ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండోనేషియా అధ్యక్షునితో ప్రధానమంత్రి అధికారిక చర్చలు
प्रविष्टि तिथि:
07 JUL 2026 2:51PM by PIB Hyderabad
ఇండోనేషియాలో చేపడుతున్న అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఇస్తానా మెర్డేకా (అధ్యక్ష భవనం) వద్ద ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షులు శ్రీ ప్రబోవో సుబియాంటో సాదర స్వాగతం పలికారు. అలాగే 2025 జనవరిలో 76వ భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అధ్యక్షులు ప్రబోవో భారత్‌లో పర్యటించిన తర్వాత ఈ నాయకులిద్దరూ సమావేశమవడం ఇదే తొలిసారి.
నాయకులిద్దరూ నియంత్రిత, ప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన అధికారిక చర్చల్లో పాల్గొన్నారు. వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, సముద్ర రక్షణ సహకారం, డిజిటల్-ఆర్థిక సాంకేతికతలు, ఇంధనం, ఆరోగ్య సేవలు, ఫార్మాసూటికల్స్, అంతరిక్షం, కీలకమైన ఖనిజాలు, అరుదైన మూలకాలు, సంస్కృతి, పర్యాటకం, వ్యవసాయం, ప్రజా సంబంధాలతో సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలను వారు సమీక్షించారు. భారత్‌లోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) ఆధారంగా ఇండోనేషియా ఓపెన్ నెట్వర్క్ (ఐవోఎన్) ప్రారంభం కావడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. 2027 నాటికి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండోనేషియాలో పర్యటించి వందేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఠాగూర్–దేవంతర సాంస్కృతిక, విద్యా దౌత్య సంవత్సరాన్ని రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు.
పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ ఆలోచనలను నాయకులు పంచుకున్నారు. ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చించారు. స్వేచ్ఛాయుతమైన, అందరికీ అందుబాటులో ఉండే, నియమ ఆధారిత ఇండో-పసిఫిక్ దిశగా తమ అంకితభావాన్ని వారు పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో, భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ (ప్రాంతాలకు అతీతంగా భద్రత, వృద్ధిలో పరస్పర, సమగ్ర పురోగతి) దార్శనికత గురించి ప్రధానమంత్రి వివరించారు. బ్రిక్స్–2026కు అధ్యక్షత వహిస్తున్న భారత్‌కు ఇండోనేషియా పూర్తి మద్దతు అందిస్తున్నట్టు అధ్యక్షుడు ప్రబోవో తెలియజేశారు.
చర్చల అనంతరం.. నాయకులిద్దరి సమక్షంలో రక్షణ, కీలకమైన ఖనిజాలు, అరుదైన మూలకాలు, శాస్త్ర సాంకేతికత, విద్య, ఎన్నికల పద్ధతులు, టెలీకమ్యూనికేషన్లు, వ్యవసాయం, సముద్ర భద్రత, అంతరిక్షం, ఉక్కు సరఫరా వ్యవస్థ, విపత్తు నిర్వహణ, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ఆరోగ్య నిపుణులకు సంబంధించిన సహకారం తదితర రంగాల్లో ఎంవోయూలు/ఒప్పందాలు కుదిరాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన యోగ్యాకార్తాలోని ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని పరిరక్షించడంలో, పునరుద్ధరించడంలో తోడ్పాటు అందించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాన్ని కూడా మార్చుకున్నారు. ఎంవోయూలు/ఒప్పందాలకు సంబంధించిన పూర్తి జాబితాను [ఇక్కడ] చూడవచ్చు.
చర్చల అనంతరం ప్రధానమంత్రి గౌరవార్థం అధ్యక్షుడు ప్రబోవో విందు ఏర్పాటు చేశారు. ఆత్మీయ ఆతిథ్యం అందించిన అధ్యక్షులు ప్రబోవోకు ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.
***
(रिलीज़ आईडी: 2282214)
आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam