ప్రధాన మంత్రి కార్యాలయం
మూడో భారత్ - ఆసియా వార్షిక శిఖరాగ్ర సదస్సు సంయుక్త ప్రకటన
प्रविष्टि तिथि:
09 JUL 2026 10:58AM by PIB Hyderabad
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు.. 2026 జూలై 8 నుంచి 10 వరకు గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. కులిన్ కూటమికి చెందిన ఊరుండ్‌జేరి వోయ్-వురుంగ్, బునురాంగ్/ బూన్ వురుంగ్ స్థానిక తెగల వారసత్వ ప్రాంతమైన నార్మ్ (మెల్‌బోర్న్)లో జరుగుతున్న మూడో ‘భారత్ -ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సు’లో పాల్గొనేందుకు శ్రీ మోదీ ఈ పర్యటన చేపట్టారు.
చారిత్రక సంబంధాలు, ప్రజల మధ్య అనుబంధం, ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాలు, పరస్పర గౌరవ పునాదులపై ఇరు దేశాల మధ్య వెల్లివిరుస్తున్న చిరకాల మైత్రిని ఇరుదేశాల ప్రధానమంత్రులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వేగంగా మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు.. భారత్ - ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసి, విస్తరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఇరుదేశాల్లోనూ శాంతి, శ్రేయస్సు, స్థిరత్వానికి దోహదం చేసేలా సహకారానికి అవకాశమున్న మరిన్ని రంగాలను పరిశీలించేందుకు ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయి.
రక్షణ, నౌకా వాణిజ్య సహకారం బలోపేతం
నానాటికీ సంక్లిష్టంగా మారుతున్న వ్యూహాత్మక పరిస్థితుల్లో.. రక్షణ, భద్రతాపరమైన సహకారం ఇరు దేశాల భాగస్వామ్యానికీ ప్రధాన ప్రాతిపదిక అని ప్రధానమంత్రులిద్దరూ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక రక్షణ, భద్రతా సంబంధాల విస్తృతినీ, ఆశయాలనూ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంతోపాటు.. ప్రాంతీయ భద్రతకు దోహదపడేలా - ‘రక్షణ, భద్రతా సహకారంపై ఉమ్మడి ప్రకటన’ను వారు విడుదల చేశారు.
ఇరు దేశాల మధ్య సంప్రదింపులు, సహకారాన్ని మరింత పెంపొందించేందుకు వీలుగా ‘వార్షిక రక్షణ మంత్రుల చర్చల’ యంత్రాంగం ఏర్పాటును ఇద్దరు ప్రధానమంత్రులు స్వాగతించారు. పరస్పర లాజిస్టిక్స్ సహకార ఒప్పందం కింద ఇరు దేశాల సైనిక విన్యాసాలు, భాగస్వామ్యాల సంఖ్య, వాటి పురోగతి నిరంతరం పెరుగుతుండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రక్షణ భాగస్వామ్యం అన్ని రంగాలకు విస్తరించడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధానమంత్రులు.. బహుపాక్షిక భాగస్వామ్య దేశాలతో కలిసి పరస్పర కార్యాచరణ సమన్వయాన్ని పటిష్టం చేసుకోవడం ఆవశ్యకమని స్పష్టం చేశారు.
