గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నీటి భద్రత కలిగిన నగరాలే లక్ష్యంగా ‘క్యాచ్ ది రెయిన్’ ప్రచారాన్ని వేగవంతం చేసిన గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ


‘క్యాచ్ ది రెయిన్’ కింద దేశవ్యాప్తంగా 900కుపైగా పట్టణ స్థానిక సంస్థల భాగస్వామ్యం.. 1.21 లక్షల ఎకరాల నీటి వనరులు, 12,750 ఎకరాల హరిత ప్రాంతాల పునరుద్ధరణ

प्रविष्टि तिथि: 13 JUL 2026 6:53PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘‘వర్షాన్ని ఒడిసిపట్టండి-ఎక్కడ కురిస్తే అక్కడ, ఎప్పుడు కురిస్తే అప్పుడు’’ నినాదంతో సాగుతున్న జల సంరక్షణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా అమృత్ 2.0 పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, జలాశయాల పునరుజ్జీవన కార్యక్రమాలను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తోంది.

 

అమృత్ 2.0 కింద నీటి భద్రతను పటిష్టం చేయడం, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడం కోసం దేశంలోని వివిధ నగరాలు వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పునరుద్ధరణ, స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులను వేగవంతం చేశాయి. ఈ జాతీయ స్థాయి ఉద్యమంలో 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 900 పట్టణ స్థానిక సంస్థలు అత్యంత చురుగ్గా పాల్గొంటున్నాయి.

 

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జలశక్తి మంత్రిత్వ శాఖతో కలిసి జలశక్తి అభియాన్-జన భాగీదారి (జేఎస్‌జేబీ) 2.0కింద భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా 79 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 1,99,278 భూగర్భ జలాల పునరుద్ధరణ  నిర్మాణాలను చేపట్టారు. అదేవిధంగా 738 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మరో 73,036 ఇంకుడు నిర్మాణాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టాలను పెంచడానికి, నీటి సంరక్షణ లక్ష్యాలను సాధించడానికి ఈ నిర్మాణాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి.

 

జల సంరక్షణ చర్యలను మరింత బలోపేతం చేయడానికి అమృత్ 2.0 కింద పద్ధతిలో భూగర్భ జల పొరల మ్యాపింగ్, నిర్దేశిత లక్ష్యాలతో నిస్సార భూగర్భ జల పొరల నిర్వహణ (ఎస్‌ఏఎం) కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.  ఈ కార్యక్రమం దేశంలోని పలు నగరాల్లో అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం నగరాలలో ఇంజక్షన్ బోర్‌వెల్స్‌తో అనుసంధానించిన ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీటిని భూగర్భ పొరల్లోకి పంపుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో నిల్వ సదుపాయాలతో కూడిన ఇంటి పైకప్పు వర్షపు నీటి నిల్వ పద్ధతులు.. అటు నీటి పొదుపునకు, ఇటు భూగర్భ జలాల పెంపునకు ఏకకాలంలో దోహదపడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా, తెలంగాణలోని వరంగల్ నగరాలు వర్షాకాలం కంటే ముందే ఇంకుడు నిర్మాణాలను సిద్ధం చేయడం ద్వారా రుతుపవన వర్షాలను భూగర్భ జలాల పునరుద్ధరణకు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాయి.

 

అమృత్ 2.0 లోని జలాశయాల పునరుజ్జీవన (డబ్ల్యూబీఆర్‌) విభాగం కింద దేశవ్యాప్తంగా సుమారు 1.21 లక్షల ఎకరాల విస్తీర్ణంలోని జలాశయాలను పునరుద్ధరిస్తున్నారు. నగరాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, భూగర్భ జలాల మట్టాలను ఉధృతం చేయడం, వరదలను తట్టుకునే శక్తిని నగరాలకు కల్పించడం కోసం ఈ చర్యలు ఉపయోగపడతాయి. ఇందులో భాగంగా పూడికతీత, నీటి ప్రవేశ, నిష్క్రమణ మార్గాల మెరుగుదల, చెరువు గట్ల రక్షణ, పరిసరాల సుందరీకరణ, జీవవైవిధ్య పెంపుదల వంటి పనులను వేగంగా చేపడుతున్నారు.

 

ఈ జల సంరక్షణ చర్యలకు అదనంగా పట్టణ ప్రాంతాల్లో 18,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పార్కులు, పచ్చని ప్రదేశాల ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భూగర్భ జలాల రీఛార్జ్‌కు మద్దతు ఇస్తాయి. నగరాల్లో వేడి తీవ్రతను తగ్గించి, ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రజా స్థలాలను అందుబాటులోకి తేవడం ద్వారా పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి.

 

ఈ వినూత్న కార్యక్రమాల ద్వారా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘వర్షాన్ని ఒడిసిపట్టండి-ఎక్కడ కురిస్తే అక్కడ, ఎప్పుడు కురిస్తే అప్పుడు’ అనే దార్శనికతను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
 

 ‘నేడు మనం పొదుపు చేసే ప్రతి నీటి చుక్క.. కాబోయే తరాల నీటి భద్రత కోసం మనం పెట్టే పెట్టుబడి’

 

పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో ఇంజెక్షన్ బోర్‌వెల్స్‌తో కూడిన ఇంకుడు గుంతల నిర్మాణం

 

 ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా, తెలంగాణలోని వరంగల్‌లో రుతుపవనాలకు ముందు ఇంకుడు నిర్మాణాల పనులు

 ఇటానగర్‌లో ఇంటి పైకప్పుపై వర్షపు నీటిని సేకరించేందుకు నిల్వ తొట్టి సదుపాయంతో కూడిన ఇంకుడు గుంత


(रिलीज़ आईडी: 2284419) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati