలుగా నిలబెడుతూ, ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చగలదని పేర్కొన్నారు. శ్రమశక్తి ప్రాధాన్య రంగాలకు ప్రోత్సాహం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు, ‘ఎంఎస్‌ఎంఈ’లు సహా యువతరానికి, విద్యార్థులకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. తద్వారా నాణ్యమైన ఉపాధిని కల్పిస్తూ, సార్వజనీన వృద్ధికి చేయూతనిస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్తలు ప్రస్ఫుటం చేశారు.
భారత్-యూకే ‘సెటా’ (సీఈటీఏ) ఒప్పందం అమలు కార్యక్రమాన్ని మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్ సమక్షాన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ ఒప్పందం కింద ప్రాధాన్య వాణిజ్యారంభానికి ప్రతీకగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఉత్పత్తులతో గల ట్రాలీలపై సరుకులను మహారాష్ట్ర ముఖ్యమంత్రి, యూకే డిప్యూటీ హైకమిషనర్ లాంఛనంగా ఇచ్చిపుచ్చుకున్నారు.
***
(रिलीज़ आईडी: 2285247)
आगंतुक पटल : 5