ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆస్ట్రేలియాలో భారతీయ ప్రవాసుల సమావేశంలో ప్రధాని ప్రసంగం

प्रविष्टि तिथि: 09 JUL 2026 6:36PM by PIB Hyderabad

మనం సమావేశమైన ఈ నేల పరంపరానుగత యజమానులకు గౌరవాభివాదాలతో నేను ప్రసంగాన్ని మొదలుపెడుతున్నాను. వారి పూర్వీకులకూ, పెద్దలకూ వినమ్రపూర్వక అభివాదాలు తెలియజేస్తున్నాను. నవతరానికి శుభాకాంక్షలు.

వణక్కం మెల్‌బోర్న్

నమస్కారం మిత్రులారా!

ఎలా ఉన్నారు మీరంతా?

కేం ఛో?

ఈ షో హౌస్‌ఫుల్ అయ్యింది, ఇది బ్లాక్‌బస్టర్.

నా ప్రసంగాన్ని ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి. మీ మొబైల్ ఫోన్ల ఫ్లాష్ లైట్లను ఆన్ చేసి... విక్టోరియా ప్రీమియర్‌కూ, నా మిత్రుడైన ప్రధానమంత్రికీ నాతో కలిసి గౌరవాభివాదాలు తెలియజేయండి.

మిత్రులారా,

దీనికి ముందు నేను మిమ్మల్ని సిడ్నీలో రెండుసార్లు కలిశాను. మెల్‌బోర్న్ ప్రజలను కలుసుకోవాలనే ఆకాంక్ష నాలోనూ బలంగా ఉంది. అందుకే ఈ సారి మెల్‌బోర్న్ వాసులతో కలిసి ఒక కప్పు ‘ఫ్లాట్ వైట్ కాఫీ’ని ఆస్వాదిస్తూ వారితో ముచ్చటించాలని భావించాను.

మిత్రులారా,

మీరూ, మన ఆస్ట్రేలియా మిత్రులూ ఉత్సాహంగా మాకు ఘన స్వాగతం పలికిన తీరు నిజంగా నిజంగా అద్భుతం. ఒక రకంగా చెప్పాలంటే, మెల్‌బోర్న్ అందరి మనసులనూ దోచేసింది.

మిత్రులారా,

నాకు, భారత్‌కు ఆప్తమిత్రుడైన ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు నా కృతజ్ఞతలు. మీరు సిడ్నీలో మాతో ఉన్నారు, ఈ రోజు ఇక్కడ మెల్‌బోర్న్‌లోనూ భారతీయ సమాజం మధ్య మాతో కలిసి ఉన్నారు. మన మైత్రికి పరిపూర్ణత చేకూరిన అనుభూతిని ఇది అందిస్తోంది.

ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఉన్న అహ్మదాబాద్, అలాగే అత్యంత ప్రతిష్ఠాత్మక స్టేడియం ఉన్న మెల్‌బోర్న్... ఇలా ఒక్క విషయంలోనే కాదు, ఎన్నో రకాలుగా మన మైత్రి అనుసంధానమై ఉంది. మిత్రులారా, మనమంతా చూశాం.. ప్రధానమంత్రి అల్బనీస్ ఎప్పుడు మాట్లాడినా భారతీయుల మనసులను, హృదయాలను గెలుచుకుంటారు. మీరు సిడ్నీలో బాగా సందడి చేశారు. అలాగే ఇప్పుడు మెల్‌బోర్న్‌లో కూడా.

ఉత్సాహభరిత ప్రసంగం చేసిన విక్టోరియా ప్రీమియర్‌కు కృతజ్ఞతలు. భారత్‌పై ఆమె ఆదరాభిమానాలకు ధన్యవాదాలు.

మిత్రులారా,

2014లో నేను ఆస్ట్రేలియాను సందర్శించాను. భారత ప్రధానమంత్రి ఇక్కడ పర్యటించడం 28 ఏళ్ల సుదీర్ఘ కాలంలో అదే మొదటిసారి. అప్పుడు నేను మీతో అన్న ఒక మాట మీకు గుర్తుండే ఉంటుంది.. ఇలాంటి పర్యటన కోసం మీరు మరో 28 ఏళ్ల పాటు వేచి చూడాల్సిన అవసరం రాబోదని నేను అప్పుడే చెప్పాను.

గత 12 సంవత్సరాల్లో ఆస్ట్రేలియాలో ఇది నా మూడో పర్యటన. మరో మాటలో చెప్పాలంటే, ఈ సారి హ్యాట్రిక్ సాధించాను. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు అత్యున్నత స్థాయికి చేరాయనేందుకు నిదర్శనమిది. ఇదంతా ఎవరి గొప్పతనమో తెలుసా మీకు? ఇది మోదీ గొప్పతనం కాదు. ఆ ఘనత మీ అందరిదీ. మిత్రులారా... ఇక్కడి ప్రవాస భారతీయులదే ఆ ఘనత.

మిత్రులారా,

మెల్‌బోర్న్‌లో ఒకే రోజులో నాలుగు రుతువులనూ చూడొచ్చని అంటుంటారు. అయితే, ఇక్కడి భారతీయ సమాజం అద్భుతమైన తన సాంస్కృతిక వన్నెలతో ఈ నగరాన్ని మరింత ఉత్తేజకరంగా మార్చింది.

ఇక్కడ మెల్‌బోర్న్, పరిసర ప్రాంతాల్లో భారతీయత ఉట్టిపడేలా ఎన్నో ప్రదేశాలు, మార్కెట్లు ఉన్నాయి. కొందరు వీటిని లిటిల్ ఇండియా అని పిలిస్తే, మరికొందరు మినీ ఇండియా అంటారు. పేరేదైనా కానీ... అవన్నీ భారతీయతను సంతరించుకున్నవే.

ఈ మధ్య ఎవరో నాకు అలాంటి ఒక మార్కెట్‌కు సంబంధించిన వీడియో చూపించారు. అక్కడ ఎప్పుడూ అద్భుతమైన ఆఫర్లు, సేల్స్ ఉంటాయని ఆ వీడియోలో చెప్పారు. దాంతో ప్రజలు ఆ షాపింగ్ హడావుడిలో మునిగిపోతుంటారట. అసలు షాపింగ్ చేసే మూడ్‌లో లేకపోయినా, అక్కడికి వెళ్తే ఎలాగోలా ఏదో ఒకటి కొనుక్కునే బయటకు వస్తారట. నేను చెప్పింది నిజమే కదా?

మిత్రులారా,

మీలో చాలామంది మొదటిసారిగా ఆస్ట్రేలియాకు వచ్చారు. మరికొందరు ఇక్కడే పుట్టారు. తరాలు మారినా మీలోని భారతీయత సజీవంగానే ఉంది. మీ ఇళ్లలో కనీసం రెండు టైమ్ జోన్లు నడుస్తుంటాయని నేను కచ్చితంగా చెప్పగలను. ఇక్కడ పిల్లలు ఆస్ట్రేలియా సమయం ప్రకారం స్కూల్ నుంచి ఇంటికి తిరిగొస్తే... భారత్‌లోని తాతయ్య, నానమ్మలు వారి వీడియో కాల్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇక్కడ వీకెండ్ అయితే... భారత్‌లో జరిగే మీ బంధువుల వివాహోత్సవాన్ని మీరిక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తుంటారు. దూరం వేల కిలోమీటర్లు కావచ్చు... కానీ మీ దైనందిన జీవితం ఇప్పటికీ భారత్‌తో ముడిపడి ఉంది. ఆ బంధాన్ని అలాగే కాపాడుకుంటూనే మీరంతా ఆస్ట్రేలియా వృద్ధికి, పురోగతికి మనస్ఫూర్తిగా సేవలందిస్తున్నారు. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను.

మిత్రులారా,

ఇదే మన భారతీయుల తత్వం. పాలలో చక్కెర కలిసిపోయి వాటిని మరింత తీయగా చేసినట్టే.. మనం ఎక్కడికి వెళ్లినా అక్కడ ప్రేమను పంచుతాం.

మన ఇంట్లోని పాలు ఆస్ట్రేలియావి కావచ్చు. కానీ చాయ్ మాత్రం భారత్‌దే. కూరగాయలు, పప్పులు ఆస్ట్రేలియా నుంచి రావచ్చు... కానీ, వాటిని రుచిగా వండే మసాలాలు మాత్రం భారత్‌వే.

మిత్రులారా,

ఈ మధ్య భారత్‌లో ‘భజన్ క్లబ్బింగ్’ అనే ఒక కొత్త ట్రెండ్ బాగా ప్రాచుర్యం పొందుతోందని వినే ఉంటారు. మన ‘జెన్ జీ’ యువతరం దీన్ని జోరుగా ముందుకు తీసుకెళ్తోంది. ఇక్కడ ఆస్ట్రేలియాలోనూ మీ వారాంతాలు భక్తి శ్రద్ధలతోనూ, ఆధ్యాత్మికతతోనూ నిండిపోతాయని నేను విన్నాను.

ఒకచోట ఒక కుటుంబం సత్యనారాయణ వ్రతం చేసుకుంటుంది... మరోచోట గురుద్వారాలో ప్రార్థనలు జరుగుతుంటాయి... ఇంకో దగ్గర పిల్లలు భాంగ్రానో, భరతనాట్యమో ప్రదర్శిస్తూ కనిపిస్తారు... వేరొక చోట క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగుతూ ఉంటుంది.

ఇక ఇప్పుడు భారతీయ చలనచిత్రోత్సవం మెల్‌బోర్న్ సాంస్కృతిక క్యాలెండర్‌లో భాగమైపోయింది. మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ మెల్‌బోర్న్‌లో భారతీయ చలనచిత్రోత్సవం ప్రారంభం కాబోతోంది. ఈ ఉత్సవాలు ఘనంగా, విజయవంతంగా జరగాలని కోరుకుంటూ ముందస్తుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

మీరంతా ఎంతో కష్టపడి ఆస్ట్రేలియా అభివృద్ధికి తోడ్పడుతున్నారు. కానీ ఒక కంటితో మీరంతా ఎప్పుడూ భారత్‌ వైపే చూస్తుంటారని నాకు తెలుసు. భారత్‌లో జరుగుతున్న పరిణామాలు, దేశ పురోగతి, అభివృద్ధి వేగం, సాధించిన విజయాలను మీరు నిశితంగా గమనిస్తూ ఉంటారు.

మిత్రులారా,

అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న స్పష్టమైన లక్ష్యంతో 21వ శతాబ్ధపు భారత్ పురోగమిస్తోంది. ఒక కల సాకారమవగానే, మరొక కొత్త కల పుడుతుంది... ఈ ప్రయాణంలో విశేషమిదే.

గతంలో మనం ఒక మాట చెప్పుకొనేవాళ్లం... ‘‘ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది. అలా వేలాది దీపాలు కలిసి వెలుగుతాయి’’ ఈ రోజు నేనంటున్నాను:- ‘‘ఒక కల మరో కలకు మూలమవుతుంది. చూస్తూచూస్తూనే వేలాది కొత్త స్వప్నాలు జనిస్తాయి’’. మనం ఒక లక్ష్యాన్ని సాధించిన ప్రతిసారీ, అంతకన్నా పెద్ద లక్ష్యంపై దృష్టి సారిస్తాం.

‘‘గొప్పగా వికసిద్దాం.. గొప్పగా సాధిద్దాం’’ అని బలంగా నమ్మే నవభారతం ఇది.

140 కోట్ల ఆకాంక్షలున్న దేశం మనది. దేశాన్ని ముందుకు నడిపించాలనే బలమైన తపన, మరింత సాధించాలనే ఆరాటం మనలో ఉన్నాయి. మనం ఇప్పటికే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. అయితే, వీలైనంత త్వరగా ప్రపంచంలోని మూడు అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవాలని మనం భావిస్తున్నాం. ఎందుకంటే మన స్ఫూర్తి చాలా స్పష్టంగా ఉంది: గొప్పగా వికసిద్దాం.. గొప్పగా సాధిద్దాం!

మిత్రులారా,

మీరు స్వయంగా చూశారు... చంద్రుడి దక్షిణ ధ్రువంపై ‘చంద్రయాన్’ను విజయవంతంగా ల్యాండ్ చేసి.. ప్రపంచంలో మరే దేశమూ సాధించని అద్భుత రికార్డును భారత్ సృష్టించింది. కానీ భారత్ దానితో ఆగిపోలేదు. ఎందుకంటే భారత్ నమ్మే సూత్రం ఒక్కటే: గొప్పగా వికసిద్దాం.. గొప్పగా సాధిద్దాం.

అందుకే మిత్రులారా... భారత్ నేడు గగన్‌యాన్ మిషన్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నద్ధమవుతోంది. అలాగే సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవాలన్న లక్ష్యంతో కూడా మనం ముందడుగు వేస్తున్నాం.

మిత్రులారా,

కొన్నేళ్ల కిందటి వరకూ కూడా భారత్‌లో 5జీ సాంకేతికత గురించి అనేక ప్రశ్నలుండేవి. అదెప్పుడు మొదలవుతుంది? ఎలా అమలు చేస్తారు? ఇంకా ఎంత సమయం పడుతుంది?... ఇలా ఎన్నో ప్రశ్నలు. మనం 2022 చివరి నాటికి 5జీ సేవలను అందుబాటులోకి తేవడం మొదలుపెట్టాం. నేడు భారత్‌లోని 99 శాతం జిల్లాల్లో ఈ సేవలు విస్తరించాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా 5జీ సేవలను విస్తరిస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుండడం మీకు సంతోషాన్ని కలిగించే విషయం.

నేడు భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద 5జీ మార్కెట్‌గా అవతరించింది. అంతేకాదు.. మేడ్ ఇన్ ఇండియా 6జీ సాంకేతికతను అభివృద్ధి చేసే దిశగానూ భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఎందుకంటే.. ‘గొప్పగా వికసిద్దాం.. గొప్పగా సాధిద్దాం’ అన్నదే మన విశ్వాసం.

మిత్రులారా,

గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా రెండు డజన్లకు పైగా నగరాలకు మెట్రో రైలు వ్యవస్థ విస్తరించింది. నేడు ప్రతిరోజూ 1.25 కోట్లకు పైగా ప్రజలు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ భారత్‌లో ఉంది. అయితే భారతీయులం దానితోనే సంతృప్తి చెందలేదు. ‘గొప్పగా వికసిద్దాం - గొప్పగా సాధిద్దాం’.. ఇదే మన విశ్వాసం.

అందుకే మనం దేశవ్యాప్తంగా నమో భారత్ రాపిడ్ రైల్ వంటి హైస్పీడ్ రవాణా వ్యవస్థలనూ, వందే భారత్ వంటి పాక్షిక హైస్పీడ్ రైళ్లనూ వేగంగా విస్తరిస్తున్నాం.

‘మేకిన్ ఇండియా’ విజయవంతమవడం మరో ఉదాహరణ. గత 12 ఏళ్లలో ‘మేకిన్ ఇండియా’ ఒక ప్రపంచ స్థాయి బ్రాండ్‌గా ఎదిగింది. భారత్‌లో తయారైన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రపంచవ్యాప్త మార్కెట్లకు చేరుతున్నాయి. మన వాహనాలు, ఔషధోత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉనికిని చాటుకుంటున్నాయి. నేడు భారత రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్నీ, విశ్వసనీయతనూ ప్రపంచమంతా చూస్తోంది.

ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ దీని సమర్థతను మీరంతా చూశారు. ఉగ్రవాద రహస్య స్థావరాల వద్ద పేలి.. ప్రపంచవ్యాప్తంగా అవి ప్రతిధ్వనించాయి. ఆ ఉగ్రవాద స్థావరాలపై జరిపిన నిశ్చయాత్మక దాడులు మీకు గర్వకారణం కదా?

మిత్రులారా,

భారత్ అంతటితో ఆగిపోవాలనుకోవడం లేదు. ‘‘గొప్పగా వికసిద్దాం - గొప్పగా సాధిద్దాం’’ అని భారత్ చాటుతోంది. అందుకే.. చిప్స్ నుంచి షిప్స్ వరకు - ఒక సరికొత్త తయారీ వ్యవస్థ నేడు భారత్‌లో రూపుదిద్దుకుంటోంది.

మిత్రులారా,

భారతదేశ గొప్ప కలలకూ, సాహసోపేతమైన ఆకాంక్షలకూ పునాది దాని ప్రజలే. భారతీయులమైన మనమే ఆ కలలకు ఉత్తేజాన్నిచ్చేది. ‘ప్రజలే ప్రథమం/నాగరిక్ దేవో భవ’ అంటే, ప్రజలే సర్వోన్నతులు... ఇదే నేడు భారత్‌లో పరిపాలనకు మార్గదర్శక సూత్రం.

ఒక ఉదాహరణ చెబుతాను. కొన్నేళ్ల కిందటి వరకు.. అర్హత పత్రాల ధ్రువీకరణ సాధారణంగా అందరికీ అవసరముండేది. మీరు దేనికైనా దరఖాస్తు చేయాలన్నా, లేదా ఏదైనా అధికారిక పత్రాన్ని సమర్పించాలన్నా.. ముందుగా ఒక ప్రభుత్వ అధికారి దాన్ని ధ్రువీకరించాల్సి ఉండేది.  

ఒకప్పుడు తాము ఎవరో నిరూపించుకునేందుకు ప్రజలు తెల్లవారుజామునే క్యూలైన్లలో నిలబడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. మాకు పౌరుడే ప్రథమ ప్రాధాన్యత. ఈ రోజుల్లో చాలా పనులకు స్వీయ ధ్రువీకరణ ఉంటే సరిపోతుంది.

విశ్వాసంతో కూడిన ఆ ప్రయాణమే ఇప్పుడు డిజిలాకర్‌గా మారింది. తమ పత్రాలను భారత ప్రజలు డిజిటల్ రూపంలో సురక్షితంగా భద్రపరచుకునేందుకు ఉపయోగపడే డిజిటల్ వేదిక ఇది. కేవలం ఒక్క క్లిక్‌తో ఇతరులతో పత్రాలను పంచుకోవచ్చు. ధ్రువీకరించుకోవచ్చు. పరిశీలన కోసం సమర్పించవచ్చు.

మిత్రులారా,

వ్యవస్థను రూపొందించటం ఒకెత్తయితే... దాన్ని సురక్షితంగా, విశ్వసనీయతతో, పెద్ద ఎత్తున విస్తరించటం అంతకన్నా గొప్ప విజయం. ఇవాళ భారత్‌లో ఎంత మంది డిజిలాకర్ ఉపయోగిస్తున్నారో మీకు తెలుసా? సంఖ్యను గుర్తుపెట్టుకోవటం కూడా అంత సులభం కాదు.

ప్రస్తుత లెక్కల ప్రకారం డిజిలాకర్‌కు 70 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. వీరంతా ఈ వేదిక ద్వారా 850 కోట్లకు పైగా అంటే 8.5 బిలియన్లకు పైగా పత్రాలను భద్రపరచుకున్నారు.

మిత్రులారా,

మా సిద్ధాంతం 'నాగరిక్ దేవోభవ'కు భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మంచి ఉదాహరణ. ఇవాళ లక్షలాది మంది భారతీయులకు డిజిటల్ హెల్త్ ఐడీలున్నాయి. వారి పూర్తి ఆరోగ్య, చికిత్సకు సంబంధించిన సమాచారం డిజిటల్ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. ఇది రోగ నిర్ధారణను సులభతరం చేయటమే కాక, దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను సమర్థవంతంగా అందించేందుకు సహాయపడుతుంది.

ఆన్‌లైన్‌లో వైద్యులను సంప్రదించే విధానం కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వ ఈ-సంజీవని వేదిక ద్వారా ఇప్పటివరకు 48 కోట్లకు పైగా ఆన్‌లైన్ వైద్య సంప్రదింపులు జరిగాయి. 2,25,000 మందికి పైగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఈ వేదికతో అనుసంధానమై ఉన్నారు.

మిత్రులారా,

ఒకప్పుడు మీరంతా పాస్‌పోర్టుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే ఉంటారు. అప్పట్లో పాస్‌పోర్టు రావడానికి ఎన్ని వారాల సమయం పట్టేదో గుర్తుందా? కానీ నేడు పరిస్థితి మారింది.. కేవలం కొద్ది రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ అవుతోంది. పౌరులకు ప్రధమ ప్రాధాన్యత పాలన ఇదే. 'నాగరిక్ దేవో భవ' మంత్రం సాధించిన విజయమిది.

మిత్రులారా,

భారతదేశం ఎంత బలంగా మారితే, ప్రజలకు అంతగా మేలు జరుగుతుందని నేను ఎల్లప్పుడూ చెబుతుంటాను. మన సనాతన సిద్ధాంతం.. ‘సర్వే భవంతు సుఖినః’ అంటే 'అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి'. ఈ శాశ్వత విలువలే నేటికీ భారతదేశ విధానాలు, చర్యలకు దిశానిర్దేశం చేస్తున్నాయి.

మిత్రులారా,

గత నెల వెనిజులాలో భారీ భూకంపం సంభవించింది. పెద్దఎత్తున విధ్వంసం జరిగింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో దూరం మాకు అడ్డుకాలేదు. వెనిజులా ప్రజల బాధను మా బాధగానే భావించాం. బాధితులకు సాయం అందించేందుకు భారత్ వెంటనే సహాయక, రక్షణ చర్యలను చేపట్టింది.

సహాయాన్ని అందించేందుకు వీలైనంత త్వరగా మా నిపుణులను అక్కడికి పంపించాం. మా వైద్య బృందాలు ఆలస్యం చేయకుండా సేవలను ప్రారంభించాయి. ఈ ప్రయత్నాల ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడినందుకు తృప్తిగా ఉంది.

మిత్రులారా,

టర్కీ, సిరియాలో భయంకరమైన భూకంపాలు సంభవించినప్పుడు భారత్ వెంటనే స్పందించి సహాయక, రక్షణ చర్యల కోసం బృందాలను పంపింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. గతేడాది మయన్మార్ కు మద్దతుగా ఆపరేషన్ బ్రహ్మను చేపట్టాం. శ్రీలంకను తుఫాను వణికించినప్పుడు సహాయం చేసేందుకు, ఉపశమన చర్యల కోసం ఆపరేషన్ సాగర్ బంధును చేపట్టాం.

మిత్రులారా,

కొవిడ్-19 మహమ్మారి జ్ఞాపకాలు ఇంకా మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఆ క్లిష్ట సమయంలో విదేశాల్లోని భారత పౌరులను స్వదేశానికి తీసుకురావడమే కాక, మరెన్నో ఇతర దేశాల పౌరులు కూడా సురక్షితంగా ఆయా దేశాలకు చేరుకునేలా భారత్ సహాయం చేసింది. మనం భారీ ఎత్తున సహాయక చర్యలను చేపట్టాం. అవసరమైన వారికి మందులను అందించాం. 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్లను పంపించాం. చివరకు యుద్ధ ప్రాంతాల్లో సంక్షోభంలో చిక్కుకున్న ప్రజలను తరలించేందుకు భారత్ శతవిధాలా ప్రయత్నించింది.

మిత్రులారా,

భారతదేశం ఎవరికైనా ఆపన్నహస్తం అందించినప్పుడు వారి దేశమేదో చూడదు. సహాయం అందించేప్పుడు వారి పాస్‌పోర్టు రంగులతో పనిలేదు. అందువల్లే ప్రపంచదేశాలన్నీ భారత్‌ను అంతగా విశ్వసిస్తాయి.

మిత్రులారా,

మానవాళికి సేవలందించటంలో ఆస్ట్రేలియా కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఉమ్మడి అంకితభావమే ఇరుదేశాల మధ్య భాగస్వామ్యానికి ప్రధాన ఆధారం.

మన బంధాన్ని మరింత బలోపేతం చేసే రంగం క్రీడలు. క్రీడా ప్రపంచంలో ఆస్ట్రేలియా ప్రత్యేకమైన బ్రాండ్. భారతదేశంలోనూ క్రీడా వ్యవస్థలో అద్భుతమైన మార్పులు వస్తున్నాయి.

మిత్రులారా,

ఖేలో ఇండియా మిషన్ గురించి మీరు వినే ఉంటారు. ఇది కేవలం క్రీడా విధానం మాత్రమే కాదు... పాఠశాల స్థాయి నుంచే యువ అథ్లెట్లను తీర్చిదిద్దేలా దేశవ్యాప్తంగా సాగుతున్న గొప్ప ఉద్యమం. వందల, వేల మంది అథ్లెట్లు పాల్గొనేలా ఖేలో ఇండియా క్రీడలను పాఠశాల, విశ్వవిద్యాలయ, జాతీయ స్థాయిల్లో నిర్వహిస్తున్నారు.

ఈ మిషన్ ద్వారా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇది అథ్లెట్లకు, ముఖ్యంగా మన ఆడబిడ్డలకు మెరుగైన అవకాశాలను కల్పిస్తోంది. ఈ ప్రయత్నం కేవలం నగరాలకే పరిమితం కాలేదు. సంసద్ ఖేల్ మహాకుంభ్ వంటి కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా గ్రామాల్లో క్రీడలు, శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించటమే కాక, వాటిని ఉపాధి అవకాశాలతో అనుసంధానిస్తున్నారు.

దీని ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతదేశ అథ్లెట్లు, క్రీడా జట్లు రోజురోజుకూ మెరుగైన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు.

మిత్రులారా,

ఈ ఆత్మవిశ్వాసమే ప్రపంచ క్రీడారంగంలో భారతదేశాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తుంది. కామన్వెల్త్ గేమ్స్-2030కి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఒలింపిక్ గేమ్స్ 2036 నిర్వహణకు బిడ్ దాఖలు చేస్తున్నాం. క్రీడారంగంలో భారత్, ఆస్ట్రేలియా భాగస్వామ్యం బలపడుతూనే ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

భారత్, ఆస్ట్రేలియా కలిసి చేసే ప్రతీ పని ఇరుదేశాలకూ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణే భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం. మీకు ఈ కవితా పంక్తి గుర్తుండే ఉంటుంది:

‘నేను గమ్యం వైపు ఒంటరిగా బయలుదేరాను కానీ, ప్రజలు నాతో చేరటం వల్ల పెద్ద సమూహం ఏర్పడింది’.

అదే విధంగా భారత్-ఆస్ట్రేలియా ఒప్పందం ఒక ఆరంభం మాత్రమే. ఇవాళ ఆ పెద్ద సమూహం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే స్థాయికి విస్తరించింది.

మిత్రులారా,

మనది కేవలం వర్తక దేశం మాత్రమే కాదు... ఆవిష్కరణలు, శాస్త్ర, సాంకేతికతకు ఎంతో ప్రాధాన్యతనిస్తాం. ఆస్ట్రేలియా ఖాతాలో ఎన్నో అద్భుతమైన విజయాలున్నాయి. హియరింగ్ ఇంప్లాంట్, వై-ఫై, గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్, ఫ్లైట్ బ్లాక్ బాక్స్, రహస్య ఓటింగ్ పద్ధతి వంటి ఆవిష్కరణలన్నీ ఆస్ట్రేలియా విశేష సహకారాన్ని తెలియజేస్తాయి. నేడు ఈ ఆవిష్కరణలు ప్రపంచాన్ని మెరుగైన ప్రాంతంగా మార్చేందుకు సహాయపడుతున్నాయి.

మిత్రులారా,

భారతదేశం కూడా శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల వ్యవస్థను సమూలంగా మారుస్తోంది. ఇవాళ దేశవ్యాప్తంగా 10,000లకు పైగా పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ప్రయోగశాలలున్నాయి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచించే మనస్తత్వాన్ని ఈ ప్రయోగశాలలు పెంపొందిస్తున్నాయి.

