లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

మానవాళికి మార్గదర్శనం చేస్తున్న భారత నాగరికత విలువలు: లోక్‌సభ స్పీకర్


దేవాలయాలు విశ్వాసానికి కేంద్రాలు... ఇవి సత్యాన్ని, ధర్మబద్ధతని, విలువలని, సేవని, సామాజిక సద్బావనను పెంపొందింప చేస్తున్నాయి: లోక్‌సభ స్పీకర్

భారతీయ సంస్కృతిని, నైతిక విలువలను సామాన్య ప్రజానీకం చెంతకు చేర్చే సాధనమే రామకథ: లోక్‌సభ స్పీకర్

శ్రీ అర్థనారీశ్వర దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంతో పాటు శ్రీ రామ కథ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన లోక్‌సభ స్పీకర్

నాడు పోస్టు చేయడమైనది: 07 JUL 2026 6:15PM by PIB Hyderabad

మానవాళికి మార్గదర్శనాన్ని అందిస్తూ శాంతి, సద్భావన, నైతిక జీవనాన్ని ప్రోత్సహించడంలో భారతదేశ నాగరికత విలువలు తమ వంతు సందర్భశుద్ధిని చాటుతున్నాయని లోక్‌‌సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా అన్నారు. ఆధ్యాత్మికత, యోగా, ధర్మం, సంస్కృతిలతో కూడిన ప్రాచీన సంప్రదాయం విలసిల్లుతున్న భూమి భారత్ అని ఆయన అన్నారు. ఆరోగ్యదాయక జీవనం, నైతికత, ఆధ్యాత్మిక చేతన సందేశాన్ని యోగా సంప్రదాయాలు, మునులు  మనకు అందించారని శ్రీ బిర్లా అన్నారు.
శ్రీ రఘువంశపురం‌ ఆశ్రమంలో శ్రీ అర్థనారీశ్వర్ దేవాలయంలో ఏర్పాటు చేసిన ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, శ్రీ రామ కథ కార్యక్రమాలలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి శ్రీ బిర్లా ప్రసంగిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
భారత ఆధ్యాత్మిక సంప్రదాయాలు, మునులు అందించిన సంస్కృతి, ప్రజాసంక్షేమ భావనకు కట్టుబడిన స్ఫూర్తిదాయక కార్యక్రమం  ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవమని శ్రీ బిర్లా అన్నారు. భగవాన్ అర్థనారీశ్వరుని ప్రాణ ప్రతిష్ఠ ఒక ధార్మిక ఉత్సవం మాత్రమే కాదని, అది విశ్వాసాన్ని బలపరిచే, విలువలను పరిపుష్టం చేసే ఒక పవిత్ర సందర్భమని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఈ కార్యక్రమం జాగృతం చేస్తుందన్నారు. ఇలాంటి ఉత్సవాలు సమాజాన్ని దాని మూలాలతో తిరిగి అనుసంధానించడంతో పాటు, దేశ నిర్మాణంలో అందరూ పాలుపంచుకొనేటట్లు స్ఫూర్తిని కలిగిస్తాయని ఆయన అన్నారు.
‘దేవాలయాలు విశ్వాస కేంద్రాలు, అవి సత్యం, ధర్మబద్ధత, విలువలు, సేవతో పాటు సామాజిక సద్భావనను పెంపొందింపచేసే సంస్థలు కూడా’ అని శ్రీ ఓమ్ బిర్లా అన్నారు. భారత సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో, సమాజ నైతిక ఆధారాన్ని దృఢతరంగా నిలబెట్టడంలో దేవాలయాలు ఒక కీలక పాత్రను పోషిస్తున్నాయని ఆయన అన్నారు. దేవాలయాలు ప్రాచీన కాలం నుంచీ విద్యకి, దానానికి, సామాజిక సంక్షేమానికి కేంద్రాలుగా ఉన్నాయని, ‘వసుధైవ కుటుంబకమ్’ భావనను నిరంతరం పెంచి పోషిస్తున్నాయన్నారు.
భగవాన్ అర్థనారీశ్వర మహత్యాన్ని శ్రీ బిర్లా ప్రస్తావిస్తూ, ఆ దివ్య రూపం శివ, శక్తి , పురుషుడు, ప్రకృతిల మేలు కలయికకు ప్రతీకగా ఉందన్నారు. అందరూ క్షేమంగా ఉండాలనేదే భగవాన్ శివుని సంకల్పమని, పార్వతీ మాత కరుణ సమాజంలో సమతౌల్యాన్ని, సద్భావనని చాటుతూ, స్పందనపూర్వక జీవితాన్ని గడిపేందుకు స్ఫూర్తిని అందిస్తుందని ఆయన అన్నారు. ఈ సమతౌల్యం ప్రకృతిని, మానవతను గౌరవించాలని బోధించడంతో పాటు సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి దిశగా పయనించేలా మనకు మార్గాన్ని చూపుతుందని లోక్‌సభ స్పీకర్ అన్నారు.
భగవాన్ శ్రీ రాముని ఆదర్శాలను శ్రీ బిర్లా ప్రస్తావిస్తూ, భగవాన్ రాముడు ధర్మం, కర్తవ్యం, ప్రజల సంక్షేమం అనే ఉన్నత ఆదర్శాలకు ప్రతీకగా నిలిచారన్నారు. ఈ ఆదర్శాలను ప్రజలు అలవరుచుకొనే, సమాజం పట్ల, దేశం పట్ల తమ కర్తవ్యాలను నిర్వర్తించే స్ఫూర్తిని శ్రీ రామ కథ అందిస్తోందన్నారు. మర్యాదా పురుషోత్తముడు రాముడు నడచిన బాటలో నడిచి పౌరులు శక్తిమంతమైన, విలువలపై ఆధారపడిన, స్వయంసమృద్ధ భారత్‌ నిర్మాణంలో తమ వంతు పాత్రను పోషించవచ్చని శ్రీ బిర్లా అన్నారు.
‘శ్రీ రఘువంశ్‌పురమ్ ఆశ్రమం, కేశవ్ ప్రియ గోశాల, శ్రీ అర్థనారీశ్వర దేవాలయం, శ్రీ రామ కథ.. ఇవి భారత సంస్కృతిలో ముఖ్య కేంద్రాలు.. ఇవి సేవ, నైతిక ప్రవర్తన, గోవుల సంరక్షణ, మానవత వంటి విలువలను ఎప్పటికీ బలోపేతం చేస్తున్నాయి’ అని శ్రీ బిర్లా స్పష్టం చేశారు.
ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ఇస్తున్న సిసలైన సందేశం దేవాలయంలో దైవ ప్రతిమను ఏర్పాటు చేయడానికే పరిమితం కాదని, అది మన జీవితాల్లో సత్యం, సేవ, దయ, సంస్కారాలను ప్రతిష్ఠించుకోవాలని కూడా సూచిస్తోందని లోక్‌సభ స్పీకర్ అన్నారు. ఈ విధమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం సామాజిక సద్భావనను, నైతిక విలువలను, దేశ నిర్మాణ భావనను మరింత బలోపేతం చేయగలవన్న నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2282454) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati