ఉప రాష్ట్రపతి సచివాలయం
“ది వాయిస్ ఆఫ్ జస్టిస్: జస్టిస్ గవాయ్ స్పీక్స్” పుస్తకాన్ని విడుదల చేసిన ఉపరాష్ట్రపతి
నిజాయతీ, రాజ్యాంగపరమైన క్రమశిక్షణ, ప్రజా విశ్వాసం ద్వారానే పటిష్ఠమైన సంస్థలు, న్యాయం నిలబడతాయి
ప్రజాస్వామ్య స్థిరత్వానికి, జాతీయ ఐక్యతకు రాజ్యాంగమే పునాది
న్యాయవాదులు ఎల్లప్పుడూ నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలి
రాజ్యాంగబద్ధమైన పాలన పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి
జస్టిస్ బీ.ఆర్. గవాయ్ న్యాయ ప్రస్థానం రాజ్యాంగ విలువల పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది: ఉపరాష్ట్రపతి
प्रविष्टि तिथि:
14 JUL 2026 6:43PM by PIB Hyderabad
ఉపరాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో “ది వాయిస్ ఆఫ్ జస్టిస్: జస్టిస్ గవాయి స్పీక్స్” అనే పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీ. పీ. రాధాకృష్ణన్ విడుదల చేశారు. ప్రొఫెసర్ ఎస్. శివకుమార్ సంపాదకత్వంలో, కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (సీ.ఎల్.ఈ.ఏ.) సహకారంతో థామ్సన్ రాయిటర్స్ ప్రచురించిన ఈ సంపుటిలో... భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్. గవాయి ప్రసంగాలు, ఉపన్యాసాలు, ఆలోచనలను పొందుపరిచారు.
ఈ సభనుద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ... అనుభవం, రాజ్యాంగపరమైన క్రమశిక్షణ, ప్రజల బాధ్యతలతో రూపుదిద్దుకున్న న్యాయపరమైన ఆలోచనలను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన రాజ్యాంగ పత్రంగా ఈ పుస్తకాన్ని అభివర్ణించారు. రాజ్యాంగవాదం, చట్టబద్ధ పాలన, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక పాలనపై విలువైన అవగాహనను ఈ పుస్తకం అందిస్తుందన్నారు. ఇది రాజ్యాంగ విలువల గురించి, న్యాయ శాస్త్రంలోని విషయాలను గురించి దేశ ప్రజల్లో అవగాహనను మరింత పెంపొందిస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
రాజ్యాంగంపై పుస్తకంలోని విశ్లేషణలను ప్రస్తావిస్తూ... గత డెబ్బయి ఐదు సంవత్సరాలుగా నిరంతర కొనసాగింపు, మార్పు, అధికారం, జవాబుదారీతనం, హక్కులు, విధుల మధ్య సమతుల్యతను పాటిస్తున్న ఒక సజీవమైన, నిరంతరం పరిణామం చెందుతున్న పత్రంగా భారత రాజ్యాంగాన్ని ఈ పుస్తకం సరిగ్గా చిత్రీకరిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్య స్థిరత్వానికి, జాతీయ ఐక్యతకు రాజ్యాంగం పునాదిగా నిలుస్తుందన్నారు. దానిని సవరించేందుకు పార్లమెంటుకు గల అధికారం, మారుతున్న కాలపు అవసరాలను తీర్చడానికి దేశానికి వీలు కల్పిస్తుందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
రాజ్యాంగ పాలనను పరిరక్షించడంలోనూ, చట్టబద్ధమైన పాలనపై పౌరుల విశ్వాసాన్ని కాపాడటంలోనూ న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ రాధాకృష్ణన్ అన్నారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో అధికారంతో పాటు సంయమనమూ అంతే ముఖ్యమన్నారు. సంస్థాగత సమగ్రత, రాజ్యాంగ క్రమశిక్షణ, ప్రజా విశ్వాసం, ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత ద్వారానే పటిష్ఠమైన సంస్థలు, న్యాయం నిలబడతాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
రాజ్యాంగబద్ధమైన పాలన సాధారణ పౌరుల ఆకాంక్షలకు, మారుతున్న సామాజిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తికీ గౌరవం, అవకాశం, ఆశ కల్పించాలంటే అణగారిన వర్గాలను బలోపేతం చేయడం అత్యవసరమని శ్రీ రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థకు జస్టిస్ బీ.ఆర్. గవాయి చేసిన సేవలను ప్రశంసిస్తూ... ఆయన న్యాయ ప్రస్థానం రాజ్యాంగ విలువలు, సంస్థాగత సమతుల్యత, న్యాయం అందరికీ అందుబాటులో ఉండటం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
న్యాయం అందరికీ అందుబాటులో ఉండేందుకు వీలుగా నిరుపేదలకు ఎల్లప్పుడూ ఉచితంగా న్యాయ సహాయం అందించాలని న్యాయవాద సంఘ సభ్యులను కోరుతూ ఉపరాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్. గవాయి, కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (సీ.ఎల్.ఈ.ఏ.) అధ్యక్షులు, సంపాదకులు ప్రొఫెసర్ ఎస్. శివకుమార్, థామ్సన్ రాయిటర్స్ ప్రచురణకర్త శ్రీ గౌరీ శంకర్ నటేశన్, న్యాయవాద సంఘ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(रिलीज़ आईडी: 2284667)
आगंतुक पटल : 29