శాంతియుత, స్థిరమైన, సుసంపన్నమైన ఇండో - పసిఫిక్ ప్రాంతాన్ని ఆవిష్కరించాలన్న సమష్టి సంకల్పానికి నౌకా వాణిజ్య సహకారం అత్యంత కీలకమని ఇరు దేశాల ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. భారత్-ఆస్ట్రేలియా నౌకా వాణిజ్య భద్రతా సహకార ప్రణాళిక ద్వారా ఈ రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఇరు దేశాల ప్రధానమంత్రులు అంగీకరించారు. ప్రాంతీయ భద్రతలో సమర్థమైన నౌకావాణిజ్య సహకారం అత్యావశ్యకమని గుర్తిస్తూ.. శాంతియుత, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని సాకారం చేసుకునే దిశగా సమష్టి సంకల్పాన్ని ఈ ప్రణాళిక ద్వారా రెండు దేశాలు పునరుద్ఘాటించాయి. సమాచార మార్పిడి, సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం, కార్యాచరణ సమన్వయం వంటి అంశాల్లో కలిసి పనిచేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. అలాగే సురక్షిత సముద్ర వాతావరణాన్ని పెంపొందించేందుకు వీలుగా.. ఆస్ట్రేలియాకు చెందిన మారిటైమ్ బోర్డర్ కమాండ్, భారత తీర రక్షక దళం మధ్య అవగాహన ఒప్పందాన్ని వారు స్వాగతించారు.
రక్షణ పరిశ్రమ, పరిశోధన, పరికరాల రంగాల్లో పరస్పర సహకారం ప్రాధాన్యాన్ని ఇరు దేశాల ప్రధానమంత్రులు గుర్తించారు. రక్షణ పరికరాలు, రక్షణ సేవలకు సంబంధించి అవగాహన ఒప్పందం రూపకల్పనలో పురోగతిని వారు స్వాగతించారు. అలాగే భారత్‌లో ఆస్ట్రేలియా చేపట్టిన మొదటి రక్షణ వాణిజ్య మిషన్, భారత్-ఆస్ట్రేలియా రక్షణ పారిశ్రామిక చర్చల కార్యక్రమాల ద్వారా.. ఇరుదేశాల రక్షణ పరిశ్రమల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు జరుగుతున్న కృషిని వారు అభినందించారు.
భవిష్యత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా సైనిక సిబ్బందిని తీర్చిదిద్దడంలో వృత్తిపరమైన సైనిక విద్య, ఉమ్మడి పరిశోధనలు, యుద్ధ క్రీడలు, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రులిద్దరూ గుర్తించారు. వృత్తిపరమైన సైనిక విద్య విషయంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇరు దేశాల సైనిక విద్యా సంస్థల మధ్య సంబంధాలను ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకోవాలని ప్రధానమంత్రులిద్దరూ సూచించారు. ఇందులో భాగంగా 2028-2029 కాలానికి.. ఆస్ట్రేలియా డిఫెన్స్ కాలేజీలో భారత విజిటింగ్ మిలిటరీ ఇన్‌స్ట్రక్టర్ నియామకం కానుండడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆస్ట్రేలియా త్వరలో ఆతిథ్యమివ్వనున్న నాలుగో విడత ‘జనరల్ రావత్ భారత్ - ఆస్ట్రేలియా యువ అధికారుల భాగస్వామ్య కార్యక్రమా’న్ని ఇరుదేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు.
ఇరు దేశాల ఆవిష్కరణ వ్యవస్థల అనుసంధానంతోపాటు.. ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధన సంస్థల మధ్య సహకారాన్ని మరింత వేగవంతం చేయడం కోసం ఒక ద్వైపాక్షిక ఆవిష్కరణల యంత్రాంగం ఏర్పాటుపై పరిశీలించడానికి ప్రధానమంత్రులు అంగీకరించారు. భవిష్యత్తుకు అవసరమైన అత్యాధునిక రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకునేలా.. రక్షణ రంగంలో శాస్త్ర, సాంకేతిక పరిశోధనలను మరిన్ని రంగాలకు విస్తరించడం ఎంతో కీలకమని వారిద్దరూ స్పష్టం చేశారు.
ఆర్థిక భద్రతను, సమృద్ధిని పెంపొందించడం
భారత్ - ఆస్ట్రేలియా ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) కింద ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిరంతరం వృద్ధి చెందడం, సుంకాలు కాని ఇతర అవరోధాలు తగ్గడాన్ని ప్రధానమంత్రులు స్వాగతించారు. దీనివల్ల ఇరు దేశాల వ్యాపార సంస్థలకు, వినియోగదారులకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక బంధాల పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడంపాటు, ఇరు దేశాల శ్రేయస్సుకూ దోహదపడేలా.. మరింత ప్రతిష్ఠాత్మకమైన, సమతౌల్యంతో కూడిన, పరస్పర ప్రయోజనకరమైన సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ) దిశగా అడుగులు వేసేందుకు కట్టుబడి ఉన్నామని వారు పునరుద్ఘాటించారు. పెట్టుబడులను మరింత పెంపొందించడం అత్యంత కీలకమని స్పష్టం చేసిన ప్రధానమంత్రులు.. ఇరు దేశాల్లోని సంబంధిత ఆర్థిక సంస్థల మధ్య బలమైన సమన్వయం ద్వారా, ప్రైవేటు రంగ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తోడ్పాటును అందిస్తామని స్పష్టం చేశారు.
పరిశ్రమల నేతృత్వంలో భాగస్వామ్యం అత్యావశ్యకమని పేర్కొంటూ.. ఈ పర్యటన సందర్భంగా నిర్వహించిన ‘సీఈవో ఫోరమ్’ సమావేశాన్ని ప్రధానమంత్రులు స్వాగతించారు. ఇరు దేశాల వ్యాపార సంస్థల మధ్య బలమైన సంబంధాలను ఏర్పరచుకునేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. భారత ‘మేక్ ఇన్ ఇండియా’, ఆస్ట్రేలియాకు చెందిన ‘ఫ్యూచర్ మేడ్ ఇన్ ఆస్ట్రేలియా’ కార్యక్రమాలు ఒకదానికొకటి పూరకాలుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తయారీ, సాంకేతికత, పెట్టుబడి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించుకునేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ‘భారత్‌తో ఆస్ట్రేలియా ఆర్థిక భాగస్వామ్యంపై సరికొత్త ప్రణాళికను ఎప్పటికప్పుడు అమలు చేస్తుండడాన్ని అభినందించారు. సహకారాన్ని మరింత విస్తరించుకునే దిశగా ఆచరణాత్మక మార్గాలను రూపొందించడంలో.. 2026 మే నెలలో సిడ్నీలో నిర్వహించిన మొదటి ‘ట్రాక్ 1.5 డైలాగ్’ ఎంతగానో తోడ్పాటునందించిందని హర్షం వ్యక్తం చేశారు.
కీలక ఖనిజాల రంగంలో పరస్పర సహకారానికి కట్టుబడి ఉన్నట్టు ఇరు దేశాల ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, దీర్ఘకాలిక సరఫరా - ఉత్పత్తి కొనుగోలు ఒప్పందాలు, ఖనిజాల ప్రాసెసింగ్, వాటి విలువను పెంచే సామర్థ్యాల అభివృద్ధికి దోహదం చేసేలా... రెండు దేశాల ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ-ప్రైవేట్ కంపెనీలు, పరిశోధన సంస్థల మధ్య భాగస్వామ్యం అత్యావశ్యకమని వారు స్పష్టం చేశారు. పారదర్శకమైన, సురక్షితమైన, పటిష్టమైన సరఫరా వ్యవస్థలు మన ఆర్థిక భద్రతకు అత్యంత కీలకమన్నారు. ముఖ్యంగా ఇంధనం, కీలక ఖనిజాల రంగానికి సంబంధించి.. ద్వైపాక్షిక కార్యక్రమాలు, బహుపాక్షిక వేదికల ద్వారా సరఫరా వ్యవస్థల్లో ఉమ్మడి సహకారం దిశగా కలిసి పనిచేయడం అత్యావశ్యకమన్న అభిప్రాయాన్ని ప్రధానమంత్రులిద్దరూ వ్యక్తపరిచారు.
ఇంధనం, వాతావరణం, అంతరిక్షం, సాంకేతికతల్లో సహకారానికి ప్రోత్సాహం
మన ఆర్థిక వ్యవస్థల్లో ఇంధన భద్రత, వనరుల సహకారం ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందని ప్రధానమంత్రులు అన్నారు. ఇంధన పరివర్తనను వేగవంతం చేయడంలో, ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో, దీర్ఘకాలిక ఆర్థిక శ్రేయస్సుకు తోడ్పడడంలో పునరుత్పాదక ఇంధనం, విద్యుదీకరణ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నమ్మకమైన, అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో, సుస్థిర ఇంధన సరఫరా కోసం పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘాటించారు. ఈ దిశగా ఇరు దేశాల మధ్య ఇంధన భద్రతపై ఉమ్మడి ప్రకటనను వారు స్వాగతించారు.
వాతావరణ మార్పు సవాలును ఎదుర్కొనే చర్యలను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రులిద్దరూ స్పష్టం చేశారు. వివిధ దేశాల స్థానిక పరిస్థితుల నేపథ్యంలో.. సమాన అవకాశాలు, వైయక్తిక వైవిధ్యాలున్న ఉమ్మడి బాధ్యతలు - ఆయా దేశాల సామర్థ్యాల సూత్రానికి అనుగుణంగా పారిస్ ఒప్పందాన్ని అమలు చేయాలని వారు స్పష్టం చేశారు. అలాగే ‘కాప్-31’ పర్యావరణ చర్చల అధ్యక్ష దేశంగా ఆస్ట్రేలియా నాయకత్వం వహించబోతుండడాన్ని స్వాగతించారు. పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లోని చిన్న ద్వీప దేశాలు, ఇతర వెనుకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వాతావరణ కార్యాచరణలో ఇదే వేగాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ.. వాతావరణ పరిరక్షణ నిధులు, అలాగే సాంకేతిక పరిజ్ఞాన వినిమయమూ, సామర్థ్యాలను పెంచుకోవడమూ అత్యావశ్యకమైన అంశాలని వారు స్పష్టం చేశారు. భారత్ - ఆస్ట్రేలియా పునరుత్పాదక ఇంధన భాగస్వామ్యంలో పురోగతిపై హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ‘రూఫ్‌టాప్ సోలార్ అకాడమీ’ని నెలకొల్పడం, అది కార్యకలాపాలను ప్రారంభించడం అభినందనీయమన్నారు.
భవిష్యత్తులో వికాసానికీ, ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి సాంకేతికత, ఆవిష్కరణలను సద్వినియోగం చేసుకోవడం ఎంతో కీలకమని ఇరు దేశాల ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. సాంకేతిక సహకారానికీ, వికాసానికీ ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాలే పునాది అని అభిప్రాయపడ్డారు. కీలక సాంకేతికతలు, సరఫరా వ్యవస్థల, సైబర్ భద్రత, డిజిటల్ సామర్థ్యం, రక్షణ పరిశోధనలల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు వీలుగా.. ‘సైబర్, కీలక సాంకేతికతలు, సరఫరా వ్యవస్థలపై భారత్ - ఆస్ట్రేలియా భాగస్వామ్యం (పీఏసీటీఎస్)’ ఏర్పాటుకు ప్రధానమంత్రులిద్దరూ అంగీకరించారు. కీలక, అధునాతన సాంకేతికతల్లో సహకారానికి విశ్వసనీయ భాగస్వామ్యాలే అసలైన పునాదిగా పునరుద్ఘాటిస్తూ... ‘ఆస్ట్రేలియా- కెనడా- భారత్ సాంకేతిక, ఆవిష్కరణల భాగస్వామ్యం (ఏసీఐటీఐ)’ అవగాహన ఒప్పందం కుదరడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలు సహా.. అంతరిక్ష రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవడం అత్యావశ్యకమని ఇరు దేశాల ప్రధానమంత్రులు పేర్కొన్నారు. భారత ‘గగన్‌యాన్’ మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి ఆస్ట్రేలియా అందిస్తున్న నిరంతర మద్దతును వారు స్వాగతించారు. ఇందులో భాగంగా కోకోస్ కీలింగ్ దీవుల్లో ఒక తాత్కాలిక అంతరిక్ష అనుసంధాన కేంద్రాన్ని అందుబాటులోకి తేవడంపై హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) - ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ (ఏఎస్ఏ) మధ్య సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై ఇరుపక్షాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్‌జీ)లో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా తన బలమైన మద్దతును పునరుద్ఘాటించింది. ‘ఆస్ట్రేలియా - భారత్ అణు సహకార ఒప్పందా’న్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా.. పరిపాలన ఒప్పందం ఖరారవడాన్ని ఇరు దేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు. కేవలం శాంతియుత ప్రయోజనాల కోసం, అలాగే ఐఏఈఏ భద్రతా ప్రమాణాల మేరకు.. ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు దీర్ఘకాల యురేనియం ఎగుమతులకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.
విద్య, నైపుణ్యాలు, ప్రజా సంబంధాల బలోపేతం
ఇరు దేశాల భాగస్వామ్యానికి ప్రజలే కేంద్రమని ప్రధానమంత్రులిద్దరూ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తున్న విదేశీయులలో భారతీయులదే అతిపెద్ద సమూహమని గుర్తుచేశారు. ఉత్తేజకరమైన, బహు సాంస్కృతిక ఆస్ట్రేలియా సమాజంలో భారతీయ సమాజం కీలక పాత్ర పోషిస్తోందని వారు కొనియాడారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్నీ, ప్రజా సంబంధాలనూ మరింత బలోపేతం చేసుకునేందుకు వీలుగా.. ‘సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా - ఇండియా రిలేషన్స్’ కోసం 10 మిలియన్ డాలర్ల ‘మైత్రి గ్రాంట్ల’ను ప్రకటించడాన్ని స్వాగతించారు. ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న ఉన్నత స్థాయి, మంత్రివర్గ సమావేశాల కొనసాగింపుగా.. ఇరు దేశాల పార్లమెంటుల మధ్య సంబంధాలు బలోపేతం కావడంపై ప్రధానమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పార్లమెంటులోని ‘భారత పార్లమెంటరీ మిత్ర బృందం’ తరహాలోనే.. భారత లోక్‌సభలోనూ ‘ఆస్ట్రేలియా పార్లమెంటరీ మిత్ర బృందం’ ఏర్పాటును ప్రత్యేకంగా ప్రస్తావించారు. పార్లమెంటు సహా ప్రజాస్వామ్య వ్యవస్థల నడుమ పరస్పర సహకారాన్ని నిరంతరం కొనసాగించాలని ఇరు దేశాల ప్రధానమంత్రులు అభిప్రాయానికి వచ్చారు.
ఇరు దేశాల మధ్య విస్తరిస్తున్న విద్యా రంగ సహకారాన్ని ప్రధానమంత్రులు ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న లేదా అందుకు అనుమతులు పొందిన ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయ ప్రాంగణాల సంఖ్య పెరుగుతుండడం ఇందుకు నిదర్శనమన్నారు. బెంగళూరులో క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ఫ్లిండర్స్ యూనివర్సిటీకి భారత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రాథమిక అనుమతి పత్రాన్ని జారీ చేయడం, గురుగ్రామ్‌లో క్యాంపస్‌ను ప్రారంభించేందుకు విక్టోరియా విశ్వవిద్యాలయానికి అనుమతి లభించడాన్ని వారు స్వాగతించారు. ఆస్ట్రేలియాకు వచ్చే భారతీయ విద్యార్థులను తాము సాదరంగా ఆహ్వానిస్తామనీ, వారు ఆస్ట్రేలియా తరగతి గదులు, క్యాంపస్‌లు, ఇక్కడి సమాజాల్లో విలువైన సభ్యులనీ ఆ దేశ ప్రధానమంత్రి అల్బనీస్ స్పష్టం చేశారు. దీనితోపాటు వృత్తి విద్యా శిక్షణ రంగంలో సహకారాన్ని మరింత విస్తరించుకునే దిశగా.. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న ‘జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ’లో మైనింగ్ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటుకు తోడ్పాటునందించేలా.. పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వం - భారత ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంపై ఇరుదేశాల ప్రధానమంత్రులు హర్షం వ్యక్తం చేశారు.
క్రీడా రంగం ఇరు దేశాల ప్రజలూ ఉమ్మడిగా అభిమానించే రంగం మాత్రమే కాదనీ, ద్వైపాక్షిక సంబంధంలో అవి కీలక భాగమని ప్రధానమంత్రులు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. క్రీడల ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, పెట్టుబడులు మరింత పెరుగుతాయని వారు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, భారత్ మధ్య క్రీడా రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ‘భారత్ - ఆస్ట్రేలియా క్రీడా సహకార ప్రణాళిక’ను స్వాగతించారు. బ్రిస్బేన్ వేదికగా జరగనున్న 2032 ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలకు ఆస్ట్రేలియా, అలాగే అహ్మదాబాద్ వేదికగా జరగనున్న 2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ సన్నద్ధమవుతున్న తరుణంలో... ప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల నిర్వహణలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ ప్రణాళిక దోహదపడుతుందని స్పష్టం చేశారు.
సాంస్కృతిక సహకారంతోపాటు.. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అత్యావశ్యకమని ప్రధానమంత్రులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఆదివాసీ పూర్వీకుల అవశేషాలను బేషరతుగా, స్వచ్ఛందంగా ఆస్ట్రేలియాకు తిరిగి అప్పగించే ప్రక్రియలో పురోగతినీ, అలాగే ఆస్ట్రేలియాలో ఉన్న పురాతన తెలుగు అవశేషాలను భారత్‌కు తిరిగి రప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలనూ వారు స్వాగతించారు. ఆస్ట్రేలియాలోని సేకరణ సంస్థల వద్ద ఉన్న అనేక భారతీయ సాంస్కృతిక కళాఖండాలను స్వచ్ఛందంగా భారత్‌కు తిరిగి అప్పగించినందుకు ఆ దేశ ప్రధానమంత్రి అల్బనీస్‌కు భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
శాంతియుత, స్థిరమైన, సమృద్ధ ఇండో పసిఫిక్‌ను సాకారం చేసుకునే దిశగా ప్రోత్సాహం
స్వేచ్ఛాయుత, నియమపాలనకు కట్టుబడి ఉండే ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ఆవిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్టు ఇరు దేశాల ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాలకు, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒడంబడిక (యూఎన్‌సీఎల్‌వోఎస్)కు లోబడి.. సముద్రయాన, వైమానిక ప్రయాణ స్వేచ్ఛతో కూడిన హక్కులను, స్వేచ్ఛను వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వారు స్పష్టం చేశారు. వివాదాలలను అంతర్జాతీయ చట్టాల ప్రకారం శాంతియుత మార్గాల్లోనే పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాలను దెబ్బతీసేలా.. ప్రస్తుత యథాతథ స్థితికి భంగం కలిగించడానికి ప్రయత్నించే ఎలాంటి అస్థిర, ఏకపక్ష చర్యలనైనా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
ఉమ్మడి సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం కోసం ప్రాంతీయ, బహుపాక్షిక సంస్థల ద్వారా పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ఇరుదేశాల ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. ఇండో - పసిఫిక్ ప్రాంతంలో ఆచరణాత్మక, స్పష్టమైన ఫలితాలను అందించే కీలక భాగస్వామ్యంగా ‘క్వాడ్’ కూటమి ప్రాధాన్యాన్ని గుర్తుచేశారు. ఇందులో భాగంగా 2026 మే నెలలో న్యూఢిల్లీలో నిర్వహించిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అత్యంత ప్రాధాన్యం కలిగిన కీలక ఫలితాలను ఇవ్వడాన్ని స్వాగతించారు.
భారత్ అధ్యక్షతన ఉన్న ‘హిందూ మహాసముద్ర తీర దేశాల సంఘం (ఐవోఆర్ఏ)’తోపాటు.. వివిధ ప్రాంతీయ కార్యక్రమాల ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఇరు దేశాల ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా.. గత జూన్ నెలలో చెన్నైలోని ‘నౌకా వాణిజ్య రక్షణ సమన్వయ కేంద్రం (ఎంఆర్‌సీసీ) వేదికగా.. ఐఓఆర్ఏ సభ్య దేశాలకు భారత్-ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించిన ‘శోధన, సహాయక చర్యల’ శిక్షణ కార్యక్రమాన్ని వారు స్వాగతించారు. అలాగే జూన్ నెలలో పెర్త్ నగరంలో సముద్ర భద్రత, రక్షణపై నిర్వహించిన ఐఓఆర్ఏ కార్యబృందం ఆరో సమావేశానికి ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమం (ఐపీఓఐ) కింద ప్రస్తుతం కొనసాగుతున్న సహకార కార్యకలాపాలను ప్రధానులిదదరూ అభినందించారు. ఆస్ట్రేలియా- భారత్- ఇండోనేషియా త్రైపాక్షిక యంత్రాంగం ద్వారా.. నౌకావాణిజ్య రంగంలో అవగాహన, సముద్ర కాలుష్య నివారణ, సముద్ర ఆర్థిక వ్యవస్థ వంటి రంగాల్లో అవకాశాలను అన్వేషించడంతోపాటు, ఈ సహకారాన్ని మరింత విస్తరించుకోవడాన్ని స్వాగతించారు.
‘బ్లూ పసిఫిక్ కాంటినెంట్’ కోసం ఉద్దేశించిన 2050 వ్యూహం ప్రాధాన్యాన్నీ, పసిఫిక్ ప్రాంత దేశాల ప్రాధాన్యాలను ప్రతిబింబించే భాగస్వామ్యాలనూ గుర్తిస్తూ... పసిఫిక్ దీవుల ఫోరమ్ (పీఐఎఫ్) పట్ల నిబద్ధతను ఇరు దేశాల ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. ‘ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్ఐపీఐసీ)’ యంత్రాంగం సహా వివిధ కార్యక్రమాల ద్వారా.. అభివృద్ధి భాగస్వామ్యాన్ని పసిఫిక్ ద్వీప దేశాలకు విస్తరించడంలో భారత్ క్రియాశీల పాత్ర పోషిస్తోందంటూ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అల్బనీస్ అభినందించారు. ప్రాంతీయ భద్రత, సహకారంలో ‘ఆసియాన్’ ప్రాధాన్యాన్నీ, అలాగే ఆసియాన్ నేతృత్వంలోని ప్రాంతీయ నిర్మాణానికీ ప్రధానమంత్రులిద్దరూ మద్దతును పునరుద్ఘాటించారు. ‘ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్ దృక్పథం (ఏవోఐపీ)’ అమలుకు బలమైన మద్దతును ప్రకటించారు.
మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంపై ఇరుదేశాల ప్రధానమంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలూ సంయమనం పాటించాలనీ, ఉద్రిక్తతలను తగ్గించాలనీ, అలాగే ప్రజలకు రక్షణతోపాటు.. ఇంధన సరఫరా, వాణిజ్యంలో అంతరాయం లేకుండా చూడాలని కోరారు. చర్చలు, దౌత్య ప్రాధాన్యాన్ని వారు పునరుద్ఘాటించారు. ఘర్షణకు శాంతియుతమైన, శాశ్వత పరిష్కారాన్ని సాధించాలంటే అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉండాలని కోరారు. ఉక్రెయిన్ యుద్ధం, విషాదకరమైన పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘర్షణను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. మయన్మార్‌లోని పరిస్థితి, ఈ ప్రాంతంపై దాని ప్రభావం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పంచసూత్రాల ఏకాభిప్రాయం సహా.. ఆసియాన్ నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలకు మరోసారి మద్దతు ప్రకటించారు.