గడిచిన 12 ఏళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ అవతరించింది. ఆ గణాంకాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వివరాలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?

నేడు భారతదేశంలో 2,00,000లకు పైగా అంకుర సంస్థలు నమోదయ్యాయి. దేశంలో ప్రతినెలా 4,000లకు పైగా కొత్త అంకుర సంస్థలు నమోదవుతున్నాయి. రక్షణ, అంతరిక్షం వంటి రంగాల్లోనూ వందలాది అంకుర సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ ఉదాహరణలను పంచుకునేందుకు కారణం ఉంది. ఒకప్పుడు భారత్‌లో ఈ రంగాలన్నీ మూతపడ్డాయి. గత కొన్నేళ్లుగా ఇవి ప్రైవేట్ వ్యవస్థాపకతకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు భారత స్పేస్ స్టార్టప్... చరిత్రలోనే తొలిసారిగా సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంది.

మిత్రులారా,

విద్య, నైపుణ్యాలు, ఆవిష్కరణల రంగాల్లో భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యం మరింత సన్నిహితంగా, బలంగా మారటం సంతోషకరం. ఇవాళ వేలాది మంది భారత విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారు. ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు భారతదేశంలోనూ క్యాంపస్‌లను ప్రారంభిస్తున్నాయి.

డీకిన్ విశ్వవిద్యాలయం, వోలోంగాంగ్ విశ్వవిద్యాలయ క్యాంపస్ లు ఇప్పటికే కార్యకలాపాలను ప్రారంభించాయి. మరిన్ని ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇది కేవలం కొత్త క్యాంపస్‌లను తెరవటం మాత్రమే కాదు.. ప్రపంచ నాయకులను తయారుచేయటం. ప్రపంచం కోసం నైపుణ్యం, సృజనాత్మకత గల ప్రతిభావంతులైన మానవ వనరులను సృష్టించే గొప్ప లక్ష్యం.

మిత్రులారా,

నేను మీతో భారతదేశం గురించి ఎంతో సమాచారాన్ని పంచుకున్నాను. ఇప్పుడు ఒక అభ్యర్థన చేయాలనుకుంటున్నా. కొంతకాలం కిందట ప్రవాస భారతీయుల పిల్లల కోసం భారత్ కో జానియే క్విజ్ కార్యక్రమాన్ని మేం ప్రారంభించాం. ఈ క్విజ్ భారతదేశ వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటమే కాక భారతీయులను, వారి కుటుంబాలను స్వదేశీ వారసత్వంతో అనుసంధానించేందుకు సహాయపడుతుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని చాలామంది యువ మిత్రులు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొనటం ఎంతో సంతోషకరం. ఈ పోటీ ఆరో ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈసారి అనేక పోటీలతో ఆటల రూపంలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులందరూ ఇందులో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆస్ట్రేలియన్ స్నేహితులను, మీ పాఠశాల మిత్రులను, మీ కళాశాల స్నేహితులను కూడా ఈ పోటీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా.

మిత్రులారా,

భారత్-ఆస్ట్రేలియా సంబంధాలను బలోపేతం చేయటంలో మీ సహకారం ఎంతో కీలకమైనది. అయితే ఇక్కడితో మీ పని ముగియలేదు. ఇప్పుడు మరిన్ని బాధ్యతలు పెరిగాయి. భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్య నూతన దశ ఇప్పుడు ప్రారంభం అవుతుంది.

భారత్-ఆస్ట్రేలియా సంబంధాల్లో ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శించండి. విజయ పరంపరను కొనసాగించండి. మీ విజయమే.. భారత్, ఆస్ట్రేలియా దేశాల విజయం.

మిత్రులారా,

ప్రధానమంత్రి అల్బనీస్‌కు, మిత్రులైన మీ అందరికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

భారత్ మాతాకీ జై

వందేమాతరం!

గమనిక: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి స్వేచ్ఛానువాదం. అసలు ప్రసంగం హిందీలో ఇచ్చారు.

 

***

 


(रिलीज़ आईडी: 2283337) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Malayalam