ఆర్థిక మంత్రిత్వ శాఖ
భారీ సైబర్ మోసాన్ని చేధించినందుకు గాను ఎఫ్ఐయూ-ఇండియాకి 'బెస్ట్ ఎగ్మాంట్ కేస్ అవార్డు (బీఈసీఏ) 2026'
అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన ఎగ్మాంట్ గ్రూప్ సదస్సులో బహుకరణ
సుమారు రూ. 868 కోట్ల సైబర్ మోసాల సొమ్ము, 5,000 కంటే ఎక్కువ మ్యూల్ బ్యాంక్ ఖాతాలు, వివిధ దేశాల పరిధిలో ఉన్న సంక్లిష్టమైన క్రిప్టోకరెన్సీ లావాదేవీలతో ముడిపడి ఉన్న ఒక భారీ మనీ లాండరింగ్ నెట్‌వర్క్‌ను ఈ కేసుతో ఛేదించిన ఎఫ్ఐయూ-ఇండియా
प्रविष्टि तिथि:
10 JUL 2026 6:46PM by PIB Hyderabad
అంతర్జాతీయ స్థాయిలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా (ఎఫ్ఐయూ-ఇండియా) మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపును దక్కించుకుంది. భారీ సైబర్ మోసానికి సంబంధించిన కేసును ఛేదించినందుకుగాను భారత విభాగానికి 'బెస్ట్ ఎగ్మాంట్ కేస్ అవార్డు (బీఈసీఏ) 2026' లో ద్వితీయ స్థానం లభించింది. అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన 'ఎగ్మాంట్ గ్రూప్ ప్లీనరీ' సమావేశంలో ఎఫ్ఐయూ-ఇండియా డైరెక్టర్ శ్రీ అమిత్ మోహన్ గోవిల్ ఈ అవార్డును అందుకున్నారు.
ఎగ్మాంట్ గ్రూప్‌లో 'బెస్ట్ ఎగ్మాంట్ కేస్ అవార్డు' అనేది అత్యున్నత గుర్తింపులలో ఒకటి. ఆర్థిక నిఘా, అంతర్జాతీయ సహకారం, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల నిరోధంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కేసులకు ఈ అవార్డును అందజేస్తారు. ఎగ్మాంట్ గ్రూప్‌లోని 182 సభ్య దేశాల నుంచి వచ్చిన ఎంట్రీలలో ఎఫ్ఐయూ-ఇండియా సమర్పించిన కేసు కేవలం రెండు ఫైనలిస్ట్ కేసులలో ఒకటిగా నిలిచి ఆ తర్వాత ఈ ప్లీనరీ సమావేశంలో రన్నరప్‌గా నిలిచింది.
భారీ సైబర్ మోసానికి సంబంధించి 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' (ఐ4సీ) అందించిన సమాచారంతో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత ఎఫ్ఐయూ-ఇండియా చేసిన లోతైన ఆర్థిక విశ్లేషణలో సుమారు రూ. 868 కోట్ల సైబర్ మోసాల సొమ్ముతో కూడిన అత్యంత సంక్లిష్టమైన మనీ లాండరింగ్ నెట్‌వర్క్ బహిర్గతం అయింది. ఇందులో 5,000 కంటే ఎక్కువ మ్యూల్ బ్యాంక్ ఖాతాలు, వివిధ దేశాల పరిధిలో క్లిష్టమైన క్రిప్టోకరెన్సీ లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ దర్యాప్తులో 'ఎగ్మాంట్ సెక్యూర్ వెబ్' (ఈఎస్‌డబ్ల్యూ) ద్వారా అంతర్జాతీయ సహకారం ఎంత కీలకమైన పాత్ర పోషించిందో స్పష్టమైంది. సీమాంతర క్రిప్టోకరెన్సీ లావాదేవీలను కనిపెట్టడానికి, అంతర్జాతీయ మనీ లాండరింగ్ మూలాలను గుర్తించడానికి ఎఫ్ఐయూ-ఇండియా పలు దేశాల ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగాలతో సమాచారాన్ని మార్పిడి చేసుకుంది. ఇలా సకాలంలో సమాచారాన్ని పంచుకోవడం వల్ల దర్యాప్తు గణనీయంగా బలోపేతం అవడమే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక నేరాలను అదుపు చేయడంలో ప్రపంచ దేశాల పరస్పర సహకారం ఎంత ముఖ్యమో ఈ కేసు నిరూపించింది.
ఎఫ్ఐయూ-ఇండియా అందించిన 'ఆపరేషనల్ అనాలిసిస్ రిపోర్ట్' ఆధారంగా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) విస్తృతమైన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ. 47 లక్షల నగదుతో పాటు సుమారు రూ. 13.6 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని (యూఎస్‌డీటీ) సీజ్ చేసింది. అలాగే రూ. 8.67 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయడమే కాకుండా 'మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) 2002' కింద రెండు ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను (చార్జ్‌షీట్లు) దాఖలు చేసింది.
ఈ అంతర్జాతీయ గుర్తింపు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారత్‌కు పెరుగుతున్న నాయకత్వ పటిమను తెలియజేస్తోంది. అత్యాధునిక ఆపరేషనల్ అనాలిసిస్, బలమైన అంతర్గత సమన్వయం, సమర్థవంతమైన అంతర్జాతీయ సమాచార మార్పిడి ద్వారా దేశంలోని 'మనీ లాండరింగ్ నిరోధక', 'కౌంటర్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం' (ఏఎంఎల్/సీఎఫ్టీ) నిబంధనలను మరింత బలోపేతం చేయడానికి ఎఫ్ఐయూ-ఇండియా కట్టుబడి ఉందని ఈ విజయం మరోసారి చాటిచెప్పింది.
***
(रिलीज़ आईडी: 2283511)
आगंतुक पटल : 8