ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించే ఐదు విభాగాల సిబ్బందికి జాతీయ స్థాయి శిక్షకుల
శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేసేందుకు సిబ్బందికి సమగ్ర శిక్షణ వ్యూహం, విభాగాల వారీ ప్రత్యేక శిక్షణ మాడ్యూళ్లను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
ప్రాథమిక ఆరోగ్య సేవల బలోపేతం కోసం సిబ్బందికి నిర్వహించిన జాతీయ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న 110 మందికి పైగా జాతీయ, మాస్టర్ ట్రైనర్లు
प्रविष्टि तिथि:
08 JUL 2026 4:48PM by PIB Hyderabad
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించే మొత్తం ఐదు విభాగాల సిబ్బంది కోసం జాతీయ స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమాన్ని (నేషనల్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్' - ఎన్టీఓటీ) కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఢిల్లీలో రెండు రోజుల పాటు విజయవంతంగా నిర్వహించింది. న్యూఢిల్లీలోని నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ (ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీ) లో నిర్వహించిన ప్రారంభ సమావేశానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ శ్రీమతి ఆరాధన పట్నాయక్ అధ్యక్షత వహించారు.
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో నైపుణ్యం, నాణ్యత కలిగిన ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడటం అత్యంత కీలకమని, ప్రభుత్వ ఆరోగ్య సేవలపై ప్రజల్లో నమ్మకాన్ని బలోపేతం చేయడానికి నాణ్యతా ప్రమాణాల ధృవీకరణ అవసరమని శ్రీమతి ఆరాధన పట్నాయక్ అన్నారు. వికేంద్రీకృత అమలు నమూనా ద్వారా ఆయా విభాగాల వారీగా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుందని ఆమె స్పష్టం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఆగస్టు 2026 నుంచి దేశవ్యాప్తంగా గుర్తించిన 100 కి పైగా ప్రాంతీయ శిక్షణ సంస్థల ద్వారా దశల వారీగా విస్తరించనున్నట్లు ఆమె తెలియజేశారు.
ఆరోగ్య కార్యక్రమాల మధ్య సమన్వయం, వివిధ సంస్థల మధ్య మెరుగైన సహకారం పెంపొందించడం ద్వారా ఆరోగ్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచవచ్చని ఆమె పేర్కొన్నారు. కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే సరిపోదని, ప్రజా కేంద్రిత మానవీయ ఆరోగ్య సేవలు అందించాలంటే ఆరోగ్య సిబ్బంది శిక్షణలో ప్రవర్తనా నైపుణ్యాలు, సానుభూతి దృక్పథం, సమర్థవంతమైన సంభాషణా సామర్థ్యాలను కూడా తప్పనిసరిగా భాగం చేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
2026 ఏప్రిల్ 30న చండీగఢ్‌లో నిర్వహించిన జాతీయ ఉత్తమ విధానాల సదస్సు సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా ఆవిష్కరించిన సమగ్ర శిక్షణ వ్యూహంతో పాటు వివిధ విభాగాల సిబ్బందికి ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణ మాడ్యూళ్లను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ప్రారంభ సమావేశంలో విడుదల చేసింది. సమగ్ర శిక్షణ వ్యూహం (ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ స్ట్రాటజీ–ఐటీఎస్) కార్యక్రమాల వారీగా, కేవలం విజ్ఞానాన్ని పెంపొందించడంపై దృష్టి సారించే శిక్షణ విధానానికి భిన్నంగా, రోగి కేంద్రిత, నైపుణ్యాధారిత శిక్షణ విధానానికి నాంది పలికిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ద్వారా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు అందిస్తున్న వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓలు), సహాయ నర్సు-మిడ్‌వైఫ్స్ (ఏఎన్ఎంలు), గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలలో సాంకేతిక నైపుణ్యాలతో పాటు ప్రవర్తనా నైపుణ్యాలు, ప్రజలతో మమేకమయ్యే సామర్థ్యాలను కూడా పెంపొందించడమే ఈ వ్యూహం ప్రధాన లక్ష్యమని తెలిపింది.
జాతీయ శిక్షకుల శిక్షణ (ఎన్టీఓటీ) కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 110 మందికి పైగా మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. ప్రామాణిక, నైపుణ్యాధారిత శిక్షణ ద్వారా ప్రాథమిక ఆరోగ్య సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలన్న దేశవ్యాప్త ఉమ్మడి సంకల్పానికి ఇది నిదర్శనమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
జాతీయ శిక్షకుల శిక్షణ కార్యక్రమాన్ని సమగ్ర అభ్యాస అనుభవాన్ని అందించేలా రూపొందించారు. ఇందులో తరగతి గది బోధన, కేసుల ఆధారిత చర్చలు, జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంస్థ (ఎన్ఐహెచ్ఎఫ్డబ్ల్యూఎఫ్) స్కిల్ ల్యాబ్‌లో ప్రత్యక్ష ఆచరణాత్మక శిక్షణను నిర్వహించారు. కీలక వైద్య సేవల విభాగాల్లో ఆరోగ్య సిబ్బందికి సాంకేతిక నైపుణ్యాలతో పాటు సాఫ్ట్ స్కిల్స్ ను పెంపొందించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య సిబ్బందిని నాణ్యమైన, రోగి కేంద్రిత ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేలా తీర్చిదిద్దడం దీని లక్ష్యమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రజల మారుతున్న ఆరోగ్య అవసరాలను తీర్చడానికి అవసరమైన విజ్ఞానం, నైపుణ్యాలు, సానుకూల దృక్పథంతో క్షేత్రస్థాయిలో ముందు వరస ఆరోగ్య కార్యకర్తలను సంసిద్ధం చేయడం ద్వారా ఈ సమగ్ర శిక్షణా వ్యూహం ప్రాథమిక ఆరోగ్య సేవల నాణ్యతను గణనీయంగా పెంపొందిస్తుందని, దేశవ్యాప్తంగా సామర్థ్య పెంపు ప్రయత్నాలను ప్రమాణీకరిస్తుందని, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పాలసీ విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ శిబిన్ సి., ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) ప్రగ్యా శర్మతో పాటు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, నేషనల్ మెడికల్ కమిషన్, మిషన్ కర్మయోగి భారత్ లకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2282704)
आगंतुक पटल : 51