ఉగ్రవాదాన్నీ, ఉగ్రవాదానికి దారితీసే హింసాత్మక తీవ్రవాదాన్నీ ప్రధానమంత్రులిద్దరూ నిర్ద్వంద్వంగా ఖండించారు. అది ఏ రూపంలో ఉన్నా, ఏ విధంగా వ్యక్తమైనా అవాంఛనీయమే అన్నారు. ఉగ్రవాద ముప్పును ఎప్పటికప్పుడు గట్టిగా తిప్పికొట్టడంలో అన్ని దేశాలూ సమష్టిగా కృషి చేయడం అత్యావశ్యకమని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నిషేధిత ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపైనా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 1267 ఆంక్షల కమిటీ జాబితాలో ఉన్న సంస్థలూ, వాటి ప్రతినిధులు, అనుబంధ సంస్థలు, వాటికి సహకరించే వారు, ఆర్థికంగా సహకరించేవారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడంలో సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. మన ప్రాంతంలో పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పులపై సమాచార మార్పిడిని మరింత పెంపొందించుకోవడానికీ, అలాగే ఆన్‌లైన్ తీవ్రవాద ప్రేరేపణ సహా ఉగ్రవాదానికి దారితీసే హింసాత్మక తీవ్రవాదాన్ని తిప్పికొట్టడానికీ కట్టుబడి ఉన్నట్టు ఇరు దేశాల ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. అలాగే కొత్త, అధునాతన సాంకేతికతలను ఉగ్రవాద ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని నిలువరించడం కోసం పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని వారు నిర్ణయించారు. వీటితోపాటు ఉగ్రవాద వ్యాప్తికి నిధులను అందించడం, కీలక మౌలిక సదుపాయాలు, నౌకావాణిజ్య రంగానికి పొంచి ఉన్న ముప్పులను సమష్టిగా ఎదుర్కొనేందుకు అవకాశాలను అన్వేషించాలని నిశ్చయించారు. పహల్గాంలో, బోండి బీచ్‌లలో జరిగిన హేయమైన దాడులతోపాటు.. అన్ని రకాల ఉగ్రవాద దాడులను ప్రధానమంత్రులు మరోసారి ముక్తకంఠంతో ఖండించారు.
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యుల ప్రాతినిధ్యాన్ని పెంచుతూ తక్షణ సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకతను ఇరు దేశాల ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. బహుపాక్షిక విధానాన్నీ, అలాగే ఐక్యరాజ్యసమితికి భారత్ దీర్ఘకాలంగా అందిస్తున్న విశేష సహకారాన్నీ పరిగణనలోకి తీసుకుని.. పునర్వ్యవస్థీకరించే భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వ అభ్యర్థిత్వానికి తన బలమైన మద్దతును ఆస్ట్రేలియా పునరుద్ఘాటించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వానికి సంబంధించి పరస్పర మద్దతుకు కట్టుబడి ఉన్నట్టు ప్రధానమంత్రులిద్దరూ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 2028–2029 కాలానికి భారత్ అభ్యర్థిత్వానికీ, అలాగే 2029–2030 కాలానికి ఆస్ట్రేలియా అభ్యర్థిత్వానికీ పరస్పరం మద్దతు ప్రకటించుకున్నారు. దీనితోపాటు ఐక్యరాజ్యసమితి పనితీరులో సామర్థ్యాన్నీ, ప్రభావాన్నీ మరింత పెంపొందించేందుకు వీలుగా.. ఆ సంస్థలో విస్తృత సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకతనూ వారు ప్రధానంగా ప్రస్తావించారు.
ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి పట్ల ప్రధానమంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరస్పర ప్రయోజనకరమైన, అలాగే స్వేచ్ఛా, సార్వత్రిక, నియమాల ప్రాతిపదికన ఉన్న, శాంతియుత, సమృద్ధమైన ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని సాకారం చేసుకునే దిశగా.. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.
***
(रिलीज़ आईडी: 2283087)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam