నీతి ఆయోగ్
రీజినల్ ఏఐఎం సంవాద్-నార్త్ ఈస్ట్ చాప్టర్ 2026: భారత్‌లో అత్యాధునిక ఆవిష్కరణలకు అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఊతం
प्रविष्टि तिथि:
15 JUL 2026 12:36PM by PIB Hyderabad
దేశ ఆవిష్కరణల రంగంలో అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల్లో ఒకటిగా ఈశాన్య భారత్ ఎదుగుతున్న తరుణంలో అస్సాంలోని గువాహటి వేదికగా నీతి ఆయోగ్‌కు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం) ‘రీజినల్ ఏఐఎం సంవాద్- నార్త్ ఈస్ట్ చాప్టర్ 2026‘ (ప్రాంతీయ ఏఐఎం సంవాద్-ఈశాన్య ప్రాంత సమావేశం) సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పారిశ్రామిక నేతలు, విద్యావేత్తలు, ఇంక్యుబేటర్లు, అంకుర సంస్థల వ్యవస్థ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలలో ఆవిష్కరణల ఆధారిత వృద్ధికి ఒక ఉమ్మడి ప్రణాళికను రూపొందించడానికి ఈ సదస్సు తోడ్పడింది.
ఆగ్నేయాసియా దేశాలకు భారత్ ముఖద్వారంగా ఉన్న ఈశాన్య ప్రాంతంలో జరుగుతున్న ఈ సదస్సు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గొప్ప జీవవైవిధ్యం, శక్తిమంతమైన సాంస్కృతిక వారసత్వం, వెదురు వనరులు, సంప్రదాయ హస్తకళలతో పాటు వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక వ్యవస్థకు ఈ ప్రాంతం నిలయంగా మారింది. ఈశాన్య ప్రాంత ప్రత్యేక బలాలను గుర్తించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్.. దేశంలో తదుపరి దశ ఆవిష్కరణల ఆధారిత వృద్ధికి ఈ ప్రాంతం కీలక శక్తిగా నిలుస్తుందని, భారత్ 2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ వేదిక ద్వారా నిరూపించింది.
ఈ సదస్సు ప్రారంభ సమావేశానికి నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరమ్ అనియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితోపాటు అస్సాం ప్రభుత్వ కమిషనర్, కార్యదర్శి కూడా పాల్గొన్నారు. డాక్టర్ అనియా ప్రసంగిస్తూ.. ఈశాన్య ప్రాంతాన్ని ‘‘అష్టలక్ష్మి’’గా అభివర్ణించిన ప్రధానమంత్రి దార్శనికతను గుర్తుచేస్తూ, ఈ ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతి ఒక్కదానికి ప్రత్యేకమైన బలాలు, దేశ వృద్ధి పథంలో భాగస్వామ్యం వహించే అపారమైన సామర్థ్యాలు ఉన్నాయని తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నీతి ఆయోగ్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, ఇక్కడి మౌలిక సదుపాయాలు, రవాణా సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి కోసం భారీ పెట్టుబడులు పెడుతోందని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ‘‘యాక్ట్ ఈస్ట్ టు యాక్ట్ ఫాస్ట్’’ విధానం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వివరిస్తూ.. నేడు ఈశాన్య ప్రాంతం దేశ అభివృద్ధి అజెండాలో కేంద్ర బిందువుగా నిలిచిందని చెప్పారు. భవిష్యత్తులో ఇది ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, స్థిరమైన వృద్ధికి ప్రపంచ కేంద్రంగా మారడానికి సిద్ధంగా ఉందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
సదస్సుకు విచ్చేసిన ప్రతినిధులకు అటల్ ఇన్నోవేషన్ మిషన్ అధిపతి (ఆర్థిక విభాగం) సుమిత్ గఖర్ స్వాగతం పలికారు. ఈశాన్యం ప్రాంతంలోని ఆవిష్కరణల సామర్థ్యాన్ని వెలికితీయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, ఆవిష్కరణల సంస్థలు, ఇంక్యుబేటర్లు, భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా మాట్లాడుతూ.. ‘‘ఈశాన్య ప్రాంతాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘అష్టలక్ష్మి’గా అభివర్ణించారు. అపారమైన ప్రతిభ, సాంస్కృతిక వైవిధ్యం, సహజ వనరులు, పారిశ్రామిక స్ఫూర్తి కలగలిసిన ఈ ప్రాంతం.. వికసిత్ భారత్ 2047 దిశగా సాగుతున్న దేశ ప్రయాణంలో అత్యంత కీలక పాత్ర పోషించనుంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా మేము ఆవిష్కర్తలను ప్రోత్సహించడం, ఇంక్యుబేషన్ వ్యవస్థలను బలోపేతం చేయడం, యువ పారిశ్రామికవేత్తలు ఈశాన్య ప్రాంతం నుంచి దేశం కోసం, ప్రపంచం కోసం సరికొత్త పరిష్కారాలను కనుగొనేలా వారికి తోడ్పాటును అందించడం ద్వారా ఈ దార్శనికతను ఒక గొప్ప అవకాశంగా మార్చడానికి కృషి చేస్తున్నాం. దీనికోసం స్థానిక బలాలు ఆధారంగా సాగే ఆవిష్కరణలకు అందరి కృషి తోడైనప్పుడు ఈశాన్య ప్రాంతం దేశ వృద్ధి ప్రస్థానంలో భాగస్వామ్యం వహించడమే కాకుండా, దానికి ముందుండి నాయకత్వం వహిస్తుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సదస్సులో భాగంగా ‘‘ప్రాంతీయ ఆవిష్కరణల రంగ భాగస్వాములను ఏకతాటిపైకి తీసుకురావడం’ అంశంపై ఒక రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమం జరిగింది. దీనిలో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల మండళ్ల ప్రతినిధులతో పాటు శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ), బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ), అటల్ ఇంక్యుబేషన్ కేంద్రాలు (ఏఐసీలు), అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ కేంద్రాల (ఏసీఐసీ) ప్రతినిధులు పాల్గొన్నారు. పరస్పర సహకారంతో కూడిన ఆవిష్కరణల దిశగా సాగుతున్న వేగాన్ని ఈ చర్చలు ప్రతిబింబించాయి. జాతీయ స్థాయి కార్యక్రమాలను ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రాధాన్యతను ఈ సమావేశం తెలియజేసింది.
రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో ఈశాన్య ప్రాంతానికి ప్రత్యేకమైన పోటీతత్వ ప్రయోజనాలు ఉన్న రంగాలపై విడివిడిగా ప్రత్యేక సమావేశాలు, విశ్లేషణాత్మక చర్చలు నిర్వహించారు. వెదురు, జీవ వనరుల విలువ వ్యవస్థను వాణిజ్యపరంగా ఎలా లాభదాయకంగా మార్చవచ్చనే అంశాలపై నార్త్ ఈస్ట్ కేన్ అండ్ బాంబూ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎన్ఈసీబీబీసీ) సీనియర్ శాస్త్రవేత్త, కన్సల్టెంట్ తిలక్ చంద్ర భుయాన్ తమ అనుభవాన్ని పంచుకున్నారు. సాంకేతికతతో కూడిన సుస్థిర పర్యావరణహిత పర్యాటకం రంగంలోని అవకాశాలను ప్రైమ్ మేఘాలయ, ఎంబీఎంఏ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న మిన్హా రియాజ్ ఖాన్ వివరించారు. సంప్రదాయ చేనేత, హస్తకళల విభాగాల్లో ఆవిష్కరణల ద్వారా గ్రామీణ స్థాయి జీవనోపాధిని బలోపేతం చేయడంపై రాయల్ గ్లోబల్ యూనివర్సిటీ వ్యవస్థాపకత, ఆవిష్కరణల విభాగం డైరెక్టర్, మార్గదర్శక్ అడ్వైజరీ సహ వ్యవస్థాపకురలు, ఎన్‌ఈహెచ్‌హెచ్‌డీసీ మాజీ సలహాదారు డాక్టర్ శ్రీపర్ణ భుయాన్ బారువా చర్చించారు.
ఈశాన్య ప్రాంతంలోని ఇంక్యుబేషన్ వ్యవస్థను బలోపేతం చేయడంపై సదస్సులో మరో కీలక చర్చ జరిగింది. ఏఐసీ-సెల్కో ఫౌండేషన్ సోసియేట్ డైరెక్టర్ రచిత మిశ్రా ఈ చర్చా కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఐఐటీ గువాహటి గ్రూపు సీఈఓ కల్నల్ ప్రబీర్ సేన్‌గుప్తా, మిరియడ్ ఏఐ-గోబిలియన్ వ్యవస్థాపకుడు, సీఈఓ రోషన్ ఫర్హాన్, ఎస్ఎన్ఎల్ ఎనర్జీ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మోయిరాంగ్థెమ్ సేథ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న ప్రతీక్ దేశ్‌ముఖ్ ఈ చర్చలో పాల్గొన్నారు. ఆలోచనల దశ నుంచి అంకుర సంస్థలకు మద్దతివ్వగల పటిష్టమైనన ఇంక్యుబేషన్ వ్యవస్థల నిర్మాణ వ్యూహాలపై వీరంతా సమగ్రంగా చర్చించారు.
సదస్సులో భాగంగా జరిగిన మరో నిపుణుల చర్చకు ఏఐసీ ఎస్ఎంయూ టీబీఐ సీఈఓ డాక్టర్ తేజ్ చింగ్థామ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈశాన్య ప్రాంతంలోని అంకుర సంస్థలక ఆర్థిక వనరులను సమకూర్చడం, కార్పొరేట్ భాగస్వామ్యాలను పెంపొందించడం, మార్కెట్ అనుసంధానాలను కల్పించే మార్గాలపై చర్చించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు న్యూ ఎకానమీ గ్రూప్ ఉపాధ్యక్షుడు-II, అధిపతి ఆశిష్ అగర్వాల్, నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్ కార్పొరేట్ ప్లానింగ్, స్ట్రాటజీ అధిపతి ప్రంత ప్రతీమ్ సిన్హా, ఎన్ఈడీఎఫ్ఐ మేనేజర్ సిద్ధార్థ పీ లహ్కర్, టాటా ఫౌండేషన్ సెంటర్ ఫర్ మైక్రోఫైనాన్స్, లైవ్లీహుడ్ జనరల్ మేనేజర్ కౌటిల్య బసుమతరి ఈ చర్చలో పాల్గొన్నారు. ఈశాన్య ప్రాంతంలో యువ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక, సంస్థాగత మద్దతు వ్యవస్థను బలోపేతం చేయడంపై వీరంతా కలిసి చర్చించారు.
వ్యాపార సంస్థలు, స్థానిక అభివృద్ధి కోసం స్థితిస్థాపకత కలిగిన ఆవిష్కరణల వ్యవస్థలను నిర్మించడంపై జరిగిన సమావేశంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ సమావేశానికి రచిత మిశ్రా సమన్వయకర్తగా వ్యవహరించగా.. ఈఆర్ఈఎస్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఫజ్లే ఇలాహి, ఎడ్యుసెంటర్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ సేయిలెజో పుత్సురే పాల్గొన్నారు. చివరగా నీతి ఆయోగ్ పరిధిలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ కార్యక్రమ డైరెక్టర్ ప్రతీక్ దేశ్‌ముఖ్ ధన్యవాద సమర్పణ చేశారు.
ఉత్తర, దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంతాలలో విజయవంతమైన కార్యక్రమాల అనంతరం ‘రీజినల్ ఏఐఎం సంవాద్-నార్త్ ఈస్ట్ చాప్టర్ 2026’ సంవాద్ శ్రేణిలో అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సమావేశాల్లో ఒకటిగా నిలిచింది. విధాన రూపకర్తలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంక్యుబేటర్లు, పారిశ్రామిక నాయకులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా దేశంలోని ప్రతి మూలకూ విస్తరించేలా ఒక సమగ్రమైన ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించాలనే అటల్ ఇన్నోవేషన్ మిషన్ నిబద్ధతను ఈ సదస్సు మరోసారి స్పష్టం చేసింది. ఈశాన్య ప్రాంతానికి గల విశిష్ట బలాల ఆధారంగా సహకారం, ఆవిష్కరణలు, వ్యవస్థాపకతతో నడిచే ఈ కార్యక్రమం.. వికిసిత్ భారత్ 2047 దిశగా దేశ ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో ఈశాన్య ప్రాంతం పోషిస్తున్న కీలక పాత్రను వివరించింది.
***
(रिलीज़ आईडी: 2284933)
आगंतुक पटल : 8