రక్షణ మంత్రిత్వ శాఖ
కార్గిల్ విజయ్ దివస్-2026: జాతీయ యుద్ధ స్మారకం నుంచి కార్గిల్ యుద్ధ స్మారకం వరకూ మోటార్‌సైకిల్ ర్యాలీ.. ప్రారంభించిన రక్షణ మంత్రి
రాబోయే 13 రోజుల్లో 1,900 కి.మీ. దూరం 28 మంది మోటారు సైకిల్ యాత్ర
భారత సైనికుల సాహసానికీ, దృఢ సంకల్పానికీ, ప్రాణత్యాగానికీ నివాళి
మన నేల మీదా, మన గుర్తింపు మీదా, మన గౌరవం మీదా శత్రుత్వంతో దాడికి తెగబడితే, పూర్తి శక్తితో జవాబిచ్చి తీరాలన్న మన తిరుగులేని సంకల్పానికి 1999 కార్గిల్ యుద్ధ విజయం ప్రతీకగా నిలిచిందన్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్
प्रविष्टि तिथि:
14 JUL 2026 1:00PM by PIB Hyderabad
దేశ వ్యాప్తంగా ‘కార్గిల్ విజయ్ దివస్-2026’ను పాటిస్తున్నారు. దీనిలో భాగంగా, న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నుంచి లద్దాఖ్.. ద్రాస్‌లో గల కార్గిల్ యుద్ధ స్మారకం వరకూ 13 రోజుల ‘‘శౌర్య విజయ్ యాత్ర’’ను
కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 2026 జులై 14న ప్రారంభించారు. సర్వీసులో ఉన్న, పదవీ విరమణ చేసిన రక్షణ బలగాల సిబ్బందీ, వారి కుటుంబ సభ్యులూ సహా 28 మంది మోటార్ సైకిలిస్టులు ఈ యాత్రలో భాగంగా ఉత్తర హిమాలయాల్లోని దుర్గమ ప్రాంతం గుండా 1,900 కిలోమీటర్ల మేర యాత్రను నిర్వహిస్తారు. 1999లో కార్గిల్ యుద్ధంలో గెలుపును నిర్ధారించిన భారత వీరుల అజేయ సాహసం, దృఢ సంకల్పం, అత్యున్నత త్యాగాలకు ఈ యాత్ర శ్రద్ధాంజలి ఘటిస్తోంది. ‘ఒక యాత్ర, ఒక దేశం, ఒక ప్రణామం’ ఈ యాత్రకు ఆదర్శ వాక్యంగా ఉంది.
రక్షణ మంత్రి తన ప్రసంగంలో వీర భారతీయ సైనికులకు నివాళులను అర్పించారు. ధైర్య సాహసాలనీ, క్రమశిక్షణనీ, సాటి లేని దేశ భక్తినీ మేళవించి వారంతా సువర్ణాధ్యాయాన్ని లిఖించారనీ, ఈ అధ్యాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా- సేనలు నేటికీ అధ్యయనం చేస్తున్నాయనీ మంత్రి అన్నారు. ‘‘దాదాపు 20,000 అడుగుల ఎత్తులో, మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో.. మన జవాన్లు సాహసంతో, దృఢత్వంతో లక్ష్యాన్ని చేజిక్కించుకున్నారు. శత్రువు గుప్పిట నుంచి ప్రతి శిఖరాన్నీ, పర్వతాన్నీ, బంకరునూ తిరిగి స్వాధీనం చేసుకున్నారు. త్రివర్ణ పతాక గౌరవాన్ని నిలబెట్టారు. మన భూమిమీదా, మన గుర్తింపుమీదా, మన గౌరవం మీదా శత్రుత్వ భావనతో దుస్సాహసానికి పాల్పడిన వారు ఎవరైనా, పూర్తి శక్తితో జవాబు ఇవ్వగలిగిన భారత్ అజేయ సంకల్పానికి ఈ విజయం నిదర్శనం’’ అని ఆయన అన్నారు.
ప్రతి యుద్ధంలోనూ విజయాన్ని అందించినందుకు భారతీయ సైనికులందరికీ శ్రీ రాజ్‌నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన కృతజ్ఞతలు తెలిపిన వారిలో పరమ వీర చక్ర గ్రహీతలైన కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, సుబేదార్ మేజర్ (ఆనరరీ కెప్టెన్) యోగేంద్ర సింగ్ యాదవ్ (రిటైర్డ్), సుబేదార్ మేజర్ (ఆనరరీ కెప్టెన్) సంజయ్ కుమార్ (రిటైర్డ్) కూడా ఉన్నారు. ఈ వీర సైనికులు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారనీ, రాబోయే తరాల వారికి కూడా వీరు స్ఫూర్తిని అందిస్తుంటారనీ మంత్రి ప్రశంసించారు.
మోటారు సైకిళ్ల మీద వెళ్లే వారు మార్గమధ్యంలో చండీమందిర్ యుద్ధ స్మారకం, రెజాంగ్ లా యుద్ధ స్మారకం, లే యుద్ధ స్మారకం, ప్రధాన సైన్య స్మారకం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. వీర మహిళలతో కూడా వారు భేటీ అవుతారు. అజేయ సాహసాన్నీ, ధీరత్వాన్నీ చాటినందుకు వారిని సత్కరిస్తారు. 2026 జులై 26న కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ యుద్ధ స్మారకానికి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
జాతీయ యుద్ధ స్మారకంలోని పవిత్రమైన మట్టిని నింపిన కలశాన్ని మోటార్ సైకిలిస్టులు వెంట తీసుకు వెళ్తారు. ఈ కలశాన్ని కార్గిల్‌లో అమరులైన వీర సైనికుల స్మృతికి అంకితం చేస్తారు. ‘‘ఇక్కడి పవిత్రమైన మట్టి.. కార్గిల్ లోని మట్టితో కలిసిపోయే ఘట్టం ఈ దేశ వర్తమాన తరం నమ్మకం, మన అమర వీరుల అజేయ శౌర్య పవిత్ర సంగమానికి ప్రతీకగా నిలుస్తుంది’’ అని రక్షణ మంత్రి అన్నారు.
శౌర్య విజయ్ యాత్రకు సంబంధించిన ఒక కీలక అంశాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావిస్తూ, ఈ యాత్ర దేశానికి చెందిన వేర్వేరు ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న అధికారులను, పూర్వ సైనికులను, పౌరులను ఒక చోటుకు చేరుస్తోందన్నారు. ‘‘ ‘‘విభిన్న నేపథ్యాలు, భాషలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ మువ్వన్నెల జెండా, ఒకే దేశం, మన అమర జవాన్ల పట్ల ఉమ్మడి గౌరవం.. ఇవే మన దేశానికి గుర్తింపు’’ అని ఆయన అన్నారు.
నేషనల్ కేడెట్ కోర్ (ఎన్‌సీసీ)కి చెందిన విద్యార్థులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యాత్ర ప్రజల్లో, మరీముఖ్యంగా యువతలో దేశభక్తితో ముడిపడిన సరికొత్త భావనను జాగృతం చేస్తుందన్న విశ్వాసాన్ని రక్షణ మంత్రి వ్యక్తం చేశారు. దేశ స్వతంత్రాన్నీ, గౌరవాన్నీ రక్షించడం ఒక్క సరిహద్దులలో మాత్రమే చోటు చేసుకొనేది కాదనీ, అది మన స్మృతులలో, విలువలలో కూడా ఇమిడివుందన్న సందేశాన్ని ఇది భావి తరాలకు అందిస్తుందనీ ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్.ఎస్. రాజ సుబ్రమణి, సైనిక దళ ప్రధానాధికారి జనరల్ ధీరజ్ సేఠ్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ‘ఆపరేషన్ విజయ్’ వేళ ప్రదర్శించిన విలువలను ముందుకు తీసుకు పోవాలన్న భారత సైన్య నిబద్ధతను శౌర్య విజయ యాత్ర చాటిచెబుతోంది. ఈ సాహస యాత్రను తిరిగి చేపట్టడం ద్వారా కర్తవ్యం, గౌరవం, నిస్వార్థ సేవ అనే ఆదర్శాలను రాబోయే తరాల వారు నిలబెట్టడానికి వారికి స్ఫూర్తిని ఇవ్వనుంది.
***
(रिलीज़ आईडी: 2284454)
आगंतुक पटल : 6